4. నలుగురు ఋత్విక్కులు తమ శుభములు కోరి సూర్యుని హవి సమర్పించి సేవింతురు. సూర్యుడు దశ దిశల గర్భజాతుడు. దశదిశలు సూర్యుని నిత్యగమనమునకు ప్రేరేపించును. ఆదిత్యునకు శత, గ్రీష్మ; వర్ష; భేదమున త్రివిధ కిరణములు కలవు. ఆ కరిణములు అంతరిక్షపు సీమలందు ద్రుతవేగమున సంచరించును.
5. పురోభాగమున దృశ్యమానమగు సూర్యమండలము అత్యంత స్తవనీయము. ఈ మండలము నుండియే నదులు ప్రవహించును. జలరాశి ఇందుననే నిలిచి ఉండును. అంతరిక్షమున ఇతర యుగళములతో సమాన బలముగల అహోరాత్రులు ఇందునుండియే ఉత్పన్నములు.
ఋత్విక్కులారా ! మీరు ఆమండలమును సేవించుడు.
6. అట్టి సూర్యుని కొరకే యజమానులు స్తోత్రములను, యజ్ఞములను విస్తరింతురు. పుత్ర స్వరూపుడగు సూర్యుని కొరకే తల్లులు-ఉష-దిశలు-బట్టులు నేయును. వర్షకారి సూర్యుని సంపర్కమున తృప్తులయిన పత్నీ స్వరూపరశ్ములు ఆకాశమార్గము నుండి మావద్దకు అవతరించును.
7. మిత్రావరుణులారా ! ఈ స్తోత్రమును స్వీకరించండి.
అగ్నీ ! మాకు కలగలుపు సుఖములు కలుగుటకుగాను ఈ స్తోత్రమును స్వీకరించుము. మేము కీర్తి ప్రతిష్ఠల వారలము కావలెను. మేము దీప్తిమంతుడు, శక్తిమంతుడు, సకల జనులకు ఆశ్రయ భూతుడగు సూర్యునకు ప్రణమిల్లుదుము.
నలుబది ఎనిమిదవ సూక్తము
ఋషి - ప్రతిభానుడు, దేవత - విశ్వేదేవతలు, ఛందస్సు - జగతి.
1. వైద్యుత విద్యుత్ సంబంధ తేజము సర్వప్రియము. పూజనీయము. బలములు అతని ఆధీనములు. అన్నములు అతని స్వాధీనములు. ఆచ్చాదనకారియగు ఆగ్నేయశక్తి ప్రజ్ఞారూపమగును. అది మబ్బుల పైభాగమున వాననీటిని విస్తారము చేయును.
మేము అట్టి వైద్యుతాగ్నిని ఎప్పుడు పూజించగలము?
2. ఋత్విక్కుల ద్వారా లభించగల జ్ఞానమును ఉషస్సులు బోధించగలవా? ఉషస్సులు ఒకరకముగా ఆవరించు కాంతిని సకల జగములందు వ్యాపింప చేయును. దేవాభిషులగు జనులు గడచిన, రానున్న ఉషస్సులను వదిలి వర్తమాన ఉషస్సువలన తమ బుద్ధిని వర్థిల్ల చేసికొందురు.
3. ఇంద్రుడు అహోరాత్రముల విష్పన్నమగు సోమము సేవించును. హృష్టుడగును. అప్పుడు మాయావి వృత్రునిపైకి తన సుధీర్ఘ వజ్రమును ప్రదీప్తము చేయును. ఇంద్రాత్మక ఆదిత్యుని శతసంఖ్యాక రశ్ములు దినములను నివర్తితము, ప్రరివర్తితము చేయును. అవి తమ ఇల్లగు ఆకసమున సంచరించును.
4. పరశువు వంటి అగ్నియొక్క స్వాభావిక స్వరూపమును మేము చూచినాము ! రూపవంతుడగు ఆదిత్యుని కీర్తిపుంజమును మా భోగలాభమునకుగాను కీర్తింతుము. ఆదిత్యుడు సహాయకుడయి యజ్ఞస్థలమునకు ఆహ్వానించు యజమానికి అన్నపూర్ణ గృహము రత్నములు ప్రదానము చేయవలెను.
