Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 7


    "కుమారా! నీచాత్ములగు నందులు నిన్నేకాదు; నన్ను సైతము పరాభవించిరి. నందసామ్రాజ్యము నాశనమగుట నిక్కువము. అనంతరము మగధ సింహాసనమునకు ప్రభువు చంద్రగుప్తుఁడు."
    "గురుదేవా! మీరు సత్యసంకల్పులరు! మీ యనుగ్రహమున్న నసాధ్య మేముండును?"
    అనంతరము కొంతసేపు గురుశిష్యులిరువురు ప్రాంతముననున్న వటవృక్షము క్రిందఁ గూర్చుండి మంత్రాలోచన సలిపిరి. మగధరాజ్యమునకు శత్రువులెవరో మిత్రులెవరో చంద్రగుప్తుఁడు చాణక్యునకు స్పష్టీకరించెను. మహామంత్రి యగు రాక్షసుని యద్వితీయమేధాశక్తిని అనుపమాన పరాక్రమమును వర్ణించెను. తన తండ్రికి మిత్రులై నేఁటికిని తన్నభిమానించు చున్న భాగురాయణాది సేనానాయకుల మనస్తత్వము లెఱింగించెను మగధ సామ్రాజ్యమునకు ప్రక్కలోని బల్లెమువలె నున్న పర్వతరాజు శక్తి సామర్థ్యములను విశదీకరించెను. ఇట్లు చాణక్యుఁడు చంద్రగుప్తునిచేఁ బాటలీపుత్రము గుట్టుమట్టులన్నియుఁ దెలిసికొనెను. అనంతరము భావికర్తవ్య నిర్వహణమునకుఁ గడంగెను.
    చంద్రగుప్తుఁడు పర్వతప్రాంత నివాసులగు నాటవికుల నెల్ల సంఘటిత పఱచి వారికి సక్రమమగు సైనికశిక్షణ మొసంగి యుద్ధసన్నద్ధులను గావింప నిశ్చయించెను. చాణక్యుఁడు మారువేషములతో మగధరాజ్యమందు సంచరించుచున్న తన శిష్యులచే నెప్పటికప్పుడు రహస్యములఁదెలిసి కొనుచుండెను. భాగురాయణాది సేనాపతులను దన బుద్ధి నైపుణ్యముచే స్వీయపక్షమునకుఁ ద్రిప్పుకొనెను. పర్వతరాజున కర్ధరాజ్యమిత్తునని యాశపెట్టి మగధపై దండయాత్రలోఁదమకు సాయపడుటకుఁ బ్రయత్నములు సల్పెను. చంద్రగుప్తుని శౌర్యాగ్నికిఁ జాణక్యుని మంత్రాలోచనము మహామారుత మయ్యెను. ప్రచండమగు నాదావానలములో నందవంశము భస్మీపటలము గాకపోవునా? మగధ సింహాసనమును చంద్రగుప్తుఁ డధిష్ఠింపక పోవునా?


                              4


    అవి సింధునదీ పరిసరములందలి గ్రీకుల యుద్ధ శిబిరములు. యవనదేశాధీశ్వరుఁడగు నలెగ్జాండరు విశ్వవిజేత కావలయు నను కుతూహలముతో భారతభూమిపై దండెత్తి వచ్చియుండెను.
    ఆనాఁడు గ్రీకుసేనాధిపతి యగు సెల్యూకసు ఆయన కుమార్తె హెలీనా వాహ్యాళికై బయలుదేరినారు. సింధునది యొడ్డుననే వారా యరణ్యప్రాంతములోఁ గొంతదూరము నడచిపోయి యందలి ప్రకృతిసౌందర్యమునకుఁ దన్మయములైన హృదయములతో మరలి గుడారములకు వచ్చుచుండిరి.
