శిల్పని చూసి "శిల్పా..... మీ అమ్మపేరేంటి?" అంది. ఈ మధ్య ఎవరికి సమాధానం చెప్పినా, చెప్పకపోయినా సిస్టర్ ఫెర్నాండిస్ కి మాత్రం తప్పకుండా సమాధానం చెబుతుంది.
"అమ్మ పేరు సరోజిని" అంది.
సిస్టర్ ఫెర్నాండిస్ మొహం ఎర్రగా మారిపోయింది.
వెంటనే నోటమాట రాలేదు.
కాస్సేపాగి "నాన్నగారి పేరు?" అంది.
"రామానుజం"
సిస్టర్ ఫెర్నాండిస్ కి నిజంగా మతిపోతున్నట్టనిపించింది.
"మరి రాగిణి ఎవరూ?" అడిగింది.
"అక్క"
"అక్కా?" వెంటనే మాట్లాడలేకపోయింది సిస్టర్ ఫెర్నాండిస్. ఆమె గుండెని ఎవరో రెండుగా చీల్చినట్టయింది. తల గిర్రున తిరిగినట్టయి అలా కాసేపు మౌనంగా వుండిపోయింది.
"ఇంకా ఎవరెవరున్నారు మీ ఇంట్లో?"
"భరణక్క" అని ఊరుకుంది.
"అంతేనా? బావలేడూ?"
బావ అనే మాటే ఎప్పుడూ వినలేదేమో అర్థంకాకపోయినా బావంటే ఎవరో తెలీక "లేరు" అన్నట్టుగా అడ్డంగా తలూపింది.
సిస్టర్ ఫెర్నాండిస్ కి ఇంకా సందేహాలు తీరలేదు.
"మీ రాగిణి అక్కడి, భరణి అక్కడి పెళ్ళిళ్ళయ్యాయా?" శిల్ప తల నిమురుతూ అడిగింది. "లేదు" అంది శిల్ప.
* *
నిగనిగలాడే బుగ్గలతో ముద్దొచ్చేట్టు చక్కగా బొద్దుగా వుండే శిల్ప ఈ పదిహేను రోజుల్లోనూ ఎంతో చిక్కిపోయింది. జ్వరం తగ్గాకకూడా రెండుమూడు సార్లు అమ్మకి లెటర్ రాయమని అక్కని రమ్మనమని చెప్పమని అడిగింది. అమ్మకన్నా ఎక్కువగా అక్కని అడగడంతో చివరకి ఇక దాచి లాభంలేదని రేపోమాపో వొస్తారు మీ అమ్మా. అక్కయ్యా - అన్న అబద్దం ఇంక ఆడలేక "మీ అక్కయ్య ప్రోగ్రామ్ కోసం అందరూ అస్సా అనే వూరికి వెళ్ళారట శిల్పా! ఇంట్లో మీ నాన్న ఒక్కరే ఉన్నారట. అందుకే రాలేదు. వాళ్ళు తిరిగి రాగానే, నిన్ను చూడటానికి వచ్చేస్తారు. ఈలోగా నువ్వు బాగా తినాలి. చక్కగా ఆడుకోవాలి. మంచిగా చదువుకోవాలి. సరేనా?" అంది లాలనగా - అలా మెల్లగా బొటానికల్ గార్డెన్స్ వైపు షికారుకి నడిపించుకుంటూ.
అంతవరకూ నవ్వుతూ వున్న శిల్ప మొహంలోని మార్పుని గమనించింది సిస్టర్ ఫెర్నాండిస్. శిల్ప ఏదో ఆలోచనలో పడిపోవడం కూడా గమనించింది. మాటలు మార్చడానికి ప్రయత్నిస్తూ "అదిగో ఆ చెట్టుకున్న పూలు చూశావా?" అంది అటుకేసి చూపింస్తూ.
"ఊఁ....." అన్నట్టు తలూపింది శిల్ప.
"ఇదిగో ఈ చెట్టునిండా ఏమున్నాయో చెప్పు?" అంటూ మరోచెట్టు చూపించింది.
శిల్ప మాట్లాడలేదు. అటువేపైనా చూడలేదు. మౌనంగా వుండిపోయింది.
"ఏయ్, నిన్నే? ఆ చెట్టునిండా వున్నాయే...... ఆ కాయల పేరేంటో చెప్పు చూద్దాం" అంది శిల్పని భుజాలు పట్టుకుని అటుకేసి తిప్పుతూ.
"ఆపిల్స్"
"కరెక్ట్! ఎంత బావున్నాయో కదూ!" అంది.
"ఊఁ....." అంది.
కాస్సేపలా కూర్చుని ఏవేవో కథలు చెబుతూ తిరిగొచ్చారు హాస్టల్ కి.
శిల్ప అన్నం తిని నిద్రపోయేదాకా వుండి, నర్సుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళింది సిస్టర్ ఫెర్నాండిస్.
శిల్ప జబ్బు పడ్డాక, రామానుజం గారి ఉత్తరం చూశాక, సిస్టర్ ఫెర్నాండిస్ కి రకరకాల అనుమానాలొచ్చాయి.
'శిల్ప ఎవరి బిడ్డ?'