5. అగ్ని రమణీయ తేజమున ఆచ్చాదితుడగును. అంధకారమును అడుగంటించును. శత్రువులను దునుమాడును. అగ్ని నలుదిశల తన జ్వాలలను విస్తరించును. జిహ్వద్వారా ఘృతాదులను స్వీకరించును. పురుషత్వము బలము ద్వారా కోరికలు తీర్చు అగ్నిని మేము ఎరుగము. ఏలననగా భజనీయుడగు సవిత వరణీయమగు ధనమును ప్రదానము చేయును.
నలుబది తొమ్మిదవ సూక్తము
ఋషి - ఆత్రేయ ప్రతిప్రభుడు, దేవత - విశ్వేదేవతలు ఛందస్సు - త్రిష్టుప్.
1. ఇదిగో ఇప్పుడే మేము మీ యజమానులకొఱకు సవిత మఱియు భగుని వద్దకు చేరుదుము. వారు మనవ యజమానులకు ధనము ప్రదానము చేయుదురు.
నేతృ స్వరూపులగు బహుభోగ కర్తలు అశ్వినులారా ! మేము మీ మైత్రి కోరుచున్నాము. మేము నిత్యము మీ ఉపస్థితికి ప్రార్థింతుము.
2. సవిత శత్రు నివారకుడు. అంతరాత్మా ! నీవు సవిత ప్రత్యాగమనమును తెలియుము. స్తోత్రములద్వారా అతని పరిచర్య చేయుము. సవిత మానవులకు శ్రేష్ఠ ధనము ప్రసాదించును. అతనికి నమస్కరించిగాని హవిస్సులు అర్పించిగాని స్తుతించుము.
3. అగ్ని పోషకుడు. భజనీయుడు. అఖండుడు. అతడు నాలుకతో కఱ్ఱలను కాల్చును. సూర్య తేజమును కప్పివేయును.
ఇంద్ర విష్ణు, వరుణ మిత్ర అగ్ని ఆది దర్శనీయ దేవతలు దినములను ఉత్పన్నము చేయుదురు.
4. ఎంతటివాడును తిరస్కరించజాలని సవిత మాకు అభిమత ధనమును ప్రదానము చేయవలెను. ఆ ధనమును మాకు అందించుటకు స్పందనశీల నదులు ప్రవహించవలెను. అందుకే మేము యజ్ఞహోతలము. స్తోత్రపాఠము చేయుదుము. మేము బహువిధ ధనస్వాములము కావలెను. అన్నము, బలము రమణీయులము కావలెను.
5. వసువులను గమనశీల అన్నము అర్పించిన యజమానికి మిత్రావరుణులను స్తుతించిన వానికి మహా తేజస్సు కలుగవలెను. దేవతలారా ! వారికి దీర్ఘతర సుఖమును ప్రసాదించుడు. మాకు ద్యావాపృథ్వుల రక్షణ లభించవలెను. మేము హృష్టులము కావలెను.
ఏబదవ సూక్తము
ఋషి - ప్వస్త్యాయముని, దేవత - విశ్వదేవతలు ఛందస్సు - అనుష్టుప్, చివరిది పంక్తి.
1. సర్వజనులు సవిత స్నేహముకోరి ప్రార్థింతురు. సర్వమానవులు సవిత నుండి ధనము కోరుదురు. సవిత అనుగ్రహమున సర్వజనులు పుష్టి కొఱకు తగిన ధనమును పొందుదురు.
2. నేతా ! దేవా ! మేము యజమానులము. నీ ఉపాసకులము. హోతలు ఇంద్రాదిదేవతల ఉపాసకులు. మేము మీవారము కావలెను. మేము ధనయుక్తులము కావలెను. మా కోరికలు తీరవలెను.
3. ఈ యజ్ఞమున ఋత్విజుల అతిథులవంటి దేవతలకు పరిచర్య చేయండి. దేవపత్నులకు హవి సమర్పించి పరిచర్య చేయండి దేవతలారా ! దూరమార్గమున వర్తించు శత్రువులను దూరము చేయండి.
4. యజ్ఞవాహకమగు యూపయోగ్య పశువు యూపస్తంభమున ఉన్న యజ్ఞమున సవిత యజమానికి కౌశల్యముగల ధీరురాలగు స్త్రీవలె పుత్ర భృత్యాది ధనమును ప్రసాదించును.
