"పద... వెళదాం..." అన్నాడు సూర్యం ప్రపంచ వింతను చూస్తున్న భ్రాంతికి లోనవుతూ.
ఆ మాటతో గోడ గడియారంవైపు చూసి లేచాడు శక్తి.
పదిగంటలకు షాపు మూసి, షాపుకు కొంచెం దూరంలో వున్న ఇంటికెళ్ళి భోంచేసి, మళ్ళీ వచ్చి ఆ రోజు జరిగిన అమ్మకాలకు సంబంధించిన ఖాతాలు చూసుకోవటం అలవాటు సూర్యానికి. అలాగే ఆ రోజు రాత్రి, భోజనం చేసిన తర్వాత షాపుకొచ్చి, శక్తి ఏం చేసాడో ఎంతవరకు చేసాడో చూద్దామని- ఎకౌంట్ పుస్తకాలు తెరిచాడు.
ఎకౌంట్స్ పుస్తకాలలోకి చూస్తున్న సూర్యం నమ్మలేని నిజాలను నమ్మలేక, నమ్ముతున్నట్లుగా ఫీల్ అయ్యాడు.
తండ్రి వారం రోజుల్లో చేసిన పనిని కొడుకు ఒక్కరోజులో చేసేసాడు...! ఎక్కడా ఏ తప్పు ఎత్తి చూపడానికి వీల్లేని విధంగా చేసాడు.
ఎక్కౌంట్స్ చెక్ చేస్తున్న సూర్యానికి అంతకంటే దిగ్భ్రాంతి కరమయిన విషయం వేరొకటి కన్పించింది. ఒక పుస్తకంలో అప్పటివరకూ ఎక్కౌంట్స్ చేస్తూ ఆపినచోట- చిన్న తెల్లకాగితం మీద ఇంగ్లీషులో వ్రాసిన అక్షరాలు కనిపించాయి. అవి హక్తి రాసినవే అని సూర్యం గుర్తించాడు.
"There are no lazyman what may appear to be a lazyman is only an unfortunate person who has found the work for which he is best suited..."
మరోసారి చదివాడు సూర్యం.
అంతే ఎవరో చాచి లాగికొట్టినట్లు ఉలిక్కిపడ్డాడు-
తనొచ్చిన పని మరిచిపోయి శక్తి గురించే ఆలోచిస్తున్నాడు.
ఆవారాగా రోడ్ల వెంట తిరిగే శక్తి, చేసే వృత్తిలో జాబ్ సాటిస్ ఫేక్షనే సక్సెస్ కు మూలం అనేంత లోతుగా ఎనలైజ్ చేయగల శక్తీ ఒకరేనా? నిస్సందేహంగా ఒకరే.... కె.వి.ఆర్. కాలేజీలో ఆడతా పాడతా చదివిన శక్తిలో ఇంత పరిశీలనా శక్తి ఉందా...?
తరచి చూడగల ఓర్పు వుండాలే కానీ మనిషిలో యెంత వైవిధ్యం...?
నిన్న తాను అనుకున్న శక్తి, నేటి ఈ శక్తి లంకెకు అందటం లేదే...?!
శక్తిలోని శక్తి గురించి ఆలోచిస్తూ వున్నాడతను- శక్తిలోని ఏకాగ్రత, శక్తిలోని నిమగ్నత గురించి ఆలోచిస్తున్నాడు సూర్యం.
సోమరి అని తను ఏదో సరదాగా అన్నందుకు, అంత ఘాటుగా సమాధానం ఇస్తాడని ఊహించలేదు సూర్యం.
* * * *
రోడ్డుమీద నడుస్తున్న శక్తి కిరాణాషాపులోంచి తాను వచ్చిన విషయం అప్పుడే మరిచిపోయాడు.
అలవాటుగా అతని కాళ్ళు హోటల్ వైపు నడిపించాయి- హోటల్ మూసేసి వుంది. పిట్టగోడ బోసిగా వుంది... దార్లో సిగరెట్ కొనుక్కుని, వెలిగించి రైతుపేటలో ఉన్న ఇంటి దారి పట్టాడు.
అప్పటికి సమయం సరిగ్గా రాత్రి పదకొండు గంటలు...
కర్రగేటు మీద చెయ్యివేసి ఇంటివైపు చూసాడు-
ప్రతిరోజూ చీకట్లో మినుకు, మినుకుమనే ఇల్లు వెలుతురుతో నిండిపోయి వుంది.
