ఆ వాతనామక గంధర్వుడు బ్రాహ్మణ, క్షత్రియులను రక్షించునుగాక. తస్మై స్వాహా. అతని భార్యలు బ్రాహ్మణ క్షత్రియులను రక్షింతురుగాక. తాభ్యః స్వాహా.
7. హే భువనపతే! నీకు అంతరిక్షమునందును, భూలోకమునందును గృహములు ఉన్నవి. మాకు వయోహాని కలిగించకుము. మాకు ధనపుష్టిని, వీరపుత్రుని, అజీవనసమృద్ధిని కలిగించుము.
8. ఒక గంధర్వుడు. అతని పేరు 'మృత్యువు'. అతడు పరమేష్ఠి. సర్వాధిపతి. అతనికి విశ్వములు ప్రియభార్యలు. వారిపేరు భువ.
ఆ మృత్యునామక గంధర్వుడు బ్రాహ్మణ, క్షత్రియులను రక్షించునుగాక. తస్మై స్వాహా. అతని భార్యలు - భువనములు - బ్రాహ్మణ క్షత్రియులను రక్షింతురుగాక. తాభ్యః స్వాహా.
9. ఒక గంధర్వుడు. అతని పేరు పర్జన్యుడు. అతడు మంచి నివాసము. మంచి సంపదగలవాడు. మంగళ ప్రదుడు. స్వర్గమును స్వాధీనము నందు ఉంచుకున్నవాడు. అతనికి విద్యుత్తులు ప్రియభార్యలు. వారి పేరు 'రుచః'
ఆ పర్జన్యనామక గంధర్వుడు బ్రాహ్మణ క్షత్రియులను రక్షించునుగాక. తస్మై స్వాహా. అతని భార్యలు బ్రాహ్మణ క్షత్రియులను రక్షింతురుగాక. తాభ్యః స్వాహా.
10. ఒక గంధర్వుడు. అతని పేరు మృత్యువు. దూరమందున్న వానిని కూడ కొట్టగల ఆయుధము కలవాడు. అతని పేరు విన్నంతనే సుఖము పోగొట్టువాడు. అతనికి ప్రజాభిమాని దేవేరులు ప్రియభార్యలు. వారిపేరు భీరువలు.
ఆ మృత్యునామక గంధర్వుడు బ్రాహ్మణ, క్షత్రియులను రక్షించునుగాక. తస్మై స్వాహా. అతని భార్యలు బ్రాహ్మణ, క్షత్రియులను రక్షింతురుగాక. తాభ్యః స్వాహా.
11. ఒక గంధర్వుడు. అతని పేరు కాముడు. అతడు అందగాడు. ఇంద్రియ విషయములందు మనస్సును లగ్నము చేయించువాడు. అతని భార్యలు విషయాభిమాన దేవతలు. వారిపేరు "శోచయన్తి".
ఆ కామనామ గంధర్వుడు బ్రాహ్మణ, క్షత్రియులను రక్షించునుగాత. తస్మై స్వాహా. అతని భార్యలు బ్రాహ్మణ క్షత్రియులను రక్షింతురుగాక. తాభ్యః స్వాహా.
12. హే భువనపతే! నీకు అంతరిక్షమునకు భూలోకమునకు గృహములు కలవు. మాకు విస్తార సుఖములను కలిగించుము. బ్రాహ్మణ, క్షత్రియులకు మహాసుఖములు కలిగించుము.
ఎనిమిదవ అనువాకము
1. 'రాష్ట్రభృత్' మంత్రములు రాజ్యప్రాప్తి హేతువులు. అవి రాజ్యస్వరూపములు అగును. కావున రాజ్యము కోరువాని కొరకు అధ్వర్యుడు 'రాష్ట్రభృత్' మంత్రములచే హోమము చేయవలెను. అందువలన యజమాని రాజ్యమును సంపాదించుచున్నాడు. అతనికి నిశ్చయముగా రాజ్యము కలుగును.
