2. మా స్తోత్రములు హృదయంగమములు. సుఖకరములు. తల్లి బిడ్డను దగ్గరకు తీసుకున్నట్లు అదితి మా స్తోత్రములను స్వీకరించవలెను.
అహోరాత్రులకు, మిత్రావరుణులకు మేము మనోహరములు. ఆనందదాయకములు, దేవగ్రాహ్యములగు స్తోత్రములను సమర్పింతుము.
3. ఋత్విక్కులారా ! మీరు అతిశయ క్రాంతదర్శి, పురావర్తి అగ్ని - సవితను ప్రముదితుని చేయండి. మధుర సోమరసము మఱియు ఘృతమున అతనిని అభిషిక్తుని చేయండి.
సవిత మాకు పరిశుద్ధము, హితకరము, ఆహ్లాదకరమగు హిరణ్యమును ప్రదానము చేయవలెను.
4. ఇంద్రా ! నీవు ప్రసన్న మనమున మాకు గోవులను దానము చేయుము. నీవు మాకు మేధావి పుత్రులను, దేవతలకు హితకరమగు అన్నమును, యజ్ఞ దేవతల అనుగ్రహమును ప్రసాదింతువు.
5. భగదేవుడు; ధనస్వామి సవిత; వృత్రహంత ఇంద్రుడు; ధన విజేత ఋభుక్షుడు, వాజ, పురంధి ఆది సమస్త అమరులు శీఘ్రముగా మా యజ్ఞమునకు విచ్చేయవలెను. మమ్ము రక్షించవలెను.
6. మేము యజమానులము. మరుద్వంతుడగు ఇంద్రుని కార్యములను వర్ణింతుము. ఇంద్రుడు యుద్ధమున ఎన్నడును వెన్నుచూపడు. అతడు విజయుడు. జరారహితుడు.
ఇంద్రా ! నీ పరాక్రమము ఏ పురాతన పురుషునకుగాని అటు తరువాత వచ్చినవారికి గాని లభించలేదు. ఏ నవీనుడు సహితము నీ పరాక్రమమును అందుకొనలేదు.
7. అంతరాత్మా ! నీవు అతిశయ శ్రేష్ఠుడు. రమణీయ ధనదాత బృహస్పతిని స్తుతించుము. అతడు హవిర్లక్షణ ధనవిభాజకుడు. బృహస్పతి స్తోత్రకర్తలగు యజమానులకు మహాసుఖములు ప్రసాదించును. ఆహ్వానించు యజమాని వద్దకు అతడు విశేష ధనము చేకొని విచ్చేయును.
8. బృహస్పతీ ! నీవు రక్షించు మానవుడు అహింసితుడు, ధనవంతుడు, సుందర పుత్రయుక్తుడు అగును. నీవు అనుగ్రహించిన ధనవంతుడు అశ్వములు, గోవులు, వస్త్రములు దానము చేయును. అతనికి ధనలాభము కలుగవలెను.
9. బృహస్పతీ ! స్తుతిప్రతిపాదకులమగు మాకు దానము ఇవ్వక తానే సర్వము అనుభవించువానిని, వ్రతములు ఆచరించనివానిని మంత్ర విద్వేషిని నష్టపరచుము. అతని ధనమును నష్టపరచుము. అట్టివాడు ఒకవేళ సంతతి సమృద్దుడయి, వర్ధమానుడు అగుచున్నను వానిని అంధకారమున త్రోయుము.
10. మరుత్తులారా ! దేవయజ్ఞమునకు రాక్షసులను పిలుచు యజమానిని అన్నము, అశ్వము, కృష్యాదుల ద్వారా ఉత్పన్నములగు భోగములకు బాధలు కలిగించువానిని నిన్ను స్తుతించువారిని నిందించువానిని మీరు చక్రహీన రథముగ అంధకారమున త్రోయుడు.
11. రుద్రుని ధనుర్బాణములు సుందరములు. శత్రునాశకములు. ఆత్మా ! అట్టి రుద్రుని స్తుతించుము. రుద్రుడు సమస్త ఓషధులకు ఈశ్వరుడు. ఆత్మా ! నీవు అట్టి రుద్రుని యజింపుము. రుద్రుడు ద్యుతిమంతుడు. బలవంతుడు. ప్రాణదాత. ఆత్మా ! లోక కళ్యాణమునకుగాను అట్టి రుద్రునకు పరిచర్యలు చేయుము.
