"ఏంటీ డల్ గా వున్నారు... ఎనీ ప్రాబ్లం" అడిగాడు మృదువుగా ఫెడ్రిక్.
"ఏం లేదు సార్" అంది అవని.
తన ప్రాబ్లం అతనితో చెప్పడం ఇష్టం లేదు.
"మొన్న ఢిల్లీ వెళ్ళాను. అక్కడో మంచి శాలువా కనిపిస్తే తీసుకొచ్చా...నీకీ కలర్ బావుంటుంది. చలికాలం కదా... వెచ్చగా వుం
టేబుల్ మీద వున్న కవర్ ఆమె ముందుకు తోస్తూ.
ఇబ్బందిగా ఫీలయింది అవని.
"తీసుకోండి అవని."
"వద్దు సార్" అంది మొహమాటంగా.
లోలోపల ఆమెకు అనుమానంగా కూడా వుంది. తనకే ఎందుకిస్తున్నట్టు...తనతో పాటు స్టాఫ్ కూ తీసుకురావచ్చుగా... ఆ మాటే అడగాలని నోటిదాకా వచ్చినా కామ్ గా వూర్కుండిపోయింది.
"పర్లేదు...తీసుకోండి. ఓ పన్జేయండి. ఆఫీసు వదిలాక తీసుకెళ్ళండి. నేను వెళ్ళే ముందు ఛాంబర్ కీస్ మీకిచ్చి వెళ్తాను."
"సారీ సార్ నాకు శాలువా అలవాటు లేదు" అంటూ లేచింది.
దెబ్బతిన్నట్టు చూశాడు ఫెడ్రిక్.
"వస్తాను సార్" అంటూ లేచింది.
ఏదో అనబోయి కామ్ గా వుండిపోయాడు ఫెడ్రిక్. అతని మొహం ఎర్రబడింది.
అవని బయటకు వచ్చేసింది.
* * *
"బాస్ ఎందుకు పిలిచాడు? అడిగింది వసుధ.
అవని ఛాంబర్ లో నుంచి బయటకు రాగానే.
"లెటర్ డిక్టేట్ చేసాడు" ఠక్కున ఓ అబద్ధం ఆడేసింది అవని. నిజం చెబితే లేనిపోని న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. అందుకే అలా చెప్పింది.
"నిజంగా అందుకేనా?" అనుమానంగా అవని కళ్ళలోకి చూస్తూ అడిగింది వసుధ.
"ఛ...అవేం మాటలు వసుధా..నీతో అబద్ధం ఎందుకు చెబుతాను" అంది తను.
"అది నిజమే" అని తన సీటు దగ్గరికి వెళ్ళిపోయింది వసుధ.
* * *
అయిదు దాటింది.
ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. వసుధ, అవని కూడా లేచారు.
సరిగ్గా అప్పడే ప్యూన్ హనుమంతు బాస్ ఛాంబర్ లో నుంచి అవని దగ్గరికి వచ్చి,
"ఏదో ఆఫిస్ వర్క్ వుందిట...మిమ్మల్ని అరగంట వుండమన్నారు బాస్" చెప్పాడు.
అవని ఆలోచనలో పడింది.
తననెందుకు వుండమన్నట్టు? తను ఇందాక అన్న మాటలు సీరియస్ గా తీసుకున్నాడా? ఏం చేస్తాడు? ఇంతవరకూ ఎంత డీసెంట్ గా వున్న మనిషి ఇన్ డీసెంట్ గా బిహేవ్ చేస్తాడా?
వసుధ అవని దగ్గరికి వచ్చి.
"అదేంటే అవనీ...నిన్ను బాస్ వుండమంటున్నాడు. ఎందుకు?" అవని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది.
"నాకేం తెలుసు?" అవని చిరాగ్గా అంది.
"పోనీ, కంపెనీగా నేను వుండిపోనా?" అంది.
"నీ ఇష్టం." అంది అవనికి ఏమనాలో తోచక.
అవనితో పాటు వసుధ వుండిపోయింది.
స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. హనుమంతు, అవని, వసుధ మాత్రమే వున్నారు.
ఇంటర్ కమ్ మ్రోగింది.
