9. మరుత్తులు 'పురుష్ణి' నదిలో ఉందురు. అందరిని శుద్ధము చేయు కాంతులను కప్పుకొందురు. వారు తమ రథచక్రమున మేఘములను పర్వతములను చెదరగొట్టుదురు.
10. మాకు అభిముఖ మార్గమున వచ్చు మరుత్తులు సర్వత్ర సంచరించువారు గిరికందరముల తిరుగువారు అనుకూల మార్గగాములగు నాలుగు పేర్లుగల మరుత్తులు విస్తరించవలెను. మా కొఱకు యజ్ఞమును వహించవలెను.
11. అభిమత వృష్ట్యాదుల నేతలగు మరుత్తులు లోకములను భద్రముగా వహింతురు. స్వయం సమ్మిళిత స్వయం నిర్మిత జగత్తును విశేషముగ వహింతురు. దూర దేశమగు అంతరిక్షమున మరుత్తులు గ్రహ, నక్షత్ర, మేఘాదులను వహింతురు. ఆవిధముగా మరుత్తుల రూపము నానావిధము దర్శనీయమగును.
12. ఛందస్సున స్తుతించువారు, ఉదకమును అభిలషించు స్తోతలు మరుత్తులను స్తుతించినారు. దూపగొన్న గోతముడు త్రాగుటకుగాను నూతిని ఏర్పరచినారు. మరుత్తులలో కొందరు దొంగచాటుగా మమ్ము రక్షించినారు. మరుత్తులు ఎన్నియో ప్రాణరూపమున కనిపించి దేహబలమును పెంపొందించినారు.
13. మరుద్గణములు దర్శనీయ విద్యుత్ రూప ఆయుధములతో విద్యోతమానులు, మేధావులు, అందరి విధాతలు. శ్యావాశ్వాఋషీ ! నీవు అట్టి మరుద్గణములను రమణీయ స్తుతులతో పరిచర్య చేయుము.
14. ఋషీ ! నీవు హవిర్దానము మఱియు స్తుతుల సహితుడవయి ఆదిత్యునివలె మరుత్తుల వద్దకు చేరుము. మీ బలమున అందరిని ఓడించగల మరుత్తులారా ! మీరు ద్యులోకము నుండిగాని ఇతర లోకము నుండిగాని యజ్ఞమునకు విచ్చేయుడు. మేము స్తుతింతుము.
15. స్తోతలు త్వరగా మరుత్తులను స్తుతింతురు. అన్య దేవతా ప్రాప్తి కోరరు. స్తోతలు జ్ఞాన సంపన్నులు, శీఘ్రగాములు ప్రసిద్ధులు, ఫలప్రదాతలగు మరుత్తులనుండియే అభీష్టఫల సిద్ధిపొందుదురు.
16. మేము మా బంధువుల అన్వేషణలో ఉన్నాము. అప్పుడు మరుత్తులు మమ్ము ప్రేరేపించినారు. వారు ద్యుదేవతను తల్లిని చేసికొన్నారు. అన్నవంతుడగు రుద్రుని తమ తండ్రిగా చూపినాడు.
17. మరుత్తులు సప్త సంఖ్యాకములు. సర్వ సమర్థులు. వారిలో ఒక్కరొక్కరు మాకు వేలగోవులను అశ్వములను ఇవ్వవలెను. వారు మాకు అందించిన గోసమూహ ధనము మాకు యమునా తీరమున లభించవలెను. వారు అందించిన అశ్వ సమూహ ధనము మాకు లభించవలెను.
ఏబది మూడవ సూక్తము
ఋషి - ఆత్రేయ శ్యావాశ్వడు, దేవత - మరుత్తులు ఛందస్సు - 1,5,11,15 కకుభ, 2 బృహతి, 3 అనుష్టుప్, 4 ఉష్ణిక్, 8,12 గాయత్రి, 6,7,9,13,14,16 బృహస్పతి.
1. మరుత్తుల ఉత్పత్తిని ఎరిగినవాడు ఎవడు? తొలుత మరుత్తుల సుఖమున వర్తమానుడు ఎవడు? మరుత్తుల పృథ్విని రథమున జోడించినపుడు వారి బలరక్షక శక్తిని ఎవడు ఎరిగినాడు?
2. మరుద్గణములు రథమున కూర్చున్నారని ఎవడు విన్నాడు? వారి రథధ్వనిని ఎవడు విన్నాడు? వారు ఏ రీతిగా సాగుదురో ఎవరు ఎరుగుదురు? ఏ దానశీలుని కొఱకు బంధుభూత, వర్షక మరుద్గణము మరింత అన్నముతో అవతరింతురు?
