Previous Page Next Page 
అందాల జాబిలి పేజి 7


    ఆశ్చర్యంగా చూశాడు రవి.
    "అందరూ ఉద్యోగాలకి పరిగెడితే ఎలా రవీ. మనలాంటివాళ్ళు కొందరుండాలి. జై కొట్టటానికి జనం వుంటేనే కాదా రధం కదిలేది?" నవ్వుతూ అన్నాడు సమద్. అతనలాగా ఎప్పుడూ నవ్వుతూనే వుంటాడు. ఒక్కరోజూ దేనికీ విచారంగా వున్నట్టు కనిపించడు. ఆఖరికి తండ్రి అకస్మాత్తుగా పోయి, చదువు ఆగిపోయి, రాబడిలేక తండ్రిలాగా బడ్డీకొట్టు పెట్టుకోవలసి వచ్చిన రోజున కూడా అతను చిరునవ్వే నవ్వాడు.
    "హలో!"
    జామూన్ రిక్షా ఆపి పిలిచాడు రవిని.
    "హలో!" ఫ్రెండ్స్ యిద్దరూ బదులు పలికేరు.
    "మా యింటిదాకా వస్తావా? ఓ చిన్న పని తగిలింది."
    "ఏమిటి?"
    "వస్తే చెబుతాగా రిక్షా ఎక్కు. మీ యింటినుంచే వస్తున్నా."
    రవి రిక్షా ఎక్కాడు. రిక్షా కదిలింది. సమద్ టాటా చెపుతున్నట్టుగా చెయ్యి ఊపాడు. రిక్షా నాలుగు గజాలు సాగగానే "ఏమిటి మన కాలేజీ అమ్మాయి రాజ్యలక్ష్మి కారి మన ఇళ్ళ ప్రాంతం నుంచి వస్తోంది. ఇప్పుడు వచ్చానులే" అన్నాడు జామూన్.
    రవికి చప్పున సమద్ చెప్పిన న్యూస్ గుర్తుకొచ్చింది.
    "ఏమో!" అప్రయత్నంగా అనేశాడు రవి.
    జామూన్ రెట్టించలేదు. రిక్షా వెళుతోంది.
                                                                                    6
    "నువ్వు కవిత్వం బాగా రాస్తావని అందరూ అనుకుంటారు. నేనూ అనుకుంటాను. నాకు నమ్మకం కూడా వుంది."
    జామూన్ మాటలకి అడ్డొస్తూ "ఎందుకు పొగడుతున్నావు?" అన్నాడు రవి నవ్వుతూ.
    జామూన్ ముఖం ఎర్రబడింది. "సారీ! నన్నిలా అపార్ధం చేసుకుంటావనుకోలేదు."
    "సినిమా డైలాగ్. ఇంతకీ విషయం ఏమిటి?"
    "మనవూళ్ళో మాజీ ఛైర్మన్ గారికి షష్టిపూర్తి అవుతోందట. ఈ సందర్భంలో మునిసిపల్ ఉద్యోగులు, ఊళ్ళో అభిమానులూ దురభిమానులూ కలసి సన్మానసభ ఏర్పాటుచేస్తున్నారు ఖర్చంతా ఆయనదే! ఆ సందర్భంగా ఆయన ఏదయినా పుస్తకాన్ని అంకితం తీసుకోవాలని అనుకున్నారట."
    "శుభ సూచకమే!"
    "గండపెండేర, గజారోహణ. కనకాభిషేక సమ్మానితులు వెళ్ళి అడిగేరట. కుక్కలు వాసనపట్టినట్టు కుకవులూ వాసన పడతారేమో! అయితే ఆయనకి అంత డబ్బు ఖర్చుచేయటం ఇష్టంలేదు."
    రవి సమాధాన చెప్పలేదు.
    "నీ గేయాలు కొన్ని కూర్చి ఓ కవితా సంపుటి వేయిస్తాడట. ముద్రణ ఖర్చులు అన్నీ సన్మాన సంఘానివి-అంటే ఆయనవే"
    "నా కవితలే ఎందుకు వేయాలి?"
    "నేను మా నాన్నతో చెప్పించాను. ప్రిన్సిపాలుగారూ చెప్పారట."
    "థాంక్యూ!"
    "ఓ ముప్పై కవితలు ఇస్తే ప్రెస్సుకిస్తారట."
    "అలాగే."
    "ఏదో శాలువా కప్పి, పర్స్ బహూకరిస్తారట."
    రవి మనస్సులో ఆశ రేకెత్తింది. ఎంతయినా కానీ అది గౌరవమే! తృణమో పణమో యిచ్చినా అది కొన్నాళ్ళకి సరిపోతుంది. మరి కొన్నాళ్ళు తిండికి వెతుక్కోనవసరం లేదు.
    "నకి వెళ్ళిరానా!" లేచాడు రవి.
    "ఒరిజనల్స్ యిస్తే, కాపీ రాయిస్తాను."
    "ఎందుకు? నేనే రాస్తాలే."