2. తన ఉన్నతి కొరకు రాష్ట్రభృన్మంత్రముల చేతనే హోమము చేయవలెను. ఈ మంత్రములు రాజ్యస్వరూపములు. అందువలన శ్రేష్ఠములు. ప్రజలు, పశువులు రాజ్యము అగుచున్నవి. కావున రాష్ట్రభృన్మంత్రములు ప్రజలను, పశువులను కలిగించుచున్నవి. వానివలన యజమాని సమానులలో ఉన్నతుడు అగుచున్నాడు.
3. గ్రామమును కోరువాడు రాష్ట్రభృన్మంత్రములచే హోమము చేయవలెను. రాష్ట్రభృన్మంత్రములే రాజ్యస్వరూపములు. జ్ఞాతులు, గ్రామప్రజలు రాజ్యము అగుచున్నారు. కావున రాష్ట్రభృన్మంత్రముల వలన యజమానికి జ్ఞాతులు, గ్రామప్రజలు అనుకూలురు అగుచున్నారు. వానివలన యజమాని నిశ్చయముగా గ్రామస్వామి అగుచున్నాడు.
4. జూదమాడు స్థలమునందే రాష్ట్రభృన్మంత్రములచే హోమము చేయవలెను. అందువలన జూదరులు యజమానికి వశ్యులు అగుదురు. వశ్యులైన వారు యజమానిని సేవింతురు.
5. ఓజస్సు కోరువాడు రథముఖమున రాష్ట్రభృన్మంత్రముల హోమము చేయవలెను. రాష్ట్రభృన్మంత్రములు, రథము రెండును ఓజస్స్వరూపములు. అందువలన యజమానికి ఓజస్సు కలుగుచున్నది. అతడు నిశ్చయముగా ఓజస్వి అగుచున్నాడు.
6. రాజ్యమును కోల్పోయినవాడు రాజ్యము సాధించుటకు రాష్ట్రభృన్మంత్ర హోమము చేయవలెను. అతనికి ఎన్ని రథములు ఉన్నవో అందరు నరుల చేత మోయించవలెను. అందువలన అతనికి పోయిన రాజ్యము తిరిగి వచ్చును.
7. రాజ్యము కలిగినను రాజభోగములు కలుగనపుడును, ఆహుతులు స్వకార్యక్షమలు కానపుడును తన రథపు కుడిచక్రమును అగ్నిపై ఉంచి రథచక్ర రంధ్రమునకు అభిముఖముగా రాష్ట్రభృన్మంత్ర హోమము చేయవలెను. అందువలన ఆహుతులు స్వకార్యసమర్థలు అగును. వానిని అనుసరించి యజమానికి రాజ్యభోగములు కలుగును.
8. యుద్ధము కలిగినపుడు రాష్ట్రభృన్మంత్ర హోమము చేయవలెను. రాష్ట్రభృతము రాజ్యసంబంధము. యుద్ధము రాజ్యమును గూర్చియే కదా! యుద్ధసన్నద్ధులైన ఉభయులలో ఎవరు ముందు హోమము చేయుదురో అతడు సమర్థుడు అగును. సమర్థుడు అయినందున యుద్ధమున గెలుపొందును.
9. యుద్ధవిజయమునకు చేయు యజ్ఞమున ఇప్పకర్ర సమిధ కావలెను. ఇప్పకర్ర యొక్క నిప్పు కణికలు యజమానిని పరివేష్ఠించును. శత్రుసేనను తరిమివైచును.
10. ఉన్మాద నివారణ కొరకు రాష్ట్రభృన్మంత్ర హోమము చేయవలెను. ఉన్మాదమునకు గంధర్వులు, గంధర్వభార్యలే కారకులు అగుచున్నారు. ఈ మంత్రములు గంధర్వ, గంధర్వభార్య స్వరూపలు అగును. అందువలన ఉన్మాదనివారణ కలుగును. శాంతి లభించును.