వసుధ రిసీవర్ లిప్ట్ చేసింది.
"వసుధా...టైమెంతయింది?" అడిగాడు ఫెడ్రిక్.
చెప్పింది వసుధ.
"ఆఫీసు టైమింగ్స్ ఏమిటి?"
చెప్పింది భయంగా.
"ఆఫీసుకు లేట్ గా రావడమేకాదు, ఆఫీసు అవర్స్ అయిపోయాక నా పర్మిషన్ లేకుండా, ఆఫీస్ లో వుండడం కూడా నాకు నచ్చదు."
ఫెడ్రిక్ మాటలు కఠినంగా వున్నాయి.
"యాస్సార్" అంది.
"నే..."ఇంకా అతని మాట పూర్తి కాకుండానే "వెళ్తున్నాస్సర్" అంది.
"దట్స్ గుడ్" ఫోన్ పెట్టేసాడు ఫెడ్రిక్.
అవని అవన్నీ గమనిస్తూనే వుంది.
"నన్ను ఇంకా ఆఫీసులో ఎందుకు వున్నావని అడిగాడు. వాడి సొమ్మేం పోయిందో? కుదర్దని చెప్పి నువ్వు కూడా వెళ్ళిపో... అయినా ఆఫీసు అవర్స్ దాటాక ఒక్క నిముషం కూడా వుంచని బాస్ ఇప్పుడేంటి...నిన్ను వుండమన్నాడు" ఆరా తీస్తున్నట్టు అడిగింది.
"నాకు మాత్రం ఏం తెలుసు."
"పోనీ...నాకు కుదర్దు...అని చెప్పి వెళ్ళిపో" అంది సలహా ఇస్తూ వసుధ.
"అలా చెబుతే బావోదేమో...అయినా అరగంటేగా" అంది అవని.
"అవునవును...అరగంటేగా" సాగదీసి అంది వసుధ. రెండు నిముషాలాగి..."సరే..నేను కార్నర్ లో వున్న హొటల్ లో కూచుంటాను. పనైపోగానే అక్కడికి వచ్చేయి" అంది వసుధ.
"ఎందుకు...నేను ఇంటికి వెళ్ళిపోతా"
"అదికాదు అవనీ...మనం ఫోన్ లో బెదిరించిన రహస్య అగంతకుని గురించి మాట్లాడుకోవాలి...అలాగే బాస్ ఎందుకు నిన్ను వుండమన్నాడో కూడా తెలుస్తుంది."
"అలాగే" అంది అవని.
వసుధ వెళ్ళిపోయింది.
వసుధ వెళ్ళిన అయిదు నిముషాల తర్వాత హనుమంతు అవని దగ్గరికి వచ్చి బాస్ పిలుస్తున్నాడని చెప్పాడు.
అవని లోపలికి వెళ్ళింది. హనుమంతు కూడా వున్నాడన్న ధైర్యం వుంది.
"హనుమంతూ...వెళ్ళి రెండు స్ట్రాంగ్ కాఫి పట్రా..." చెప్పాడు ఫెడ్రిక్.
హనుమంతు ప్లాస్క్ తీసుకొని వెళ్ళిపోయాడు. చలికాలం కావడం వల్ల అప్పటికే చీకట్లు ముసురుకున్నాయి. లోలోపల భయంగా వుంది. హనుమంతుని కూడా పంపించాడు. ఇప్పుడేం చేస్తాడు? బెదిరిస్తాడా? కొంపదీసి ఫోన్ లో తనని చంపేస్తానని బెదిరించింది తన బాస్ కాదుకదా?
మెల్లిగా తలెత్తి బాస్ వంక చూసింది. తనవై పే చూస్తున్నాడు.
"మిస్ అవనీ... మొదట్నుంచి మీమీద సాప్ట్ కార్నార్ వుంది. మీ డిసిప్లిన్, సిన్సియార్టి నాకు చాలా బాగా నచ్చాయి." అన్నాడు రివాల్వింగ్ చెయిర్ లో వెనక్కివాలి రిలాక్సవుతూ
"థేంక్యూ సార్" అంది మెల్లిగా అవని.
"నిన్ను...సారీ మిమ్మల్ని చూస్తుంటే, ఓ ఆత్మీయురాలిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది" అన్నాడు ఫెడ్రిక్.
