లోనికి నడిచాడు హుందాగా... గర్వంగా.
గదిలో మేనేజర్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. మేనేజర్ ఛాంబర్ ముందున్న కుర్చీలో కూర్చుని వచ్చేపోయే కస్టమర్లను చూస్తున్నాడు శక్తి.
పావుగంట గడిచింది. అరగంట కరిగిపోయింది.
మేనేజర్ రూమ్ లోకి అప్పుడే వెళ్ళొచ్చిన స్టాఫ్ మెంబర్ వేపు చూసి.
"హలో..." అని పిలిచాడు శక్తి.
"చెప్పండి..." అన్నాడా స్టాఫ్ మెంబర్ వినయంగా.
"మేనేజర్ని అర్జంటుగా కలవాలి... లోనున్న ఆ విజిటర్ వెళ్ళడా?"
"ఏంటి పని..." శక్తివేపు, శక్తి వేసుకున్న డ్రెస్ వేపు చూస్తూ అన్నాడు ఆ స్టాఫ్ మెంబర్.
తనెందుకు, ఈ బ్యాంకుకు వచ్చాడో తెలిస్తే, ఆ బ్యాంక్ ఉద్యోగి కంగారు పడిపోతాడు.
"మేనేజర్ తో మాట్లాడాలి..." అన్నాడు శక్తి తలెగరవేస్తూ.
"విజిటింగ్ కార్డుందా...." వెంటనే శక్తిధర్ తన జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి ఆ బ్యాంకు ఉద్యోగి చేతిలో పెట్టాడు. ఆ విజిటింగ్ కార్డుతో ఆయన లోపలకు వెళ్ళాడు.
ఆ విజిటింగ్ కార్డుని చూడగానే బ్యాంకు మేనేజర్ గబగబా బయటకు పరిగెత్తుకు వచ్చాడు.
"మీరా... మీ పేరు వినటమే కానీ, మీరని అనుకోలేదు... సారీ... రండి... ప్లీజ్ కమ్..." బ్యాంక్ మేనేజర్ స్వయంగా ఆహ్వానించటంతో ప్రక్కనున్న బ్యాంకు ఉద్యోగి శక్తి ఎవరో తెలియక అయోమయంలో పడిపోయాడు.
లోనికెళ్ళాడు శక్తి.
అతిధి మర్యాదలు జరిగాక-
"చెప్పండి... వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సర్..." వినయంగా అడిగాడు బ్యాంక్ మేనేజర్.
"ఏం లేదు... కొంత ఎమౌంట్ డిపాజిట్ చేయాలనుకుంటున్నాను" చేతిలో నున్న బ్రీఫ్ టేబుల్ మీద పెడుతూ అన్నాడు శక్తి.
"ఎంత?" యధాలాపంగా అడిగాడు ఆయన.
"టూ క్రోర్స్.... రెండు కోట్లు..."
"రెండు కోట్లా...!" దిగ్భ్రాంతిగా అడిగాడు మేనేజర్.
"ఎస్..." బ్రీఫ్ తెరిచి ఆయన ముందుకు తోసాడు. బ్రీఫ్ కేసు నిండా... కరెన్సీ... తళతళలాడుతున్న కరెన్సీ... అన్నీ ఐదొందల రూపాయల నోట్లు.
"వెరీ నైస్... వెరీ... నైస్..." కేష్ కౌంటర్ కేసి పరిగెత్తాడు మేనేజర్.
పదినిమిషాల్లో తతంగం అంతా పూర్తయింది. ఆ తతంగం పూర్తయ్యేంత వరకూ ఆ బ్యాంకు మేనేజర్ నిలబడే ఉన్నాడు.
"ఈసారి... మీరు రాకండి... ఫోన్ చేస్తే మేమే వస్తాం..." మళ్ళీ మేనేజర్ అన్నాడు వినయంగా.
శక్తి బయటకు వచ్చాడు. అతని వెనకే వినయంగా నడుస్తూ మేనేజర్ కూడా వచ్చాడు.
