శృతి లేచి నుంచుంది. "రాత్రంతా నిద్రలేదు. కాసేపు పడుకో. తర్వాత లేపుతాను. స్నానం చేసి భోం చేద్దువుగాని" అంది.
"వెంకట్ రమ్మన్నాడు వెళ్ళాలి. నిద్రపోతున్నానని పదకొండు గంటలదాకా లేపకుండా వుండేవ్? పది కాంగానే లేపు శృతీ!" అని దిండు సరిచేసుకుని పడుకున్నాడు సిద్దార్థ.
"అలాగే పడుకో అన్నయ్యా!" అని ఇవతలి కొచ్చేసింది శృతి.
సిద్దార్థ ఆవులించి కళ్ళు మూసుకున్నాడు.
5
మురారి దేముడు గురించి అన్నయ్యతో చెబుదామని వుంది శృతికి. చెప్పటం మంచి జరుగుతుందా? కీడు జరుగుతుందా అన్నది తేల్చుకోలేక ఆగిపోయింది. సిద్ధార్థ నీతిగా, నిజాయితీగా ఉంటాడు. ఏ చిన్న అన్యాయంకూడా సహించడు. ఆవేశం జాస్తి, ఒక దొంగ బెదిరించి ఇంట్లో ఉన్నాడంటే ఊరుకోడు. ఎదురుతిరిగి పోట్లాడి వెంటనే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తాడు. "నాతో మాటమాత్రం చెప్పకుండా ఒక ఖూనీకోరుని దాచేటంత ధైర్యశాలివయావా?" అని శృతిమీద ఎగిరిపడవచ్చు. ఓవేళ మురారి దేముడు ఇంట్లో దాక్కున్న విషయం బైటపడితే శృతి జీవితం ఏమవుతుందో శృతి భవిష్యత్తుకి అదెంత పెద్ద దెబ్బో ఆ పరమాత్ముడికే తెలియాలి.
ఒంటరిగా ఆడపిల్ల వున్న ఇంట్లో మగవాడు దొంగ, ఖూనీకోరు అయినవాడు రాత్రిళ్ళు వున్నాడంటే వాడివల్ల ఎంత అపకారం జరుగుతుందో ఎవరికి తెలుసు? జరగవచ్చు జరక్కపోవచ్చు. జరిగిందనే లోకం అంటుంది. పక్కలో చేరిన పాము కాటేయ్యదంటే ఎవరూ నమ్మరు. ఈ విషయంలో శృతి భయపడుతున్నది. రాత్రిళ్ళు సిద్దార్థ నైట్ డ్యూటీకి వెళుతున్నాడు. ఈనైటు డ్యూటీలు ఇప్పుడేపడాలా?
మధ్యాహ్నం పన్నెండు గంటలయింది.
సిద్ధార్థ ఉదయమంతా నిద్రతీసి పదకొండు గంటలకు భోంచేసి స్నేహితుడి పనిమీద బైటి కెళ్ళాడు నాలుగు తర్వాత వస్తానని చెప్పాడు.
నిన్నటిరోజు సిద్దార్థ బైటికి వెళ్ళగానే హాయిగా ఉదయం భోజనం కానిచ్చాడు మురారిదేముడు. ఒంటిగంటకి సిద్దార్థ తిరిగి రావటం, రాత్రి ఎనిమిది గంటలదాకా ఇల్లు కదలక పోవడంతో మురారిదేముడికి కాఫీనీళ్ళు, ఆఖరికి మంచి నీళ్ళకుకూడా గతిలేకపోయింది. ఆటకే గతిఅయింది. సిద్దార్థ నైటు డ్యూటీకి వెళ్ళగానే ఆటక దిగి వచ్చాడు. వాడి పోయింది ముఖం. ఏ రోగమూ లేని మనిషి అలా పడుకుని ఉండాలంటే కష్టమే. జబ్బుతో బాధపడుతున్నట్టే అయిపోతారు. శృతినడిగి సర్ఫ్ తీసుకుని తన బట్టలు వుతికి ఆరేశాడు. శృతితో ఎక్కువ మాట్లాడలేదు. సిద్దార్థ పడుకునే మంచం మీద పడుకున్నాడు. ఉదయం లేచి తనబట్టలు తీసుకుని అటకెక్కాడు.