11. ఉన్మాదనివారణకు చేయు హోమమున జమ్మికాని మర్రికాని మేడికాని జువ్వికాని సమిధకావలెను. గంధర్వులకు, గంధర్వుల భార్యలకు ఆ చెట్లు స్థానములు అగును. అందువలన వారిని వారి స్థానములందే శాంతింప చేసినట్లగును.
12. ఇతరులను హింసించదలచినపుడు ఈ రాష్ట్రభృన్మంత్రములను చివరి మంత్రమునుంచి మొదలు పెట్టి మొదటి మంత్రముతో ముగించి హోమము చేయవలెను. అందువలన హింసించ దలచిన వాని ప్రాణములు విపరీత స్థానములకు చేరును. కావున ప్రాణములు విపరీతముగా చేరిన వానిని సులభముగా హింసించవచ్చును.
13. అభిచార - హింసించు - హోమము ప్రకృతి సిద్ధమగు చవిటినేల యందుగాని, చీలిన నేలయందు కాని చేయవలెను. ఇదియే అభిచార దేవత కొరకు నిరృతి దేవత ఏర్పరచిన స్థానము. ఈ హోమము అభిచరితుని నిరృతి దేవతలకు వప్పగించును. క్రూరధ్వనిచే వషట్కారము చేయవలెను. ఈ క్రూరవషట్కారము అభిచరితుని ఛేదించును. అందువలన అభిచరితునకు తీవ్రమగు దుఃఖము కలుగును.
14. ఒకని అన్నాద్యమును హరించదలచిన వాడు ఆ ఒకని సభయందు ఉత్తానశరీరుడై "భువనస్య పతే" అను మంత్రమును ఉచ్ఛరించుచు గడ్డిని అందుకొనవలెను. ప్రజాపతియే భువనములకు స్వామి. కావున ప్రజాపతిచేతనే ఆ ఒకని అన్నాద్యము హరింపచేసినవాడు అగును.
15. అన్నాద్యమును హరించదలచిన వాడు 'భువనస్య పతే' నుండి "సనోభువఅస్య పతే" అణు ఆరుమంత్రములను ఉచ్ఛరించుచు గడ్డిని అందుకొనవలెను. ఋతువులు ఆరు. అవి ప్రజాపతి స్వరూపములు. కావున ప్రజాపతియే ఆ ఒక్కని అన్నాద్యమును గుంజుకొనును - యజమానికి ఇచ్చును.
16. ఒకడు గొప్పవానికి బంధువు అగును. ఆ గొప్పవాడు ఇతనిని నీచునిగ, నికృష్టునిగ చూచును. బ్రహ్మయనెడి ఋత్విజుడు అవమానించబడిన యజమానిని ఉచ్ఛప్రదేశమున కూర్చుండ పెట్టవలెను. నాలుగు మూకుళ్ల అన్నము వండి, దానితో రాష్ట్రభృన్మంత్ర హోమము చేయవలెను. రాష్ట్రభృన్మంత్రములే శరీరము అగును. యజమానిని ఎత్తు ప్రదేశమున కూర్చుండ పెట్టుటచే బ్రహ్మ అతనిని సమానులందు ఉన్నతుని చేయుచున్నాడు.
17. అన్నము నాలుగు మూకుళ్లది కావలెను. దిక్కులు నాలుగు. కావున యజమానిని నాలుగు దిక్కులందు ప్రతిష్ఠించినట్లగును.
18. అన్నమును పాలతో ఉడికించవలెను. అందువలన బ్రహ్మ అన్నమునకు రుచి కలిగించినవాడగును.
19. అన్నము చక్కగా ఉడుకుటకుగాను అన్నమును అడుగునుండి పైకి కలియపెట్టవలెను.
21. హుత శేషమగు అన్నమును నలుగురు భుజించవలెను. అందువలన నాలుగు దిశలకు అగ్నియందు హోమము చేసినట్లగును.
