Previous Page Next Page 
ఋగ్వేద సంహిత - 2 పేజి 8


    5. అగ్నీ ! నీ స్తోత్రము అత్యంత మనోహరము. సోమరసము చెక్క పాత్రలో ఉండును. దానిని నీవు స్వీకరింతువు. మనోహర స్తోత్రములను ఆలకింతువు. అట్లు నీవు ఉల్లాసవంతుడవు అగుదువు. అప్పుడు నీవు ఉపాసకుల మధ్య ఎంతో శోభింతువు.

    జీవనదాతా ! యజ్ఞమున నీవు రక్షించుజ్వాలను సర్వత్ర వర్థిల్లచేయుము.

    6. ఇది ఎట్లు కనిపించునో అట్లే వర్ణించబడును. సాధక దీప్తియుక్తమయి అది జలమధ్యమున తన రూపము ధరించును.

    ఆ దేవతలు మాచే పూజింపబడవలెను. వారు మాకు విశేషధనము, మహావేగము, అసంఖ్యాకులగు వీర పుత్రులను, అక్షయ బలమును ప్రసాదించవలెను.

    (శాయణుడు "ఏషావైశ్వదేవీ" ఈమెవైశ్వదేవి అన్నాడు. మంత్రమున ఆ పేరు కనిపించదు. వైశ్వదేవిని గురించి వివరణ లేదు. "యాదృగేవదృశ్యతే తాదృగుచ్యతే" అని మంత్రము)

    7. సూర్యుడు సమదర్శి. అగ్రగామి. అతడు అసురులతో యుద్దాభిలాషగలవాడు. భార్య ఉషతో విహరించుటకు సాహస పూర్వకముగ అగ్రసరుడు అగును. ధనము సూర్యాధీనము. అతడు మాకు ఉజ్వలము, సర్వత్ర రక్షణలు కలిగించు గృహమును పరిపూర్ణ సుఖమును ప్రసాదించవలెను.

    8. సూర్యుడు సర్వదేవ శ్రేష్ఠుడు. సూర్యా ! యజమానులు నీవద్దకు చేరుదురు. నిన్ను ఉదయాది లక్షణముల ద్వారా తెలుసుకొనవచ్చును. ఋషులు నిన్ను స్తుతింతురు. అందున నీ పేరు వర్ధిల్లును.

    ఋషులు కోరిన దానిని వారు తమ కార్యముల ద్వారా సాధింతురు. మనస్ఫూర్తిగా పూజించువారికి ఫలితము దక్కును.

    9. మా సమస్త స్తోత్రములందు ప్రధాన స్తోత్రములు సముద్రతుల్యుడగు సూర్యుని చేరును. యజ్ఞ గృహమున విస్తరించిన సూర్య స్తుతికి క్షతిలేదు. పవిత్ర సూర్యునకు తవ చిత్తము సమర్పించిన ఉపాసకుని హృదయగత అభిలాష విఫలముకాదు. ఫలించును.

    10. సవిత అందరితో స్తుతించబడువాడు. అందరి కోరికలు పూరించువాడు. అతనివద్ద మాకు క్షత్ర్ - మనన - అవద-యజత సిధ్రి - అవత్సారనామక ఋషిజ్ఞానులద్వారా భోగయోగ్యము బలప్రదమగు అన్నము లభించును.

    11. విశ్వవార, యజత, మాయీ ఋషుల సోమరస జనిత మదము ప్రశంసనీయ గమనముగల శ్యేన పక్షివలె శీఘ్రగామి అగును. అదితివలె విస్తారమగును. వారు సోమ పానమునకుగాను పరస్పరము ప్రార్థింతురు. విశేషపానము చేయుదురు. అతిరిక్త మత్తత పొందుదురు.

    12. సదాసృణ; యజత; భువృక్తః; శృతవిత్; తర్య ఋషులు మీతో కలిసి శత్రుసంహారము చేయవలెను. ఆ ఋషులు ఇహపర లోకములందు సకల శ్రేష్ఠకోరికలను సాధించి దీప్తులు కావలెను. ఎందుకనగా వారు హవ్యము, స్తోత్రములద్వారా విశ్వదేవతలను ఉపాసింతురు.

