Previous Page Next Page 
మోడల్ పేజి 7


     కాలానుగుణమైన మార్పుల్తో యాడ్ ఫిల్మ్స్ లో కూడా మార్పులొస్తున్నాయి మగవాళ్ళు త్రాగే సిగరెట్లు యాడ్ ఫిల్మ్స్ లొ కూడా  పరువంలో వున్న ఫిమేల్ మోడల్స్ ని ఉపయోగిస్తున్నారు.

    యాడ్ ఫిలం ఫోటో గ్రాఫర్ ప్రోడక్ట్ తగ్గట్టుగా మోడల్సుని సెలక్టు చేసుకుంటాడు. ఆ తరువాత ప్రొడక్షన్ కి తగ్గట్టుగా లోకేషన్ సెలక్షన్ షూటింగ్ సందర్భంలొ కావల్సిన వస్తువుల్ని (సెట్ ప్రాపర్టీన్) సిద్దం చేసుకొని మోడల్సుకి అందంగా అమరేటట్లుగా పెక్సప్పీల్ ఉండేలా దుస్తులు కుట్టమని కాస్ట్యూమర్ని ఆదేశిస్తాడు.

    కాస్ట్యూమర్ ఆయా మోడల్స్ దగ్గరకువెళ్ళి వారికొలతలు తీసుకొని వారి అంగసౌష్టవానికి, శరీరచ్ఛాయకు తగ్గట్టుగా వివిధ రంగుల్లో బట్టలు తీసుకొని వాటిని కుట్టించి షూటింగ్ కి ముందే అందజేస్తాడు. అప్పుడు వివిధ లోకేషన్స్ కి చెందిన అధికారుల దగ్గర షూటింగ్ కి పర్మిషన్ తీసుకొని షూటింగ్ మొదలుపెడతాడు.

    యాడ్ ఫిల్మ్ షూటింగ్ సినిమా షూటింగ్ లాగే ఉంటుంది.

    మోడల్స్ కివ్వాల్సిన రెమ్యూనరేషన్, కెమెరాలకి అద్దె(సొంత కెమెరా లేకుంటే) కాస్ట్యూమ్స్, రావాణా, లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చులు, షూటింగ్ పూర్తయ్యాక రీరికార్దింగ్, ఎడిటింగ్ స్పెషల్ సౌండ్ ఎఫెక్టు జంగిల్స్  సౌండ్ ఎఫెక్టు, మిక్సింగ్ లాంటి పనులకు  అయ్యే  లేబ్స్  ఖర్చులకు తోడు తన  మార్జిన్ కలుపుకొని బిల్ చేస్తాడు యాడ్ ఫోటోగ్రాఫర్.

    ఎన్ని థియేటర్ల లొ రిలీజ్ చేయాలనేది వస్తూత్పత్తి కంపెనీ నిర్ణయించగానే ఫోటోగ్రాఫర్ ఇచ్చిన నెగిటివ్ నుంచి కావల్సినన్ని పాజిటివ్ ఫిల్మ్ కాపీలు తీసుకుంటారు ఏజన్సీ వాళ్లు.

    ఇంకా తరువాత అవి సినిమా థియేటర్స్ కి పంపిస్తారు. సినిమా ప్రారంభానికి ముందు అవి వేస్తారు థియేటర్స్ వాళ్లు.

    ఆ పిల్మ్ బావుంటే వినియోగదారులు వేలం వెర్రిగా వస్తువును కొనటం ప్రారంభిస్తారు. అంటే ఆ యాడ్ ఫిల్మ్ వినియోగదారుల్నిమభ్యపరచాలి తమ వస్తువు మంచిదని, గొప్పదని దీనికి సాటి మరొకటిలేదని నమ్మించేందుకు ప్రయత్నిస్తుంది.

