Previous Page Next Page 
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 89


    9. వశాలంభనము చేయువాడు ముందు 'ఆవాయోభూష' ఇత్యాది ఋక్కుచే వశను ఉపాకరణము చేయవలెను. అప్పుడు అతడు వాయువునుండియే వశను సంపాదించి ఆలంభనము చెసినట్లగును.

    10. 'ఆకూత్యైత్వా, కామాయత్వా' అనునది మంత్రమున చెప్పిన రీతియే అగునని గ్రహించవలెను.

    11. జిహ్వాగ్రమును పైకిచాచి అటునిటు కదలించునపుడు ఏర్పడు ధ్వని కిక్కిట ధ్వనిని అనుకరించుట అగును. ఆ ధ్వని చేయుచు గ్రామ్య పశువులను వశపరచుకొందురు. ఆ ధ్వని చేయుచు హోమము చేయవలెను. ఆ ధ్వనిచే గ్రామ్య పశువులు వశములగును. అరణ్య మృగములు ఆ ధ్వని విని పారిపోవును. కిక్కిటాకార ధ్వనిచే హోమము చేయుట గ్రామ్య పశువుల ధృతికి సాధ్యము అగును.

    12. యజమాని కొరివిచేతబట్టి పశువునకు ప్రదక్షిణము చేయునపుడు ఆజ్యహోమము చేయవలెను. అట్లు చేసిన వశను సజీవముగనే స్వర్గమునకు పంపిన వాడు అగుచున్నాడు. 'త్వం తురీయా' ఇత్యాది మంత్రములచే వశను దేవలోకమునకు పంపినవాడు అగుచున్నాడు.

    13. "సత్యాః సన్తు యజమానస్య కామాః" అనునది మంత్రము. ఈ యజ్ఞము నిరాటంకముగ సమాప్తి యగునుగాక అనునదియే యజమాని కోరిక. అందుకే ఆ మంత్రము ఆ విధముగా చెప్పినది.

    14. పశువా! నీవు మేకవు. హవిస్సు రూపమున దేవతలకు ధనము అగుచున్నావు అనుటవలన యజమానికి మూడు లోకములందు ప్రతిష్ఠ కలుగుచున్నది.

    15. ఈ మేక యజమానికి స్వర్గమునందు ప్రకాశము కలిగించుచున్నది అనునది మంత్రములోని చరమభాగము అగుచున్నది.

    16. 'తన్తుం తన్వ' ఇత్యాది మంత్రము ఈ మేక యజమానికి మూడు లోకములను ప్రకాశవంతము చేయుచున్నది అని వచించినది.

    17. యజ్ఞమునందలి అతిరిక్త అంగమునకు ఈ అజము శాన్తి అగుచున్నది అనునది 'అనుల్బణ' మంత్రార్థము.

    18. ప్రజలు మనువు సంబంధులు. కావున ఆ ప్రజలనే భోగ్యములుగా చేయుచున్నాడు అనునది 'అనుల్బణ' మంత్రపు చరమభాగపు అర్థము.

    19. 'పశువా! నీవు పూజించదగిన దేవతలకు హవిస్సువు అగుచున్నావు' అనునది మంత్రార్థము అది స్వగాకారము కొరకు అగుచున్నది.

    20. 'పశువా! నీ అంగములను తిని మేము పుష్టిగల అంగము కలవారము అగుచున్నాము' అని మంత్రము చెప్పుటను యజమాని ఆశీస్సుగానే కోరుచున్నాడు.

    21. వశమ ఆలంభనము చేయువాడు మబ్బులు కమ్ముకున్నచో ఆలంభన చేయరాదు. ఆకాశము నిర్మలముగా ఉన్నప్పుడే ఆలంభనము చేయవలెను.

    22. వశా పశువులు ఆలంభన చేసినపుడు అకస్మాత్తుగా ఆకాశము మేఘావృతమైనచో ఆలబ్ధ పశువును జలములందు ప్రవేశపెట్టవలెను. లేదా మొత్తమును తినవలెను.

    23. వధించిన పశువును జలములందు ప్రవేశపెట్టిన యజ్ఞమును విఘ్నము చేసినవాడు అగును. మొత్తమును భక్షించినచో తాను సామర్థ్యము కలవాడు అగుచున్నాడు.

    24. సంవత్సరసత్రయాగము చేసినవాడు - సహస్రదక్షిణాయుక్తమగు యాగము చేసిన సహస్రయాజి - గృహపతిగా దీక్షనొందిన గృహమేధి మాత్రమే దీనికి అర్హులు. ఆ ముగ్గురే ఈ వశాయాగము చేయవలెను. ఇది వారినే అనుసరించుచున్నది.

