రిసెప్షనిస్టు ఇంటర్ కమ్ లో ఎవరితోనో మాట్లాడి "వెళ్ళండి ఆ కుడి చేతివైపు రెండోరూం" అంది.
ఆ రూంలోకి నడిచింది అమూల్య.
టేబుల్ మీద ఉన్న పేపర్లలో మునిగిపోయినట్లు కనబడుతున్న ఒకతను మర్యాదగా లేచి నిలబడ్డాడు. అతని వెనక అద్దాల బీరువాల్లో ఉన్న కేస్ లా పుస్తకాలు ఆమె దృష్టిని ఆకర్షించాయి.
"ఐ యామ్ రాజూ! చెప్పండి! వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ!"
"మిస్టర్ నిఖిల్ ని కలుసుకోవాలి నేను"
"ఏం పని మీదో తెలుసుకోవచ్చా?"
"ఆయనతోనే మాట్లాడతాను"
"క్షమించండి. అది అంత తేలిక కాదనుకుంటాను. మిస్టర్ నిఖిల్ చాలా బిజీగా ఉంటారు. రేపుపొద్దున్న వైజాగ్ నుండి వస్తారు. మళ్ళీ రేపు మధ్యాహ్నం కాకినాడ బయలుదేరి వెళ్తారు. మీ పని ఏమిటో చెబితే అపాయింట్ మెంట్ ఏర్పాటు చెయ్యడానికి ప్రయత్నిస్తాను".
సందేహంగా చూసింది అమూల్య. "కానీ ఇది అత్యవసరం. నేరుగా ఆయనతోనే మాట్లాడాలి."
"సారీ!" అని తల అడ్డంగా తిప్పి, "ఇంకేమిటి?" అన్నట్లు ఆమెవైపు చూస్తూ కూర్చున్నాడు రాజు.
"రేపు పొద్దున్న వచ్చి మళ్ళీ ట్రై చేస్తాను" అంది అమూల్య.
అతను నవ్వాడు "ట్రై యువర్ లక్!"
లేచి బయటికి వచ్చేసింది. బయట గేటు దగ్గరే ఆటో ఒకటి నిలబడి ఉన్నది. తన అపార్టుమెంట్ అడ్రసు చెప్పి ఎక్కి కూర్చుంది అమూల్య. వెంటనే ఆలోచనలు ఆమెని చుట్టుముట్టేశాయి.
ఈ లెక్కన తను నిఖిల్ ని కలుసుకోవడం కష్టమేలాగుంది. కలుసుకోవడమే కష్టమయితే ఇంక అతని విశ్వాసాన్ని సంపాదించి అతని దగ్గర ఉద్యోగంలో చేరడం ఇంకెంత కష్టమై ఉండాలి?
కొంచెం నిస్పృహ కలిగింది ఆమెకి.
పక్కనుండి దూసుకు వెళుతున్న లారీ రొదకు ఆమె ఆలోచనల్లో నుండి బయటపడి రోడ్డువైపు చూసింది.
అది తమ అపార్ట్ మెంట్స్ కి వెళ్ళేదారి కాదు. పూర్తిగా వ్యతిరేకమైన దిశలో వెళుతోంది ఆటో.
"ఆటో! ఇటుకాదు వెళ్ళవలసినది" అంది గట్టిగా.
"నేను ఇటే వెళుతున్నాను నాతోబాటు నువ్వు వస్తున్నావు" అన్నాడు ఆటో డ్రైవర్ రియర్ వ్యూ మిర్రర్ నుండి ఆమె వైపు చూస్తూ.
"ఏమిటిది! ఆటో ఆపు!" అంది కంగారుగా.
అతను నవ్వి నిర్లక్ష్యంగా గేరు మార్చి స్పీడు పెంచాడు. ఊరవతల ఉన్న కులీ కుతుబ్ షా సమాధుల వైపు పరిగెత్తుతోంది ఆటో.
"ఆపు! ఆపు!" అంది అమూల్య గాభరాగా.
ఆగింది ఆటో. సమాధులు దాటి అప్పటికే ఇంకా చాలా ముందుకి వెళ్ళిపోయారు.
"చెప్పు అమూల్య! ఎందుకు నన్ను కలుసుకోవాలను కుంటున్నావ్!" అన్నాడతను హఠాత్తుగా.
నిర్ఘాంతపోయి అతని వైపు చూస్తూ నిలబడింది అమూల్య. అతను నిఖిల్ అని అప్పటికిగానీ గ్రహించలేక పోయింది ఆమె.
అతను పెద్దగా వేషమేమీ మార్చుకోలేదు. ఆటో డ్రైవర్లకు కంపల్సరీ ఆయన కాకీ బట్టలు వేసుకుని ఉన్నాడు. కనుబొమల మీదకు పడేటట్లు ఉలెన్ క్యాప్ ఒకటి పెట్టుకున్నాడు. అంతే!
"సారీ! గుర్తుపట్టలేక పోయాను" అంది అతను అనాసక్తిగా ఆమె వైపు చూశాడు "చెప్పు"
"నా ఉద్యోగం పోయింది"
"ఎలా ఉంటుంది, నువ్వంత తెలివి తక్కువగా ప్రవర్తించాక!"
ఉక్రోషాన్ని దిగమింగి జాలిగా మొహం పెట్టింది అమూల్య. "ఇంక నాకెక్కడా ఉద్యోగం దొరకదు. నన్నెవ్వరూ జూనియర్ గా కూడా తీసుకోరు. నాకేం చెయ్యాలో తోచడంలేదు"
"అయితే నా దగ్గరి కెందుకు రావడం?"
"నేను ఈ పరిస్థితిలోకి రావడానికి కారణం మీరే అనుకుంటున్నాను. నన్ను ఈ పరిస్థితిలో నుండి బయటపడేసే బాధ్యత కూడా మీదే అనుకుంటున్నాను"
"అవును నిజమే!" అన్నాడతను. "అలా అయితే నా దగ్గరే ఉండిపో రాజుకి లీగల్ మేటర్సు లో సాయం చేస్తూ ఉండు. సరేనా? ఎంత జీతం కావాలి నీకు?"
"జీతం గురించి ఎక్కువ పట్టింపులేదు నాకు. లా ప్రాక్టీసు నా జీవితం. క్రిమినల్ లాలో ఎదురులేకుండా వెలిగిపోవాలని కలలు కన్నాను నేను. నన్ను లా నుండి దూరం చెయ్యనివ్వకుండా ఉంటే అదే చాలు"
"సరే! రేపొద్దుటి నుండి వచ్చి డ్యూటీలో చేరిపో!"
"థాంక్స్ మిస్టర్ నిఖిల్!"
"ఆటో ఎక్కు"
ఆటో కదిలి కాసేపటి తర్వాత అమూల్య ఇంటి ముందు ఆగింది.
"వస్తాను" అన్నాడు నిఖిల్.
అప్పుడే గుర్తొచ్చినట్లు అడిగింది అమూల్య "అయితే మీరు విశాఖపట్టణం వెళ్ళలేదా?"
"వెళ్ళాను" అని ముక్తసరిగా అని ఆటో ముందుకు పోనిచ్చాడు నిఖిల్.
అదెలా సంభవమో అర్ధంకాక పెదిమలు కొరుకుతూ చూస్తూ ఉండి పోయింది అమూల్య.