కర్రగేటు తెరిచిన చప్పుడు వినగానే-
గబుక్కున లోపల తలుపు తెరుచుకుని శారద వచ్చింది.
"అమ్మా... అన్నయ్యొచ్చాడే..." అరిచినట్లుగా అంది.
"వచ్చాడా..." తండ్రి ప్రక్కన కూర్చున్న తల్లి లేచి నిలబడింది.
మాట్లాడకుండా కాళ్ళూ, చేతులూ కడుక్కుని తువ్వాలుతో తుడుచుకుంటూ తండ్రి దగ్గరకు వచ్చి.
"ఎలా ఉంది నాన్నా?" అడిగాడు ప్రేమగా.
"బాగానే వుందిరా... పనెలాగుంది బాబూ... ఏమైనా తెలియకపోతే సూర్యాన్ని అడుగు."
"నేను నీ హెల్త్ గురించి అడిగాను..." తండ్రి అన్న మాటలు విన్పించుకోకుండా అన్నాడు శక్తి!
"నా హెల్త్ కేరా... బంగారంలాగా వుంది... నువ్వు బాధ్యత తెలుసుకుంటుండేసరికి, గుండెల్లో నొప్పేలేదూ, దిగులూ లేదు..." నవ్వుతూ అన్నాడాయన.
"అన్నయ్యా అన్నం తినవా..." చెల్లి శారద లోపలి నుంచి కేకవేసింది.
రోజూ ఆ సమయానికి నిద్రపోయేది శారద.
అన్నయ్య కోసమే మెలకువగా వుంది శారద- అన్నయ్య రోజూ పనిలోకి వెళ్ళాలని అప్పటికి ఎన్నోసార్లు మొక్కుకుంది. కాలేజ్ ఫీజ్ కట్టాలని తల్లితో చెప్పి, చెప్పి విసిగిపోయింది. ఆ విషయం అన్నయ్యకు చెబితే? నోటి వరకూ వచ్చి ఆగిపోయింది మాట-
ఇవ్వాళే కదా పనిలోకి వెళ్ళింది- రేపు చెబితే... అనుకొని ఊరుకుంది... శక్తి భోజనం కానిచ్చేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు.
ఒక్కరోజు రోడ్డుమీదకు వెళ్ళకపోతే అతని మనస్సు అంతా అదోలా అయిపోయింది. రోజంతా గొడ్డులా చాకిరీ చేయటం బోరు కొట్టదా? ఇన్నేళ్ళ నుంచి తండ్రి ఎలా చేస్తున్నాడు ఆ రొటీన్ జాబ్.
తండ్రి మున్సిపాలిటీ లోనూ గొడ్డులా పని చేసాడు- రిటైరై పోయాడు. ఇక్కడా అలాగే పని చేస్తున్నాడు. ఎంతకాలం ఇలా వీళ్ళకు ఎదగాలని వుండదా? ఎదగటం కోసం గానుగ ఎద్దు జీవితం నుంచి బయట పడలేరా? వీళ్ళకో ధ్యేయం ఉండదా? లక్షల్లో ఒకరిగా నిలవాలని ఉండదా? తల్లి ఎలిమెంటరీ స్కూల్లో...
తండ్రి కిరాణా కొట్టులో... వీళ్ళ జీవితాల కసలు అర్థం ఉందా? శక్తికి నిద్రపట్టలేదు... మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు. రేపు కూడా షాపుకు వెళ్ళాలా? అని అనుకుంటూనే కలల్లోకి వెళ్ళిపోయాడు.
* * * *
"ఓరేయ్... శక్తీ... శక్తీ..." భుజం మీద దెబ్బ పడేసరికి మెలుకువ వచ్చింది. ఒక పట్టాన కళ్ళు తెరవలేకపోయాడు. మండుతున్నట్లుగా ఉన్నాయి కళ్ళు.
"ఏవిట్రా- ఒక్కరోజుకే అయిపోయిందా భాగోతం... షాపుకు వెళ్ళవా?"
ఎదురుగా కాఫీ కప్పుతో నుంచుని అడుగుతున్న తల్లిని చూసి, తనెక్కడున్నాడో గుర్తుకు తెచ్చుకున్నాడు శక్తి.