Previous Page Next Page 
గజ్జె ఘల్లుమంటుంటే పేజి 7


    .....ఎక్కడో సరయిన బడులు లేనిచోట, చదువులకోసం మమతలు చంపుకుని ఇలా పంపించేస్తే ఫర్వాలేదు. కానీ హైదరాబాదులాంటి నగరంలో వుంటూ కూడా చిన్నపిల్లని దగ్గరుంచుకోకుండా, ఎందుకీ బాధ? ఈ వయసులో పిల్లలకి తల్లినీడ అవసరం. తల్లి నేర్పించే మాటలు నేర్చుకుంటూ, ఆమెను అనుకరిస్తూ వుంటారు పిల్లలు. ఈ వయస్సు పిల్లలకి తల్లే గురువు, ఇల్లే విద్యాలయం కావాలి. వాళ్ళు పెరిగాక వాళ్లంతట వాళ్ళు స్వయంగా ఆలోచించి మనగలిగిన నాడు, కన్న తల్లే అప్పుడప్పుడు పరాయి దానిలా ఫీలవచ్చు......
    ..... కానీ ఏం లాభం? ఎదిగిన బిడ్డల్లో చూసుకునే ముద్దూ ముచ్చట్లు వేరే వుంటాయి. కానీ పిల్లలకి ఈ వయస్సు తిరిగిరాదు. తల్లికి ఆ ముచ్చట తీరదు."
    శిల్పని ఆకర్షించాయి పూర్తిగా అర్థం తెలీకపోయినా ఆ చివరి మాటరు.
    "మన ముద్దు ముచ్చటలకోసం, వారి భవిష్యత్తు ఆలోచించకపోతే ఎలా? ఇలా హాస్టల్ లో ఉండి చదువుకోవడం వలన, వాడు ఒక మంచి వ్యక్తిత్వం, ధైర్యం అలవాటవుతాయి. పిరికితనం అన్నింటికీ ఒకరిపైన ఆధారపడే మనస్తత్వం ఉండదు" అన్నాడాయన.
    "అవును లెండి! దాన్లోనూ కొంతమంచుంది. వాళ్ళ అభిప్రాయాలనుబట్టి, వాళ్లకి కావలసింది వాళ్ళు ఎంచుకోవచ్చు." అన్నాడు అవతలతను.
    శిల్పకి వీటన్నిటికీ పూర్తి అర్థాలు తెలీకపోయినా, ఏవో కొన్నికొన్ని లీలగా అర్థమయ్యాయి. ఏది ఏమయినా తల్లితో ఆడుకోవాలన్నా, ఆమె కూడా తిరిగి ఆమెతో వుండాలనుకున్నా ఇదే వయస్సని మాత్రం అర్థమయింది. అదేదో తను పోగొట్టుకున్నదానిలా బాధపడింది. తల్లి తనని దూరం చేసినట్టుగా బాధపడింది.
                                       *    *
    వర్షం దంచికొడుతోంది. ఊటీ చేరుకునేసరికి మధ్యరాత్రి దాటింది. సిస్టర్ ఫెర్నాండెస్ పంపించిందని రహీం వచ్చి కూర్చున్నాడు బస్టాండుదగ్గర గొడుగుపట్టుకుని! బస్సాగగానే "శిల్పా..... శిల్పా....." అని పిలుచుకుంటూ బస్సులోకెక్కాడు. శిల్పని చూసి "నీ లగేజీ ఏదమ్మా" అన్నాడు.
    శిల్ప చూపించింది. ఒకచేత్తో లగేజీని పట్టుకుని, మరో చేత్తో శిల్పనెత్తుకుని బస్సు దిగాడు. పక్కనే ఆగివున్న మినీ బస్సులో సామాను పెట్టి, తనూ ఎక్కి కూర్చున్నాక "పోనీ డ్రైవర్" అన్నాడు.
    "శిల్పా! బాగున్నావా? అమ్మా నాన్నా.... అంతా బాగున్నారా?" పలకరించాడు డ్రైవరు.
    "ఆఁ" అన్నట్టుగా తలూపింది శిల్ప.
    "ఆకలేస్తోందా?" అడిగాడు రహీం.
    "లేదు" అని తలూపింది.