    ఈ ఆధునిక ప్రపంచంలో ఏ వస్తువు అమ్ముడుపోవాలన్నా ముందు పబ్లిసిటీ కావాలి. ఈనాడు ఎంత గొప్పవస్తువయినా, మంచి వస్తువయినా పబ్లిసిటీ లేనిదే యే మాత్రం ప్రయోజనం వుండదు. ఫలానా కంపెనీ ఫలానా వస్తువును తయారు చేస్తుందన్నా.....ఆ వస్తువులవల్ల లభాలివి అని చెప్పాలన్నా, అది మంచిదని చెప్పాలన్నా తక్కువధర, ఎక్కువ మన్నిక, నాణ్యత అని చెప్పాలన్నా, కావాల్సింది పబ్లిసిటీ.......తప్పనిసరైంది పబ్లిసిటీ......అనివార్యమైంది పబ్లిసిటీ.....పబ్లిసిటీ పారిశ్రామిక వస్తువుళ అమ్మకాలకి ఆక్సిజన్ లాంటిది. ఇది సాధారణంగా జరిగే విధానం. ఒక్కో సారి వస్తూత్పత్తి కంపెనీతో యాడ్ ఫిల్మ్స్ తీస్తుంటారు. ఇలాంటివాళ్ళు అరుదు. దీనివల్ల ఇద్దరికి మధ్య ఉన్న  యాడ్ ఏజన్సీ తీసుకొనే మిడిల్ మేన్ కమిషన్ మిగిలిపోతుంది. మనోహర్ అలాంటి కాంటాక్టే కోరమాండల్ ఇండస్ట్రీస్ తో పెట్టుకున్నాడు. అదే అతన్ని ప్రమాదాలకు దగ్గర చేసింది.

   
                                   *    *    *


    మనోహర్ వుండే సొంత ప్లాట్ చాలా పెద్దది. మూడు బెడ్ రూమ్స్, రెండు పెద్ద హాల్స్ ఉన్నాయి. ఒక హాలుని డ్రాయింగ్ రూమ్ గా, మరో హాలుని ప్రొజెక్టింగ్ కమ్ ఎడిటింగ్ రూమ్ గా మార్చుకున్నాడు.

    మూడు బెడ్ రూమ్స్ లో  ఒకటి తనకు, మరొకటి చెల్లెలికి అట్టి పెట్టుకొని, మూడవది గెస్ట్ లకు కేటాయించాడు. మంగళ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా గెస్ట్  రూమ్ లో ఉంటుంది.

    మనోహర్ ఒక్కడే ఉన్నప్పుడు ఏదో ఒక హొటల్ లో భోంచేస్తాడు. పని వత్తిడి ఎక్కువగా వుంటే అదీ వుండదు.

    చెల్లెలుకాని, మంగళకాని వస్తే  కమ్మగా  వండి, దగ్గరుండి పెడతారు. ఇంటి చుట్టూ పచ్చటిలాన్ , మధ్యమధ్యలో రకరకాల గులాబి మొక్కలతో పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది. ఏదైనా కొత్త ఆఫర్ వస్తే ఆ రాత్రి గంటల తరబడి లాన్ లో కూర్చుని ఆలోచిస్తూ గడుపుతాడు. నిజానికి ఏ ఫోటోగ్రాఫర్ అంతగా కష్టపడడు. రొటీన్ గా వర్క్ చేసుకుపోతాడు. కాని  మనోహర్ విపరీతంగా కష్టపడతాడు. నూతనసత్వం కోసం తెగ మధనపడిపోతారు. కష్టపడరుండా తేరగా వచ్చే సక్సెస్ ని కోరుకోడు.

    "THERE ARE NO SHORT CUTS TO SUCCESS" అనే పోలసీని బాగా నమ్ముతాడు.


                                   *    *    *

    ఉదయం తొమ్మిది కావస్తోంది.

    మనోహర్ స్నానం చేసి డ్రెస్ చేసుకొని వచ్చేసరికి డైనింగ్ టేబుల్ పై బ్రేక్ పాస్ట్ సిద్ధం చేసింది మంగళ.

