"తీసుకున్నాను సార్. రేపు రెండు గంటలకల్లా ఈ లోకేషన్ కి వస్తానంది."
"వెరీగుడ్." అంటూ మధువైపు ప్రశంసా పూర్వకంగా చూశాడు మనోహర్.
మధు రోమాకౌర్ తో ఫోన్ లో మాట్లాడటం, ఆమె టైంతీసుకోవడం ప్రదీప్ సక్సేనా విన్నట్లు, ఆ వెంటనే ఆమె చావుకి టైం, ప్లాన్ సిద్ధంచేసినట్లు అటు రోమాకిగాని, ఇటు మనోహర్ కిగాని తెలియదు. మధు వెళ్ళి పోయాడు. మనోహర్ కి, మంగళకి కుర్చీలు తెచ్చివేశారు యూనిట్ అసిస్టెంట్స్. గిరీష్. మోడల్స్ కి ఆ రోజు చేయవలసిలన సీన్స్ గురించి అప్పటికే వారికి చెప్పి రిహార్సల్ చేయించాడు. చిన్న సరస్సులో మూడుపడవలు ఒడ్డున లంగరేసున్నాయి. అందులో ఒక పడవ శోభాయమాసంగా అలంకరించి వుంది. రెండో పడవలో కెమెరా ఫిక్స్ చేసి వుంది. మూడో పడవలో పెద్ద పెద్ద స్టాండ్స్ కి రిప్లెక్టర్స్ అమర్చి వున్నాయి.
మూడు పడవలకు ముందు వాటిని నీటిలోకి లాగేందుకు మోటార్ బోట్స్ సిద్ధంగా వున్నాయి. నీటిలో బోట్స్ పై షూటింగ్ వుంటే ఆ బోట్స్ లో వుండే ఇంజన్ ఆం చేయరు. దానివలన షూటింగ్ బోట్స్ ప్రకంపనాలకు లోనవుతాయని అలా అయితే శేకింగ్ వస్తుందని, వేరే మోటార్ బోట్స్ కి షూటింగ్ బోట్స్ కట్ట స్లోగా లాగిస్తుంటారు. కెమెరాలోకి మోటార్ బోట్ రాకుండా చూసుకుంటారు. స్క్రిప్టు ఓసారి చూసుకొని ప్రక్కనే వున్న గిరీష్ ని అడిగాడు మనోహర్ "అరేంజ్ మెంట్స్ ఓ.కే.నా?"
"ఓ.కే సార్."
గిరీష్ దగ్గర నుండి వ్యూఫైండర్ తీసుకొని బోట్స్ వైపు నడిచాడు మనోహర్.
ఫిమేల్ మోడల్స్ రూపాచక్రవర్తి, గీతాబెహెల్, మేల్ మోడల్స్ అనిల్, జాకీ. యూనిట్ సభ్యులంతా పడవల దగ్గరకు వచ్చారు.
గిరీష్ పెద్దగా అరిచాడు. "రెడీ ఫర్ ఫైనల్ రిహార్సల్స్" అంటూ.
మనోహర్, గిరీష్ కెమెరా బోట్ లోకి ఎక్కేసారు. నలుగురు మోడల్స్, మధు షూటింగ్ బోట్ లోకి ఎక్కేశారు. లైట్ బోయన్ రిప్లెక్టర్స్ బోట్ లోకి ఎక్కేసారు. అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి.
మనోహర్ ఇచ్చిన సంజ్ఞ అర్ధం చేసుకున్న గిరీష్ "బోట్ పొజిషన్" అంటూ షూటింగ్ బోట్ ముందున్న మోటార్ బోట్ డ్రైవర్ ను ఉద్దేశించి అరిచాడు.
మోటార్ బోట్ కదిలింది. దానితోపాటు మోడల్స్ వున్న బోట్ కదిలింది. వంద అడుగుల నీటిలో ప్రయాణించి ఓచోట ఆగిపోయింది. మనోహర్ వ్యూఫైండర్ లోనుంచి ఆ బోట్ ని చూశాడు. పరతిసారి తీయబోయే షాట్ కి సంబంధించిన ఫ్రేమ్ కెమెరాలో నుంచి చూడడం ఇబ్బంది కానుక సింగిల్ లెన్స్ బైనా క్యూలర్ లా వుండే వ్యూఫైండర్ లో నుంచి చూస్తాడు కెమెరామెన్. అదే ఫీచర్ ఫిల్మ్ షూటింగ్ లో అయితే డైరెక్టర్ ఉపయోగిస్తాడు వ్యూఫైండర్ ను. ఫ్రేమ్ సంతృప్తికరంగా కనిపించడంతో కెమెరా ముందుకు వచ్చాడు మనోహర్.