    "ఎందుకని? బుగ్గలు ముద్దులుపెట్టుకున్నాడు రహీం.
    శిల్ప మాట్లాడలేదు.
    "బస్సులో ఏమయినా తిన్నావా?"
    అవునని తలూపింది.
    "ఏం తిన్నావ్?"
    అతికష్టంమీద నోరువిప్పి చెప్పింది. "శాండ్ విచెస్..... బిస్కట్లు"
    "అబ్బా!...... చాలా తిన్నావే" నవ్వుతూ అన్నాడు రహీం.
    వాన, ఉరుములూ, మెరుపులూ, వ్యాను స్కూలు కాంపౌండులో ఆగింది. రహీం సామాన్లు దింపాడు. డ్రైవరు శిల్పని దింపాడు. టార్చ్ లైటు పట్టుకుని సిస్టర్ లిల్లీ వచ్చింది - హల్లో శిల్పా..... హౌ.... డూ...... యూ..... డూ..... అంటూ.
    "ఫైన్...... థాంక్యూ...... సిస్టర్......" అంది.
    సామాన్లు లోపలపెట్టి రహీమూ, డ్రయివరూ వెళ్ళిపోయారు సిస్టర్ లిల్లీకి, శిల్పకీ గుడ్ నైట్ చెప్పి.
    శిల్ప బట్టలు మార్చుకుని నైటీ వేసుకుంది. సిస్టర్ లిల్లీ ఫ్లాస్కులో ఉంచిన పాలను కప్పులో పోసిచ్చింది. గబగబా పాలుతాగేసి తన మంచం మీదికెళ్ళి పడుకుంది శిల్ప, సిస్టర్ లిల్లీకి గుడ్ నైట్ చెప్పి.
    ఒక్కొక్క గదిలో మూడు మంచాలున్నాయి. మిగతా ఇద్దరు పిల్లలూ కోయంబత్తూరు నుంచి ఆమర్నాడొస్తున్నారు. చేరాక ఒకరోజు రెస్టుంటుందని ఒకరోజు ముందుగా శిల్పని పంపించింది రాగిణి.
    శిల్ప పక్కనున్న రెండుమంచాలూ ఖాళీగా ఉండడంతో సిస్టర్ లిల్లీ శిల్ప పక్కనున్న మంచంమీదే పడుకుంది. ప్రయాణంచేసి బాగా అలసిపోయిందేమో మంచంమీద పడుకోగానే నిద్రపోయింది శిల్ప.
    మర్నాడు దాదాపు ఏడుగంటలు కావస్తున్నా శిల్ప నిద్దరలేవలేదు. సిస్టర్ లిల్లీకూడా లేవలేదు సిస్టర్ ఫెర్నాండిస్ ఒకసారి శిల్పని చూద్దామని వచ్చి నిద్దురపోతోందని చెప్పి లేపకుండా వెళ్లిపోయింది.
    మామూలుగా అయితే అయిదుగంటలకే అందరూ లేచిపోతారు వానకురుస్తున్నా మంచుపడుతున్నా కూడా. లేవగానే మొహం కడుక్కుని ప్రేయరుచేసి దైవప్రార్ధన అయిపోగానే అప్పుడు స్నానాలు చేసి టిఫిన్ తిని పాలుతాగి క్లాసుల్లోకెళ్ళిపోతారు. కానీ ఇంకా బడి తెరవలేదు కాబట్టి ప్రయాణంచేసి అలసిపోయి వచ్చిన శిల్పని ఎవ్వరూ లేపలేదు. కానీ ఎనిమిది దాటినా ఇంకా లేవకపోయేసరికి సిస్టర్ ఫెర్నాండిస్ శిల్ప వంటిమీద చెయ్యివేసింది. తట్టిలేపడానికి. "మై గాడ్!" అంది ఉలిక్కిపడ్డట్టుగా.
    "వాట్...... సిస్టర్......" అంటూ సిస్టర్ లిల్లీ దగ్గరకొచ్చింది.
    "శిల్పకి హై.... ఫీవరుంది. నూటమూడు నూటనాలుగుంటుంది టెంపరేచర్. ముందు ఒక క్రోసిన్ టాబ్ లెట్ ఇవ్వండి" అంది సిస్టర్ ఫెర్నాండిస్.
