"కుమారస్వామే ఈ గుడికి- వేరే రూపంలో వచ్చి ప్రాణప్రతిష్ట చేసారని స్థల పురాణం చెబుతోంది. అంగారకుడు- కుమారస్వామికి దైవప్రసాదమైన కుమారుడు.
పూర్వజన్మ పాపఫలంగా అంగారకుడికి (కుజుడు) కుష్టువ్యాధి సోకింది. దాంతో కుజుడు తన తండ్రైన కుమారస్వామిని రోగ విముక్తుడ్ని చేయాలని ప్రార్థించాడు. అందుకు కుమారస్వామి తన అశక్తతను వెలిబుచ్చాడు.
నేను కేవలం దేవతా ప్రపంచానికి సర్వసైన్యాధ్యక్షుడ్నే తప్ప వైద్యుడ్ని కాదు- కనుక నువ్వు నీ పెదనాన్నయిన విఘ్నేశ్వరుడ్ని శరణు వేడుకోమని కొడుక్కి సలహా ఇచ్చాడు కుమారస్వామి.
అంగారకుడు తన తండ్రిని తోడు తీసుకుని తన పెదనాన్న దగ్గరకు వెళ్ళి తనను రోగవిముక్తుడ్ని చేయమని వేడుకున్నాడు.
వినాయకుడు తన అసక్తతను వెలిబుచ్చాడు.
నేను, నన్ను పూజించేవారికి, వారి వారి లక్ష్యసాధనలో విఘ్నాలు కలగకుండా మాత్రమే చూడగలను తప్ప- రోగాల్ని నయంచేసే శక్తి లేదని తాతగారైన శివుడ్ని ప్రార్థించమని సలహా ఇచ్చాడు.
అంగారకుడి అభ్యర్థన మేరకు ముగ్గురూ కలిసి లయకారుడయిన మహేశ్వరుని శరణు వేడారు.
అందుకు ఈశ్వరుడు తన మనుమడ్ని చూసి బాధపడ్డాడే తప్ప, రోగవిముక్తుడిని చేయలేకపోయాడు.
నేను లయకారుడ్నే గానీ, ప్రాణహితకారుడ్ని కానని తన అశక్తతని వెలిబుచ్చాడు ఈశ్వరుడు.
దాంతో తెలివి కలవాడయిన వినాయకుడు తన తమ్ముడి కొడుక్కి, తాతగార్ని వైద్యుడిగా మార్చాలంటే తపస్సు చేయక తప్పదని సలహా ఇచ్చాడు.
దాంతో అంగారకుడు ఘోరతపం చేశాడు. ఆ తపస్సుకు సంతసించిన మహేశ్వరుడు వైద్యునిగా అవతారమెత్తి, కుజుడికి సోకిన కుష్టువ్యాధిని పోగొట్టాడని స్థలపురాణం. ఈశ్వరుడు వైద్యుని అవతారం ఎత్తాడు గనుక వైదీశ్వరుడై పోయాడు.
అందుకే వ్యాధిగ్రస్తులు ఈ కోనేట్లో మొదట స్నానం చేయడం ఆనవాయితీ. ఈ కోనేట్లోని బెల్లంనీళ్ళు, కుజుడికి ఇష్టమైన పదార్ధం బెల్లం...." అని చెపుతూ తన చేతిలోని ఒక పొట్లాన్ని తీసి, ఆ వ్యక్తి చేతిలోపెట్టి-
"ఇంతటి వృద్ధులు... ఈ సమయంలో, ఈ చలిలో మీరు చన్నీటి స్నానం చేయడం అంత మంచిదికాదు. నీళ్ళు శిరస్సు మీద జల్లుకుని, పొట్లంలోని బెల్లాన్ని నీళ్ళలో వదలండి చాలు" అన్నాడు శివస్వామి.
"ఇంతదూరం వచ్చాక నీళ్ళకు భయపడటం ఏమిటి? మీరు ఒడ్డున కూర్చోండి... నేను స్నానం చేసొస్తాను" అంటూ చేతిలోని బెల్లాన్ని తీసుకుని చలినీళ్ళలోకి దిగుతున్న ఆ వృద్ధుడివైపు నిబిడాశ్చర్యంతో చూశాడు శివస్వామి.
దట్టమైన మంచుతో కురిసిన నీళ్ళు చురకత్తుల్లా వున్నాయి.
మొలలోతు వరకూ దిగి, శిరస్నానం చేస్తున్నాడాయన.
అర్థరాత్రి, తన దగ్గరకొచ్చిన ఆ వ్యక్తి ఎవరు? ఎందుకొచ్చాడు? ఈ వయసులో ఆయనలో అంత తేజస్సు, వేగవంతమైన శరీరపు కదలికలు ఎలా సాధ్యం?
వయసురీత్యా వణకవలసిన కంఠం శాసిస్తున్నట్లుగా బేస్ వాయిస్ తో గంభీరంగా ఎలా వుంది? అని ఆలోచిస్తున్నాడు శివస్వామి.
నల్లని కొలను నీళ్ళ మధ్యన, తెల్లటి పద్మంలా మెరుస్తున్నాడాయన.
ఆయన గొంతు విచ్చుకుంది. 'ఓం' ఓంకారనాదం గర్భాలయం లోంచి వచ్చినట్లుగా మార్మోగింది.