    "నాయనా! భారతభూమి పవిత్రమైనదని విన్నాను. మన సార్వభౌముఁడు భారతదేశముపై దండెత్తి వచ్చుట దురాక్రమణ మనిపించుకొనదా? మనదేశము మఱియొక దేశముపైఁబడి దోఁచుకొనుట న్యాయవిరుద్ధము కదా!"
    "అమ్మా! అట్లుకాదు. సామ్రాజ్యము విస్తరింపఁజేసి కొనుట కొఱకు సలుపు సంగ్రామములు ధర్మవిరుద్ధములు కావు. చక్రవర్తులకు జైత్రయాత్రలు స్వభావసిద్ధములగు ధర్మములు."
    "తండ్రీ! సామ్రాజ్యవిస్తరణమునకై సమరము చేయుటయా? ఆహా! అమాయికజనుల హాహాకారములే సార్వభౌములకు జయజయనినాదములు కాఁ బోలు! మన చక్రవర్తి యింకను జైత్రయాత్ర సాగించునా?"
    "తక్షశిలాధీశ్వరుఁడు 'అంభి' మొదలగువారు మనకు లోఁబడిపోయిరి. మనచక్రవర్తికి మగధదేశము జయింపవలెనను కాంక్ష కలిగినది గాని సైనికులు స్వదేశమునకు మరలి పోవలెనని పట్టుదల వహించుట చేతను, మన దేశములో సామంతులు విప్లవము లేవఁదీయుచున్నారను వార్తలు వచ్చుట చేతను సార్వభౌముని జైత్రయాత్ర మందగించినది."
    ఇంకను సెల్యూకసు మాటలు పూర్తికాలేదు. బాట ప్రక్కనున్న గుట్టలో నుండి యొక భయంకర శార్దూలము ముందు నడచుచున్న సెల్యూకసుపై దుమికినది. సెల్యూకసు తనచేతనున్న కత్తిని దానిపై విసరినాడు. కాని బెబ్బులి దెబ్బతప్పించుకొని ద్విగుణీకృత వేగముతో హెలీనాపై బడబోయినది. హెలీనా "తండ్రీ, తండ్రీ" యని యరచుచు నటునిటు బరువిడినది. ఇంతలో నెటనుండియో యొకబాణము రివ్వున వచ్చి పెద్దపులి డొక్కలో గ్రుచ్చుకొనినది. ఆ శరాఘాతముచే శార్దూలము గిరగిర తిరిగి ధరణిపైఁబడినది.
    హెలీనా సెల్యూకసులు కొంచెము తెప్పరిల్లి లేచి చూచునప్పటికి వారి ముందొక వీరకుమారుఁడు నిలిచి యుండెను. ఆ శూరాగ్రేసరుఁడొకచేత ధనుస్సును మరియొక చేత బాణములను ధరించియుండెను. దీర్ఘమగు కరవాలము నడుమున వ్రేలాడుచుండెను. మెలికలు తిరిగిన మేనికుండలు పరాక్రమమును బ్రదర్శించుచుండెను. నూనూగు మీసముల నూతన యౌవనముతో మెరసిపోవుచున్న యా భారతవీరకుమారుని సందర్శించినంతనే హెలీనా ముఖపద్మము వికసించెను. కపోలములు లజ్జారుణితము లయ్యెను. కలువ రేకుల వంటి కన్నులు మరింత విశాలము లయ్యెను. ప్రథమ సందర్శనమందే యువతీయువకుల హృదయ క్షేత్రములలో ననురాగబీజము లంకురిత మయ్యెను.
    సెల్యూకసు సగౌరవముగ యువకునకు స్వాగత మొసఁగితనకృతజ్ఞత ప్రదర్శించెను. హెలీనా అరటిమువ్వల వంటి తన చేతులెత్తి ధన్యవాదము లర్పించెను.
    "మిత్రుఁడా! నేఁడు నీవు మాకు ప్రాణదాన మొనరించితివి. నీ ఋణము తీర్చుకొనఁజాలము. రమ్ము! మా చక్రవర్తి కడకుఁబోవుద"మని సెల్యూకసు యువకుని చేయిపట్టుకొని యలెగ్జాండరు సముఖమునకుఁ గొనిపోయెను.