    13. యజమాని అవత్సారుని యజ్ఞమున సుతంభర ఋషి సుందర ఫలముల పాలయిత అగును. సమస్త యజ్ఞకార్యములు ఫలప్రదములగును. గోవులు స్వాదుదుగ్ధములను ప్రదానము చేయును. పాలు అందించబడును. ఈ క్రమమును చాటి అవత్సారుడు నిద్రను వదిలి అధ్యయనము సాగించును.

    14. సర్వదా గృహమున జాగృతులగు దేవతలను ఋక్కులు అభిలషించును. సర్వదా జాగృతుడగు దేవతలను సామము వరించును. సర్వదా జాగృతుడగు దేవతతో అభిషుత సోమము ఇట్లనవలెను.

    "మమ్ము స్వీకరించుము. అగ్నీ ! నీనియత స్థానమున సహవాసము చేయుదుము"

    "ఆహతవాహమస్మి సఖ్యేన్యోకాః"

    15. అగ్ని సర్వదా గృహమున జాగృతుడగును. ఋక్కులు అతనిని అభిలషించును. అగ్ని సర్వదా జాగృతుడగును. సామము అతనిని వరించును. అగ్ని సర్వదా జాగృతుడగును. అతనితో అభిషుత సోమము ఇట్లనవలెను.

    "ఆహతవాహమస్ని సఖ్యేన్యోకాః"

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత నాలుగవ అష్టకము ఐదవ మండలమున మొదటి అధ్యాయమున మూడవ అనువాకము సమాప్తము)


               నాలుగవ అనువాకము            నలుబది అయిదవ సూక్తము

        ఋషి - ఆత్రేయ సదాపృణుడు, దేవత - విశ్వేదేవతలు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. అంగిరులు ఇంద్రుని స్తుతించినారు. ఇంద్రుడు స్తుతులు విన్నాడు. స్వర్గమున వజ్రము అందుకున్నాడు. పణులు అపహరించి దాచిన గోవులను పునరుద్ధరించినాడు.

    కదలివచ్చు ఉషాకిరణములు సర్వత్ర వ్యాపించును. పుంజీభూత అంధకారమును నష్టపరచి సూర్యుడు ఉదయించును. అతడు మానవుల ఇళ్లవాకిళ్లను తెరిపించినాడు.

    2. ఘట, పటాది పదార్థము భిన్న రూపములుగా కనిపించును. అట్లే సూర్యుడు తన దీప్తిద్వారా విస్తరితుడగును. కిరణజాలములకు జనని ఉష సూర్యుని ఆగమమునకు వీక్షించి విస్తార అంతరిక్షమున అవతరించును. దరులను కూల్చునదులు ప్రవాహమానమగు జలరాశి వెంట ప్రవహించును. ఇంటిని నిలుపుటకు ఏర్పరచిన గట్టి స్తంభమువలె స్వర్గము సుదృఢ భావమున నిలిచి ఉండును.

    3. మహాస్తోత్రముల స్రష్టలగు ప్రాచీనులవలె మేము ఎంతకాలము స్తుతింతుమో అంతకాలము మేఘ గర్భములందున్న జలరాశి మా మీద పడుచుండును. మబ్బులు వాన కురిపించును. ఆకాశము తన కార్యసాధన చేయును. సర్వత్ర పరిచర్యలు చేయు అంగిరులు కర్మానుష్ఠానము ద్వారా నితాంత పరిశ్రాంతులు అగుదురు.

    4. ఇంద్రాగ్నులారా ! మా రక్షణ కొఱకు దేవతలు సేవించు ఉత్కృష్ట స్తోత్రములతో మేము మీ ఇద్దరిని ఆహ్వానింతుము. చక్కగా యజ్ఞము చేయు మరుత్తులవలె కర్మతత్పరులు, పరిచర్యలు చేయు జ్ఞానులు స్తోత్రములతో మీ ఉభయులను ఉపాసింతురు.

    5. ఈ యజ్ఞదినమున శీఘ్రముగ విచ్చేయుడు. మేము శుభంకర కర్మలు చేయువారలము. ప్రత్యేకముగ శత్రువులను హింసింతుము. ప్రచ్చన్న శత్రువులను దూరము చేయుదుము. యజమానులముందుకు త్వరత్వరగా చేరుదుము.