"ఓ.కే.......రిహార్సల్ స్టార్ట్" అన్నాడు మనోహర్.
గిరీష్ చేయి ఎత్తి గాలిలో వూపాడు. దాన్ని అర్ధం చేసుకున్న మోడల్స్ షూట్ చేయబోయే సీక్వెన్స్ నటించి చూపించారు.
"మంటేజ్ చెప్పు గిరి" అన్నాడు మనోహర్ కెమెరాలోంచిచూస్తూ.
"సైలెన్స్ ప్లీజ్......మాంటేజ్ షాట్" పెద్దగా అన్నాడు గిరీష్.
మంగళ క్చురీలోనుంచి లేచి లేక్ ఒడ్డుకు వచ్చింది. మనోహర్ వేపే చూస్తోంది. అతను ఈ లోకంలో వున్నట్లులేడు. అలాంటి పరిస్థితుల్లో ఎంతటి అర్జంటు పనైనా మనోహర్ ని కదిలించడానికి యూనిట్ లో ప్రతి ఒక్కరూ భయపడతారు. అప్పుడు కూడా మనోహర్ తో మాట్లాడగలిగేది ఒక్క గిరీష్ మాత్రమె. అప్పటివరకూ ఒంటిమీద కప్పుకున్న షాల్స్ ని తీసేసారు మోడల్స్ మంగళ అనుకోకుండా లేక్ ఎడంవైపున వున్న గుబురు పొదలవైపు చూసి ఓ క్షణం ఉలిక్కిపడింది.
అక్కడో వ్యక్తి ఒక పొదను చాటుచేసుకొని జామ్ లెన్స్ కెమెరాతో మోడల్స్ నీ, మనోహర్ ని ఫోటోలు తీస్తున్నాట్లుగా అనిపించింది మంగళలో అనుమానం పోడచూపింది.
ఎవరా అగంతకుడు?
చాటుగా దొంగతనంగా ఫోటోలు ఎందుకు తీస్తున్నట్లు? మంగళలో సిక్త్ సెన్స్ అతను ప్రమాదకరమైన వ్యక్తి అన్నట్లు హెచ్చరించింది.
ఆ విషయమై మనోహర్ కు చెబుదామనుకుంది. కాని ఆ సమయంలో మనోహర్ పూర్తిగా వర్క్ లో మునిగి వున్నాడు.
మంగళ ఆ పోదవైపు చూస్తున్నప్పుడు మనోహర్ తనవైపు చూసినట్టు మంగళకు తెలిసే అవకాశం లేదు.
రూపా, అనిల్,బెహెల్ జాకీని పొదివి పట్టుకున్నారు.
వాళ్ళు రెండు జంటలుగా విడిపోయారు. నలుగురి చేతుల్లో "హాయ్.....హాయ్" కూల్ డ్రింక్ బాటిల్స్ వున్నాయి.
అప్పుడు రూపా, బెహెల్ ఒంటిమీద బికినీ మాత్రమే వుంది.
అనిల్, జాకీలను అండర్ వేర్స్ వున్నాయి. అంతకుముందే మేకప్ మెన్ వారి శరీరాలకు మర్దించిన ఆలీవ్ ఆయిల్ వలన సూర్యకిరణాలు వారి శరీరాలమీద పడి మెరుస్తున్నాట్లుగా వున్నారు.
వంటిమీద రెండు పీలికలుతప్ప మరే ఆచ్ఛాదనలేకుండా నగ్నంగా కనిపిస్తున్న వారివైపు చూడటానికి యిబ్బంది పడిపోయింది మంగళ. మోడల్స్ కదులుతున్నారు. వయస్సువలన వచ్చిన పరువం.
ఆ పరువం వారి అంగసౌష్టవంపై చూపించే బిగువు, లావణ్యం, ఆకర్షణ అమోఘం. జీవకళ వారిలో అణువణువునా తొణికిసలాడుతోంది..
బలంగా, నిండుగా, పుష్టిగా మోయలేనట్లున్న రూపా, బెహెల్ వక్షోజాలు వారు ధరించిన సాటిన్ బ్లూ కలర్ బ్రాల్లోంచి బయటపడేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నట్లుగా వున్నాయి.
సన్నని నడుము, లోతైననాభి, క్రింద అండర్ వేర్స్ త్రికోణంలో వున్నాయి. అరటిబోదెల్లాంటి వారికాళ్ళు నునుపుతో నిగారించిపోతున్నాయ్.