    సిస్టర్ లిల్లీ తన గదిలోకివెళ్ళి టాబ్ లెట్ తీసుకొని వచ్చింది. ఎంత లేపినా శిల్ప లేవలేకపోతోంది. నీరసంగా మూలుగు మొదలెట్టింది. బలవంతాన లేపి కూర్చోబెట్టినా టాబ్ లెట్ మింగించడం వారికి చేతకాలేదు. సిస్టర్ లిల్లీ టాబ్ లెట్ ని పొడిచేసి పాలల్లో కలిసి ఇవ్వాలని చూసింది. కానీ శిల్ప తాగే స్థితిలో లేదు. సిస్టర్ ఫెర్నాండిస్ కి కొంచెం భయమేసింది. వెంటనే డాక్టరుకి ఫోన్ చేసింది.
    కాసేపటికల్లా డాక్టర్ రాబర్ట్ వచ్చాడు. శిల్పని పరీక్షచేసి ఇంజక్షనిచ్చాడు. "డోంట్ వర్రీ..... తగ్గిపోతుంది. పడుకోనివ్వండి. బత్తాయిరసం తప్ప ఇంకేమీ పెట్టకండి" అని చెప్పి వెళ్ళాడు. శిల్ప మూసినకన్ను తెరవకుండా పడుకునే ఉంది. మధ్యాహ్నానికి లేపి మెల్లగా కూర్చోబెట్టి బత్తాయిరసం తాగించారు. జ్వరం కొంచెం జారింది కానీ కూర్చోలేకపోతోంది. ఆ రోజల్లా పడుకునే ఉంది రాత్రికి మళ్ళీ జ్వరం ఎక్కువయింది.
    అలా మూడు నాలుగు రోజులైనా జ్వరం నార్మల్ కి రాలేదు డాక్టర్ టైఫాయిడ్ అని తేల్చేశాడు. సిస్టర్ ఫెర్నాండిస్ ఎందుకైనా మంచిదని ఇంటికి టెలిగ్రాం పంపించింది వెంటనే బయలుదేరి రమ్మని రాగిణిని.
    మర్నాటికల్లా తిరుగు టెలిగ్రాం వచ్చింది. రాగిణి, భరణి వాళ్ళావిడా ముగ్గురూ కూడా రాగిణి డాన్సు ప్రోగ్రాంకి గవర్నమెంటు వారు పంపగా అస్సాం వెళ్ళారనీ, తనొక్కడే ఇంట్లో వుండడంవల్ల తను ఇల్లొదిలిపెట్టి రాలేననీ, ఎంత డబ్బయినా సరే ఖర్చుపెట్టి మంచి మందులిప్పించి, అవసరమైతే మంచి నర్సుని ఒకర్ని శిల్పని చూసుకోడానికి ఏర్పాటు చేయమనీ, వెయ్యి రూపాయలకి సిస్టర్ ఫెర్నాండిస్ పేరుమీద డ్రాప్టు పంపుతూ ఉత్తరం వచ్చింది రామానుజంగారినుంచి.
    సిస్టర్ ఫెర్నాండిస్ కి మతిపోయింది. రామానుజంగారెవరు? శిల్పకి తండ్రా? తండ్రయితే అలా అనలేడు. మరయితే రాగిణి ప్రోగ్రాంకి వెళితే భర్త కూడా వెంట వెళతాడా? ఈ పిల్ల మౌనానికి వాళ్ళ కుటుంబ చరిత్రకీ ఏదైనా సంబంధం వుందా? ఇత్యాది ప్రశ్నలు ఎంతోసేపు ఆమెని వేధించాయి. ఆ మర్నాడే డాక్టర్ రాబర్ట్ గారికి చెప్పి నర్సుని ఏర్పాటు చేసింది. జ్వరంలో ఎన్నోసార్లు శిల్ప "అమ్మా అమ్మా..... అక్కా..... అక్కా" అంటూ కలవరించడం గమనించింది. శిల్పకి కొంచెం జ్వరం జారాక సిస్టర్ ఫెర్నాండిస్ శిల్ప మంచంమీద కూర్చుని తల నిమురుతూ ఏవేవో కథలు చెబుతూ బుజ్జగిస్తూ నర్సుచేత భోజనం తినిపిస్తూ -

 Previous Page Next Page