శృతి నిస్సత్తువుగా మురారిదేముడి చేతిలో వడిలిపోయిన తోటకూర కాడలా ఉండిపోయింది.
శృతి పెదవి గంటు పడేలా కొరికి వదిలేశాడు మురారి దేముడు.
శృతి కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. "అబ్బా" అంది.
"అబ్బ కాదు అమ్మని తల్చుకో. వాళ్ళిద్దరినీ దేనికిలే. నన్ను తల్చుకో" అని వంగి రివాల్వర్ అందుకున్నాడు మురారిదేముడు.
శృతి చేతుల్లో ముఖం దాచుకుని ఏడుపు ఆపుకోటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నది. ఎగిసిపడే గుండె వణుకుతున్న చేతులు. వినబడుతున్న ఎక్కిళ్ళు శృతి ఏడుస్తున్నదని చక్కగా తెలియజేస్తున్నాయి.
"ఏడుస్తున్నావా శృతీ?" మృదువుగా అడిగాడు మురారిదేముడు.
శృతి మాట్లాడలేదు.
"రేప్ చేసినట్లు ఏమిటా ఏడుపు? ముందేమయింది ఈ జాగ్రత్త? హెచ్చారించానే. లక్ష్యపెట్టావా?"
".... .... .... ... ...."
"ముద్దు పెట్టుకున్నాను అంతేగా?"
".... ... .... .... ..... ..."
"మృదుమధురంగా ఉండేది ముద్దు. దీనికింత బాధపడాలా? కాపోతే ఆ తొందరలో కాస్త గట్టిగా ముద్దెట్టు కొనుంటాను. సారీ! శృతీ!" మురారి దేముడి చెయ్యి శృతి భుజంమీద నిమ్మదిగా పడింది. సారీ? చెపుతున్నాకదా! ఒక ఆడపిల్లని బెదిరించి ఇలా దాక్కోవటం నాకూ ఇష్టం లేదు. ఏం చేయను? నా వృతి అలాంటిది. నీ జోలికి రానని ముందే మాటిచ్చాను. ప్రాణం తీస్తానని రెండోసారి బెదిరించావ్? నన్ను రెచ్చగొట్టావ్, అయినా ముద్దుతో వదిలేశాను. కానీ మూడోసారి బెదిరించావనుకో ముద్దుతో మాత్రం వదిలెయ్యను......"
భుజంమీదున్న మురారిదేముడి చేతిని విసిరికొట్టింది శృతి. "పాముకి పాలు పోశాను," వెక్కుతూనే కోపంగా అంది.
మురారిదేముడి చేతులు శృతిని చుట్టేశాయి. "ఊ!.....ఏడుపు ఆపు. కోపం తగ్గించుకో. నా జోలికి నీవురాకు. నీ జోలికి నేను రాను ఇదే చివరిమాట. నేను నీ వాళ్ళ కళ్ళల్లో పడితే నీకు ప్రమాదం వూహిస్తున్నావేగాని నా గురించి ఆలోచించావా? ప్రమాదంలో ఉంది నేను. నా ఉనికిని నే బైట పెట్టుకుంటావా? ఎంత తెలివితక్కువదానివి. సమయం చూసి నేనే వెడతాను. ఊఁ ఏడుపు ఆపాలి. లేకపోతే నా చేతులిలా నిన్ను చుట్టేవుంటాయి. ఆపైనా మనసు నా వశం తప్పుతుంది. ఆపై......"
శృతి టక్కున ఏడుపాపేసింది.
"గుడ్ గరల్! నాకు భోజనం వడ్డించు" అంటూ మురారి దేముడు శృతినుంచి దూరంగా జరిగాడు.
శృతి రయ్యిన వంటగదిలోకి పరుగెత్తింది.
మురారిదేముడు బాత్ రూమ్ కెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కోచ్చాడు. ఆ పూట స్నానం చేయ్యాలేదు.
వంటగదిలోకి వెళ్ళిన శృతి ఇంకా వడ్డించలేదు. మురారిదేముడు స్నానం చేసోచ్చేటప్పటికి ఎలాగూ ఆలస్యం అవుతుంది. అందుకే తీరుబడిగా హృదయంలో భారమంతా దిగేటట్టు పీటమీద కూర్చుని మోకాళ్ళలో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది. మురారి దేముడు గుమ్మంలో నుంచుని వుండటం గమనించలేదు.
"కాసేపుఏడిస్తేనేగాని ఈపిల్ల స్తిమితపడేటట్లు లేదు" అనుకుంటూ రెప్పవాల్చకుండా శృతిని చూస్తూ ఉండి పోయాడు మురారిదేముడు తను చేసిన పనికి పశ్చాత్తాపం మాత్రం పడలేదు.
శృతి కళ్ళు తుడుచుకుంటూ తల ఎత్తి మురారి దేముణ్ణి చూసింది. భయం, కంగారుతో చకచక పీటవాల్చి భోజనం వడ్డించింది.
మురారిదేముడొచ్చి పీటమీద కూర్చున్నాడు.
