Previous Page Next Page 
హత్య పేజి 7


    "నేనేమి అంతకాని మాట అన్నానురా సూరీడూ?"

 

    "అన్నానా! అని నెమ్మదిగా అంటావేమిటి? అన్నావు."

 

    "ఏమన్నానురా?"

 

    "నీకభ్యంతరం లేకపోతే కొన్నాళ్ళు మీ యింట్లో..... అలా అన్నావా లేదా!"

 

    "అన్నాను."

 

    "అదే ఆ మాట ఎందుకు అన్నావు అంటున్నాను. నీ.....నా....ఇలాంటి కూత ఇహపై కూయకు. అది నీ ఇల్లు నీ యిష్టం వచ్చినన్నాళ్ళు వుండు. హాయిగా వేళపట్టున ఇంతతిని ఇంటిపట్టున వుండి విశ్రాంతి తీసుకుంటే కొత్త పెళ్లి కొడుకు లాగా తయారవుతావు" సూర్యారావు నవ్వుతూ అన్నాడు.

 

    పెళ్ళికొడుకు లాగా తయారయితే పిల్లనిస్తామంటూ బయలుదేరుతాను ఆడపిల్లల తండ్రులు. మళ్ళీ ఆగోలతో నా పరిశోధనకుంటుపడుతుంది.

 

    "పరిశోధనా!"

 

    "అలా తెల్లముఖం వేయకు సూరీడూ! నేను ఈ ఊరు వచ్చింది దేనికనుకున్నావ్! పరిశోధనకి. ఇటు మీ ఇంటిలో ఉన్నట్లు వుంటుంది. అటు ఉరుముకొండలో రాళ్లగురించి పరిశోధన....."

 

     "ఆపు" అరచినట్లె అన్నాడు సూర్యారావు.

 

    కైలాసగణపతి తెల్లబోయాడు.

 

    "నేనేమన్నా తప్పు మాట్లాడానా!"

 

    "ముందు నోరు కుట్టేసుకో."

 

    "సూదీ దారం లేదే." నవ్వటానికి ప్రయత్నిస్తూ అన్నాడు గణపతి.

 

    "ఇష్. మనం అలా కాలవగట్టుకెళ్ళి మాట్లాడుకుందాము. ఈ లోపల ఈ ఊరి పేరు ఎత్తకు" అన్నాడు సూర్యారావు.

 

    అతను అన్నతీరులో అపాయంలాంటిది ధ్వనించినట్లయింది కైలాసగణపతి. అందుకని ముక్తసరిగా "సరే. అలాగే కానియ్యి" అన్నాడు.

 

    యిరువురు వ్యక్తులు సరదాగా మాట్లాడుకుంటుంటే మాటల్లోచిన్న అపస్వరం దొర్లినట్లు గమనిస్తే ఆ క్షణానే సరదా చచ్చి యింక ఏమి మాట్లాడాలో తెలియకుండాపోతుంది.

 

    సూర్యారావు కైలాసగణపతి మౌనంగా నడపటం మొదలుపెట్టారు. దోవలో సూర్యారావుని ఒకరిద్దరు తెలిసిన వాళ్ళు పలకరించారు. వాళ్ళకి ముక్తసరిగా జవాబు చెప్పి ముందుకు సాగాడు.

 

    ఊరు దాటి పది అడుగులు వేసిం తరువాత పచ్చిక బయలు ఆపై పంటచేలు తగిలాయి. ఆ తర్వాత పిల్లకాలుప వచ్చింది. అక్కడ ఎవరూ లేరు.

 

    "మనం ఆ గట్టుమీద కూర్చుందాము" అన్నాడు సూర్యారావు అటుకేసి నడుస్తూ!

 

    "సరే" అన్నాడు కైలాసగణపతి.

 

    ఇరువురూ అటుకేసి నడిచారు.


                                         6

 

    "చాలా బాగుంది."

 

    "ఏమిటి?"