3. మరుత్తులు సోమపానము చేసినారు. హర్షము పొందినారు. గుఱ్ఱములు ఎక్కినారు. మావద్దకు వచ్చినారు.
అడిగినారు:-
"మానవులకు హితము కూర్చు నిరాకారుడెవ్వడు" వారు అప్పటి మా స్థితిని చూచినారు. న్నారు. "ఋషీ ! నీవు స్తుతించుము"
4. మరుత్తులారా! మీ దీప్తి - ఆభరణములను ఆశ్రయించిన దీప్తి; ఆయుధములు, మూలలదీప్తి; ఉరపు భూషణముల దీప్తి; హస్త, పాద భూషణములదీప్తి; రథపు దీప్తి; ధనస్సు దీప్తి; అట్టి సమస్త దీప్తులకు మేము ప్రణమిల్లుదుము.
5. శీఘ్రదానశీలురగు మరుత్తులారా ! సర్వత్ర వర్షపు గమనశీల దీప్తివంటి దృశ్యమానమగు మీ రథము మాకు సంతోషము కలిగించును. మేము స్తుతింతుము.
6. మరుత్తులు నేతలు. శోభన దానశీలురు. వారు హవి సమర్పించు యజమానుల కొఱకు ఆకసమునుండి నీరునిండిన మబ్బును కురిపింతురు. వారు ధ్యావాపృథ్వులకుగాను మబ్బులను విడిపింతురు. తదనంతరము సర్వత్ర సంచరించి ఉదక సహితులయి వ్యాపింతురు.
7. పాలిచ్చు కొత్తగా ఈనిన ఆవో అనునట్లు భేదించరాని మేఘమునుండి వెడలిన జలరాశిలోని నీరు అంతరిక్షమున ప్రసారితమగును. బాటన సాగుటకు వదలిన వడిగల గుఱ్ఱమువలె నదులు మహావేగమున ప్రవహించును.
8. మరుత్తులారా ! మీరు ద్యులోకమునుండిగాని అంతరిక్షము నుండిగాని ఈ లోకమునుండిగాని వేంచేయుడు. దూరప్రదేశములగు ద్యులోకము మున్నగువానిలో నిలువరాదు.
9. మరుత్తులారా ! రసా, అనితభ, కుభనామక నదులును సర్వత్రగమించు సింధు మిమ్ములను నిలుపరాదు. జలమయి 'సరయు' మిమ్ము నిలుపరాదు, మాకు మీరాక వలన సుఖము కలుగవలెను.
10. మరుత్తులారా ! మీకు ప్రేరకమగు నీ నూతన రథ బలమును దీప్తిమంతులగు మిమ్ము మేము స్తుతించుచున్నాము. వర్షము మరుత్తులను అనుసరించును.
11. మరుత్తులారా ! మేము స్తుతులతోను హవి ప్రదానమునను నీ బలమును అవివక్షిత గణమును సప్త సముద్రగణమును అనుసరింతుము.
12. నేడు హవ్యములు సమర్పించు ఏ యజమాని వద్దకు ప్రకృష్ట రథమున మరుత్తులు విచ్చేయుదురు?
13. మరుత్తులారా ! మీరు దయార్ద్రులు మీరు పుత్ర, పౌత్రాది, అక్షీణ ధాన్య భీజమును బహు పర్యాయములు ప్రదానము చేయుదురు. అట్టి కరుణాపూరిత హృదయముననే మాకు సహితము అటువంటి ధాన్య భీజమును ప్రదానము చేయుడు. మేము మీనుంచి సౌభాగ్య ధనమును వాంఛింతుము.
14. మరుత్తులారా ! మాకు శుభములు కలుగవలెను. పాపములు మమ్ము పరిత్యజించవలెను. మేము నిందకులగు శత్రువులను జయించవలెను. మీరు వర్షము కలిగింతురు. అందువలన మాకు శుభము కలుగవలెను. పాపనివారక జలము గోయుక్త ఔషధము లభించవలెను.
15. మరుత్తులారా ! మీరు నేతలు, పూజ్యులు. మీరు రక్షించు వారిని దేవతలు అనుగ్రహింతురు. శోభన పుత్ర పౌత్రాదియుక్తులను చేయుదురు. మేము నీవారము. మేము నీ రక్షణ పొందినవారము కావలెను.