ఏమనాలో తోచలేదు అవనికి. ఇవ్వన్నీ తనకెందుకు చెబుతున్నట్టు.
"నేను త్వరలో స్టేట్స్ కు వెళ్దామనుకుంటున్నాను. ఇక్కడ బిజినెస్ ను వైండప్ చేయాలా? కంటిన్యూ చేయాలా? అని ఆలోచిస్తున్నాను" అన్నాడు.
'నిజమా?' అన్నట్టు చూసింది.
"అవును... నిజం అవని... ఇక్కడ నాకు ఎవరున్నారని... వున్న ఒక్కరూ..." అతని గొంతు గాద్గికమైంది.
ఈలోగా హనుమంతు వచ్చాడు. రెండు కప్పల్లోకి కాఫీ ఒంపి చెరో కప్పు ఇచ్చాడు.
"హనుమంతు...నువ్వెళ్ళిపో... ఆఫీసుకు నేను తాళాలు వేస్తాను" అన్నాడు ఫెడ్రిక్.
విచిత్రంగా చూశాడు హనుమంతు. ఇంతవరకూ ఎప్పుడూ తనే తాళాలు వేసేవాడు. అలాంటిది? అవని వంక చూశాడు హనుమంతు.
అవని తల వంచుకుని వుంది.
రకరకాల ఆలోచనలు ఆమెను చుట్టుముట్టాయి. హనుమంతుని కూడా వెళ్ళిపోమ్మంటున్నాడు. అంటే బాస్ మనసులో ఏదైనా దురుద్దేశం?...
ఛ..ఛ.. ఇన్నాళ్ళు ఎంత డీసెంట్ గా వున్నాడు. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ వుండిపోయింది.
హనుమంతు వెళ్ళిపోయాడు.
"నాతో మాఇంటికి రాగలరా అవనీ."
"నేనా...ఎందుకు...? నేర్రాను నాకు పనుంది. తొందరగా వెళ్ళాలి" గబగబ అనేసింది.
"ఓ అరగంట వుండి వెళ్ళిపోవచ్చు." ఫెడ్రిక్ అన్నాడు
"కుదర్దు..నేను వెళ్ళాలి సార్" అంటూ లేచింది.
ఫెడ్రిక్ ఏదో అనబోయి ఆగిపోయి "సరే నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను" అన్నాడు.
వద్ని వారించబోయింది గానీ, బాస్ మొహంలోకి చూసి ఆమాట అన్లేక పోయింది.
* * *
ఆఫీసు క్లోజ్ చేసి కారు బయటకు తీసాడు. అవని వెనక సీట్లో కూచోబోయింది.
"నేను డ్రైవర్ ని కాదు...ముందు సీట్లో కూచోండి"ఫెడ్రిక్ అనడంతో చచ్చినట్లు, ఫ్రెంట్ డోర్ ఓపెన్ చేసి బాస్ పక్కనే కూచొంది.
మరొకర్తెతే ఈ అవకాశాన్ని గొప్పగా ఫీలయ్యేవాళ్ళు. కానీ తనకు ఫీలింగే లేదు. అప్పుడు గుర్తొచ్చింది. కార్నర్ హొటల్ లో వసుధ తన కోసం వెయిట్ చేస్తూ వుంటుందని.
ఇప్పడా విషయం బాస్ తో చెప్పలేదు కూడా. కారు టాంక్ బండ్ మీదుగా వెళ్తూంది.
"మీరు చాలా టెన్షన్ గా వున్నారు అవనీ. నిజం చెప్పాలంటే నేనూ టెన్షన్ గానే వున్నాను. డిస్ట్రబ్ అయ్యాను. మెంటల్ గా, ఫిజికల్ గా కూడా...ఏదో చిన్న కన్ సర్న్ ఫీలింగ్ నామీద మీకుంటుందని ఆశించాను. నా మనసులో ,మాట చెప్పాలనుకున్నాను. కానీ, ఆ అవకాశాన్ని నాకు ఇవ్వడం లేదు.