    క్రితం రోజు స్టేషన్ నుంచి రాగానే పడకెక్కేసింది. అలాగే ప్రొద్దుటి వరకూ  నిద్రపోయింది. మెళుకువ రాగానే రాత్రి తనతోపాటు మనోహర్  కూడా  భోంచేయలేదని, స్క్రిప్ట్ చూసుకుంటూ అలాగే  నిద్రపోయాడని తెలుసుకొని బాధపడింది. అప్పటికప్పుడు తలారా స్నానంచేసి టిఫిన్ తయారుచేసింది.

    షూటింగ్ వుందని హడావుడి పడిపోతున్నాడు మనోహర్.

    డైనింగ్ హాల్లోంచి మంగళ వచ్చేసరికి మనోహర్ తన రూమ్ లో బ్రీఫ్ కేసు సర్దుకుంటూ కనిపించాడు.

    "మనూ" పిలిచింది మంగళ తలుపు దగ్గరే ఆగిపోయి.

    "బాగా నిద్రపట్టిందా? నిన్నంతా రెస్ట్ లేదనిచెప్పి లేవలేదు" అన్నాడు మంగళవైపు చూస్తూ.

    తలంటు పోసుకున్నందు వలన, ఫ్యాన్ గాలికి కురులు ఆమె  వీపంతా పరుచుకొని పట్టుకుచ్చులా మెరిసిపోతున్నాయి, కడిగిన ముత్యంగా వుంది మంగళ.

    ఓ నిముషం కళ్ళార్పకుండా మంగళవైపే చూసాడు.

    పెద్ద పెద్ద కళ్ళు, గుండ్రని ముక్కు, ఆ ముక్కుకి ముక్కెర, పల్చటి పెదవులు, నవ్వితే చొట్టలుపడే నునుపైన చెక్కిళ్ళు, కోలమొహం ఏదో తెలియని ఆకర్షణ, అందం ఆమెలో కనిపిస్తుంటుంది.

    శరీరపు రంగు నలుపైనా ఎత్తు ఐదడుగుల ఐదంగుళాలుండటంతో ఒక రకమైన హుందాతనం కనిపిస్తుంటుంది మంగళలో.

    అప్పుడప్పుడు 'నల్లపిల్ల' అంటూ ఏడిపిస్తూంటాడు మనోహర్.

    ఆ వెక్కిరింతకు మంగళ ఉడుక్కోదు. మధురంగా నవ్వుకుంటుంది.

    మనోహర్ రంగుకి ప్రాధాన్యం ఇచ్చేవాడు కాదని తమ ప్రేమ అంకురించే తొలిరోజుల్లోనే గ్రహించగలిగింది.

    పచ్చగా, ఎత్తుగా, ఎంతో అందంగా వుండే మనోహర్ ప్రక్కన తనను ఊహించుకొని మనోహర్ కి తను తగినదాన్ని కాదేమోనని ఎప్పుడూ ఊహించనైనా ఊహించని విశిష్టమైన వ్యక్తిత్వం మంగళది.

    బాహ్యమైన సౌందర్యం కన్నా ఆత్మసౌందర్యాన్ని గౌరవించే మంగళ.....ఆ ఆత్మసౌందర్యాన్ని గౌరవించే వారినే గౌరవిస్తుంది.

    మనోహర్ దీర్ఘంగా తనవేపే చూట్టం గమనించి సిగ్గుపడిపోయింది. ఈ పరిస్థితి రానంతవరకు మనోహర్ చూసినా సిగ్గుపడకూరదనే అనుకుంటుంది. కాని మరలా మామూలే........మనోహర్ చూపుల్లో తొంగి చూసే చిలిపితనం తనొక్కతే గ్రహించ గలుగుతుంది.

    "ఏంటలా కొత్తగా చూస్తున్నావు?" తలెత్తి మనోహర్ వేపు ఓరగాచూస్తూ అడిగింది.

