"మరోసారి మీరు ఇన్ డీ సెంట్ గా బిహేవ్ చేస్తే నేను బాస్ కు కంప్లయింట్ ఇవ్వాల్సి వస్తుంది" ఇరిటేటింగ్ గా అంది అవని.
ఉదయం నుంచీ అసలే అనీజీగా వుంది. దానికి తోడు శేషశాయి ప్రవర్తన.
ఇంతకుముందే రెండు మూడుసార్లు ఘాటుగా మాట్లాడింది. అయినా అతనిలో మార్పు లేదు.
"కంప్లయింట్ ఇస్తారా? ఇవ్వండి చూద్దాం" అన్నాడు కోపంగా శేషశాయి.
"ఖచ్చితంగా ఇస్తాను... నాకేమైనా భయమనుకున్నారా?" ఇంకా కోపంగా అంది అవని.
" నా సంగతి తెలియదేమో...నోరు జారితే జాగ్రత్త" శేషశాయి పళ్ళ బిగువున కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు.
అప్పటికింకా వసుధ రాలేదు. ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. వాళ్ళిద్దరి మధ్య జరిగే వాగ్వివాదాన్ని ఎవరూ గమనించడం లేదు.
"ఏంటి...మీ సంగతి తెలిసేది? ఏంటి ఏం చేస్తారు? మీ భార్య దగ్గర చూపించండి... మీ ధైర్యాన్ని" కోపంగా అంది అవని.
కోపంలో తనేం మాట్లాడుతుందో కూడా అర్ధం కాలేదు. శేషశాయి భార్యకు భయపడతాడనితెలుసు. అతను తనని అనేసరికి తన 'ఇగో' దెబ్బ తిని అలా అంది.
"పెద్ద పతివ్రతలా ఫోజు కొట్టకు...బాయ్ ఫ్రెండ్ తో నువ్వు సినిమాలకు తిరగడం తెలియదనుకోకు" శేషశాయి గొంతు పెంచాడు.
ఆవేశం విచక్షణను అణచేస్తుంది. ఇప్పుడు ఇద్దరి విషయంలోనూ అదే జరిగింది.
"షటప్... నా పర్సనల్ విషయాలు నీకు అనవసరం" ఏకవచనంతో కోపంగా అంది.
"చూస్తా.. నీ అంతు చూస్తాను" అన్నాడు.
"ఏం చేస్తావు? చంపేస్తావా?" ఇంకా కోపంగా అంది తను గొంతు పెంచి.
"ఆ పని కూడా చేయగల్ను" అంటూ ఏదో అనబోయేంతలో కారు శబ్దం వినిపించింది.
చకచకా తన సీటు దగ్గరికి వెళ్ళాడు శేషశాయి. అటు వెళ్ళగానే హనుమంతు అవని దగ్గరికి వచ్చాడు.
"ఏం జరిగింది మేడమ్...వాడేమైన వెకిలిగా ప్రవర్తించాడా?" అడిగాడు హనుమంతు.
ఏమనక మౌనంగా వుండిపోయింది అవని.
"వాడొట్టి రోగ్... ముసలితనం వచ్చినా వెధవబుద్ది పోలేదు. మీకన్నా ముందు సౌధామిని అనే మేడమ్ ని కూడా ఇలానే బెదిరించాడు. చంపేస్తానని కూడా బెదిరించాడు" అన్నాడు హనుమంతు.
ఒక్కక్షణం ఉలిక్కిపడింది అవని.
"చంపేస్తానని బెదిరించాడా?" తనలో తనే గొణుక్కుంది.
* * *
"ఏయ్...అవనీ.. ఏంటి డల్ గా వున్నావు?" అడిగింది లంచ్ టైమ్ లో వసుధ.
బాస్ రావడంతో మధ్యాహ్నం వరకు ఎవరూ సీట్లలో నుంచి కదల్లేద. వసుధ వన్ అవర్ లేట్ గా వచ్చింది. అవని డల్ గా వుండటం చూసి ఎందుకలా వున్నావని అడిగింది. ఉదయం తనకూ క్యాషియర్ శేషశాయికి జరిగిన గొడవ గురించి చెప్పింది.
