"ప్రేక్షకుల కోరిక మీద మళ్ళీ సినిమా మొదటి నుంచీ వేస్తున్నాం అనే స్లెయిడు వేడి సినిమా మళ్ళీ వేయండి..."
వాళ్ళ మధ్య నుంచి చిరాగ్గా వెళ్ళిపోతూ అన్నాడు మేనేజర్-
శక్తి కాబిన్ రూమ్ లోంచి బయటకు నడిచాడు.
ఆపరేటర్ వైపు చూసి మీసం మెలేస్తూ రమణరావు ముందుకు నడిచాడు. ఆ వెనుకే మిత్రబృందం లోపలకు వెళ్ళింది.
అద్భుతమైన ఓపెనింగ్ తో తిరిగి చిరంజీవి స్క్రీన్ మీద దిగాడు.
టైటిల్స్ దగ్గర నుంచి సినిమా తిరిగి ప్రారంభం అయ్యింది.
* * * *
ఇల్లు దగ్గర పడటంతో అంతవరకూ నోట్లో ఉన్న సిగరెట్ ను గబగబా ఊదేసి ప్రక్కన పారేసి- కర్రగేటు మీద చెయ్యి వెయ్యబోయాడు శక్తి.
అపుడు శక్తికి చటుక్కున ఓ విషయం గుర్తుకు వచ్చింది.
చెల్లెలి ట్యూషన్ దగ్గరకు వెళ్ళి తల్లి తీసుకురమ్మని చెప్పటం అప్పుడు గుర్తుకొచ్చింది. ఆ విషయాన్ని మర్చిపోయినందుకు నాలిక కరుచుకున్నాడు.
తల్లీ, తండ్రీ తన మీదకు అంతెత్తు లేచే దృశ్యాన్ని ఊహించుకుని తప్పదన్నట్లు పిల్లిలా నడుచుకుంటూ లోపలకు వెళ్ళాడు.
అప్పుడు...
రాత్రి పదకొండు గంటలైంది.
దగ్గరగా చేరవేసి వున్న తలుపుల్ని తోసుకొని లోనికి అడుగుపెట్టిన శక్తి ఎదురుగా కన్పించిన దృశ్యాన్ని చూసి కంగారుపడ్డాడు.
పాతకాలపు మంచం మీద తండ్రి పడుకుని వున్నాడు.
తల్లి ఆయన గుండెల మీద చేత్తో రాస్తూ ఉంది. శారద స్థంభానికి ఆనుకుని కూర్చుని ఉంది దిగులుగా.
"ఏం జరిగింది..." గబగబా ముందుకు వెళ్ళాడు శక్తి. శారద స్థంభానికి ఆనుకుని కూర్చుని ఉంది దిగులుగా.
"ఏం జరిగింది..." గబగబా ముందుకు వెళ్ళాడు శక్తి. కలలు కంటూ- తల్లిదండ్రుల మాటల్ని గౌరవించకపోయినా- వాళ్ళంటే శక్తికి చాలా ప్రేమాభిమానాలున్నాయి.
"మీ నాన్నకు మళ్ళీ గుండెల్లో నొప్పొంచ్చిందిరా..." అంది తల్లి బాధగా.
"డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదా?" కంగారుగా అడిగాడు శక్తి.
"ఇప్పుడే వెళ్ళొచ్చాం..." శారద చెప్పింది చిన్నగా.
"ఏమన్నాడు..." ఆతృతగా అడిగాడు శక్తి.
"ఇంజక్షన్స్ చేసారు... మెడిసిన్స్ కొనమన్నారు. సమయానికి నువ్వు లేవు. ఆడపిల్ల అర్దరాత్రి అంత దూరం వెళ్ళి మందులు తెచ్చింది." తల్లి నిష్ఠూరంగా అంది.
"ఎలా ఉంది నాన్నా...." జానకీ రామయ్య కళ్ళలోకి చూస్తూ అడిగాడు శక్తి- లోలోపల గిల్టీగా ఫీలవుతూ.
"ఈసారికి గండం గడిచింది...." నెమ్మదిగా అన్నాడాయన.
"అదేమిటండీ... ఆ మాటలు..." తల్లి బాధపడుతూ అంది.
కాసేపయ్యాక శారద లేచింది.
"రా అన్నయ్య... కాళ్ళు కడుక్కో.... వడ్డిస్తాను?" అంది.
నెమ్మదిగా అక్కడి నుంచి కదిలాడు శక్తి తప్పు చేసిన వాడిలా తలవంచుకుని.
శక్తి అన్నం తింటున్న సమయంలో-
"నువ్వెళ్ళి పడుకో శారదా... ఉదయాన్నే కాలేజీకి వెళ్ళాలి కదా." అంటూ కొడుకు ఎదురుగా కూర్చుంది తల్లి.