12. దాంత మనస్కులు చమూసము, అశ్వము, రథము, గోవులు మున్నగువాని నిర్మాణమున కుశల హస్తులగు ఋభువులు; వర్షణకారి ఇంద్రుని పత్ని; గంగాది నదులు; విభుకృత సరస్వతి; దీప్తిమతి రాకా మున్నగునవి దీప్తములయి ఉన్నవి. అవి మాకు ధనమును ప్రసాదించవలెను.
13. ఇంద్రుడు మహామహుడు. శుభముల రక్షకుడు. అతనికి అత్యంత స్తుత్యములు. సద్యోజాతములగు స్తుతులను సమర్పింతుము. ఇంద్రుడు వృష్టికారకుడు. అతడు కన్యారూపమగు పృథ్వి హితమునకుగాను నదులకు రూప కల్పన చేసినాడు. మాకు జలములను అనుగ్రహించినాడు.
14. స్తోతలారా ! మీ శుభంకర స్తుతులు గర్జనశీలుడు, శబ్దకారి, ఉదకస్వామి పర్జన్యుని చేరవలెను. అతడు మేఘములను ధరించును. జలవృష్టి కలిగించును. ద్యావాపృథ్వులను వైద్యుతా లోకమునుండి పరికించి పయనము సాగించును.
15. మేము సముపార్జించిన స్తోత్రము రుద్రుని యువ పుత్రులు మరుత్తుల అభిముఖమున ఉపస్థితము కావలెను.
మనసా ! ధనేచ్చ మమ్ము నిరంతరము ఉత్తేజితులను చేయును. వివిధ వర్ణ అశ్వములు ఆరోహించి యజ్ఞమునకు వచ్చువారిని స్తుతింపుము. "కామో రాయేహవతే".
16. ధనముకొఱకుగాను మా ద్వారా విహితములయిన స్తుతులు పృథ్వి, స్వర్గము, వృక్షములు, ఓషధులకు చేరవలెను. మా కొఱకుగాను అందరు సుందర దేవతలు ఆహూతులు కావలెను. భూమాత మాకు చెడు తలంపులు కలుగనీయరాదు.
17. దేవతలారా ! మాకు నిరంతరము నిర్విఘ్నముగా మహా సుఖభోగములు కలుగవలెను.
18. అశ్వినుల రక్ష ఆనందదాయకము. సుఖసంపన్నము. అంతకుముందు మరెవరికి లభించని అశ్వినుల రక్ష మాకు లభించవలెను. అమరులగు అశ్వినులారా ! మీరు మాకు ఐశ్వర్యమును, వీరపుత్రులను, సౌభాగ్యమును ప్రసాదించుడు.
నలుబది మూడవ సూక్తము
ఋషి - అత్రి, దేవత - విశ్వేదేవతలు, ఛందస్సు - త్రిష్టుప్.
1. వేగవతులగు నదులు బాధలు కలిగించక మధుర రసముతో మావద్దకు విచ్చేయవలెను. విశేష ప్రీతి కలిగించు స్తోతలు మహాధనలాభమునకుగాను ఆనందదాయకములగు సప్తమహానదులను ఆహ్వానించవలెను.
(శాయణుడు ఏడు నదుల పేర్లు ఇవ్వలేదు. "ఇమే గంగా ఇతి మంత్రోక్తః" అన్నాడు. వీటిని గంగ అనియే మంత్రము చెప్పుచున్నది.
మాక్సుముల్లర్ పంజాబులో ప్రవహించు అయిదు నదులతోపాటు సింధు, సరస్వతి కలిపి సప్తనదులని చెప్పినాడు. సప్త సింధూ దేశము పేరు కూడ కావచ్చును.)
2. మేము శుభంకర స్తవము హవ్యము ద్వారా - అన్న లాభమునకుగాను - అహింసారూపములగు ద్యావాపృథ్వులను ప్రసన్నము చేయవలెనని కోరుచున్నాము. ప్రియవదన, శోభన హస్త, యశోయుక్త, మాతా పితృస్వరూప ద్యావాపృథ్వులు యుద్ధమున మమ్ము రక్షింపవలెను.
3. అధ్వర్యులారా ! మధుర ఆజ్యాది హవ్యమును సమర్పించండి. రమణీయము, దీప్తమగు సోమమును సర్వప్రథమముగా వాయువుకు సమర్పించండి. వాయువా ! నీవు హోతవలె ఈ సోమమును ఇతర దేవతలకన్న ముందు స్వీకరించుము. ఈ మధుర సోమరసమును నీ ఆనందమునకుగాను సమర్పించుచున్నాము.