తొమ్మిదవ అనువాకము
1. సంతానార్థి ధాత్రాది అయిదు దేవికల ఇష్టిని నిర్వాపము చేయవలెను. దేవికలు ఛందోరూపములు. ప్రజలు ఛందోరూపములు. కావున ఈ ఇష్టులు యజమానికి సంతానము కలిగించుచున్నవి.
2. పంచదేవతలలో యజమాని ముందు ధాతను స్థాపించుచున్నాడు. 1. ధాత యజమానిని పత్నితో మిథునముగా చేయును. 2. అనుమతి దేవత యజమాని మిథునీకరణను అనుమతించును. 3. రాకాదేవి బీజము కలిగించును. 4. సినీవాలి సంతానమును పుట్టించును. 5. కుహూదేవి వాక్కును కలిగించును.
3. పశువులను కోరువాడు దేవికేష్టులను నిర్వాపము చేయవలెను. దేవికేష్టులు ఛందోరూపములు. పశువులు ఛందోరూపములు. కావున ఈ ఇష్టి అతనికొరకు పశువులను పుట్టించును.
యజమాని తొలుత ధాతను స్థాపించుచున్నాడు. కావున ధాత గోవులందు బీజము వేయును. అనుమతి దేవి అనుమతించును. రాకాదేవి గర్భమును కాపాడును. సినీవాలి పశువులను పుట్టించును. కుహూదేవి పుట్టిన పశువులను పోషించును.
4. గ్రామస్వామి కాగోరువాడు ఈ ఇష్టినే నిర్వాపము చేయవలెను. దేవికాశ్చన్దాగ్ంసివఖలు గ్రామశ్చందః ఛందస్సు చేతనే యజమాని గ్రామమును పొందును.
యజమాని ధాతను అనుమతిదేవి రాకాదేవి తరువాత స్థాపించి రాకాదేవత కుహూదేవతలను స్థాపించవలెను. అందువలన ధాత మధ్యమున స్థాపించబడినవాడు అగును. అట్లగుటచే ధాత యజమానిని గ్రామమధ్యమున స్థాపించినవాడు అగుచున్నాడు.
5. దీర్ఘవ్యాథులు కలవాడు ఈ ఇష్టినే నిర్వాపము చేయవలెను. దేవికాశ్చన్దాగ్ంసివై. దీర్ఘవ్యాధి కలవానిని దేవికారూపమగు ఛందస్సులే కోపించుచున్నవి. ఆ ఛందస్సులే సంతుష్టులై అతని దీర్ఘరోగమును నివారించుచున్నవి.
ధాతృదేవతలను దేవికల మధ్యన స్థాపించవలెను. వ్యాధిగ్రస్తుని ఉదరమధ్యమందు దోషము ఉండును. మధ్యన నిలిపిన ధాత రోగగ్రస్తుని ఉదరమధ్యము నందలి దోషమును నివారించును.
అట్లయినపుడు యజమాని ధాతృదేవుని ప్రథమమున స్థాపించవలెను. అట్లు స్థాపించబడిన ధాత యజమానిని ప్రథమముననే ప్రతిష్ఠించును. అప్పుడు యజమానికి యజ్ఞఫలము లభించును.
7. ఒక యజ్ఞము చేసినవాడు మరొక యజ్ఞము చేయుటకుగాను ఈ ఇష్టిని నిర్వాపము చేయవలెను. దేవికాశ్చన్దాగ్ంసివై. పూర్వయజ్ఞపు ఛందస్సులు కళలను కోల్పోవుచున్నవి. కావున యజమాని ధాతృదేవతను నలుగురు దేవికల తరువాత చివరకు స్థాపించవలెను. అప్పుడు ధాతృదేవుడు జరుపనున్న యజ్ఞపు ఛందస్సులను కళాహీనము కాకుండ చేయును. అందువలన యజమానికి యజ్ఞఫలము లభించును.