Previous Page Next Page 
అనుభవాల అలలలో పేజి 7

    "జనం చాలా మందే వున్నారు. ట్రైన్ యింకా రాలేదేమో!" ఆమె అంది.
   
    "కనుక్కొస్తాను..." అతను కదిలి వెళ్ళాడు.
   
    కొద్ది సేపటిలో స్టేషన్ మాష్టరుని వెంట బెట్టుకొచ్చాడు.  స్టేషన్ మాష్టరుని వెంటబెట్టు కొచ్చాడనేకన్నా అతని వెనుకే ఆయన వచ్చారన్నది నిజం.
   
    "ట్రైన్ అరగంటక్రితమే రావటం వెళ్ళటం జరిగింది. పైగా ఈ రోజు పది నిమిషాలు బిఫోర్ టైమొచ్చింది," వినయంగా అన్నాడు స్టేషన్ మాష్టరు.
   
    "మా కోసం ఎవరూ రాలేదా?" హుందా వుట్టిపడుతున్నది అతని స్వరంలో.
   
    "మమ్మల్ని గురించి ఎవరూ అడగలేదా?" లతలా వున్న ఆమె కొద్దిగా కంపిస్తూ అడిగింది. ఆ అడగటంలో ఆతృత కొద్దిపాటి ఆ వేదనా వున్నాయి.
   
    సుకుమారమయిన ఆమె దేహం మీద నుంచి చూపులు తిప్పుకుంటూ "లేదు మేడమ్! అడగడమే ఆలశ్యం బండి కట్టించి పోర్టరుని తోడిచ్చి మీ యింటికి పంపే వాడిని" అన్నాడు. అదేదో తన ధర్మం అయినట్లు.
   
    "ఈ ట్రైనుకి రాలేదేమో!" ఆతనన్నాడు ఆవేదన చూచుకుంటూ.
   
    "ఏదో జరిగింది" ఆమె దిగులుగా అంది.
   
    "ఎవరికోసం?" స్టేషన్ మాష్టరు అడగబోయాడు. ఇంతలో అతని ప్రశ్నకు అడ్డుతగిలింది, "ఆ గుంపేమిటి?" అంటూ.
   
    అతను చూస్తున్న వేపు తలతిప్పి చూసి "ఓ. అదా-ఓ ముష్టిది చచ్చింది. దాన్ని చూస్తున్నారు. ఎక్కడా చోటు లేనట్లు ఇక్కడికొచ్చి చచ్చింది. వెధవ పీడా కారం అన్నీ నేనే చూసుకోవాలి. అన్నట్లు మరో పావుగంటలో ఓ ప్యాసింజర్ వస్తుంది. దానిలో మీ వాళ్ళు దిగుతారేమో చూడండి. వస్తా సార్. అవతల బండి చూడాలి" అంటూ స్టేషన్ మాష్టరు హడావిడిగా వెళ్ళిపోయాడు.
   
    "అక్కడికెళ్ళి చూద్దాం" ఆమె అంది.
   
    "వద్దు....నీ ఆరోగ్యం అసలే బాగులేదు." ఆమె పొదివి సుతారంగా పట్టుకుని అతనన్నాడు.
   
    "చూడాలనిపిస్తున్నది పాపం ఎవరో చూస్తాను." ఆమె మొండిగా అంది.
   
    ఆ సమయంలో ఆమె మనసు చాలా ఆందోళనగా వుంది. అతని మనసు కూడా అందుకు భిన్నంగా లేదు. ఆమె పైకి ఆందోళన వ్యక్తం చేస్తున్నది అతను ఆ భావాలు మోమందు కానరానీకుండా తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో మసలుతున్నాడు.
   
    సుకుమారంగా వున్న ఆమె చేతిని సుతారంగా పుచ్చుకుని అతను అటువైపు నడిచాడు.
   
    చనిపోయినదానిని చూడాలని ఇరువురికీ లేదు. పరిపరి విధాలపోతున్న మనసుని మళ్ళించాలంటే ఏదో చేయాలి. కాసేపు ఆ గుంపులో జొరబడి ఆ ముష్టిదాని శవాన్ని చూస్తే....
   
    ఇరువురి మనసూ కోరుకున్నదొకటే. అందుకే కలిసి అటు నడిచారు.
   
    ఎత్తుగా, హుందాగా, రాజసం ఉట్టిపడుతున్న మోముతో సూటు బూటులో వున్న అతన్ని, తెల్లగా, సన్నగా మెరుపుతీగలా మృదుమనోహరంగా ఉన్న ఆమెని చూసి జనం పక్కకి తొలిగారు.
   
    ఇరువురూ ఆ బెంచీకి కాస్త దగ్గరగా వచ్చి ఆగారు.
   
    అతను ఆమె శవం మీదనుంచి చూపు మరల్చి పసిపిల్లను చూస్తూ వుండిపోయాడు.
   
    ఆమె పసిపిల్ల మీద నుంచి శవం మీదికి చూపు మరల్చింది.
   
    అలానే చూస్తుండిపోయింది.
   
    పొరలు చీల్చుకుని బైటికొస్తున్న జ్ఞాపకాలు.
   
    అలానే గుచ్చి గుచ్చి చూసింది బిచ్చగత్తె శవం ముఖంలోకి.
   
    గుర్తుపట్టింది.
   
    ఒక్కసారిగా గాలి స్తంభించినట్లు, భూమి వెనక్కి  తిరిగినట్లు, లావా పొంగి పొరలినట్లు, మిన్ను విరిగి మీద పడ్డట్లు, అగ్నిగోళం బ్రద్దలయినట్లు....ఆమె తల, వళ్ళు కళ్ళు ఒక్కసారిగా గిర్రున తిరిగాయి.

 Previous Page Next Page