కారు డ్రయివర్ కనబడక పోయేసరికి కంగారుగా మేనేజర్ శక్తివేపు చూసి-
"కారు తీసుకురాలేదా?" అడిగాడు మేనేజర్.
రాలేదన్నట్లుగా తలూపి-
"ఎక్కువ కేష్ కేరీ చేస్తున్నప్పుడు... నేను సిటీ బస్సులో వస్తాను. ఎక్కువ క్యాష్ తో సిటీ బస్సుల్లో ఎవరూ ప్రయాణం చేయరని భావిస్తారు కనుక" నవ్వుతూ అన్నాడు శక్తి.
"అఫ్ కోర్స్... అఫ్ కోర్స్... మార్వలెస్... యూ ఆర్ ఏ జీనియస్" పొగిడాడు మేనేజర్.
యూ.... ఆర్... ఏ జీనియస్... యూ ఆర్ ఏ జీనియస్... యూ ఆర్ ఏ జీనియస్...
* * * *
"యూ ఆర్ ఏ జీనియస్..."
ఆ మాటలు ఫోర్ ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ లో వినిపిస్తున్నాయి. తటాలున మెలకువ వచ్చింది శక్తికి. కళ్లు విప్పి చూసాడు. కిటికీలోంచి మసక మసక చీకటి మాటున దూదిపింజాల్లా మెరుస్తున్న వెలుతురు.
టిక్కు టిక్కుమంటున్న పాత గడియారం ఐదున్నర అయ్యిందని తెలియజేసింది.
"యూ ఆర్ ఏ జీనియస్..." కలలో బ్యాంక్ మేనేజర్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి.
సూట్ కేసులో డబ్బు గుర్తుకు వచ్చింది.
అంత డబ్బు తను ఎప్పుడయినా కళ్ళతో చూడగల్గుతాడా?
అంత డబ్బుతో తను బ్యాంక్ కు సిటీ బస్సులో ఎందుకెళ్ళాడు? ఛీ...
ఆ వెళ్ళేదేదో మారుతీకారులో వెళ్లుంటే ఎంత బాగుండేది కదా...
పూర్ డ్రీమ్... పేద కల...
ఊళ్ళో ఎక్కడో కోడి కూసిన కూత...
ఒక్కసారి తండ్రి జ్ఞాపకం వచ్చాడు. గబుక్కున లేచి ముందు వరండాలో పడుకున్న ఆయన దగ్గరకు వెళ్ళి చూసి గదిలోకొచ్చాడు- రాత్రి తల్లి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.
రెండు నిమిషాలు ఆలోచనల్లో పడ్డాడు. ఆ తర్వాత లేచి పెరట్లోకి నడిచాడు.
* * * *
ఆరుగంటలకు లేచింది లక్ష్మీదేవి.
వంటింట్లోకి వెళుతూ కొడుకు గదిలోకి తొంగిచూసి, ఆశ్చర్యముతో ఉబ్బి తబ్బిబ్బయిపోయింది.
అప్పటికే ప్యాంటూ, షర్టూ వేసుకొని తయారయిపోయాడు శక్తి.
అంత ఉదయాన్నే కొడుకు లేవటం, తయారయి పోవటం ఆమెకు అనూహ్యమైన విషయం."
"కాఫీ ఇస్తే కిరాణా షాపుకు వెళతాను."
అలాంటి మాటలు శక్తి నోట్లోంచి వస్తుందని ఊహించని తల్లి విస్తుబోయింది.
"ఇవాళ భూకంపం రావటం ఖాయం."
అప్పుడే అక్కడకు వచ్చిన శారద ద్వారబంధానికి చేరబడి అంది.
"చిన్నా.... వాడ్నే మనకే... వాడి మూడ్ మారిపోయిందనుకో- మళ్ళీ పడకేసేస్తాడు" వంటింట్లోకెళ్ళి స్టవ్ వెలిగించి డికాషన్ పడేస్తూ అంది తల్లి.
అదే సమయంలో తండ్రి లేచి, జరుగుతున్నదేమీ అర్థంకాక కొడుకు గదిలోకి చూస్తూ కూర్చున్నాడు.