16. ఋషీ ! యజమాని స్తుతించువాడు. అతని యజ్ఞమున దాతలగు మరుత్తులను స్తుతించుడు. తృణాదులు తినుటకు గోవులు సాగును. అట్లే మరుత్తులు ఆనందింతురు. పురాతన బంధువుల వంటి మరుత్తులను ఆహ్వానించుము. స్తోత్రప్రియ మరుత్తులను వచనములతో స్తుతించుము.
ఏబది నాలుగవ సూక్తము
ఋషి - శ్యావాశ్వుడు, దేవత - మరుత్తులు, ఛందస్సు జగతి 14 త్రిష్టుప్.
1. మరుత్తుల బలమును ప్రశంసించండి. వారు తేజోవిశిష్ట పర్వతములను చెదరగొట్టువారు. ఉష్ణ నివారకులు. ద్యులోకము నుండి వచ్చువారు. ద్యుతిమంతులు. అన్నవంతులు. వారికి ఎంతో అన్నము ప్రదానము చేయుడు.
2. మరుత్తులారా ! మీ గణములు ప్రాదుర్భవించినవి. అవి దీప్తిమంతములు. జగద్రక్షణార్థము జలాభిలాషులు. అన్న వర్థయితులు. గమనించుటకు రథమును అశ్వయుక్తము చేయునవి. విద్యుత్తుతో కలిసి పోవునవి. నలుదిక్కుల పయనించు జలరాశి అంతరిక్షము నుండి నేల మీద పడును.
3. మరుత్తుల ద్యుతిమంత తేజోవంతులు. వర్ష నేతలు. ఆయుధయుక్తులు. ప్రదీప్తులు, మేఘవిదీర్ణులు. వారంవారం ఉదకదాతలు. వజ్ర క్షేపకులు. ఏకత్ర శబ్దాయమానులు. ఉద్ధతబలులు.
మరుద్గణములు వర్ణము కొరకు ప్రాదుర్భూతులు అయినారు.
4. రుద్రపుత్రులగు మరుత్తులారా ! మీరు రాత్రింబవళ్లను కలుగచేతురు. సర్వ సమర్థులారా ! మీరు అంతరిక్షమును లోకములను వెల్లడి చేయుదురు. కంపనకారులారా ! సముద్ర మధ్యస్థ నౌకవలె మేఘములను కంపింప చేయుడు.
మరుత్తులారా ! శత్రునగరములను ధ్వంసము చేయుడు. "నాహరిష్యధ" హింసించకండి.
5. సూర్యుడు ఎంతో దూరమువరకు తనకాంతిని విస్తరింప చేయును. అట్లే మరుత్తులారా ! మీ సుప్రసిద్ధ వీర్యమును బలమును స్తోతలు ఎంతో దూరము వరకు విస్తరింప చేయుదురు.
6. మరుత్తులారా ! మీరు వృష్టి విధాతలు. మీరు జలవంతమగు మేఘమును బాదుదురు. మీ బలము శ్రేయస్కరము. పరస్పర గమనప్రీతిగల మరుత్తులారా ! మార్గ ప్రదర్శనమున నేత్రము నాయకత్వము వహించినట్లు మమ్ము సుగమ మార్గమున ధనాదుల వద్దకు చేర్చుడు.
7. మరుత్తులారా ! మీరు మంత్రద్రష్టయగు ఏ ఋషిని లేక రాజును సత్కర్మలకు ప్రేరేపింతురో అట్టివాడు ఇతరులచే పరాభూతుడు కాడు. హింసితుడు కాడు. అతడు ఎన్నడూ క్షీణించడు. పీడింపబడడు. అతనికి ఎటువంటి బాధకలుగదు. అతని రక్షణలకు, ధనమునకు నష్టము వాటిల్లదు.
8. నియుతనామక అశ్వయుక్తులు, సంఘాత్మకులు, నరాకారులు, ఆదిత్యునివలె దీప్తులగు మరుత్తులు ఉదకవంతులు. వారు అధిపతులయినపుడు నేలనున్న బావులను - ఆకాశమున ఉన్న మబ్బులను జలపూర్ణము చేసెదరు. శబ్దాయమాన సారభూత, సుమధుర జలములతో భూమిని తడిపెదరు.
9. మరుత్తుల కొరకు పృథ్వి విస్తీర్ణమగును. ద్యులోకము మరుత్తుల సంచారమునకు విస్తీర్ణమగును. అంతరిక్ష మార్గములు మరుత్తుల రాకపోకలకు విస్తీర్ణములగును. మరుత్తుల కొరకే మేఘములు పర్వతములు వర్షకారకములగును.