మాంటేజ్ షాట్ అయిపోయింది. షూటింగ్ బోట్ లో అప్పటి వరకూ అడుగున పడుకున్న మధు లేచాడు.
తన చేతిలోవున్న లైట్ ఇండికేటర్ ని మోడల్ మొఖాలముందుంచి లైట్ ఇన్ టెన్సిటీని చెక్ చేశాడు.
"మధు.....లైటింగ్ ఓ.కే?" మనోహర్ పెద్దగా అడిగాడు.
"ఓ.కే సార్....." అంటూ పడవలోకి వంగొని క్లాప్ బోర్డు తీసి మోడల్స్ మొఖాలకు అడ్డంగాపెట్టి రెడీగా వున్నాడు గిరీష్ ఇచ్చే సూచన కోసం.
మనోహర్ కెమేరా ఏంగిల్ మరోసారి సరిచూసుకొని గిరీష్ కి సంజ్ఞ చేశాడు. గిరీష్ చుట్టూ చూసాడు.
రెండు చేతులు పైకెత్తి "సైలెన్స్ ప్లీజ్. మధూ క్లాప్" అన్నాడు.
మోటార్ బోట్స్ రొద చేసుకుంటూ స్టార్టయ్యాయి.
అంతకుముందే ఏ బోట్ ఎప్పుడు ఎటువైపు ఎంతవేగంగా కదలాల్సింది బోట్ డ్రైవర్స్ కి సూచనలు ఇవ్వబడ్డాయి.
అంతా నిశ్శబ్దం. డిగ్.....డిగ్ అంటూ మోటారు బోట్స్ శబ్దం మాత్రం వినిపిస్తోంది. లేక్ చుట్టూ చేరిన జనం కన్నార్పకుండా మరిచిపోయి రూపా, బెహెల్ అందాల్ని చూస్తున్నారు.
"సీన్ నెంబర్ వన్."
"షాట్ వన్!"
"టేక్ వన్."
అంటూ పెద్దగా అరుస్తూ క్లాప్ కొట్టాడు మధు, ఆ క్లాప్ బోర్డ్ పై మనోహర్ కెమేరా ఓపెన్ చేశాడు. కెమేరా కొద్దిగా రన్ కాగానే బోట్ లో బోర్లా పడుకుండిపోయాడు మధు తను కెమేరా ఫ్రేంలోకి రాకుండా మనోహర్ చేతిలో కెమేరా తిరుగుతోంది.
మోడల్స్ లైట్ గా డిస్కోడాన్స్ అభినయిస్తూ కూల్ డ్రింక్ బాటిల్స్ ఎత్తి నోటిదగ్గర పెట్టుకున్నారు సుతారంగా.
ఒక సిప్ బాటిల్స్ మార్చుకున్నారు.
"కట్....." అన్నాడు గిరీష్.
మనోహర్ కెమేరా అప్ చేశాడు.
"షాట్ ఓ.కే నెక్ట్స్" అన్నాడు మనోహర్.
మధ్యాహ్నం రెండుగంటలకల్లా ఆ యాడ్ ఫిల్మ్ కి సంబంధించిన లాంగ్ షాట్స్, మిడ్ షాట్స్ తీసుకున్నారు. ఇక మిగిలింది క్లోజ్ షాట్స్ మాత్రమే. యూనిట్ మొత్తానికి లోకేషన్ లోనే లంచ్ ఏర్పాట్లు చేశారు.
అందరూ ఆకలితో వుండటంతో ఆవురావురుమంటూ తిసేస్తున్నారు.
మనోహర్ గిరీష్ తో ఏదో మాట్లాడుతున్నాడు.
మంగళకు ఏం చేయటానికి తోచటంలేదు.
తన ఆకలి సంగతి మర్చిపోయి మనోహర్ ఆకలి గురించే ఆలోచిస్తోంది మంగళ.
అంతలో రూపచక్రవర్తి మంగళ సగ్గరకు వచ్చింది.
"మేడమ్! మీరు లంచ్ తీసుకోరా?"
మంగళ రూపావైపు చూసింది. వయస్సు ఇరవైకంటె ఎక్కువ వుండదు. పసినిమ్మ రంగులో ఉంది ఆమె కోమలమైన శరీరం.
ఐబ్రోస్ నెలవంకలా, వాలుగా కత్తిరించుకుంది. కనురెప్పలపైన యాష్ కలర్ మేకప్ షేడ్ , కనులక్రింద రోజ కలర్ మేకప్ షేడ్. పెదవులకు పింక్ కలర్ లిప్ ప్టిక్ మోమంతా లైట్ గా మేకప్.
