Previous Page Next Page 
అందమైన అపశృతి పేజి 9


    శృతి మౌనం విడనాడ లేదు.

    "ఉదయం ఆస్ప్రో ఉందా అని అడిగాను. మాత్రలేమన్నా వున్నాయా శృతీ?"

    రెండు ఆనాసిన్ మాత్రలు తెచ్చి స్టూలుమీద పెట్టింది శృతి.

    రెండు మాత్రలూ వేసుకుని  మంచినీరు తాగాడు మురారిదేముడు.

    "నీకు ఉత్తతలనొప్పేకాదు జ్వరం, కడుపులో నొప్పి ఇంకా చాలా చాలా  రావాలి." కోపంగా అనుకుంది శృతి.

    "నువ్వు మౌనవత్రం పట్టినా నే మాట్లాడక తప్పదు శృతీ! ఈపూట భోంచేయను. కాఫీ, పాలు, ఏదిచ్చినాసరే వేడి ద్రవపదార్థం చాలు. ఉదయం తలనొప్పి వళ్ళు పులకరింత జ్వరంలోకిదించాయి. ఏనూట రెండు జ్వరమో వుండివుంటుంది కాలి గాయం కొద్దిగా చీముపట్టింది. గాయంవల్లే జ్వరం వచ్చి వుంటుంది. గాయం కూడా బాగా సల్పుతున్నది. కాటను, ఆయింటుమెంటు, గుడ్డ యిస్తే గాయం శుభ్రంచేసి కట్టు కట్టు కుంటాను. ఈలోపల కాఫీ కలిపి ఇద్దువుగాని."

    ఆప్తులతో చెప్పుకుంటే బాధ కొంతయినా ఉపశమిస్తుందన్నట్లు శృతితో చెప్పాడు మురారిదేముడు.

    అతను చెబుతుంటే కంఠం వణుకుతున్నట్లు శృతి గమనించింది.

    "అతనికి జ్వరం రావాలని నేనెందుకు కోరుకున్నాను?" తనకి తెలియకుండానే అనుకుంది శృతి.

    అప్పటికీ మాట్లాడలేదు శృతి. కాటను, ఆయింట్ మెంటు, తెల్లలుంగీలో చించిన గుడ్డపీలిక అక్కడ పెట్టి వంటింట్లోకెళ్ళి  కాఫీ కలుపుకు వచ్చింది.

    శృతి వచ్చేటప్పటికి మురారిదేముడు గాయంచుట్టూ వున్న చీము. నెత్తురుని కాటన్ తో అద్ది తుడుస్తున్నాడు.

    మురారిదేముడు ప్రక్కనే కాఫీగ్లాసు వుంచిన  శృతి దగ్గరనుంచి అతని కాలి గాయాన్ని చూసింది అది మామూలు గాయంగాక తుఫాకీ తూటావల్ల అయింది కాబట్టి గాయం లోతుగా వుంది. చీము బాగా పట్టింది. కొంతమేర కాలు వాచింది. కూరలు తిరుగుతూ కత్తిపీట కోసుకుంటే చాలు వారంరోజులు ఆ వేలు అలా పెట్టుకు తిరుగుతుంది శృతి. కొద్ది గాయానికి కొద్దిచీముపడితే ఎంత బాధో అనుభవమే శృతికి. మురారిదేముడి కాలు  చూడగానే కడుపులో దేసినట్లయింది. "అంతపెద్ద గాయానికి ఎంత బాధగా వుంటుందో అనుకుంది. ఆపై ముద్దుమాట గుర్తొచ్చి "ఎవరు చేసిన పాపం వాళ్ళనుభావించాల్సిందే." అనుకుంది కసిగా.

    మురారిదేముడు కాఫీ తాగాడు. కాలిగాయం శుభ్రం చేసి కట్టు కట్టుకున్నాడు. కుంటుకుంటూలేచి వెళ్లి గాయం తుడిచిన కాటను, అంత క్రితం కట్టుకట్టుకున్న గుడ్డపీలిక దొడ్లో గోడమీద నుంచి బైటపారేసి వచ్చాడు.