4. ఋత్విక్కుల సోమ పేషకములగు పది చేతివ్రేళ్లు సోమరస నిప్యంద పటుత్వముగల రెండు బాహువులు శిలలను గ్రహించును. కుశలాంగుళియుక్తులగు ఋత్విక్కులు ఆనందితులయి సోమలత నుండి శైలజ రసమును పితుకుదురు. సోమము నుండి శుభ్ర రసము స్రవించును.
5. ఇంద్రా ! నిన్ను సేవించుటకు - వృత్రాదివధ కార్యములకు - నీ బలమునకు - నీకు మహా హర్షము కలిగించుటకు నీకు సోమరసము అర్పించబడును. అందుకే నిన్ను మేము ఆహ్వానింతుము. నీవు ప్రియములు, సుశిక్షితములు, వినమ్రములగు అశ్వద్వయమును రథయుక్తము చేసి మా వద్దకు విచ్చేయుము.
6. అగ్నీ ! నీకు మాకు ప్రియంకరుడవు. మధుర సోమర్స్ పానమున ప్రహృష్టమగుటకుగాను దేవతల మార్గమున గ్నాందేవిని మావద్దకు కొనిరమ్ము. బలశాలినియగు ఆదేవి సర్వత్ర సంచరించ వలెను. యజ్ఞమును తెలిసికొనవలెను. స్తోత్రముల సహితముగా ఆ దేవికి హవిసమర్పితము కావలెను. ("గ్నాః గ్నాం దేవీం సర్వైర్గంతవ్యా మేతే న్నామకాం దేవతాం" అని శాయణుడు. అందరు చేరుకోగల దేవత గాన ఆ పేరు వచ్చినదని.
"గచ్చన్తి జ్ఞానం యయా" అని దయానందుడు జ్ఞానము కలిగించు దేవత అని. గ్నామ్ స్త్రీకి సమానార్థము)
7. మేధావులైన అధ్వర్యులు తండ్రి వడిలో తనయునివలె అగ్నిమీద హవ్యపాత్రను స్థాపించినారు. అది చూడగా స్థూలకాయముగల పశువును వారందరు అగ్నిద్వారా పితుకుచున్నట్లున్నది.
8. మా ఈ స్తోత్రము పూజనీయము. మహంతము. సుఖదాయకము. అశ్వినులను ఈ స్థానమునకు ఆహ్వానించుటకు మా స్తోత్రము దూతవలె పనిచేయవలెను. సుఖదాయకులగు అశ్వినులారా ! మీరు ఒకే రథమున ఎక్కి మేము సమర్పించు సోమము వద్దకు - బరువు మోయు మేకువలె- విచ్చేయండి. మేకులేని నాభితో రథము నడువనట్లు మీరు లేకుండ సోమయాగ నిర్వహణ జరుగదు.
9. మేము బలవంతుడు, వేగవంతుడగు పూష మఱియు వాయుదేవులను స్తుతింతుము. ఆ ఉభయులు ధనము, అన్నమునకుగాను జనుల బుద్ధులను ప్రేరేపించవలెను. వారు ధనదానము చేయవలెను.
10. అగ్నీ ! నీవు సమస్త సృష్టిని ఎరిగినవాడవు. మేము నిన్ను ఆహ్వానించుచున్నాము. నీవు ఇంద్ర వరుణాది నామములు ధరించి విభిన్నాకృతులుగల నిఖిల మరుత్తులను యజ్ఞమునకు తీసికొని రమ్ము.
మరుత్తులారా ! మీరు సకల రక్షణలతో యజమాని యజ్ఞమునకు ఫలవతి స్తుతికి - పూజకు విచ్చేయండి.
11. సరస్వతి మాచే పూజలు అందుకొన తగినది. ఆమె ద్యుతిమంతమగు ద్యులోకము నుండియు మహా మేఘమునుండియు యజ్ఞస్థలమున అవతరించవలెను. ఆమె మా స్తుతులకు ప్రసన్నం కావలెను. స్వేచ్చగా సుఖకరములగు సంపూర్ణ స్తోత్రములను ఆలకించవలెను.
12. బృహస్పతి బలవంతుడు. పుష్టికారకుడు. స్నిగ్ధాంగుడు. అతనిని యజ్ఞగృహమున స్థాపించవలెను. అతడు గృహమధ్యమున నిలిచి అంతట వెలుగులు విరజిమ్మగలడు.
బృహస్పతి హిరణ్యవర్ణుడు. దీప్తిమంతుడు. మేము అతనిని పూజింతుము.