రోజూ ఒకటి మాట్లాడుతూ అతన్ని పరీక్షగా చూస్తూ రకరకాలుగా ఆలోచించేది శృతి. ఛాతీనిండా నల్లని ఊలు కోటులా ఇంతెతున పెరిగిన రోమాలు చూడంగానే "చీమలూ దోమలూ ఏం ఖర్మ బల్లులు తొండలుకూడా ఈ మహారణ్యంలో దాక్కోవచ్చు" అనునుని నవ్వుకునేది. "ఛా....పాడు ఆలోచనలు......" అని ఆపై తిట్టుకునేది. మనిషి తెల్లగానే వున్నాడు. దొంగలు, ఖూనీకోర్లు నల్లగా ఉంటారని కథల్లో చదివింది గాని తెల్లదొంగలు లేరని చదవలేదుగా" ఇలాసాగేవి ఆలోచనలు.
ఈ రోజు మాత్ర్రం తలెత్తిపోరపాటుగానైనా మురారిదేముడి వేపు చూడలేదు శృతి. అన్నీ దగ్గరపెట్టి అవమాన భారంతో అటు తిరిగి అలమర సర్దుతూ నుంచుంది.
"కూర బాగుంది." మురారిదేముడన్నాడు, కూరమారు వడ్డించుకుంటూ.
శృతి ఊకొట్టలేదు, తిరిగి చూడలేదు, అలమరలో డబ్బాలను జాడీలను తియ్యను, యధాస్థానంలో పెట్టనుచేస్తున్నది.
కొద్దిసేపు ఆగి పులుసు బాగుంది. పులుసులో మూలాక్కాడలు నాకెంతో ఇష్టం." అన్నాడు మురారిదేముడు.
నోరుమూసుకుని తినిపో అన్నట్లు మౌనం వహించింది శృతి.
మురారి దేముడు ఇంక మాట్లాడలేదు. భోజనం ముగించి పీటమీద నుంచి లేచాడు.
"శృతీ? కాలు సలుపుతున్నది. వాళ్ళంతా నొప్పులు జ్వరమొచ్చేటట్లుంది. ఆస్ప్రోగాని అనాసిన్ గాని టాబ్ లెట్లు ఉన్నాయా?" అడిగాడు మురారిదేముడు.
శృతి జవాబిచ్చేలోపలే వాకిలి తలుపులు దడదడ శబ్దం చేశాయి.
మురారిదేముడు నాలుగంగల్లో మధ్యగదిలోకి వెళ్ళి అటకెక్కాడు.
మురారిదేముడు తిన్న కంచం తీసుకెళ్ళి అంట్లలో పడేసి "అప్పడే అన్నయ్య వచ్చాడా?" అనుకుంటూ తలుపు తీయటాని కెళ్ళింది శృతి.
వచ్చింది సిద్ధార్థకాదు. శృతి స్నేహితురాలు శ్రీదేవి.
"అదేమిటే శృతీ! నీ ముఖం అట్లా వుంది! అద్దంలో ఓసారి చూసుకో నుదుట కుంకుమ చెదిరింది. కాటుక కన్నీటి చారికలు బుగ్గలమీద జాలువారాయి, కళ్ళు వుబ్బాయి, ముఖం వాడిపోయింది, శరీరం.....ఆ....నాలాగాలేదులే, నే వస్తున్నానని ముందే గ్రహించి తీరుబడి ఏడుస్తూ కూర్చున్నా వేమిటే? లేక ఎవరైనా రేప్ చేశారా?" గుమ్మంలో కాలు లోపల పెడుతూ నవ్వుతూ అడిగిండి శ్రీదేవి.
"ఏడ్చినటే వుంది. నిద్రపోయి లేచాను." అంది శృతి.
"నీ ముఖంఏడ్చినట్లే వుందనే కదానే సెలవిచ్చిందీను?" అంటూ పకపక నవ్వింవి శ్రీదేవి.
మిట్టమధ్యాన్నం మిడసరి లగ్నం అన్నట్లు ఇప్పుడు బైలుదేరి వచ్చావేమిటి?" అంది శృతి.
"చెప్పాలా?"
"చెప్పక తప్పదు."
"మీ అమ్మ ఊరికి వెళ్ళిందని నాకు తెలుసు. రాత్రింబవళ్ళు ఇలా పడి నిద్రపోతావనికూడా నాకు తెలుసు. అందుకే నీ నిద్రాభంగం చేయటానికి, నీతో సరదాగా సాయంత్రందాకా గడుపుదామని వచ్చాను. నిద్రముఖం నీవూను. నే వచ్చేసరికి టాయ్ లేట్ అయి ఖుషీగా వుండక ఇదేమిటి?"
"వస్తావని ముందే కబురు చెయ్యకపోయావా? అలంకరించుకుని ఎదురుచూస్తూ వుండేదాన్ని ప్రస్తుతం తమరు కూర్చుంటే ముఖం కడుక్కుని, పౌడరద్దుకుని, బొట్టు పెట్టుకుని వస్తాను."