అవని విననట్లే వుండిపోయింది. లేకపోతే మనసులో మాట పేరుతో ఇంకేం చెబుతాడో...ఇంకా తనేం వినాల్సి వస్తుందో...?
ఇల్లు ఇంకాస్త దూరంలో వుందనగానే కారు ఆపి వేయించింది. "ఇక్కడ్నుంచి నడిచే వెళ్తాను సార్. చాలా దగ్గర...కారు లోపలికి రాదు" అంది అవని.
కారు ఆపి, అవని దిగగానే స్టార్ట్ చేసి "గుడ్ నైట్" అన్నాడు. అలా అన్నప్పుడు అతని మొహంలో ప్రతిఫలించే నిరాశ, నిస్పృహలను గమనించలేదు.
వాటికి గమనించినా, అతను చెప్పే విషయాలు పూర్తి గా విన్నా, అతను చెప్పినట్లుగా అతని ఇంటికి వెళ్ళినా కథ మరోలా వుండేది.
* * *
ఇంట్లో అడుగు పెట్టేసరికి, ఇల్లంతా నిశ్శబ్దగా వుంది. తండ్రి టి.వి. లో వార్తలు చూస్తున్నాడు. తల్లి కూరగాయలు తరుగుతోంది.
తన గదిలోకి తొంగి చూసింది.
అవని మనసు చివుక్కుమంది. తమ్ముడికి ఇష్టమైన పిల్లి...ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. మెల్లిగా తమ్ముడి దగ్గరికి వెళ్ళి తలమీద చేయేసి, "తమ్ముడూ" అని పిలిచింది.
ఆమాత్రనికే దుఃఖం తన్నుకోచ్చేసింది. అక్క ఒడిలో తలపెట్టి వెక్కి వెక్కి ఏడ్చాడు.
"నా పిల్లిని ఎవరో చంపారక్కా" అన్నాడు వెక్కుతూనే.
ఉలిక్కిపడింది అవని.
పిల్లిని చంపారన్న విషయం తమ్ముడికి ఎలా తెలుసు?
"అదికాదురా...ఏ కుక్కో.."
"కాదక్కా...కత్తితో పొడిచి చంపారక్కా" అన్నాడు వెక్కడం ఆపకుండానే.
"నీకెలా తెలుసు" ఆశ్చర్యంతో అడిగింది అవని.
"పిల్లి మెడ దగ్గర కత్తిపోట్లు వున్నాయక్కా...
మన పెరట్లో కూరగాయలు తరిగే కత్తి రక్తంతో తడిసి కనిపించింది" అంత బాధలోనూ సృష్టంగా చెప్పాడు.
తమ్ముడి తెలివితేటలకు ఆశ్చర్యపోయింది.
"నువ్వు డిటెక్టివ్ గా బాగా పనికి వస్తావురా" అంది సిన్సియర్ గా.
ఆక్షణం పిల్లి చనపోయిందని బాధ మరిచిపోయి "నిజామా అక్కా...హంతకుడు నవలలో విలన్ పిల్లిని చంపి హీరోయిన్ ని బెదిరిస్తాడు. అచ్చు అలాగే జరిగింది" అని ఆగి అక్కయ్య మొహంలోకి చూసి-
"అవునక్కా...ఇప్పుడు నాకు అనుమానం కలుగుతోంది. నిన్ను ఫోన్ లో బెదిరించిన వాడే నిన్ను భయపెట్టడానికి మన పిల్లిని చంపివుంటాడు."
మళ్ళీ ఉలిక్కిపడింది అవని...అది నిజం కూడా...కానీ, ఆ నిజం తన తమ్ముడు గ్రహించడం...
వెంటనే తమ్ముడు నోరు మూసి లో గొంతుకతో "నాన్న వింటారు" అంది.
"నిజమక్కా...వాడే...ఆ టెలిఫోన్ లో నిన్ను బెదిరించిన వాడే నా పిల్లిని చంపాడు. నేను వాడిని వదిలిపెట్టనక్కా" అన్నాడు ఉక్రోషంగా డుంబు.
"రాత్రి నాన్న అమ్మా పడుకున్నాక మాట్లాడుకుందాం" అంది మెల్లగా అవని.
కామ్ గా వుండిపోయాడు డుంబు.