    "ఏం లేదు. నలుపులో ఇంత అందం ఉందా అని"

    "అదే పొగడ్త మరొకరు అనుంటే మంగళ రియాక్షన్ వేరుగా వుండేది. కాని మనోహర్ కావటంతో ఆమె మనసంతా ఓ  విధమైన అలౌకిక ఆనందానికి లోనయింది. స్త్రీ పరమైన అందాన్ని నిజాయితీగా పొగిడే మగవాళ్ళు అరుదని మంగళ నమ్మకం.

    యాడ్ ప్రపంచంలో స్టన్నింగ్ బ్యూటీస్ ఉంటారు. అయినా  తనంటేనే మనసుపడిన మనోహర్ అంటే ప్రాణం మంగళకు. ఆ యాడ్ అందాలవేపు మనోహర్ మొగ్గు చూపుతాడా....... అనే స్త్రీ పరమైన జెలసీ అప్పుప్పుడు మంగళకు కలుగుతుంటుంది. అంతలోనే సిగ్గుపడుతుంది. అలాంటి ఆలోచన తనకొచ్చినందుకు. కాని ఎప్పటికైనా మనోహర్ని ఈ గ్లిట్టరింగ్ వరల్డు నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవాలనే కోర్కె అంతర్గతంగా మహావృక్షంళా పెరుగుతోంది ఆమెలో.   

     "టిఫిన్ చేయి త్వరగా. రాత్రికూడా భోజనంలేదు. మొద్దు నిద్రపోయాను. ఛీ.....ఛీ....బుద్ధిలేదు నాకసలు నేనుండి కూడా పస్తుబెట్టాను. సారీ మానూ" అంది బాధగా డైనింగ్ టేబుల్ వేపు నడుస్తూ.

    మనోహర్ బ్రేక్ ఫాస్ట్ హడావుడిగా తీసుకోవటం ప్రారంభించాడు.

    "ఈ రోజు షూటింగ్ ఉందా మనూ?"

    "అవును. బంజారా హొటల్ ముందున్న లేక్ లో. నువ్వూరాకూడదు సరదాగా....." తింటూనే అడిగాడు మంగళను.

    మంగళ మనస్సులో చాలాకాలంగా మనోహర్ షూటింగ్ చేస్తుండగా చూడాలని వుంది. ఇంతకాలం వీలుపడలేదు. ఈ రోజు తప్పనిసరిగా చూడాలి అనుకుంది మనస్సులో.

    మనోహర్ చేతులు కడుక్కుని తుడుచుకునేందుకు నేప్ కిన్ కోసం చూసాడు. అది కనిపించకపోవడంతో ప్రక్కనే వ్రేలాడుతున్న మంగళ చీర కొంగుకు తుడుచుకున్నాడు.

    "ఏమిటీపని? ఇది చీరా......నేప్ కినా?" అంది చిరుకోపం ప్రదర్శిస్తూ బ్రీఫ్ కేసు  చేతిలోకి తీసుకున్నాడు.

    అప్పుడప్పుడు  మనోహర్ చేసే పనులు చిన్నపిల్లల చేష్టల్లావున్నా అవి తీయటి అనుభూతుల్ని నింపుతాయి మంగళ హృదిలో.

    ఇంటికి తాళం వేసి ఇద్దరూ కారెక్కారు.

    కారు బంగళా హొటల్ ముందు ఆగింది. కారుని చూసి అసోసియేట్ గిరీష్ అసిస్టెంట్ మధు హడావుడిగా వచ్చేసారు.

    అప్పటివరకు కబుర్ల తో మునిగున్న యూనిట్ లోని స్టాప్ అంతా అలర్ట్ అయిపోయారు, మనోహర్ వచ్చేసాడని తెలియగానే.

    కారుదిగి హొటల్ ముందున్న లేక్ వైపు చూశాడు మనోహర్.

