పక్క స్టేషనులో చాయ్ వాలాని పిలిచి రెండు చాయ్ లు తీసుకుని ఒకటి వందనాదేవికిచ్చి తనొకటి తాగాడు.
ఇన్ స్పెక్టర్ వినాలన్నట్లు "ఫాతిమా! చాయ్ బాగుంది కదూ?" అన్నాడు.
"ఫాతిమా ఎవరు? ఓ...తను బురఖాలో వుంది. ప్రస్తుతం తన పేరు అది" బాగుందని చెప్పక ఆలోచిస్తూ కూర్చుంది. ఎంత పొరపాటు. ఈ తఫా ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తగా వుండాలి" అనుకుంది వందనాదేవి.
"ఫాతిమా పేరు బాగుంది. మనిషి ఎలా వుందోగాని" ఇన్ స్పెక్టర్ అనుకున్నాడు.
4
మగవేషంలో వున్న నందితాదేవి ట్రైన్ మరో నిమిషాలకి వస్తుందని తెలుసుకుంది.
హిగిన్ బాదమ్స్ లో రెండు మాగజయినులు, ఒక పేపరు కొంది, కొద్ది యివతలికొచ్చి ఆడవాళ్ళని తాకినంత దగ్గరగా నిలబడింది.
ట్రైను మరికొద్ది నిమిషాలకి రావటం తెలిసి ప్రయాణీకులు ప్లాట్ ఫామ్ మీద పరుగులు పెడుతున్నారు. జనం ఎక్కువగానే వున్నారు.
"ఇదో రోగం"
"అంతేనంటారా?"
"కాక కాస్త తగిలితే ఏమొస్తుందో, బజారులో వెళుతూ వుంటామా, ఈ మగ పురుగులు మన్ని మైలు దూరానే చూస్తారు. చెయ్యి
ఇంతదూరాన పక్షవాతం వచ్చినట్లు పెడతారు. ఆ చెయ్యి మనకి తగులుతుంది. వాళ్ల జన్మ పావనం అవుతుంది. రౌడీ వెధవలు-- పోయే కాలం..."
"ఊరుకుంటే మీద కూడా పడతారు"
"చెప్పు తీసుకు మూతిపళ్ళు రాలకొడితే సరి"
నందితాదేవికి అప్పుడర్ధమైంది.
తను మగవేషం వేసుకున్నా ఆడబుద్ధితో ఆడవాళ్ళ పక్కకొచ్చి నుంచుంది. వాళ్ళు తనని రౌడీ వెధవ అనుకుంటున్నారు. వాళ్ళు తిట్లూ,
శాపనార్ధాలూ పెట్టేది తననే. నవ్వుకుంటూ కిందపెట్టిన బ్రీఫ్ కేసు చేతిలోకి తీసుకుని ముందుకు నడిచింది.
"వెధవనవ్వు, గొప్ప ఘనకార్యం చేసినట్లు" వెనక నుంచి ఒకామె కసిగా మాట విసిరింది.
మగవాళ్ళ గుంపుకి దగ్గరగా వచ్చి వాళ్ళకి కాస్త వెడంగా నుంచుంది. ఈ తఫా జాగ్రతపడుతూ.
భుజమ్మీద బలంగా చెయ్యి పడింది.
అతనెవరో గండుపిల్లి ముఖంతో గారపట్టిన పళ్ళతో, లావుగా, ఎత్తుగా వున్నాడు. బాగా తాగాడేమో కళ్ళు ఎర్రగా వున్నాయి. దుర్వాసన
గుప్పున కొడుతున్నది.
నందితాదేవి ఫై ప్రాణాలు పైనే పోయినట్లయింది.
"తమ్ముడూ! అగ్గిపెట్టె వుందా?" సిగరెట్ చూపుతూ గండుపిల్లిగాడు అడిగాడు.
"అగ్గిపెట్టె తాగటం అలవాటు లేదు" కంగారుగా అంది నందితాదేవి.
"ఓ... సిగరెట్ తాగే అలవాటు లేదా? అగ్గిపెట్టె తాగరు తమ్ముడూ! ఆహ్హహ్హా" అంటూ విలన్ నవ్వు నవ్వి గట్టిగా భుజం మీద చరిచి
"తాగంది మగాడెట్టవుతాడు! మగాడన్న తరవాత అదీ ఇదీ అన్నీ తాగాలి. ఆడపిల్లలా ఇంత నాజూకుగా వుంటే అడదాన్నేం సుఖపెడతావ్? ముఖం
మారంజుగా వుంది అనుకో" అంటూ బుగ్గమీద చిటికె వేశాడు.
ట్రైన్ దేముడిలా వచ్చి ఎదురుగా నిలిచింది.
నందితాదేవి బ్రీఫ్ కేసు పుచ్చుకుని పరుగు తీసింది.
"సిగరెట్ తాగటం అయినా అలవాటు చేసుకో" వెనుకనుంచి అతను అరిచాడు.
తెరిపిగా సీటుమీద కూర్చున్నా గుండె దడ, కాళ్ళల్లో వణుకు తగ్గలేదు నందితాదేవికి. ఈ వేషం మగా, ఆడా ఇద్దరితో ప్రమాదమే
అనుకుంది.
ట్రైను బయల్దేరింతరువాత కాస్త గుండెదడ తగ్గింది. చమట బిందువులు ధారాపాతంగా కారటం మటుకు తగ్గలేదు. సున్నితంగా కర్చీఫ్ తో