"ఓం అవః అంగుష్టాభ్యాం నమః
జ్యోతిః- తర్జనీభ్యాం నమః
రసః-మధ్యమాభ్యాం నమః
అమృతం, అనామికాభ్యాం నమః
భూర్భువః-కనిష్టి కాభ్యాం నమః
స్సువరోయ్-కరతలకర
పృష్టాభ్యాం నమః"
అవిశ్రాంతంగా సాగుతోంది గాయత్రి మంత్రం.
దేవాలయ ప్రాంగణంలో వున్న చెట్లమీది పక్షులు ఆ శబ్దోచ్చారణకు ఉలిక్కిపడి లేచి, కువకువలాడుతూ గుడ్లు మిటకరిస్తున్నాయి.
స్వరతరంగాలు, నిశ్శబ్దవాయు వీచికల్లో అలల్లా ప్రయాణం చేస్తూ దేవాలయ పరిసర ప్రాంతాల్లో వింత ధ్వనిని ప్రజ్వలింప చేస్తున్నాయి.
వేదనిష్టాగరిష్టుడిలా స్నానం, సంధ్యా చేసుకుని ఒడ్డుకొచ్చి ఒంటిమీద దుస్తులను పిండుకొంటున్న ఆ వ్యక్తివైపు పరమాశ్చర్యంగా చూస్తూ పరిపరివిధాలుగా ఆలోచనలు చేస్తున్నాడు శివస్వామి.
"మహాశయా వెళదామా?" నెమ్మదిగా విన్పించిన గొంతుకి తెప్పరిల్లి లేచి నిలబడ్డాడు శివస్వామి.
"రండి" అంటూ శివస్వామి గర్భగుదికేసి సాగాడు.
మరో నిమిషం తర్వాత అంగారక దేవాలయ గర్భాలయానికి ఎదురుగా వున్నారిద్దరూ.
అంగారకుడికి ఇష్టమైన ఉప్పు, మిరియాలతో పూజాకార్యక్రమాన్ని నిర్వహించాడు శివస్వామి. ఆపైన వైదీశ్వరార్చన గావించేసరికి అరగంట గడిచింది.
అక్కడి నుంచి బయలుదేరేసరికి సరిగ్గా తెల్లవారుఝామున నాలుగు గంటలయింది. దేవాలయానికి ఫర్లాంగు దూరంలో మిల్లడి స్ట్రీట్ లో వున్న శివస్వామి కార్యాలయ భవనంకేసి సాగిపోయారిద్దరూ.
* * * *
"దయచేయండి" అంటూ మెట్లెక్కి తన పూజా మందిరంలోకి దారితీశాడు శివస్వామి.
విశాలమైన పూజామందిరం. ఆ మందిరంలోకి అడుగుపెట్టగానే పవిత్రమైన ధూపదీపాల వాసన ముక్కుపుటాలకు సోకింది.
నాలుగువైపులా అంగారకుడు, శివుడు, పార్వతి, వినాయకుడు, పళనిస్వామిల చిత్రపటాలు...
శాస్త్రీయంగా వినాయక పూజ నిర్వహించాడు శివస్వామి. ఆ తరువాత వైదీశ్వరుడ్ని, అంగారకుడ్ని ప్రార్థించి, జ్యోతిష్యానికి మూలపురుషుడయిన అగస్త్య మహామునిని ప్రార్థించాడు. అక్కడికి పూజా కార్యక్రమం పూర్తయింది.
అదే సమయంలో మందిరం ఎడమవైపున పాతకాల భోషాణపెట్టెలు ఆ వ్యక్తి చూపుల్ని ఆకర్షించాయి. అటుదిశగా తదేకంగా చూశాడాయన.
శివస్వామి భోషాణపెట్టెల దగ్గరకెళ్ళి, ఓ పెట్టెదగ్గర నుంచుని, ఆ పెట్టె మూతని తెరిచి-
అందులోంచి ఒక తాళపత్ర గ్రంధాన్ని బయటికి తీసి, అ వ్యక్తి ఎదురుగా కూర్చున్నాడు.
"మన పురాతన భారతదేశం పుణ్యగర్భ- రత్నగర్భ- యవనులు, తరుష్కులు మనదేశంలోని సంపదను కొల్లగొట్టడానికి నిరంతర దండయాత్రలు చేస్తున్న కాలమది. అలాగే మన ప్రాచీన పుస్తక భాండాగారమైన తంజావూరు గ్రంధాలయమ్మీద కూడా దాడి జరిగింది. అపురూపమైన గ్రంథాలను తస్కరించటంతోపాటు, కొన్నింటిని మంటలకు ఆహుతి చేశారు.
ఆ మంటల నుంచి రక్షించుకొని, పదిలపరచుకొన్న నాడీ గ్రంథాల తాళపత్ర సంపుటాలే ఆ బోషాణం పెట్టెలో నిక్షిప్తమై వున్నాయి, కొన్ని వందల సంవత్సరాల పూర్వం మా పూర్వులు పెట్టిన భిక్ష యిది. అంగారకక్షేత్ర ఆలయ ప్రధాన పూజారులుగా వున్న మా వంశంవారే ఆ నాడీ గ్రంథాలను పరిరక్షిస్తూ, ఆ శాస్త్ర పండితులుగా కొనసాగుతూ వస్తున్నారు.