"ఆ మాత్రానికే భయపడిపోతావా? వాడొట్టి రోగ్... వుండు... నేను వార్నింగిస్తాను" అంది వసుధ.
" అబ్బ.. ఏం వద్దులే...నేను వార్నింగిచ్చానుగా."
"మరయితే, ఇంకా ఈ డల్ నెస్ ఏంటి?"
వసుధకు అసలు విషయం చెప్పాలా? వద్దా? అన్న ఆలోచనలో పడిపోయింది.
"ఎనీ ప్రాబ్లం?" అడిగింది అవని వంక చూసి వసుధ.
"అలా.. చెట్టు దగ్గరికి వెళ్దాం పద" అంది అవని.
ఇద్దరూ క్యాంటీన్ దగ్గర్లో వున్న చెట్టు దగ్గరికి వెళ్ళారు.
"చెప్పు..ఏంటి ప్రాబ్లం?"
ఎలా మొదలు పెట్టాలో అర్ధం కాలేదు.
"చూడు.. అవనీ.. నేను నీ బెస్ట్ ఫ్రెండ్ ని ఏ మాత్రం సంకోచించకుండా చెప్పు" అంది వసుధ.
ఫోన్ లో ఆగంతకుని బెదిరింపు నుంచి, తనింట్లో పిల్లిని చంపి పారేయడం వరకూ చెప్పింది.
అంతా విని ఒక్కక్షణం నిశ్శబ్దంగా వుండిపోయింది వసుధ.
అవని కూడా మౌనంగా వుండిపోయింది.
"నాకు ఆశ్చర్యంగా వుందే...నిన్ను హత్య చేస్తానని బెదిరించడం ఏంటి? బహుశ ఎవరైనా పూల్ చేయడానికి అలా చేసారేమో!"
"లేదు వసుధా...నేను మొదట అలాగే అనుకున్నాను. కానీ, రోజు రోజుకు ఆగంతకుని బెదిరింపు ఎక్కువవుతోంది."
"పోనీ నిన్ను హత్య చేయడానికి 'మోటివ్' ఏదో ఒకటి వుండాలే?"
"అదే నాకు ఆశ్చర్యంగా వుంది."
"బాగా గుర్తు చేసుకో...నీకు శత్రువులు ఎవర్తెనా వున్నారా?" అవని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది వసుధ.
"ఊహు."
"అలాకాదు.. మీ నాన్న తరపువాళ్ళు .. ఆస్తి గొడవల్లాంటివి?"
"అవేమీ లేవు..మాకసలు ఆస్తిపాస్తులుంటేగా.. తన జీతం డబ్బుతో కొన్న ఇల్లు తప్ప మరేమీ లేదు."
"నిన్నెవర్తెనా ప్రేమించారేమో...నువ్వు వాళ్ళ ప్రేమను రిజెక్ట్ చేసావన్న కోపంతో?"
"అలాంటి సంఘటనలు నాకెప్పడూ ఎదురవ్వలేదు. కాలేజి రోజుల్లో నన్ను అందరూ ఓ స్నేహితురాలిగానే చూశారు. అలాంటి ఎఫెయిర్స్ లేవు."
"నీవల్ల అతనికి ఏదైనా ఉపయోగం వుందేమో?"
"నా వల్లా...నావల్ల ఏం ఉపయోగం ఉంటుంది? అయినా అలాంటిదేమైనా వుంటే అతనిక్కావల్సిందేంటో అడగొచ్చుగా."
"అదీ నిజమే" అంది వసుధ.
"ఏం చేయాలో తోచడం లేదు" దిగులుగా అంది.
"నువ్వేం వర్రీ అవ్వొద్దు. అవసరమైతే నేను ధీరజ్ తో మాట్లాడతాను అతనికి చాలా డిటెక్టివ్ ఏజన్సీలతో పరిచయాలున్నాయి."
"డిటిక్టివ్ ఏజెన్సీలతో మనకేంటి పని?"
"వాళ్ళు ఇన్ వెస్టిగేషన్ చేస్తారు.