    అలెగ్జాండరు సార్వభౌముఁడా వీరకిశోరమును కన్నులార దర్శించినాఁడు. అతని ధీరగంభీర స్వరూపమున కచ్చెరు వందినాఁడు. తన సేనానాయకునిచే వాని పరాక్రమమును బాణప్రయోగ నైపుణ్యమును తెలిసికొనినాఁడు.
    "యువకుఁడా! నీ పేరేమి? నీ చరిత్ర మెట్టిది? నీ వీ ప్రాంతమున నేల సంచరించుచుంటివి?"
    "యవనేశ్వరా! నా పేరు చంద్రగుప్తుఁడు. నేనొక నిర్వాసిత రాజకుమారుఁడను. న్యాయముగ నాకు రావలసిన మగధసింహాసనమును నందరాజు లాక్రమించినారు. నన్ను దేశమునుండి వెడల నడచినారు. నేను మరల మగధ నాక్రమించుకొనుటకై యాటవిక సైన్యము నాయత్తపరచుచునజ్ఞాతవాసము చేయుచున్నాను. మీ యుద్ధపద్ధతులు, వ్యూహ రచనలు, సైన్య విన్యాసములు నన్నాకర్షించినవి. అందుచే నీ ప్రాంతమునఁ జరించుచు మీ యుద్ధ విద్యా విశేషములు గ్రహించుచున్నాను."
    "నేఁడు నీవు మా కొనర్చిన సాయమునకు సంతోషము! నీవు మా సైన్యములోఁ జేరుము. నీకు మగధసింహాసన మిప్పింతుము."
    "యవనేశ్వరా! మీ యాదరానురాగములకుఁ గృతజ్ఞుఁడను. ఆ పని మాత్రము నాచేతఁగాదు. ఏల యందురా! మీరు భారతదేశమును గొల్లగొట్టుటకై యంత దూరము నుండి యింత దూరము వచ్చినారు. స్వదేశముపై దండెత్తి వచ్చిన పరదేశీయునకు పౌరుషముగల భారతీయుఁ డెవ్వఁడును 'దాసోహ' మనఁలేడు."
    "అదేమి? తక్షశిలాధీశ్వరుఁడు మాలోఁ జేరలేదా?"
    "యవనేశ్వరా! అది దేశద్రోహుల లక్షణము. భారత సౌధకవాటములు దెఱచి పరరాజు నాహ్వానించిన "అంభి" ద్రోహి; స్వార్థపరుఁడు; నేను స్వశక్తితోనే మగధను జయించి తీరెదను. ఈ విషయమున పరదేశీయుల సాయము నేమాత్రమును గోరను."
    "ఏమి నీ యౌద్ధత్యము! నిన్నిప్పుడు బంధించినచో నేమి చేయుదువు?"
    "ఈ శరీరములోఁ బ్రాణముండఁగా, ఈ చేతిలోఁ గృపాణముండఁగా నది యసాధ్యము."
    అని చంద్రగుప్తుఁడనుచుండగనే యలెగ్జాండరు సేనాపతులకుఁ గనుసన్న చేసెను. సేనాపతులు సమీపించిరి. చంద్రగుప్తుని కరవాలము తళుక్కున మెరసినది. చూచుచుండగనే చంద్రగుప్తు డదృశ్యుఁడైనాఁడు.
    అలెగ్జాండరు విభ్రాంతుఁడై "సెల్యూకస్! ఇదేమి? ఆ యువకుఁడేఁడి?" యని యడిగెను.
    "ప్రభూ! ఇదే భారతవీరుల చాకచక్యము. అనుపమానమగు శస్త్రలాఘవము! అనన్యసామాన్యమగు పరాక్రమము!" అని సెల్యూకస్ సమాధాన మిచ్చెను.

 Previous Page Next Page