    (ఇవి అంగిరులు అన్నమాటలు)

    6. మిత్రులారా ! రండు, మనము స్తోత్ర పాఠము చేతము. ఎవనిద్వారా దొంగలించబడిన గోవుల కొట్టము కనిపెట్టబడినదో, ఎవనిద్వారా మనువు హనువిహీన శత్రువును జయించినాడో, ఎవనివలన వర్తకునివలె బహుఫలాకాంక్షి - కక్షీవంతుడు జలమునుకోరి, అడవులకు పోయి జలము పొందినాడో.

    (అతనిని స్తుతింతమని "ఇదమప్యంగిరసాం వాక్యం" ఇదియ అంగిరస వాక్యము)

    7. ఈ యజ్ఞమున ఋత్విక్కుల చేతులందు కదలాడిన శిలాఖండ శబ్దము ఉత్పన్నమగును. ఆ శబ్దము ద్వారముననే నవశ్వులు, దశశ్వులు ఇంద్రుని పూజించినారు.

    యజ్ఞమందున్న సరమ గోవులను పొందినది. అంగిరుల సకల స్తవాది కర్మలు సఫలములు అయినవి.

    8. అది పూజనీయ ఉష అవతరించిన కాలము. అప్పుడే అంగిరులకు గోవులు లభించినవి. గోవులు ఉషతో కలిసినపుడు సత్యమార్గమున సరమ గోవులను చూచినది. అంతట అక్కడి ఉత్కృష్ట యజ్ఞశాలలో పాలవాగులు పారినవి.

    9. సూర్యుడు ఏడు గుఱ్ఱముల స్వామి. అతడు మా ముందుకు విచ్చేయవలెను. అతడు శ్రమ సాధ్యమగు బాటన ఒక సుదూర గంతవ్య ప్రదేశమునకు చేరవలసి ఉన్నది. సూర్యుడు శ్యేన పక్షివలె శీఘ్రగామి యయి సమర్పిత హవ్యము కొఱకు అవతరించును. అతడు స్థిర యవ్వనుడు. దూర దర్శి.

    సూర్యుడు. నిజ కిరణముల మధ్య నిలిచి వెలుగులను పరచును.

    10. ఉజ్జ్వల జలరాశిమీద సూర్యుడు ఆరోహించును. అతడు వెలుగు వెన్నుగల గుఱ్ఱములను రథమునకు జోడించినపుడు ధీమంతుడగు యజమాని - నదిలోని ఓడనువలె సూర్యుని ఆహ్వానించును. అతని ఆదేశము వినియే జలరాశి అవనతమగును.

    11. దేవతలారా ! ఈ స్తోత్రము సర్వదాయకము. ఈ స్తోత్రముననే నవగ్వులు దశమాస సాధ్య యజ్ఞమును సముపార్జించినారు. మేము నీటి కొఱకుగాను అట్టి స్తోత్రములతో మిమ్ము స్తుతింతుము. ఏ స్తోత్రము ద్వారా మాకు దేవతల రక్షణ కలుగునో, దేనివలన పాపపు సీమను అతిక్రమించగలమో అట్టి స్తోత్రమును ఉచ్ఛరింతుము.

                                           నలుబది ఆరవ సూక్తము

    ఋషి - ప్రతిక్షత్రుడు, దేవత - తొలి ఆరింటికి విశ్వేదేవతలు, మిగిలినవారికి దేవపత్నులు, ఛందస్సు - జగతి 2, 3 త్రిష్టుప్.

    1. సర్వజ్ఞ ప్రతిక్షుత్రుడు శకటమున అశ్వమువలె తనను యజ్ఞభారమునకు జోడించినాడు. హోతలమగు మేము అలౌకిక రక్షావిధాయక భారమును వహింతుము. ఈ భారమును తప్పించు కొనవలెను అనుకొనము. ఈ భారము మాటి మాటికి మాకు కలుగవలెనని సహితము కోరము. దారి తెలిసిన అంతర్యామి దేవతలు పురోగాములయి సరళ మార్గమున మానవులను నడిపించవలెను.

    2. అగ్ని - ఇంద్ర - వరుణ - మిత్రాది దేవతలారా ! మీరందఱు మాకు బలమును ప్రసాదించండి. విష్ణువు, మరుత్తులు మాకు బలమును ప్రసాదించవలెను. ఆసత్యద్వయము, రుద్రుడు, దేవ పత్నులు, పూష, భగుడు, సరస్వతి మా పూజలకు ప్రసన్నులు కావలెను.