    "ఫర్లేదులే! కొంచెం శ్రమ తప్పుతుంది. ప్రూఫులలో తప్పుల్రాకుండా నే చూస్తాను. ఫైనల్ ప్రూఫ్ నీకు పంపిస్తాను."
    ఏమిటి ఇంత ప్రత్యేకత అన్నట్లుగా చూశాడు రవి.
    "అదంతేలే! కవిని గౌరవించాలి కనీసం."
    నవ్వి అక్కడినుంచి వచ్చాడు రవి.
    బజారులో కొన్ని పేపర్లు కొనాలనుకున్నాడు. జేబులు ఖాళీ. లక్ష్మీ బుక్ స్టోర్సు వద్దకి వెళ్ళి అడిగాడు. అతనిలో కొంత కవితాభిమానం వుంది. దస్తాపేపర్లు ఊరికే యిచ్చాడు. "ఇదిగోనండి కవిగారూ! మంచి పెన్. మా తమ్ముడు న్యూయార్క్ నుంచి పంపించాడు. లెక్కలు రాసుకునేవాడికి నాకెందుకు, ఏ రూపాయి కలమయినా సరిపోతుంది. మీరు రాసుకోండి" అని మంచి పెన్ అందించాడు.
    రవి మనస్సు పొంగిపోయింది ఆ మాత్రానికే. "ఫరవాలేదు. ఆంధ్రదేశంలో యింకా రసజ్ఞత చావలేదు."
    అటునుంచి నేరుగా యింటికి వచ్చాడు. మసక చీకట్లు కమ్ముకున్నాయి ఆ సరికే. ధియేటర్ లోనుంచి రికార్డులు వినిపిస్తున్నాయి.
    ఆ రాత్రి కొంత శాంతితో నిద్రపోయాడు రవి.
                                                              *        *        *
    వీటిలో స్నానంచేసి యింటికి వస్తోంటే ఎవరో అమ్మాయి తమ ఇంటిలోకి వెళ్ళటం చూశాడు. ఎప్పుడు చూసిన గుర్తు రాలేదు. ఆలోచిస్తూ ఇంట్లో అడుగుపెట్టాడు రవి.
    గల గలా మాటాడుతోంది ఆ అమ్మాయి. వంటింటినుంచి గేటుదాగా తగు స్థాయిలో వినిపిస్తోంది కంఠం.
    టవల్, డ్రాయిర్, అరపంచా తాటిపై ఆరవేసి పైజామా చొక్కా వేసుకున్నాడు. అది ఆరోజు జామూన్ యిచ్చినవి! తనకోసమే కుట్టించి యిచ్చినవి. ఎంత మొండికేసినా తిరిగి తీసుకోలేదు.
    "అదిగో వచ్చినట్టున్నాడు" అంటోంది ఆ అమ్మాయి.
    తల దువ్వుకుని అద్దం, దువ్వెన గూట్లో పెట్టాడు రవి.
    "నమస్తే బావా!"
    కలకందలాంటి తలత్రిప్పిచూశాడు రవి. నేత్రపర్వంగా వుంది ఆ అమ్మాయి.
    "మా అన్న కూతుర్రా! అన్న అంటే చిన్నాన్న కొడుకులే! ఎప్పుడూ మన యింటికి రాలేదు. మానాన్న పోయాక అమ్మతో సరిపడక మా యింటికి వచ్చేవాడు కాదు. అయినా మనం గుర్తుస్తున్నామట వాళ్ళకి!"
    "నా పేరు సవిత బావా! మానాన్న సంగారెడ్డిలో మునిసిపల్ మేనేజర్! మా ఓ అన్నయ్య గుంటూరు మునిసిపాలిటీలో వర్క్స్ సూపర్ వైజర్! ఇంకో అన్నయ్య, బావ తిరుపతి మునిసిపాలిటీలో పని చేస్తున్నారు. మా ఆఖరి అన్నయ్యని యిక్కడి వాటర్ వర్క్స్ సూపర్ వైజర్ గా వేశారు!"
    "అంతా మునిసిపాలిటీ వాళ్ళేనే!" అనుకున్నాడు రవి.
    "ఈ అమ్మాయి --- అదే సవిత --- ఇంటర్ పూర్తిచేసిందట. ఎక్కడా జాబ్ దొరక్క లాటరీ టికెట్లు అమ్ముకుంటుందట!"
    "ఇదిగో బావా ఓ టికెట్!"
    "నా కెందుకు?" తెల్లబోయాడు రవి. పైగా ఆ అమ్మాయి మాటిమాటికి బావా బావా అంటుంటే అతని మనస్సుకి గిలిగింతలు పెట్టినట్టుగా వున్నా ఏదో ఎబ్బెట్టుగా అనిపిస్తోంది.
    "కొనొద్దులే! ఊరకే యిస్తోన్నా!"
    "అయినా సరే! నాకు లాటరీలపై నమ్మకం లేదు --- ఆశాలేదు!"

 Previous Page Next Page