1. యజమాని అర్పించు హవిస్సు అధికము అయినచో ఆ యజ్ఞమునకు అవగుణము కలుగును. అందుకు పరిహారముగా 'సూర్యోదేవా' ఇత్యాది మంత్రములచే హోమము చేయవలెను. అప్పుడు బృహస్పతియు ప్రజాపతియు, యజ్ఞపు అవగుణమును సరిచేయుదురు.
2. ఒకదేవతకు బలి ఇచ్చిన పశువు కడుపుతో ఉన్నదయిన ఆ బలి రాక్షసులకు చెందును. రాక్షసులను నాశము చేయుటకు "యస్యాస్తే హరితో గర్భః" అను మంత్రములను ఉచ్ఛరించవలెను. అట్లయిన ఆ పశువు దేవతలకు చేరుచున్నది.
4. ప్రజలు, పశువులు సంపద అగుచున్నవి అని చెప్పబడినది. అందువలన యజమాని పశువులను, ప్రజలను సమృద్ధములను చేయుచున్నాడు.
5. యజ్ఞాంగము తక్కువ అయినచో అది స్వర్గమును చేరును. అది ఎక్కువైనచో అది భూమిని చేరును. వానిని సరిచేయనిచో యజమాని పీడించబడును. అప్పుడు 'మహీద్యౌ' ఇత్యాది మంత్రములు ఉచ్చరించవలెను. అందువలన ఆ హెచ్చు తగ్గులను ద్యావాపృథ్వులే సరిచేయును మరియు యజమానికి పీడకలుగదు.
6. యజమాని ఆత్మసాత్కారము కొరకు మేక గర్భమును బూడిదతో కప్పువలెను. గర్భము ద్యావాపృథ్వుల నుండియే ఉత్పన్నమైనది. బూడిదచే కప్పుట వలన ఆ గర్భమును ద్యావాపృథ్వులందే స్థాపించినట్లగును.
7. పశువు యొక్క హృదయాద్యంగమును అవదానము చేసినచో హవిస్సు అతిరిక్తమగును. అవదానమే చేయనిచో హవిస్సు రిక్తమగును. ఆ దోషపరిహారమునకు గాను పశువు యొక్క నాభి ముందు భాగమునుండి కొంచెము అంగమును, నాభిపై భాగమునుండి కొంచెము అంగమును అవదానము చేయవలెను. ముందు భాగము నుండి ప్రాణ వాయువు ముఖమునకు సంచరించును. పై భాగము నుండి అపానవాయువు వెనుక భాగమునకు సంచరించును. అందువలన పూర్తి పశువును అవదానము చేసినట్లగును.
8. విష్ణువు పశుస్వామి అగును. అతని కొరకు పశువు గర్భపు దక్షిణ పూర్వపాదమును ఛేదించి హోమము చేయవలెను. పశువు యొక్క ప్రధానాంగము మరియు పశువునకు సంబంధించిన ఉపాకృత అధిక భాగము విష్ణువునకు సంబంధించినది అగును. ఆ విధముగా చేయుటవలన అతిరిక్తము నందే అతిరిక్తమును స్థాపించినవాడు అగును. అది అతిరిక్తమునకు శాంతి అగును.
9. ఈ యొక్క ప్రాయశ్చిత్త ఇష్టియందు ఎనిమిది బిందువుల బంగారము దక్షిణగా ఈయవలెను. ఆలబ్దమైన పశువు గర్భము కలది. అందువలన గర్భస్థ శిశువు సహితముగా ఎనిమిది పాదములు కలది. ఆత్మతొమ్మిదవది అగును. కావున అష్టబిందు దక్షిణ పశుదక్షిణ యగును. అది పశుప్రాప్తికి కారణము అగును.
10. హిరణ్యమును దక్షిణగా ఇచ్చు యజమాని దానిని తలపాగ యొక్క నాలుగవ మడతయందు ఉంచవలెను. ఏలననగా పశువు గర్భము నందున్న శిశువు 1. మావి 2. చర్మము 3. మాంసము 4. ఎముకలు అను పొరలు కలది అగుచున్నది. అట్టి హిరణ్యమును దానము చేసిన యజమాని సంపూర్ణ పశువును దానము చేసినవాడు అగును.
11. యజ్ఞమునందు ఈ విధమగు ప్రాయశ్చిత్త క్రియ చేయువానికి అత్యంత ధనము లభించును.
రెండవ అనువాకము
1. వాయుదేవా! విచ్చేయుము. పశువును అలంకరించుము. దేవా! నీవు శుద్ధ హవిస్సును పాలించువాడవు. నీకు వేల సంఖ్యలో 'నియుత' అశ్వములు ఉన్నవి. నీకు పశురూప ఆహారము ఇష్టమగును. నీకు ఏ పశుసంబంధమగు పశువు సోమసదృశమనిపించునో - దానినే నీకు సమర్పించుచున్నాను.
2. పశువా! ఆకూత్యై - నా సంకల్పసిద్ధి కొరకు త్వా - నిన్ను - కామాయ - నా కోరికలు తీర్చుటకు - త్వా - నిన్ను - సమృద్ధయే - సమృద్ధికొరకు - కిక్కిటా - కిక్కిటాకార పూర్వకముగ, తేమనః - నీ మనస్సును, ప్రీణయిత్వా - సంతోషపరచి, ప్రజాపతయే స్వాహా.