"నువ్వు అర్థరాత్రీ... అపరాత్రీ వరకు తిరగటాలు తగ్గించాలిరా, ఏ క్షణంలో ఏమౌతుందోనని బెంగతో చస్తుంటే, నువ్వు బైట బలాదూర్లు తిరిగితే ఎలాగరా..." లక్ష్మీదేవి బాధగా ఉంది.
భోజనమైపోయి చెయ్యి తుడుచుకుంటూ లేవబోయిన శక్తి తల్లి మాటలు విని ఆమె వైపు సూటిగా చూడలేకపోయాడు.
"నాన్నగారు పనిచేసే కిరాణా షాపులో, నాన్నగారి పని నేను చేయాలా?" చిరాకును కప్పిపుచ్చుకుంటూ అడిగాడు శక్తి.
"నేనేం అర్థంకాని భాషలో చెప్పటంలేదు. ఎలాగూ వీధుల్లో పాత బస్టాండ్ పిట్టగోడల మీద కాపలా వాళ్ళలాగా కూర్చునేబదులు, ఆ కిరాణా షాపులో కూర్చుంటే... కుదురూ ఏర్పడుతుంది. పనీ అలవడుతుంది" అందావిడ నచ్చజెప్పే ధోరణిలో.
"ఆ ఓనర్ రెండు రోజులు నాన్నగారికి సెలవివ్వడా.... అదేం ఆర్మీనా? నేవీనా? సెలవు దొరక్కపోవటానికి" విసురుగా, కోపంగా అన్నాడు శక్తి.
"సెలవిస్తాడు కానీ... జీతం ఇవ్వడు. కిరాణా కొట్టంటే ఆర్మీ కాదు- నేవీ కాదు గదా- శెలవు పెట్టినా జీతం ఇవ్వటానికి, వెధవ రీజనింగులు, లాజిక్కులు మానేసి నా మాట విను. నా ఎలిమెంటరీ స్కూల్లో జీతం... నాన్నగారి ఆ జీతంతోనే బండి నడుస్తోంది. అన్ని విషయాలూ అర్థం చేసుకునే వయసు వచ్చింది. వితండవాదం చెయ్యకు." నెమ్మదిగా నచ్చజెప్పే ధోరణిలో అంది.
మరేం మాట్లాడలేక తన గదిలోకి వెళ్ళిపోయాడు శక్తి. గదిలో మంచాన్ని చూడగానే అన్ని ఆలోచనలనూ మర్చిపోయేడు- వరదలా నిద్ర ముంచుకు వచ్చింది.
నిద్రపోతున్న భర్త జానకీరామయ్య ముఖంవైపొక సారి చూసి, దుప్పటి సర్ది, రెండో గదిలోకి వచ్చింది లక్ష్మీదేవి. అప్పటికే శారద ముసుగుతన్నేసింది. కానీ నిద్రపోవటం లేదు. శారదకు కంటిమీద కునుకు రావటం లేదు.
కాలేజీలో ఎగ్జామ్స్ ఫీజ్ కట్టటానికి ఎల్లుండే ఆఖరిరోజు. తల్లితో ప్రతిరోజూ ఆ విషయం చెబుతూనే ఉంది. ఆ రోజు కాలేజీ నుంచి రాగానే తల్లిని గట్టిగా అడగాలని నిర్ణయించుకుంది- కానీ తండ్రికి ఒంట్లో బాగుండక పోవటంతో అడగలేకపోయింది.
రేపు ఎలా? ఏం చెయ్యాలి?
చాలాసేపు అలా ఆలోచనలతోనే గడిపింది పద్దెనిమిదేళ్ళ శారద.
* * * *
రోడ్డు విశాలంగా ఉంది- విశాలమయిన ఆ రోడ్డుమీద జనం. సిటీ బస్సుల్లోంచి ఎక్కుతూ, దిగుతూ జనం.
అప్పుడే వచ్చి ఆగిన సిటీబస్సులోంచి చెమటలు కక్కుకుంటూ దిగాడు శక్తి. చేతిలో చిన్న బ్రీఫ్ కేస్- బస్సునీ, జనాన్నీ, నలిగిపోయిన తన డ్రెస్ నీ చూసుకుని విసుక్కున్నాడు శక్తి.
"మేనర్ లెస్ బ్రూట్స్... ఇక ఎప్పుడూ బస్సెక్కకూడదు..." విసుక్కుంటూ ముందుకు నడిచాడు.
అరఫర్లాంగు నడిచేక ఎడం పక్కవేపు తలతిప్పి చూశాడు.
కెనరా బ్యాంక్ బోర్డ్ కనిపించింది.