5. నేతా ! సవితా ! నీ రథము ధనవంతము. అది అందరిని పాలించునది. ఆ రథము మాకు శుభములు కలిగించవలెను. మేము స్తుతి యోగ్యుడగు సవిత స్తోతలము. ధనము, సుఖమునకుగాను సవితను స్తుతింతుము.
ఏబది ఒకటవ సూక్తము
ఋషి - స్వస్త్యాత్రేయుడు, దేవత - విశ్వేదేవతలు
ఛందస్సు - 1-4 గాయత్రి, 5-10 ఉష్ణిక్, 11-13 త్రిష్టుప్, 14-15 అనుష్టుప్.
1. అగ్నీ ! మేము హవ్యము సమర్పించు యజమానులము. ఇంద్రాది సకల రక్షక దేవతలతో సోమపానమునకు మా వద్దకు విచ్చేయుము.
2. సత్యస్తుతుల దేవతలారా ! మీరందరు మా యజ్ఞమునకు విచ్చేయండి. అగ్ని జిహ్వద్వారా ఆజ్యమును, సోమరసమును స్వీకరించండి.
3. అగ్నీ ! నీవు అభీష్టవరుదుడువు. పూజనీయుడవు. ఉదయమున వచ్చు దేవతల సహితుడవయి సోమపానమునకు విచ్చేయుము.
4. పురోభాగమున ఉంచబడిన ఈ సోమము అభిషవణ ఫలకమున అభిషవించబడినది. పాత్రలో నింపబడినది. ఇది ఇంద్ర వాయువులకు ప్రియమయినది. ఇంద్ర వాయువులారా ! ఈ సోమరస పానమునకు విచ్చేయుడు.
5. వాయువా ! హవి అందించు యజమాని విషయమున ప్రీతుడవగుము. సోమపానమునకు విచ్చేయుము. విచ్చేసి అభిషుత సోమమును సేవింపుము.
6. ఇంద్ర వాయువులారా ! మీరు అభిషుత సోమపాన యోగ్యులు. కావున అహింసకులయి సోమరసమును సేవించండి. సోమాత్మక అన్నము కొఱకు విచ్చేయండి.
7. ఇంద్రవాయువుల కొఱకు పెరుగు కలిపిన సోమము అభిషుతమయినది. ఇంద్రవాయువులారా! పల్లమునకు పారునదులవలె సోమము మీముందునకు చేరును.
8. అగ్నీ ! నీవు సమస్త దేవతలతో కలిసి అశ్వినులు ఉషవెంట సమాన ప్రీతుడవయి విచ్చేయుము. యజ్ఞమున అత్రి ఆనందించినట్లు నీవు అభిషుత సోమమున ఆనందించుము.
9. అగ్నీ ! నీవు మిత్రుడు వరుణుడు సోముడు విష్ణువు సహితముగ విచ్చేయుము. యజ్ఞమున అత్రి ఆనందించినట్లు నీవు అభిషుత సోమము ఆనందించుము.
10. అగ్నీ ! నీవు ఆదిత్యుడు వసువులు ఇంద్రుడు వాయువు సహితముగ విచ్చేయుము. యజ్ఞమున అత్రి ఆనందించినట్లు నీవు అభిషుత సోమము ఆనందించుము.
11. అశ్వినులు మాకు అనశ్వర శుభములు కలుగజేయవలెను. భగుడు శుభములు కలిగించవలెను. అదితి శుభములు కలిగించవలెను. బలవంతుడు, సత్యశీలుడు శత్రుసంహారకుడు పూష మాకు శుభములు కలిగించవలెను. జ్ఞానవిశిష్ట ద్యావాపృథ్వులు మాకు శుభములు కలిగించవలెను.
12. మాకు శుభములు కలిగించుమని వాయువును స్తుతింతుము. సోముని స్తుతింతుము. సోముడు అఖిలలోక పాలకుడు. సకల దేవతల సహితముగా మంత్రపాలకుడగు బృహస్పతిని మా కళ్యాణమునకుగాను స్తుతింతుము. అదితి పుత్రులు దేవగణములను శుభములు కూర్చుమని ప్రార్థింతుము.