"ఏమోనే.. అనిరుధ్రకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను" అంది అవని.
"వద్దొద్దు" వెంటనే అంది వసుధ.
"అదేం?"
"అసలు విషయమేంటో తెలుసుకోకుండా, అతనికి విషయం చెబితే అతను కన్ ప్యూజ్ అవ్వొచ్చు. అదీగాక నీ వెనక ఇంత కుట్ర జరుగుతుందని తెలిసి, మనకెందుకు రిస్కు అని అతను తప్పకోవచ్చు. లేదా, నీకు వేరే ఏమైనా ఎఫయిర్స్ వున్నాయేమో అనికోవచ్చు."
"ఏం చేయమంటావు? పోనీ పోలీస్ రిపోర్ట్ ఇచ్చేదా."
"అదీ డెంజరే ... ఏమీ తెలియకుండా పోలీస్ రిపోర్ట్ ఇస్తే...పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం కష్టం. పైగా ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే?"
"హమ్మో..." గుండెల మీద చేయేసుకొని అంది అవని.
"నాకు కొద్దిగా టైం ఇవ్వు...ఈలోగా నీకు ఎవరెవరి మీద డౌట్ వుందో గుర్తు చేసుకో...మనమే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం..ఈసారి ఆ ఆగంతకుడు ఫోన్ చేస్తే...మీ డిమాండ్ ఏమిటని అడుగు."
"అలాగే" అంది అవని.
"నువ్విక ఈ విషయం గురించి దిగులేమీ పెట్టుకోవద్దు... సరేనా" అంది భుజం తట్టి.
"థేంక్యూ" అంది అవని.
ఇప్పడామె మనసు ప్రశాంతంగా వుంది. తన సమస్య పంచుకోవడానికి ఓ ప్రెండ్ దొరికిందన్న ఆనందంలో నిండా మునిగిపోయింది.
సాయంత్రం నాలుగవతుండగా అవనికి ఫోన్ వచ్చింది. అవనికి ఓ పక్క భయంగానే వుంది. ఫోన్ వసుధ టేబుల్ మీద వుంది. వసుధ బయటకు వెళ్ళింది. బహుశా బాత్రూంకు వెళ్ళిందేమో అనుకుంది.
హనుమంతు ఫోన్ ఎత్తి అటువై పు మాట్లాడింది విని, అవనిని పిలిచి, రిసీవర్ ఆమెకు ఇచ్చాడు.
"హలో" అంది అవని.
"హ..లో..వ్... గుర్తుపట్టావా? నీ పాలిట యముడ్ని" అదే బొంగురు గొంతు.
చుట్టూ చూసింది. దూరంగా స్టూల్ మీద కూచున్న హనుమంతు అవని వంకే చూస్తున్నాడు.
వసుధ అన్న మాటలు గుర్తొచ్చాయి. కొద్దిగా ధైర్యం చేసి లోగొంతుకతో అంది "మీ డిమాండ్స్ ఏమిటో చెప్పండి."
అవతల వై పు ఒక్కక్షణం నిశ్శబ్దం.
"మిమ్మల్నే...మీకసలు ఏం కావాలో చెప్పండి."
"వెరీగుడ్...ఇప్పుడు దారిలోకి వచ్చావు. ఇలా చెప్పగానే బుద్ధిగా అర్ధం చేసుకొని మాట్లాడేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం...ఓ.కే. మళ్ళి ఫోన్ చేస్తాను"ఫోన్ డిస్ కనెక్ట్ అయింది.
మొహానికి పట్టిన చెమట కొంగుతో తుడుచుకొని తన సీట్లో కూచుంది.
శేషశాయి సీటు వై పు చూసింది. అతని సీటు ఖాళీగా వుంది.
ఇంతలో వసుధ వచ్చింది.
వసుధను చూడగానే అవని లేచ, వసుధ సీటు దగ్గరికి వెళ్ళి, ఆమె సీటు పక్కకు చెయిర్ లాక్కొని మెల్లిగా చెప్పింది.
"ఆ ఆగంతకుడు ఫోన్ చేశాడు."
"ఏమన్నాడు?" ఆతృతగా అడిగింది వసుధ.