10. మరుత్తులు మహాబలవంతులు. అందరినేతలు - ద్యులోక నాయకులు. వారు సూర్యోదయమున సోమపానమున హృష్టులు అగుదురు. అప్పుడు వారి అశ్వములు నడకలో శిథిలములు కావు. వారు ముల్లోకముల మార్గములన్నింటిని దాటుదురు.
11. మరుత్తులారా ! మీ మొలకు ఆయుధములున్నవి. కాళ్లకు కడియములు, ఉరమున ఆభరణములున్నవి. మీరు రథమున దేదీప్యమానులయి ఉన్నారు. మీ చేతులందు అగ్ని దీప్త కిరణములు ఉన్నవి. తలమీద బంగారు మకుటము ఉన్నది.
12. మరుత్తులారా ! మీరు నడక సాగించినపుడు అప్రతిహత దీప్తిశాలి స్వర్గము సముజ్వల జలరాశి విచలితములు అగును. మేము సమర్పించిన హవ్యములు ఆరగించి బలశాలురు అయినపుడు ఉజ్వల భావమున దీప్తిప్రకాశితము చేయుదురు. మీరు జలవర్షము కలిగించ తలచినపుడు భీషణ రూపమున గర్జింతురు.
13. వివిధ బుద్ధులుగల మరుత్తులారా ! మేము రధాధిపతులము. మేము మీరు ప్రసాదించిన అన్నవంతమగు ధనములకు స్వాములము. మీరు ప్రసాదించిన ధనమునకు నష్టము వాటిల్లదు. సూర్యుడు ఆకాశము నష్టపడడు కదా ! మరుత్తులారా ! దుమ్ము అపరిమిత ధనమున ఆనందింప చేయుడు.
14. మరుత్తులారా ! మీరు మాకు ధనము, పుత్రులు, భృత్యులు మున్నగువానిని ప్రదానము చేయుడు. మీరు సోమ సహిత విప్రుని రక్షించండి. మీరు శ్యావాశ్వునకు ధనము, అన్నము దానము చేయండి. అతడు దేవతలను యజించువాడు. రాజును సుఖయుక్తుని చేయండి.
15. మరుత్తులారా ! మీరు సద్యో రక్షణశీలురు. మీవద్ద మేము ధనమును యాచింతుము. సూర్యుడు తనకాంతితో దూరదూరములకు విస్తరిల్లినట్లు - ఆధనము వలన మేము పుత్ర, భృత్యాదులతో విస్తరిల్లుదుము.
మరుత్తులారా ! మీరు మా ఈ స్తోత్రమును అభిలషించుడు. అందువలన మేము బలము కలిగి వంద హేమంతములు జీవింతుము. "తరేమ తరసా శతం హిమాః"
ఏబది అయిదవ సూక్తము
ఋషి -శ్యావాశ్వుడు, దేవత - మరుత్తులు, ఛందస్సు - జగతి, చివరిది త్రిష్టుప్.
1. మరుద్గణములు అత్యంత పూజనీయులు. దీప్తి ఆయుధవంతులు. యవ్వనరూపులు. బృహత్ అన్నమును ధరించినవారు. వారు వక్షమున హారములు ధరింతురు. సులభముగా అదుపులో ఉంచదగినవి, వడిగల గుఱ్ఱములు వారిని వహించును. జలప్రియులయిసాగు మరుత్తుల రథము అన్నింటిని వెనుక సాగును. "యాతామనురథా అవృత్సత"
2. మరుత్తులారా ! మీరు సరి అనుకున్న సామర్థ్యమును స్వయముగా సాధింతురు. మీ సామర్థ్యము అప్రతిహతము. మీరు మహామహులయి, అత్యున్నతులయి శోభిల్లండి. అంతరిక్షమును బలము ద్వారా వ్యాప్తము చేయండి. జలప్రియులగు సాగు మరుత్తులుమీరు, "యాతామనురథా అవృత్సత"
3. మహా మరుద్గణములు ఒకేసారి పుట్టినవి. ఒకేసారి వర్షకములు అగును. వారు అత్యంత శోభతో ఎల్లెడల వర్థిల్లుదురు. సూర్య రశ్మివలె వారు యుగాది కార్యములనేతలు శోభాసంపన్నులు అగుదురు. జలప్రియులయిసాగు మరుత్తులు "యాతామనురథా అవృత్సత"