 

    "ఇక్కడ వాతావరణం సూరీడు! పట్నంలో పార్కులో కూర్చుంటే రాని అందం యిక్కడ ఈ కాలువ గట్టున వుంది. అటుచూస్తే పచ్చ పచ్చని పంటపొలాలు, విదలబడిన జొన్నకంకులు, కాలవమీద నుంచి వచ్చే చల్లనిగాలి, శరీరాన్ని తేలిక పరిచే వాతావరణం. ఈ బరువయిన నిశ్శబ్దంలో ఉండి ఉండి పక్షులకూతలు, గువ్వల కువకువలు గాలివూసులు....

 

    "చాల్లే....." విసుక్కున్నాడు సూర్యారావు.

 

    "అదేంటిరా సూరీడూ! నిప్పులు గక్కుతున్నావ్?" కైలాస గణపతి నవ్వటానికి ప్రయత్నిస్తూ అన్నాడు.

 

    "నేను నిప్పులు కక్కటం లేదు, కప్పలు కక్కడం లేదు ముందిది చెప్పు."

 

    "ఏది?"

 

    "ఈ వూరు నువ్వు వచ్చింది రాళ్ళని పరిశోధించటానికేనా?"

 

    "అరె! నీకెలా తెలిసింది?"

 

    "వెధవ జోకులెయ్యకు నీవే చెప్పావు గుర్తు తెచ్చుకో రాళ్ళని పరిశోధించటానికేనా నీవు వచ్చింది?"

 

    "అవును ఉరుముకొండలో వున్న రాళ్ళకి చాలా కధ వుందని....."

 

    "కధ చాలానే వుంది. ముందిది చెప్పు. నీకు బతికి బట్ట కట్టాలని వుందా లేదా!"

 

    "నాలుగు కాలాలపాటు చల్లగా బతకాలనేవుంది. బతికినప్పుడు బట్టకట్టుకోకుండా తప్పదుకదా."

 

    "అలాంటి ఆశ నీకున్నప్పుడు ఉరుముకొండలో పరిశోధన మానెయ్యి. మా ఇంట్లో నీ యిష్టం వచ్చినన్నాళ్ళు వుండు. కావాలంటే శాశ్వతంగా వుండు. అంతేగానీ ఇలాటి పిచ్చిపనులు చేయకు. చేయదల్చుకుంటే తక్షణం వెళ్లిపో."

 

    "నీకేమైందిరా సూరీడూ!"

 

    "ఏమీ కాలేదు."

 

    "విషయం చెప్పకుండా ఎగిరితే నాకెలా తెలుస్తుందిరా. అసలు కథాకమామిషా చెప్పు."

 

    "ముందు నీ కధ చెప్పు. పరిశోధన అని అఘోరిస్తున్నావుగా అదీ చెప్పు. ఏదీ వదలకుండా చెప్పు."

 

    "అలాగే ముందు ఆ ముఖంలో ధుమధుమలుతగ్గించు నా సంగతి నీకు తెలిసిందే కదా? ఎప్పుడయితే అది నామానాన నన్ను వదిలేసి అగ్ని దేముడితో కలిసిపోయిందో ఆనాడే నా సరదాలన్నీ చచ్చిపోయాయి. వయసొచ్చినా కాలేజీకుర్రాడిలా అల్లరి చేసేవాడిని. ఆకతాయి వ్యవహారాలు సలిపేవాడిని. అలాంటిది దాని మరణంతో సగం చచ్చిదేశంమీద పడ్డాను.

 

    దేశ దిమ్మరికిచాలా అనుభవాలు అవుతాయి. మనశ్శాంతి లేకపోగా ఎన్నో కొత్త అనుభవాలుఅయ్యాయి. ఏదో ఒక దాంట్లో దిగి దానిలో పూర్తిగా మునిగిపోతే తప్పలాభం లేదనుకున్నాను. ఆచారి అనే ఓ ముసలాయన నాకు తారసపడ్డాడు. ఆయనతో వాళ్ళింటికి వెళ్ళాను. స్నేహంగా మేము దగ్గరఅయ్యాము.

 

    ఆచారి రకరకాల రాళ్ళని దగ్గర పెట్టుకుని పరిశోధన చేసేవాడు. ముందు నేను వాటినిచూస్తూ కూర్చునే వాడిని. ఆ తర్వాత నాకు పరిశోధన చేయాలనిపించింది. ఆచారిని అడిగి నేర్చుకున్నాను.

 Previous Page Next Page