    "శృతీ! ఈ గాయం సెప్ టిక్ కాకుండా  జాగ్రత్త పడకపోతే కోతి బ్రహ్మరాక్షసిలా తయారవుతుంది. నేను కొన్ని మాత్రలూ, మందులూ చెపుతాను. అవీ , చిన్న  పేకేట కాటన్, గాజ్ గుడ్డ రేపు కొనుకొచ్చి పెట్టు" అన్నాడు మురారిదేముడు.

    "నాకు తెలియదు." ఈసడింపుగా అంది శృతి. మొదటి సారిగా పెదవి కదిపింది.

    "చదువుకున్న దానివి. బజారు కెళ్ళటం రాడా? మెడికల్ షాపు తెలియదా? మెడిసిన్స్ అడగడం చాతగాదా? నీకు ముందే వార్నింగ్ ఇచ్చాను శృతీ! నన్ను రెచ్చగొట్టవద్దని."

    చురచుర చూసింది శృతి.

    "తర్వాత కోప్పడుదువుగాని. శాంతింఛి నాకోరిక మన్నించి రేపు మెడికల్ షాపు కెళ్ళోచ్చావంటే నా ప్రాణం రక్షించిన దానివవుతావ్!"

    "నే వెళ్ళను." అంది శృతి.

    "ఏం వెళ్ళను." అంది శృతి.

    "ఏం, ఎందుకెళ్ళవు? ముద్దు పెట్టుకున్నాననేనా? నా ప్రాణం తీస్తానని బెదింరించావ్! దాని మాటేమిటి?" ఓ అడుగు ముందుకొచ్చి అడిగాడు మురారి దేముడు.

    "నీ ప్రాణం ఎందుకు తీస్తాను! రెండు కాళ్ళమీద రివాల్వర్  పేలుద్దామనుకున్నాను." నోరుజారి నాలుక్కర్చుకుంది శృతి.

    "ఈ గాయంతోనే బాధపడుతుంటే, ఇంకా రెండు గాయాలా? ఓ మైగాడ్, ఈ యింట్లోంచి నే వెళ్ళటం కిష్టం లేదా?"

    "గాయపర్చి పోలీసులకి పట్టిద్డామనుకున్నాను." ధైర్యంగా ఉన్నవిషయం చెప్పింది శృతి.

    "ఘనకార్యమే ఆపనే  చేయాల్సింది. ఆ తర్వాత నీ పని పట్టేవాడిని. పాము మనిషిజోలికిపోదు. తనకకారంచేస్తే మాత్రం కాటేసిందాకా ఊరుకోదు. నా జోలికొచ్చినా అంతే" అంటూ మురారిదేముడు కుంటుతూ శృతి దగ్గర కొచ్చాడు.

    శృతి భయంతో రెండడుగులు వెనక్కువేసింది.

    "రేపు నే చెప్పినవి తెస్తావా? లేదా?"

    "ఎలా తీసుకురాను? పగలు మాఅన్నయ్య వుంటాడు. బజారుకెళతానంటే ఏంకావాలో చెప్పు నేనే తేస్తానంటాడు" పొడారిపోతున్న పెదవులని నాలుకతో తడిచేసుకొని నెమ్మదిగా అంది శృతి.

    "అదంతా నాకు తెలియదు. కూరలకనే వేళతావో, స్నేహితురాలింటికనే వెళతావో, ఏ వంకతోనో వెళ్ళు సంచి అడుగున నే చెప్పినవి దాచి పైన ఇంటికి కావలసిన సరుకులో పుస్తకాలో పెట్టుకుని ఉపాయంగా రా, సరేనా?"

    "వీలుకాకపోతే?"