* * *
రాత్రి తోమ్మిదవుతుండగా అందరూ భోజనాల దగ్గర కూచున్నారు.
డుంబు కొద్దిగా తేరుకున్నాడు.
మహాలక్ష్మి భర్తకు, కూతురుకి, కొడుక్కి వడ్డిస్తుంది.
"నువ్వూ కూచోవే" అన్నాడు సూర్యనారాయణ భార్య నుద్దేశించి.
"ముందు మీరు కానీయండి" అంది మహాలక్ష్మి.
"అమ్మా...వున్నదే నలుగురం.. మళ్లీ నువ్వు వేరుగా కూచోవడం ఎందుకు?" అంది అవని.
కూతురి బలవంతం మీద మహాలక్ష్మి కూడా కూచుంది
వేడి వేడి సాంబార్ పొగలు కక్కుతోంది. వడియాలు, ఆవకాయ పచ్చడితో అందరూ సుఘ్ట గా తిన్నారు.
అవని సింక్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కుని నెప్ కిన్ తో మూతి తుడుచుకుంటుండగా ఫోన్ మ్రోగిం
బెదిరిపోయింది ఫోన్ రింగ్ విని అవని. డుంబు గబగబ ఫోన్ దగ్గరికి పరుగెత్తాడు. అక్కయ్యని ఫోన్ లో బెదిరించిన వ్యక్తే అయితే తిట్టాలన్నాంత కసిగా వుంది.
తమ్ముడి మొహంలో కోపం చూసి వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్ళింది అవని.
అప్పటికే డుంబు "హలో..హలో" అన్నాడు. రిసీవర్ తీసుకుంది అవని.
"నేను వసుధను మాట్లాడుతున్నాను." అటువైపు నుంచి వసుధ గొంతువినిపించింది.
"నువ్వా...ఇంత రాత్రివేళ చేసావేంటి?" అడిగింది ఆశ్చర్యంగా.
"అదేంటి..నేను ని కోసం వెయిట్ చేస్తే నువ్వు...రాలేదు"అంది వసుధ కోపంగా.
"సారి..మరిచిపోయాను" అంది.
"మరచిపోయావా? కారులో బాస్ పక్కనే కూచునేసరికి నువ్వే మారిపోయావా?" వసుధ గొంతులో ఎంత దాచుకుందామన్నా దాగని జెలసీ వినిపించింది.
గతుక్కుమంది అవని.
వసుధ తనని గమనించలేదనుకొని అబద్ధం చెప్పింది.
"చెప్ప.. అవనీ... ఈ ఫ్రెండ్ కన్నా, బాస్ కంపెనీ నీకు గొప్ప రిలీఫ్ ను ఇచ్చినట్టుంది" అంది నిఘ్టారంగా వసుధ.
"సారీ వసుధా...అదికాదు...అసలు ఏం జరిగిందంటే..." అని జరిగింది చెప్పబోయి ఆగింది.
"ఏం జరిగింది? " వసుధ గొంతులో ఆత్రుత.
"ఏంలేదు...రేపొద్దున చెబుతానులే" అంది అవని.
"అదేం కుదర్దు...ఇప్పుడు చెప్పరాదూ." అంది పట్టుదలగా వసుధ.
"రేపు చేబుతాన్లే... వుంటాను. గుడ్ నైట్" అంది.
"సరే" అటువైపు నుంచి అయిష్టంగా పలికింది వసుధ గొంతు.
రిసీవర్ పెట్టేసి తన గదివై పు నడిచింది అవని.
"ఇంత రాత్రివేళ ఫోన్ చేసింది ఎవరమ్మా?" తండ్రి అడిగాడు.
"వసుధ...ఆఫీసులో నా కొలీగ్ నాన్నా." అంది.
* * *
రాత్రి పదకొండు గంటలకు హఠాత్తుగా మెళుకువ వచ్చింది.
తమ్ముడు నిద్రపోతున్నాడు.
తనని బెదిరించిన ఆగంతకుడి అంతు చూస్తానని శపధం చేసాడు తమ్ముడు.
నవ్వుకుంది. తమ్ముడి వంక మురిపెంగా చూసి నుదురు మీద ముద్దు పెట్టుకుంది.