తమ అందాల్ని, అవయవ పోందికను, శరీర లావణ్యాన్ని కాపాడు కొనేందుకు రోజుకు ఎన్నిగంటలు కేటాయిస్తారో? ఎంత డబ్బు ఖర్చు పెడతారో? ఎంత శ్రద్ధ తీసుంటారో? నవ్వుతూ చూస్తూన్న రూపాచక్రవర్తి మంగళలో ఎన్నో ఆలోచనల్ని రేపింది. మొట్టమొదటిసారిగా మనోహర్ వృత్తిపట్ల కొద్దిపాటి అయిష్టత ఏర్పడింది మంగళలో.
* * *
మనోహర్ కారు ఇంటివేపు వెళుతోంది.
కారులో డ్రైవింగ్ సీటులో మనోహర్. ప్రక్కనే మంగళ, వెనుక గిరీష్, మధు కూర్చున్నారు.
"గిరీష్! రేపు ఉదయం ఎనిమిది గంటలకే షూటింగ్ కి ఆరేంజ్ చేయండి. క్లోజ్ షాట్స్ లో రియాక్షన్స్ తీద్దాం. బైదిబై రేపు అందరికీ పుల్ పేమెంట్స్ ఇచ్చేందుకు క్యాష్ ఆరేంజ్ చేయమని మన క్యాషియర్ కి చెప్పండి. ఈరోజు తీసిన ఫిల్మ్ రోల్స్ లేబ్ కి పంపించి త్వరగా డెవలప్ చేయించి రష్ ఫిల్మ్ వచ్చేలా చూడండి." డ్రయివింగ్ చేస్తూనే చెప్పాడు మనోహర్.
అప్పుడు మనోహర్ మనసులో ఓ రహస్యాన్ని చేదించాలన్న ఆలోచన ఉన్నట్లు, ఆ రాత్రికే రూపచక్రవర్తిని కలిసి తన ప్రాజెక్టుకు ఫైనల్ క్లియరెన్స్ తీసుకోబోతున్నట్లు ఆ కారులోవున్న మిగతా ముగ్గురికీ తెలియదు. ఆ రాత్రి రాబోయే ఎనిమిదవ గంటకోసం ముగ్గురూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఒకరు మనోహర్, మరొకరు గిరీష్, ఇంకొకరు రూపాచక్రవర్తి. ఈ ముగ్గురూ కాకుండా ఆ ఎనిమిదోగంట కోసమే ఎదురుచూసే మరో ఆగంతకుడు కైలాష్.
* * *
"మధ్యలో గిరీష్. మధు కారు దిగగానే అడిగింది మంగళ "మానూ....న్యూస్ పేపర్సులో అందమైన అమ్మాయి కావాలని ప్రకటన యిచ్చావే! ఎందుకని?"
"అందమైన అమ్మాయికాదు. ఉత్త అందమైన అమ్మాయి కోసం ప్రకటన అవసరంలేదు. ప్రకటనకు పాతికవేలు ఖర్చుపెట్టక్కర్లేదు. నాకు కావాల్సింది కుబుసం విడిచిన ఎలనాగులాంటి అందమైన అమ్మాయి" అన్నాడు మంగళవైపు చిరునవ్వుతో చూస్తూ.
"అదే ఎందుకని?"
"చెబుతాను" అన్నాడు ముక్తసరిగా. ప్రకటనకు సంబంధించిన రహస్యాన్ని మంగళ దగ్గర దాచాడు. ప్రకటన గురించి చెప్పాల్సివస్తే పందెం గురించి చెప్పాలి. పందెం గురించి చెబితే మంగళ భయపడవచ్చు.
తనీ పందెంలో గెలుస్తాడా? ప్రదీప్ సక్సేనా ఎలాంటి ఎత్తులు వేస్తున్నాడు? అతన్ని తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి అడుగు తూచి తూచి వేయాలి.
ప్రదీప్ అంటే ఇండియన్ యాడ్ వరల్డులో ప్రతి ఒక్కరికి భయం.
తనింతవరకు అందమైన అమ్మాయిల్ని వెతికి పట్టుకోవటం, వారితో మంచి యాడ్ ఫిల్మ్స్ తీయడం ఆలోచించాడు. కాని యికనుంచి మిగతా విషయాలుకూడా అప్రమత్తంగా గమనిస్తూ ఉండాలి.