    షూటింగు ఏర్పాట్ల హడావుడి చూసి జనం షూటింగ్ చూద్దామని అప్పటికే లేక్ ముందు గుమికూడారు. మనోహర్ చేతిలో బ్రీప్ కేసు మధు తీసుకొన్నాడు. మంగళ కారుదిగి రాగానే లోకేషన్ వైపు నడిచాడు మనోహర్.

    అప్పటివరకు గొడుగుల క్రింద కుర్చీలో కూర్చున్న  ఫిమేల్ మోడల్స్ రూపాచక్రవర్తి, గీతాబెహెల్ లేచి ఒంటినిండా షాల్స్ కప్పుకుని మనోహర్ కి ఎదురువెళ్ళి విష్ చేశారు.

    వాళ్ళప్పుడు బికినీ డ్రెస్ లో వున్నారు.

    సోప్స్, పౌడర్స్ , సాప్ట్ డ్రింక్స్ మీద యాడ్ ఫిలిమ్స్ తీసేటప్పుడు మోడల్స్ అర్ధనగ్నంగానో, ముప్పాతిక నగ్నంగానో వుంటారు. షూటింగ్ ముందో, షాట్ కీ షాట్ కీ మధ్యలో విరామం అప్పుడో, లోకేషన్ లో  ఒళ్ళు దాచలేని  షూటింగ్  కాస్టూమ్స్ తో వుండటం  మనోహర్ కి యిష్టం వుండదు. మాంటేజ్ షాట్  బిగిన్ అయ్యేవరకూ ఒంటినిండా షాల్స్ కప్పు కోవాలని మనోహర్ నిబంధన యూనిట్ సభ్యులు కూడా ఎవరి పనుల మీద వారు పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలి. అనవసరమైన బాతాఖానీ కొట్టడాన్ని మనోహర్ సహించడు. ఇన్ని కఠినమైన నియమ నిబంధనలు  మనోహర్ యూనిట్ లో  వున్నప్పటికీ అందులో పనిచేసే  ఎవరికీ కష్టం అనిపించదు. కారణం వేరే ఫోటోగ్రాఫర్స్ కంటె ఎక్కువ జీతాలిస్తాడు. అదీ నెలాఖరునే ఇస్తాడు. తన యూనిట్ లోని సభ్యులకి ఎవరికి కష్టం వచ్చినా ఆదుకుంటాడు. పై పెచ్చు మంచి ఫోటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న మనోహర్ దగ్గర పని చేయడానికి ప్రివిలేజ్ గా భావిస్తారు.

    మధు బ్రీఫ్ కేసు తెరిచి స్క్రిప్ట్ మనోహర్ కిచ్చేసి లేక్ వైపు వెళ్ళబోతూ  ఓ క్షణం ఆగిపోయాడు. మధు ఏదో చెప్పడానికి సందేహిస్తున్నట్లుగా గ్రహించాడు మనోహర్.

    "ఏదైనా చెప్పాలనుకుంటున్నావా?"

    "అవును సార్! మొన్నీ మధు హొటల్ ఒపేరా స్విమ్మింగ్ ఫుల్ లో తీసిన క్లియర్  టోన్ సోప్ యాడ్ ఫిల్మ్ లో రోమాకౌర్ షాట్స్  కొన్ని బాగా రాలేదు. ఈ రోజు ఉదయమే  ఆ ఫిల్మ్ రష్ చూశాను."

    మనోహర్ ఆశ్చర్యపోయాడు. తను తీసే   ఫిల్మ్స్ లో కొన్ని షాట్స్ బాగా రాకపోవడమనేది చాలా అరుదు.

      సరె....సరె రోమాతో మాట్లాడి ఆమె టైమ్ తీసుకోండి. రేపు తీసేద్దాం. మరలా ఆ హొటల్ దగ్గర  వీలుపడదు. ఇక్కడే ఇదే లోకేషన్ లో తీసేద్దాం."

 Previous Page Next Page