3. వశా పశువా! లోకములు మూడు కాగా నీవు నాలుగవ దానవు. నీవు వంధ్యవు. మనసున ఒకసారి పురుషాభిలాష కలిగినంత నీకు గర్భమైనది. తదుపరి నీవు ఇంద్రియ నిగ్రహము కలదానవు. కావున నీవు దేవతలను చేరుము. అందువలన సత్యాస్సంతు యజమానస్య కామాః - యజమాని కోరికలు తీరునుగాక.
4. పశువా! నీవు మేకవు. ఇప్పుడు హవిస్సువు అయినావు. దేవతలకు ధనరూపవు అయినావు. నీవు భూమిమీద ఉండుము. తదుపరి అంతరిక్షమునకు చేరుము. ద్యులోకమునందు నీకు గొప్ప తేజస్సు కలుగును.
5. రజస్వరూప హవిరంశమును విస్తరింపచేయుము. ఆదిత్యుని అనుసరించి సాగుము. మేము ప్రజ్ఞచే సాధించిన జ్యోతిర్మార్గములను రక్షించుము.
6. పశువు యొక్క హృదయాద్యంగములారా! మేము ఈ కర్మను నిర్విఘ్నముగా పూర్తి చేయుటకు ఆతురపడుచున్నాము. దానిని అతిరిక్తము కాకుండచేయుము. మనువు వలె ఉత్పత్తి చేయుదానవు అగుము. తదుపరి యజమానికి దేవతా సంబంధము కలిగించుము.
7. పశువా! నీవు పూజించదగిన దేవతలకు హవిస్సువు అగుచున్నావు. ప్రజాపతి స్వరూపమువు అగుచున్నావు. అటువంటి నీ అంగములు తిని మేము పుష్టి కలవారము అగుచున్నాము.
మూడవ అనువాకము
1. పూర్వము ద్యావాపృథ్వులు కలసి ఉండెను. వాయువు ఆ రెండింటిని విడదీసినాడు. ఆ ద్యావాపృథ్వులు మరల కలసినవి. గర్భము దాల్చినవి. ఆ గర్భము నుండి సోమము పుట్టినది. పుట్టిన సోమమును అగ్ని మ్రింగినాడు. అప్పుడు ప్రజాపతి అగ్నిదేవతాకమగు అష్టాకపాల పురోడాశమును దర్శించినాడు. దానిని ఆచరించి అగ్నినుండి వశారూపసంతానమును కొన్నాడు.
2. అగ్నిదేవతాకము కాకుండ - ఇతరదేవతాకమైనను ముందు అగ్నిదేవతాక అష్టాకపాలమును నిర్వాపము చేయవలెను. అందువలన అగ్ని నుండియే కొని ఆలంభనము చేసినట్లగును.
3. ద్యావాపృథ్వులను వాయువు విడదీసినందున వశ - వంధ్య - వాయుదేవతాకమైనది.
ద్యావాపృథ్వుల నుండి సోమము పుట్టినందునను, దానిని అగ్ని మ్రింగినందునను అది అగ్నిషోమదేవతాకమైనది.
ద్యావాపృథ్వులు విడివడినపుడు ధ్వని కలిగినది. అది వాక్కు అయినది. అందువలన వశ సరస్వతీ దేవతాకమైనది.
అగ్ని నుండి వశను ప్రజాపతి కరీదు చేసినందున వశ ప్రజాపతి దేవతాకమైనది.
సావాఏషా సర్వదేవత్యా యదజా వశా - కావున వశయగు మేక సర్వదేవతాకమగుచున్నది.
4. ఐశ్వర్యము కోరువాడు వాయుదేవతాకవశను ఆలంభనము చేయవలెను. వాయువు వేగవంతుడు అందువలన అతడు వాయువును తన భాగధేయముగా పొందును.
5. సస్య సమృద్ధి రూపమగు ప్రతిష్ఠను అభిలషించువాడు ద్యావాపృథ్వీ దేవతాకమగు వశను ఆలంభనము చేయవలెను. అతని కొరకు పర్జన్యుడు దివినుండియే వర్షము కలగించును. భూమి మీద ఓషధులు మొలుచును అతనికి సస్యసమృద్ధి కలుగును.
6. అన్న సమృద్ధియు, అన్నము తినుశక్తియు అభిలషించువాడు అగ్నిషోమ దేవతాకమగు వశను ఆలంభనము చేయవలెను. అందువలన అతడు అగ్ని చేత అన్నమును, సోమముచేత అన్నము తిను శక్తిని పొందుచున్నాడు.
7. వాక్కుకలిగియు పలకలేనట్టివాడు సరస్వతీ దేవతాక వశను ఆలంభనము చేయవలెను. అందువలన సరస్వతి అతనికి భాగధేయముగ లభించును. సరస్వతియే అతని వాక్కును అధిష్ఠించుచున్నది.
8. తాను జయించలేని వారిని జయించవలెనని కోరువాడు ప్రజాపతి దేవతాకమగు 'వశ' ను ఆలంభనము చేయవలెను. ప్రజాపతి సర్వదేవతా స్వరూపుడు అగును. కావున యజమాని తాను జయించలేనివానిని సర్వదేవతలచేత జయించును.