"త్వరగా రమ్ము, ప్రస్తుతము బాత్ రూమ్ కి పొమ్ము, నేనిలా విశ్రమించెద లెమ్ము" అంటూ శ్రీ దేవి మంచాని కడ్డంగా పడుకుంది.
తేలికపడిన హృదయంలో శృతి వెళ్ళి ముఖం కడుక్కువచ్చింది.
శృతి శ్రీదేవి ఓచోట చేరారంటే వాళ్ళకి గంటలు నిమిషాల్లో గడిచిపోతాయి.
మరి కాసేపటికి శృతి, శ్రీదేవి కబుర్లలో పడ్డారు.
6
శ్రీదేవికి, శృతికి ఒకళ్ళింట్లో ఇంకోరు భోంచేయటం అలవాటే.
శ్రీదేవి రాత్రిదాకా వుండి భోంచేసి వెళ్ళింది. శృతికి తోడుగా రాత్రి పడుకునేదేగాని ఇంట్లో రాత్రికి అక్కాబావా దిగబడతారని కారణం చెప్పి వెళ్ళింది.
అన్నయ్యచేత మీ ఇంటికి కబురు పంపిస్తాలే! ఈ రాత్రికుందూ?" బతిమిలాడింది శృతి.
"ఈ ఒక్క సారికీ నన్నోదిలేయి బాబ్బాబు! నీకాళ్ళు నీ చేతులు , నీకంఠం ఎక్కడ పట్టుకోమంటే అక్కడే పట్టుకుంటా. మా అమ్మవుకదూ? నా తల్లివి కదూ?" అంటూ శృతి గడ్డం పుచ్చుకుంది శ్రీదేవి.
"అదికాదు శ్రీ! ఈ మధ్య చెల్లాయి ఒంటరిగా వుండలేక పోతున్నది వెధవ నైట్ డ్యూటీలని నామీద రోజుకి పదిసారు విసుక్కుంటున్నది. అమ్మ ఊరినుంచి రాలేదని ధూంధాం అంటూ ఆ కోపంకూడా నామీదనేచూపిస్తున్నది" భోంచేస్తూ సిద్దార్థ అన్నాడు.
"వంటరిగా వుండలేకపోతే తొందరగా ఎవరినోచూసి ముడిపెట్టి జంటగా వుండేటట్లు చెయ్యండీ." అంది శ్రీ దేవి.
"ఏదీ, చూస్తున్నా శృతికి తగ్గవాడు దొరకలిగా ?"
"ఏ సన్నాయి వాడినో చూసి కట్టేయండి."
"ఇష్టమొచ్చినట్లు వాగావంటే ఈ వేడిచారు నీనెత్తిన పోస్తాను. పెళ్ళికి నీకు తొందరగా వున్నట్లుంది నామీద పెట్టి నీక కోరిక బైట పెట్టావ్. ఇంకోక్కమాట నీనోట్లోంచి వచ్చిందా నీ పెళ్ళి నేనే చేసి పంపిస్తాను తక్షణం" అంది శృతి.
"చెల్లాయేమిటి అలా అంటున్నది శ్రీ!" సిద్దార్థ చిలిపిగా చూస్తూ అడిగాడు.
"ఛీ....పో" అంది శ్రీ దేవి సిగ్గుపడుతూ.
"కుదిరింది తిక్క. అయ్యింది పెళ్ళి." అంటూ చిన్న పిల్లల్లా ఆనందిస్తూ చప్పట్లు కొట్టింది శృతి.
అలా సర్దాగా కబుర్లతో భోజనం కానిచ్చారు ముగ్గురూ.
సిద్దార్థ నైట్ డ్రూటీకి వెళ్ళిపోయాడు.
శ్రీదేవి ఇంటికి వెళ్ళిపోయింది.
వాళ్ళు వెళ్ళంగానే గాలిస్తంభించినట్లు, చైతన్యం కోల్పోయినట్లు దిగాలుగా మన్నుతిన్న పాములా వుండి పోయింది శృతి.
మిలిటరీ వాడిలా కార్యక్రమంలో ఏ పొరపాటూ వుండరాదన్నట్లు వాళ్ళు అటు వెళ్ళిన పావుగంటకి ఆటక మీద నుంచి మురారి దేముడు దిగాడు.
మురారిదేముణ్నిచూసి శృతి ముఖంతిప్పుకుంది. అతన్ని చూడగానే అంతవరకూ మర్చిపోయింది. గుర్తుచేసినట్లయింది. అతని వుడుం పట్టులో గిలగిలలాడుతుంటే అతడు బలవంతాన ముద్దులు పెట్టుకుని పెదవి కొరికి వదిలేశాడు. అది మరవటానికి వీలులేకుండా పెదవి గాటు మంట పుడుతున్నది.
"నామీద ఇంకా కోపం తగ్గలేదా?"
ఆడపిల్ల మగవాడి కెంతలోకువ అన్నట్లు చురుక్కునచూచి ముఖం తిప్పేసుకుంది శృతి.
"నీ స్నేహితురాలు. అదే శ్రీదేవి. అబ్బబ్బ పిల్ల కాదు పిడుగు. వాగింది వాగినట్లే వుంది."