    3. మా రక్షణకుగాను మేము ఇంద్రుని - అగ్నిని - మిత్రుని - వరుణుని అదితిని - ఆదిత్యుని - ద్యావాపృథ్వులకు - మరుత్తులను - పర్వతములను- జలములను - విష్ణువును - బ్రాహ్మణస్పతిని సవితను ఆహ్వానింతుము.

    4. విష్ణువు - అహింసకారి వాయువు - దానదాత సోముడు మాకు సుఖములు ప్రసాదించవలెను. ఋభువులు - అశ్వినులు - త్వష్ట - విభుడు మాకు ఐశ్వర్యము ప్రసాదించుటకు అనుకూలురు కావలెను.

    5. పూజనీయులు స్వర్గలోక స్థితులు మరుద్గణములు కుశలపై ఆసీనులగుటకు మావద్దకు రావలెను. బృహస్పతి - పూష - వరుణుడు - మిత్రుడు - ఆర్యమ మాకు గృహసంబంధములగు సంపూర్ణ సుఖములను ప్రసాదించవలెను.

    6. శుభంకర స్తోత్రవంతములగు పర్వతములు దానశీలలగు నదులు మమ్ము రక్షించవలెను. ధనదాత భగుడు అన్నము, రక్షణలతో విచ్చేయవలెను. సర్వత్ర వ్యప్తయగు అదితి మా స్తోత్రములను ఆలకింపవలెను.

    7. ఇంద్రాది దేవతల పత్నులు మా స్తోత్రములు వినవలెను. మమ్ము రక్షించవలెను. వారు మాకు బలశాలురగు పుత్రులను, సమృద్ధ అన్నమును ప్రసాదించవలెను.

    దేవేరులారా ! మీరు భూమిమీద ఉన్నను అంతరిక్షమున ఉన్నను ఉదక వ్రతమున నిమగ్నులగుడు. మేము మిమ్ము ఆహ్వానించుచుందుము. మీరు మాకు సుఖములు అనుగ్రహించుడు.

    8. దేవేరులగు దేవపత్నులు హవ్యమును ఆరగించవలెను. ఇంద్రాణి; అగ్నాని; దీప్తిమతి; అశ్విని; రోదసి; వరుణాని ఆదులు విశేషముగా మా స్తుతులను వినవలెను. దేవ పత్నులలో ఋతువుల అధిష్ఠాత్రిదేవి మా స్తోత్రములను ఆలకించవలెను. హవ్యమును ఆరగించవలెను.

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత ఐదవ మండలమున నాలుగవ అష్టకము రెండవ అధ్యాయము సమాప్తము)


        ఓం వతామినన్తి మాయినో వధీరావ్రతా దేవావాం ప్రధమాధ్రివాణి
        నరోదసీ అద్రుహా వేద్యాభిరన్న పర్వతావి వమేస్థివాంసః


               మూడవ అధ్యాయము             నలుబది ఏడవ సూక్తము

     ఋషి - ప్రతిరథుడు, దేవత - విశ్వేదేవతలు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఉష పరిచర్యకారిణి, నిత్యతరుణి, పూజనీయ; పూజిత ఉష ఆహూతురాలై శక్తిగల తల్లివలె కన్యస్వరూప పృథ్విని ఆలకించును. మానవులను పనులందు ప్రవర్తితులను చేయును. ద్యులోకమునుండి రక్షకులగు దేవతల సహితముగా యజ్ఞభూమికి విచ్చేయును.

    2. కిరణములు ఎల్లలు ఎరుగనివి. సర్వత్ర వ్యాపించునవి. అవి వెలుగులతో తమ కర్తవ్యమును నిర్వహించును. అమర సూర్యమండలమున ఏకత్రితమగును. ద్యావాపృథివి, అంతరిక్షములకు పయనించును.

    3. సూర్యుని రథము జలప్రదము. దేవతలకు ఆనందాయకము. దీప్తిమంతము, ద్రుతగామి. అది జనక స్వరూపమగు తూర్పుదిక్కున ప్రవేశించినది. తదుపరి స్వర్గమధ్యమున నిలిచినది. విభిన్న వర్ణుడు, సర్వవ్యాపి సూర్యుని అంతరిక్షపు ఉభయ భాగముల అగ్రసరుని చేసినది. సూర్యుడు జగత్తులను రక్షించుచున్నాడు.

 Previous Page Next Page