                                          నాలుగవ అనువాకము

    1. చిత్తము నా యందు ఉండునుగాక. చిత్తిః అను నిర్వికల్ప జ్ఞానము నాకు కలుగునుగాక. ఆకూతమను సంకల్పితము నాకు కలుగునుగాత. ఆకూతి యనుసంకల్పము నాకు కలుగునుగాక. విజ్ఞానము నాకు కలుగునుగాక. అంతఃకరణము నాకు కలుగునుగాక. చక్షురాది బాహ్యేంద్రియ శక్తులు నాకు కలుగునుగాక. దర్శయాగము, పూర్ణమాస యాగము, బృహత్ యాగము, రథంతరసామము నాయందు నిలుచునుగాత.

    యుద్దాభిగమనములందు అనుభవముగల ప్రజాపతి వర్షము కలిగించు ఇంద్రునకు జయహేతువులగు మంత్రములను ప్రసాదించినాడు. అందువలన జనులందరు ఇంద్రునకు విధేయులు అయినారు. ఆ ఇంద్రుడే అనుభవజ్ఞుడు అయినాడు. 'సహి హవ్యో బభూవ' అతడు హోమ యోగ్యుడు అయినాడు.

    2. పూర్వము దేవతలు, అసురులు యుద్ధసన్నద్ధులు అయినారు. అప్పుడు ఇంద్రుడు ప్రజాపతిని దర్శించినాడు. ప్రజాపతి ఇంద్రునకు జయహేతు మంత్రములను ఉపదేశించినాడు. ఇంద్రుడు జయహేతు మంత్రములచే హోమము చేసినాడు. అందువలన దేవతలు జయించినారు. జయించినారు కావున వాటికి 'జయత్వ' మంత్రములని పేరు వచ్చినది.

    3. స్పర్థ కల యజమాని ఈ మంత్రములచే హోమము చేయవలెను. అందువలన అతడు తన శత్రువులను నిశ్చయముగా జయించును.

                                      అయిదవ అనువాకము

    1. అగ్ని ప్రాణులకు అధిపతి. సమ్కావతు - అతడు మమ్ము రక్షించునుగాత.

    పెద్దలగులోకపాలురకు ఇంద్రుడు అధిపతి. సమ్కావతు. యముడు పృథివికి అధిపతి. సమ్కావతు. వాయువు అంతరిక్షమునకు అధిపతి. సమ్కావతు. సూర్యుడు దివికి అధిపతి. సమ్కావతు. సూర్యుడు దివికి అధిపతి. సమ్కావతు. చంద్రుడు నక్షత్రములకు అధిపతి. సమ్కావతు. బృహస్పతి బ్రాహ్మణులకు అధిపతి. సమ్కావతు. మిత్రుడు సత్యమునకు అధిపతి. సమ్కావతు. వరుణుడు జలములకు అధిపతి. సమ్కావతు. సముద్రుడు ప్రవాహములకు అధిపతి. సమ్కావతు. అన్నము సామ్రాజ్యములకు అధిపతి.సమ్కావతు. 

    సోముడు ఓషధులకు, సూర్యుడు అనుజ్ఞలకు, రుద్రుడు పశువులకు, త్వష్ట రూపములకు, విష్ణువు పర్వతములకు, మరుత్తులు గణములకు అధిపతులు. వారు నన్ను రక్షింతురుగాక.

    తండ్రులారా! తాతలారా! ఏడుతరములకు పూర్వపు, పరపు పితామహులారా! ఈ లోకమున మమ్ము రక్షించండి.

    బ్రాహ్మణులయందు, క్షత్రియులయందు, కోరదగిన ఫలములందు, ప్రాధాన్యమునందు, చేయబడుచున్న ఈ కర్మయందు, దేవతలను గూర్చిన మా ఆహ్వానములందు అగ్ని భూతములకు అధిపతి అగుచున్నాడు. అతడు మమ్ము రక్షించవలెను. పైవానియందు ఇంద్రుడు పెద్దలకు అధిపతి అగుచున్నాడు. అతడు మమ్ము రక్షించునుగాక.

                                      ఆరవ అనువాకము

    1. దేవతలు చేసిన యజ్ఞములనే అసురులు చేసినారు. అప్పుడు దేవతలు 'అభ్యాతాన' మంత్రములను అభిముఖముగ తెచ్చి హోమము చేసినారు. అందువలన దేవతల కర్మ సమృద్ధము అయినది. అభ్యాతాన హోమము తెలియనందునను, చేయనందునను అసురుల కర్మ సమృద్ధము కాలేదు.

    2. యజమాని ఏ కర్మచేత సమృద్ధిని కోరునో అతడు అభ్యాతాన మంత్రములచే హోమము చేయవలెను. అందువలన అతనికి నిశ్చయముగా సమృద్ధి కలుగుచున్నది.

    3. విశ్వేదేవతలు 'అభ్యాతాన' మంత్రములను దర్శించినారు. అందువలన అవి విశ్వేదేవతాకములు అయినవి.

    ప్రజాపతి ఇంద్రునకు జయహేతు మంత్రములను ప్రసాదించినాడు. అందువలన అవి ప్రజాపతి దేవతాకములు అయినవి.