13. ఈ యజ్ఞ దినమున సమస్త దేవతలు మాకు శుభములు కూర్చవలెను. రక్షించవలెను. మానవులనేత, గృహదాత, అగ్నిమాకు శుభములు కూర్చవలెను. రక్షించవలెను. దీప్తిమంతులగు ఋభువులు మా శుభములను రక్షించవలెను. రుద్రదేవుడు మా శుభములను రక్షించవలెను. పాపములనుండి కాపాడవలెను.
14. అహోరాత్రి అభిమానులగు మిత్రావరుణులారా ! మాకు శుభములు ప్రసాదించుడు. హితమార్గగామిని, ధనవతి దేవి మాకు శుభములు ప్రసాదించవలెను. ఇంద్రాగ్నులు మాకు శుభములు ప్రసాదించవలెను. దేవి అదితి మాకు శుభములు ప్రసాదించవలెను.
15. సూర్యచంద్రులు నిరాలంబ మార్గమున రాక్షసాది ఉపద్రవరహితులయి సంచరింతురు. అట్లే మేము మార్గమున సుఖముగా ప్రయాణము చేయవలెను. ప్రవాసమున చిరకాలము ఉన్నప్పటికి అక్రోధనులు, స్మరణశీలురగు బంధువులతో మేము కలియవలెను.
ఏబది రెండవ సూక్తము
ఋషి - ఆత్రేయ శ్యావాశ్వుడు, దేవత - మరుత్తు ఛందస్సు 1-5, 7-15 అనుష్టుప్, 6, 16,17 పంక్తి.
1. శ్యావాశ్వ ఋషీ ! నీవు నెమ్మదిగా స్తుతియోగ్యులగు మరుత్తులను అర్చింపుము. యాగ యోగి మరుద్గణము నిత్యము హవిర్లక్షణ అన్నముపొంది ఆనందింతురు.
2. వారు మరుత్తులు బలములకు మిత్రులు. ధీరులు. వారు మార్గములందు పరిభ్రమింతురు. స్వేచ్చగా మా పుత్రులను భృత్యులను రక్షింతురు.
3. మరుత్తులు స్పందనశీలుడు. జలవర్షకులు. వారు రాత్రిని అతిక్రమించి సంచరింతురు. మరుత్తుల తేజము ద్యావాపృథ్వులందు నిలిచి ఉన్నది. మేము దానిని స్తుతింతుము.
4. మరుత్తులు మర్త్యులగు మానవులను సర్వకాలములందు హింసకుల నుండి రక్షింతురు. హోతలారా ! అందుకే మీరు మరుత్తులను మృదువుగా స్తుతించుచున్నారు.
5. మరుత్తులు పూజనీయులు. విశేషదాన విశిష్టులు. కర్మ నేతలు. అధిక బలవంతులు, హోతలారా! అట్టి యాగయోగ్యులు, ద్యుతిమంతులగు మరుత్తులకు యజ్ఞసాధక హవ్యమును సమర్పించుడు.
6. వృష్టి నేతలగు మహా మరుద్గణములు వెలుగు విరజిమ్ము ఆభరణములను ఆయుధ విశేషములను ధరింతురు. వారు మేఘ భేదనమునకుగాను విశేష ఆయుధములను ప్రక్షిప్తము చేయుదురు. ఉరుములు ఉరుము జలరాశివలె మరుత్తులు వత్తురు. ద్యుతిమంతులగు మరుత్తుల కాంతి స్వయం ప్రకాశకము అగును.
7. భూ సంబంధ మరుత్తులు వర్థిల్లుదురు. అంతరిక్ష సంబంధి మరుత్తులు వర్థిల్లుదురు. వారు నదుల ప్రవాహ మధ్యమునను ద్యులోక మధ్యమునను వృద్ధి చెందవలెను. వర్షకార్యమునకుగాను సర్వత్ర వర్తమానులగు మరుత్తులు మేఘ భేదనమునకుగాను ఆయుధ విశేషములను దాచి ఉంచెదరు.
8. స్తోతలారా ! మరుత్తుల ఉత్కృష్ట బలమును స్తుతించుడు. వారి బలము అత్యంత ప్రవృద్ధము సత్యమూలము. వర్ష నేతలు మరుత్తులు గమనశీలురయి అందరి రక్షణలను వృద్ధిచెందింతురు. జలములకుగాను స్వయముగా పరిశ్రమింతురు.