ఏమన్నాడో చెప్పింది అవని.
"నేను చెప్పానా? అతను నీ నుంచి ఏదో ఆశిస్తున్నాడు."
"ఏదో అంటే... కొంపదీసి" భయంగా ఏదో అనబోయి ఆగిపోయింది అవని.
"అలా భయపడకు...అతను నిన్ను ఆశిచడంలేదనే నాఉద్దేశ్యం...ఈసారి అతనితో ధైర్యంగా మాట్లాడు...అతనికి ఏం కావాలో సృష్టంగా చెప్పమను. వీల్తెతే ఎక్కడైనా కలుసుకుందామని చెప్పు.
అతని గురించి ఎక్కడా చెప్పనని, పోలీస్ కంప్లయింట్ ఇవ్వనని చెప్పు...
అప్పుడతనికి నీ మీద నమ్మకం ఏర్పడుతుంది" అంది వసుధ.
"అంతేనంటావా?" నీరసంగా అడిగింది.
"ప్రస్తుతానికి అంతకు మించిన మార్గ లేదు. పైగా నీకు నష్టం లేని ప్రపోజ్ అతను చేసినప్పుడు ఆ ప్రపోజ్ కు నువ్వు ఒప్పుకుంటే సరి...అవసరమైతే నీ తరపున నేను మాట్లాడతాను" ధైర్యం చెప్పింది వసుధ.
"థేంక్యూ వసుధా...నాకు చాలా సాయం చేస్తున్నావు."
అవనికి ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా అనిరుద్రని పెళ్లి చేసుకొని అతని భార్యగా సింపుల్ గా వుండటమే ఇష్టం.
"అనవసరమైన ఈ రొంపిలో ఇరుక్కోవడం ఎందుకు? నువ్వెలా చెబితే అలా చేస్తాను" అంది మనస్పూర్తిగా అవని.
"దట్స్ గుడ్" అంది వసుధ.
ఈలోగా శేషశాయి తన సీటులోకి వచ్చాడు.
"ఇందాకట్నుంచి వాడు సీటులో లేడా?" శేషశాయిని ఉద్దేశించి అడిగింది వసుధ.
"లేడు."
"ఎక్కడికో వెళ్ళివుంటాడు. కొంపదీసి వాడే నిన్ను బెదిరించడం లేదు కదా" అంది వసుధ.
ఉలిక్కిపడింది అవని.
"అతనా...అతనంతపని చేస్తాడా?"
"ఏమో ఎవరు చెప్పోచ్చారు. నేను అతడ్ని ఓ కంట కనిపెడతాలే... అన్నట్టు నువ్వు ఫోన్ లో వచ్చినా ఆ గొంతును గుర్తుపట్టగలవా?"
"ఖచ్చితంగా...ఆ గొంతులో అదో జీర బహుశా కర్చీఫ్ అడ్డం పెట్టుకునో, కావాలనో గొంతు మార్చో మాట్లాడుతూ వుండొచ్చు" అంది అవని.
"నేనూ ఆ పని మీదే వుంటాను...నువ్వేం కంగారుపడకు" అంది.
అవని తన సీటులోకి వెళ్ళి కూచుంది.
ఈలోగా ఇంటర్ కమ్ మ్రోగింది.
"మిస్ అవనీ..ఒక్కసారి నా ఛాంబర్ కు రండి " బాస్ ఫెడ్రిక్ మాటలు వినిపించాయి ఇంటర్ కమ్ లో.
పెన్సిల్ , బుక్ తీసుకొని బాస్ ఛాంబర్ వైపు నడిచింది అవని.
వసుధ అవని వెళ్ళిన వైపే చూస్తోంది.
అవని అడుగుల శబ్దం విని ఫైల్ లో నుంచి తలెత్తాడు ఫెడ్రిక్.
"చెప్పండి సార్" అంది డిక్టేషన్ తీసుకోవడానికి రెడీ అవుతూ.
"నో..నో మిస్ అవనీ... క్యాజువల్ గా పిలిచానంతే... కూచో" అన్నాడు.
కూచుంది అవని.