రాగిణి అప్లికేషన్ ఫారంలో తల్లిపేరు కింద తన పేరు రాసింది. తండ్రి పేరు "రాజు" అని రాసింది. మరి శిల్ప తల్లిని అక్కా అని పిలవడమేమిటి? తల్లి పేరు అడిగితే మరేదో పేరు చెప్పింది. తండ్రి పేరూ అంతే! వాళ్ళ ఇంట్లో వున్న వాళ్ళ పేర్లలో రాజు పేరు ఎక్కడా లేదు. పైగా రాగిణికి పెళ్ళి కాలేదంటోంది. దీన్ని బట్టి రాగిణి, శిల్పల జీవితాల వెనకాల ఏదో కథ వుండివుంటుందనే నిర్ణయానికొచ్చింది. శిల్ప ప్రవర్తనకీ, వాళ్ళింట్లో వాతావరణానికీ ఏదో సంబంధం ఉండే ఉంటుందని నిర్థారణ చేసుకుంది మనసు గజిబిజిగా అయిపోయి ఏదో కలత పడింది. శిల్ప బడిలో చేరినప్పటి నుంచీ, శిల్ప మనస్సుని తెలుసుకోవడం కోసం ఒంటరిగా చాలాసార్లు శిల్పతో మాట్లాడటం, షికార్లకి తీసికెళ్ళడం, కథలు చెప్పడం మొదలెట్టింది. మిగతా పిల్లలందరి సంగతీ ఒకటి శిల్ప సంగతి ఒకటిగా శిల్ప మౌనానికి కారణాలను వెతుకుతూ వచ్చింది.
ఆ రోజు రాగిణి దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది. శిల్ప ఆరోగ్యాన్ని గురించి వాకబు చేస్తూ, ఆందోళన వ్యక్తపరుస్తూ, సమయానికి తను ఊళ్ళో లేకపోవడం ఎంతో బాధగా వుందనీ, డాన్స్ ప్రోగ్రామ్ కి అస్సాం వెళ్ళవలసొచ్చిందనీ రాసింది.
"మీ రాగిణి అక్క వస్తోంది ఎల్లుండి" అనగానే శిల్ప మొహం చింకి చాటంత అవడం గమనించింది.
"అక్క ఎల్లుండొస్తుందా?" మళ్ళీ అడిగింది. ఎల్లుండి ఇంకా చాలా రోజులున్నట్టు.
"అవును! నీకు సంతోషంగా ఉంది కదూ" అంది బుగ్గల్ని నొక్కుతూ సిస్టర్ ఫెర్నాండిస్.
నవ్వింది శిల్ప!
'శిల్పం లాగానే అందంగా..... ముద్దుగా వున్న ఈ పసికూన కధేమిటో' అనుకుంటూ ఆలోచనలో పడిపోయింది సిస్టర్ ఫెర్నాండిస్. భోజనానికి టైమయ్యిందంటూ సిస్టర్ లిల్లీ శిల్పని తీసుకుపోయేదాకా, ఆమె ఈ లోకంలో లేదు. రకరకాల ఆలోచనలు ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తూవుంటే, అలా స్థాణువులా వుండిపోయింది. ఎంత సేపో! గడియారం తొమ్మిది గంటలు కొట్టేసరికి ఉలిక్కిపడి భోజనానికి లేచింది.
* * * *
"సిస్టర్! శిల్పకెలా వుంది?" ఆత్రుతగా అడిగింది రాగిణి.
"బాగానే వుంది. వాళ్ళ నాన్నగారు రాలేదా?"
ఆ ప్రశ్నకి ఒక్క క్షణం ఉలిక్కిపడిండి రాగిణి.
వెంటనే తమాయించుకుని "లేదు" అంది ముక్తసరిగా.
ఇద్దరి మధ్యా రెండు నిమిషాలు మౌనం చోటుచేసుకుంది.
"మీరు ఊర్లో లేరట. వాళ్ళ నాన్నగారు వెయ్యి రూపాయలకి డ్రాఫ్టు పంపించి నర్సుని పెట్టించమన్నారు శిల్పని చూసుకోవడానికి. డాక్టర్ రాబర్టు మంచి మందులిచ్చారు. మంచి నర్సునే పెట్టాము కానీ......."
"కానీ......?" తడబడుతూ కంగారుగా అడిగింది.
"శిల్ప అస్తమానం 'అమ్మా..... నాన్నా అక్కా.......' అనే కలవరించింది. మేము ఎంత బాగా చూసుకున్నా అమ్మా, నాన్నా కావాలనే కోరుకుంటారు కదా పిల్లలు. సమయానికి మీరు ఊర్లో లేకపోవడం, వాళ్ళ నాన్నగారు కూడా రాలేకపోవడం, పాపం శిల్ప చాలా బెంగ పెట్టుకుంది" అంది సిస్టర్ ఫెర్నాండిస్.
ఈలోగా రహీం శిల్పని వెంటబెట్టుకొచ్చాడు.
"గుడ్ మార్నింగ్ శిల్పా?" అంది సిస్టర్.
"గుడ్ మార్నింగ్! గాడ్ బ్లెస్ యూ సిస్టర్" అంది.
శిల్ప అలా మాట్లాడుతూ వుంటే రాగిణికి ఏదో ఆనందం. ఏదో తృప్తి, కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
"ఎవరొచ్చారో చూడు?" అంది సిస్టర్ రాగిణి కుర్చీకేసి చూపిస్తూ.
అంతవరకూ సిస్టర్ ఫెర్నాండిస్ ని తప్ప అటూ ఇటూ చూడకుండా నుంచున్న శిల్ప రాగిణిని చూడగానే "అక్కా!" అంది నెమ్మదిగా.
"రా శిల్పా!" అంటూ చేతులు చాచింది రాగిణి.
"శిల్ప మిమ్మల్ని అక్కా అంటుందేమిటి? అమ్మా అని పిలవదా?" కుతూహలం పట్టలేక అసలు సంగతేమిటో తెలుసుకోవాలనే అడిగింది సిస్టర్ ఫెర్నాండిస్.