"అవును కదూ! నాకు గుర్తులేక అడిగాను. ఇంతకీ ఎందుకు పిలిచావు?"
"ఇది చదవండి"
"ఆ పిల్ల ఇచ్చిందేనా?"
"ఆ...."
"మరి నేను చదవవచ్చా! అహా నా వుద్దేశ్యం ఏమిటంటే అది... అది... మగవాళ్ళు చదవవచ్చా అని....."
"చదవకూడదు."
"మరి నేను మగవాడిని కానా!"
"అధిక ప్రసంగం మాత్రం బాగావచ్చు. నేను చదవమన్నా కాబట్టి చదవండి." గద్దించినట్లు మాట్లాడింది అరుంధతి.
పద్మనాభం నోరు మూసుకుని చదవటం మొదలుపెట్టాడు.
"ఇదేమిటేవ్, ఇది చదువుతుంటే ఏదో కొంప మునిగే విషయంలా అనిపిస్తున్నది."
"అలా అనిపించిందా!"
"అనిపించిందనే కదా చెపుతున్నాను!"
"ఇంతకీ ఆ రాతకి అర్ధం ఏమిటంటారు?"
"నా కర్ధమైతే కదా నీకు చెప్పటానికి! ఇంతకీ ఆ పిల్ల ఏది, పిలిచి అడుగుతాను." అన్నాడు పద్మనాభం మెడంతా చాచి సందు చివరిదాకా తొంగిచూస్తూ.
"ఇంకెక్కడ వుంది. ఎప్పుడో వుడాయించింది. అయినా మీరు ఆ పిల్లని పిలవనూ అక్కరలేదు. అడగనూ అక్కరలేదు. కడగనూ అక్కరలేదు. పిల్లను పిలుద్దామన్న రందేగాని విషయమేమిటో తెలుసుకునే శక్తి లేదు."
"నీ అంత తెలివిగల దానికే ఈ చిన్న విషయం కొరుకుడు పడక పోతే నేనెంత నా తెలివెంత! అయినా యిదేమిరాత, మళ్ళీ చదువుతానుండు."
అపాయం! అపాయం! అపాయం!
ఆడవాళ్ళ మానప్రాణ రక్షణ ఏది?
మీ పై ఓ ముష్కరుడు చేయి విసిరిన వేళ...
మిమ్మల్ని నలుగురు రౌడీలు తరిమి తరిమి కొట్టిన వేళ...
మీరు వంటరిగా... నిరాధారంగా...
"ఇంక చాల్లేండి. ఎన్నిసార్లు చదువుతారు!" అంటూ అరుంధతి భర్త చేతిలోని పాంప్లెట్ ని వక్కలాగు లాగింది.
"మళ్ళీ మళ్ళీ చదివితే ఏమన్నా తెలుస్తుందేమోనని..." పద్మనాభం నంగినంగిగా అన్నాడు.
"పక్కింటి పిన్నిగారికి యిలాంటివి బాగా తెలుస్తాయి. ఇదేమిటో వెళ్ళి అడిగివస్తాను" అని అరుంధతి వెళ్ళిపోయింది.
'నేను కానే నీ మొగుణ్ణి. పక్కింటి ఆండాళ్ళమ్మ. వెళ్ళు వెళ్ళు దమ్మిడీ బోడెమ్మకి యాగానీ క్షవరం అని...' పద్మనాభం కోపంగా అనుకున్నాడు.
పృధ్వీరాజ్ పూలున్న లుంగీకట్టుకుని ఆఫ్ బనీను వేసుకున్నాడు. మెడలో సన్నటి గొలుసుంది. మనిషి తెల్లటి తెలుపు కాకపోయినా రక్తం చిందే ఎరుపుతో షైనింగ్ గా వున్నాడు. దుబ్బు క్రాఫు వుంది. చివర్లు చిన్న మెలి తిరిగిన మీసాలు వున్నాయి. ఎత్తుగా లావుగా బుల్లి బుల్లి కండలు తీరి బలమైన శరీర సౌష్ఠవంతో వున్నాడు. వాళ్ళమ్మ అతని పసితనంలో బొచ్చు పోలయ్య అన్న నిక్ నేమ్ తో పిలిచిందో లేదో గాని చేతులకి కాళ్ళకి చాతికీ వెంట్రుకలు వున్నాయి. ఒకానొక రచయిత్రి ఒకానొక నవలలో హీరోని వర్ణిస్తూ మగసిరి వుట్టిపడుతూ అని రాసినట్లు... ఏమాట కామాటే చెప్పాలన్నట్లు మగసిరి ఉట్టిపడుతూనో ఊడిపడుతూనో మొత్తానికి చాలా భాగం అలాగే వున్నాడు. కాపోతే ముఖం మాత్రం అమాయకంగా... నోట్లో వేలు పెడితే కొరక్కపోగా తీయండి అని చెప్పేటంత మంచి తనంతో బుద్దూలాంటి పూర్ణ పురుషుడు అనిపిస్తున్నాడు చూడగానే.