    దేవతలు 'రాష్ట్రభృత్' మంత్రముల వలన రాష్ట్రమును అసురుల నుండి గుంజుకున్నారు. అందువలన ఆ మంత్రములకు రాష్ట్రభృతత్వము కలిగినది.

    దేవతలు అభ్యాతాన మంత్రముల చేత అసురులను వశపరచుకున్నారు. 'జయత్వ' మంత్రముల చేత అసురులను ఓడించినారు. 'రాష్ట్రభృత్' మంత్రములచేత అసురులనుండి రాజ్యమును గుంజుకున్నారు.

    అసురులను వశ్యులను చేసికొన్నందున వాటికి అభ్యాతానత్వము కలిగినది. జయత్వ మంత్రములచే జయించినందున వాటికి జయత్వమంత్రములని పేరు వచ్చినది. రాష్ట్రభృత్ మంత్రములను పేరు వచ్చినది.

    ఈ మూడు విధములగు మంత్రముల వలన దేవతలు విజయులైనారు. అసురులు పరాజితులు అయినారు.

    4. శత్రువులు కలవాడు ఈ మూడు విధముల మంత్రములచే హోమము చేయవలెను. అభ్యాతానము వలన అతడు శత్రువులను వశ్యులను చేసికొనును. జయత్వమంత్రముల వలన శత్రువును జయించును. రాష్ట్రభృత్ మంత్రముల వలన అతడు శత్రువుల రాజ్యమును గుంజుకొనును.

    అందువలన అతడు గెలుచును. అతని శత్రువు ఓడిపోవును.

                                       ఏడవ అనువాకము

    1. ఒక గంధర్వుడు. అతని పేరు అగ్ని. అతడు సత్యముచే అసత్యమును ఓడించువాడు. ఋతము అతని ధామము. ఓషధిదేవతలు అతనికి ప్రియభార్యలు. వారి పేరు "ఊర్జ".

    ఆ అగ్ని నామక గంధర్వుడు బ్రాహ్మణ, క్షత్రియులను రక్షించునుగాక. అతని భార్యలు బ్రాహ్మణ, క్షత్రియులను రక్షింతురుగాక. ఆ గంధర్వునకు - తస్మై స్వాహా. అతని భార్యలకు - తాభ్యః స్వాహా.

    2. ఒక గంధర్వుడు. అతని పేరు సూర్యుడు. అతడు సర్వమును అనుసంధానము చేయువాడు. సమస్త సామములు తెలిసినవాడు. అతనికి మరీచిదేవేరులు ప్రియభార్యలు. వారిపేరు ఆయువులు.

    ఆ అగ్నినామక గంధర్వుడు బ్రాహ్మణ, క్షత్రియులను రక్షించునుగాక. తష్మై స్వాహా. అతని భార్యలు - ఆయువులు - బ్రాహ్మణ, క్షత్రియులను రక్షింతురుగాక. తాభ్యః స్వాహా.

    3. ఒక గంధర్వుడు. అతని పేరు చంద్రుడు. అతడు అందమైనవాడు. సూర్యకిరణములు కలవాడు. అతనికి నక్షత్రములు ప్రియభార్యలు. వారిపేరు బెకురయః - బేకురులు.

    ఆ చంద్రనామక గంధర్వుడు బ్రాహ్మణ, క్షత్రియులను రక్షించునుగాక. తస్మై స్వాహా. అతని భార్యలు - బేకురులు - రక్షింతురు గాక. తాభ్యః స్వాహా.

    4. ఒక గంధర్వుడు. అతని పేరు యజ్ఞము. అతడు విశ్వమును పాలించువాడు. పక్షివలె ఆకసమున తిరుగువాడు. అతనికి దక్షిణలు ప్రియభార్యలు. వారికి స్తవములు అనిపేర్లు.

    ఆ యజ్ఞనామక గంధర్వుడు బ్రాహ్మణ క్షత్రియులను రక్షించునుగాక. తస్మై స్వాహా. అతని భార్యలు - స్తవములు - బ్రాహ్మణ క్షత్రియులను రక్షించునుగాక. తాభ్యః స్వాహా.

    5. ఒక గంధర్వుడు. అతనిపేరు మనస్సు. అతడు ప్రజాపతి, విశ్వకర్మ. అతనికి ఋక్సామ దేవతలు భార్యలు. వారు అందకత్తెలు.

    ఆ మనస్సను పేరుగల గంధర్వుడు బ్రాహ్మణ, క్షత్రియులను రక్షించునుగాత. తస్మై స్వాహా. అతని అందకత్తెలగు భార్యలు బ్రాహ్మణ క్షత్రియులను రక్షింతురుగాత. తాభ్యః స్వాహా.

    6. ఒక గంధర్వుడు. అతని పేరు వాతుడు. అతడు అనుకున్నచోట ఉండువాడు. అంతట సంచరించువాడు. అతనికి జలదేవతలు ప్రియభార్యలు. వారిపేరు ముదా.

 Previous Page Next Page