13. అగ్ని సమస్తమును భరించును. అతడు అత్యంత దీప్తిశాలి. అభీష్టవరదుడు. శిఖా, ఓషధి సమూహమున ఆచ్చాదితుడు. అప్రతిహతగమనుడు. లోహిత, శుక్ల, కృష్ణవర్ణ త్రివిధ శృంగ జ్వాలా విశిష్టుడు. వృష్టికారకుడు. అన్నదాత. మేము అతనిని ఆహ్వానించుచున్నాము. అగ్ని సంపూర్ణ రక్షణలతో విచ్చేయవలెను.
14. యజమానియొక్క హోత, హవ్యపాత్రధారి ఋత్విగ్గణము - మాతృస్వరూప పృథ్వి ఉజ్వల, ఉత్కృష్టమగు ఉత్తరవేదికి చేరుదురు. చిరంజీవి అగుటకు పసిబిడ్డను నిమిరినట్లు నవజాత కొమలాంగుడగు అగ్నిని స్తుతులు, హవ్యప్రదానముచేసి పోషింతురు.
15. అగ్నీ ! నీవు బృహత్ స్వరూపుడవు. వ్రతములందు చిక్కిన దేహములుగల దంపతులు నీకు ఒకేసారి విశేష అన్నమును అర్పింతురు. దేవగణములు మాచే ఆహూతులు కావలెను. తల్లి భూదేవి మా విషయమున విరుద్ధబుద్ధి కలిగి ఉండరాదు.
16. దేవతలారా ! మేము మర్యాదగల, బాధలు లేని సుఖములు అనుభవించవలెను.
17. అశ్వినులరక్ష ఆనందదాయకము. సుఖసంపన్నము. అంతకుముందు మరెవరికి లభించని అశ్వినులరక్ష మాకు లభించవలెను. అమరులగు అశ్వినులారా ! మీరు మాకు ఐశ్వర్యమును, వీరపుత్రులను, సౌభాగ్యమును ప్రసాదించుడు.
నలుబది నాలుగవ సూక్తము
ఋషి - కశ్యపగోత్రజుడు అవత్సారుడు దేవత - విశ్వేదేవతలు, ఛందస్సు - జగతి 14, 15 త్రిష్టుప్.
1. ప్రాచీన యజమానులు. మా పూర్వులు సమస్త ప్రాణిజాలము. ఆధునికులు ఇంద్రుని స్తుతించి పరిపూర్ణ మనోరథులు అయినారు. అంతరాత్మా ! అట్లే నీవు ఇంద్రుని స్తుతించి పరిపూర్ణ మనోరధుడవు అగుము.
ఇంద్రుడు దేవతలలో శ్రేష్ఠుడు. కుశాసీనుడు. సర్వజ్ఞుడు. సముఖవర్తి. బలశాలి. వేగవంతుడు. జయశీలుడు. అంతరాత్మా ! స్తుతుల ద్వారా ఇంద్రుని వర్థిల్ల చేయుము.
2. ఇంద్రా ! నీవు స్వర్గమునందలి కాంతిని విస్తరింప చేతువు. వర్షించని మేఘమద్యమున అందమగు జలరాశి ఉండును. మానవ హితమునకుగాను ఆ మేఘమును ప్రేరేపింతువు. అన్ని దిశలందు వర్షము కలిగింతువు. వృష్టి మున్నగు చక్కని పనుల ద్వారా నీవు మానవ జాతిని రక్షింతువు. నీవు ప్రాణులను వధించకుము. శత్రువుల మాయలను అతిక్రమింపుము.
ఇంద్ర ! నీ పేరు సత్యలోకమున ప్రఖ్యాతము.
3. ఇంద్రుడు అప్రతిహతగమనుడు. హోమ నిర్వాహకుడు. బలవిధాయకుడు. ఫలప్రదాత. శిశువు. తరుణుడు. జరారహితుడు. ఓషధుల మధ్య స్థితుడు. విశేషముగ కుశలమీద సంచరించువాడు. నిత్యము, ఫలసాధకము, విశ్వదారకము అగు హవ్యమును అగ్ని నిరంతరము వహించును.
4. యజ్ఞమును వర్థిల్లచేయు సూర్యకిరణములు పరస్పర సంయుక్తములయి - యజమాని కొఱకుగాను యజ్ఞ భూమిలో సంచరించు అభిలాషతో అవతీర్ణములు అగును. సూర్య కిరణములు వేగగాములు. అందరిని నియమించునవి. ఈ సమస్త కిరణములతో ఆదిత్యుడు జలరాశిని దిగువ్ ప్రాంతమునకు ప్రేరేపించును.