    "వీలుచేసుకో"

    శృతి మాట్లాడలేదు.

    "తెస్తావా, లేదా? ' మరింత ముందుకొచ్చి శృతి భుజం  మీద బరువుగా చెయ్యేసి శృతి కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ రెట్టించి అడిగాను మురారిదేముడు.

    "తెచ్చిపెడతాను" దూరంగా జరుగుతూ అందిశృతి.

    "ఈ ఒక్కమాట ఇందాకే  అంటే పోయేదాకా ఎందుకింత గోల? " అంటూ  మురారిదేముడు శృతి భుజంమీద నుంచి చెయ్యి తీసేశాడు.

    "కందిరీగల తుట్టేని కదిలించకూడదు." అనుకుంది శృతి నైట్ శృతీ?" అని కుంటుకుంటూ పడకగదిలోకి వెళ్ళి పోయాడు మురారిదేముడు.

    "గుడ్ నైట్" గొణిగింది శృతి
   
    నవల చదువుతూ పడుకున్నాడు మురారిదేముడు. ముందు గదిలో ఉన్న శృతికి అతను కనిపిస్తూనే వున్నాడు. వారపత్రిక అందుకుని మధ్య మధ్య ఓరకంటితో చూస్తూ అతను నిద్రపోయిందాకా తనూ నిద్రపోరాదని నిశ్చయించుకుని కూర్చుంది.

    "నువ్వూ చదువుకుంటున్నావా?" మధ్యలో ప్రశ్నించాడు మురారిదేముడు.

    "ఊ" అని "నాకు నేను కాపలా కాచుకుంటున్నా" అనుకుంది శృతి.

    నవలంతా చదివి గంట తర్వాత లైటార్పి బెడ్  లాంప్ స్బిచ్ నొక్కి మరోసారి "గుడ్ నైట్" చెప్పి నిండా దుప్పటి ముసుకు పెట్టుకు పడుకున్నాడు మురారి దేముడు.

    ఆవులిస్తూ పత్రిక మూసి పావుగంట నిద్ర ఆపుకుని మురారిదేముడు నిద్రపోయాడని రూఢి చేసుకుని అప్పుడు లైటు ఆర్పి మంచమెక్కింది శృతి.

    "నా  పిచ్చిగాని మెలకువతో వునప్పుడే ఆపద రావాలనేముంది? నేను మంచి నిద్రలో వుండగా మురారి దేముడు ఏమైనా చేయదల్చుకుంటే చేయక వదిలిపెడతాడా? ఈ శిని తొందరగా వదిలితే బాగుండును. అమ్మ, అన్నయ్య ఇంట్లో వుంటే ఏం చేస్తాడు? రాత్రి కూడా అట కేగతి. పాపం! ఎలావుంటాడో? పాపం దేనికి? డ్రైనేజీ గొట్టాలు, పొగ గొట్టాలు, అటకలు అన్నింటిల్లో దాక్కోటం అలవాటేగా?"

    అలా ఆలోచిస్తూ నిద్రపోయింది శృతి.


                                                    7
   
    ఉదయమే ఊరు నుంచి దిగింది సీతమ్మ.

    శృతికి తల్లిని చూడగానే పై ప్రాణాలు పైనే పోయినట్లయింది. ఇంకా రెండు మూడు రోజులదాకా ఊరునుంచి తల్లి రాదులే అని ధైర్యంగా వుంది. మరోవిధంగా జరిగింది.

    "అదేమిటి శృతీ? అలా నుంచుండిపోయావేం నన్ను చూడంగానే" చేతిలో సంచి కిందపెట్టకుండానే అడిగింది సీతమ్మ.

    "ఆశ్చర్యంగా వుంది!" తెప్పరిల్లి తెలివిగా అంది శృతి.

    "ఎందుకూ ఆశ్చర్యం?" సీతమ్మ తానే ఆశ్చర్యపోతూ అడిగింది.

 Previous Page Next Page