రాత్రంతా మురారిదేముడు కదలకుండా పడి ఎద్రపోతాడు. శృతికి నిద్రపట్టలేదు. పక్కలో బల్లెం పెట్టుకుని ప్రశాంతంగా వుండలే ననుకుంది. తెగించి ఏదో ఒకటి చేయాలనుకుంది. అదృష్టం కలిసోచ్చిందా అన్నట్లు మురారిదేముడి రివాల్వర్ శృతికి చిక్కింది. రాత్రి తను బట్టలు వుతుక్కుంటుండగా శృతి రివాల్వర్ కజేసిందని మురారి దేముడు గ్రహించలేదు.
సిద్దార్థ బైటికెళ్ళగానే మురారి దేముడు ఆటక దిగి వచ్చాడు.
మురారిదేముడ్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తూన్నది శృతి.
"మీ అన్నయ్యకి ఎలా థాంక్స్ చెప్పాలో తెలియటం లేదు శృతీ! రాత్రిళ్ళు డ్యూటీ కెడుతున్నాడు, పగలు స్నేహితుడి పనిమీద వెడుతున్నాడు." నవ్వుతూ అన్నాడు మురారి దేముడు.
రెండురోజుల్లో ఏ నిమిషాన్నయినా మా అమ్మ రావచ్చు. మాఅన్నయ్యకి నైటు డ్యూటీలు అయిపోతాయి. నువ్వెప్పుడు వెడతావ్?" అతను చెప్పింది వినిపించుకోనట్లుగా విసుగ్గా ముఖం పెట్టి అడిగింది శృతి.
"ఏపని చెయ్యాలన్నా మంచి మహూర్తం చూడాలన్నది పెద్దలమాట. మంచి మహూర్తం చూసుకు మరీ వెళతాను."
"వచ్చేటప్పుడు ముహూర్తం చూసుకునే వచ్చావా? ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగెత్తుకొచ్చావే?"
"నే మంచి ముహూర్తం చూసి పరుగెత్తుకు రాబట్టే ఓ అందమైన అమ్మాయి వినయంగా తలుపులు తెరిచి పై అంతస్థులో పడకేర్పాటుచేసి నవకాయ పిండివంటలతో ఆతిథ్యం ఇచ్చి ఆదరించి గౌరవించి...."
"షటప్!" శృతి కళ్ళు నిప్పులు కక్కినట్లు ఎర్రబడ్డాయి. అప్పుడే నిజస్వరూపం చూపిస్తున్నా డనుకుంది.
అలవాటుగా భుజాలెగరేశాడు. అబ్బో అన్నట్లు మూతి బిగించాడు. "నువ్వు తిట్టినా బాగుంటుంది శృతి?" అన్నాడు తేలిగ్గా నవ్వేస్తు మురారిదేవుడు.
చీరలకింద దాచిన రివాల్వర్ ని చీరలు ఓ చేత్తో నెట్టేసి ధన్ మని మరోచేత్తో అందుకుంది. సూటిగా అతని వేపు గురిపెట్టింది. "నే చంపినా బాగుంటుంది!" అంది కఠినంగా.
"అదేమిటి?" తెల్ల బోయాడు మురారిదేముడు.
"రివాల్వర్, ప్రాణ రక్షణకి. ప్రాణం తియ్యటానికి వాడే ఆయుధం, ప్రస్తుతం నీ ప్రాణం తియ్యటానికి ఉపయోగపడుతున్నది. "రెడీగా వుండు దేముడూ?"
"శృతీ!"
"ఎందుకు అరుస్తావ్?"
"నేను నీ కపకారం చెయ్యలేదు. అయినా ణ రివాల్వర్ దొంగిలించి నన్నే బెదిరిస్తున్నావ్? ఇది మంచిది కాదు.
"హ్హూ దొంగిలలించటం! ఆ అవసరం నీవే కల్పించావ్? నీ వునికి బైటపడితే నాకొచ్చే కీడు గ్రహించావా? నీ క్షేమం నువ్వు చూసుకున్నట్టే నా క్షేమం నే చూసుకుంటున్నాను, తక్షణం వెళ్ళిపోతే నీకూ నాకూ మంచిది."
"తక్షణం వెళ్ళటానికి వీలులేదు."
"రాత్రికి వెళ్ళు."
"ఉహూ కాలు చాలా నెప్పి చేసింది నాలుగుడగులు వేస్తె నా పని అయిపోతుంది. సఫోజ్, పరుగెత్తాల్సి వస్తుందనుకో, ఈ గురుడి పని గోవింద. కాలు నొప్పి తగ్గాలి. నే వెళ్ళాలి."
"అన్నీ దొంగవేషాలు. నీకోసం మూల మూలల గాలిస్తున్న విషయం అన్నిచోట్ల పోలీసుల కాపలా విషయం మా అన్నయ్య నాతో చెపుతుంటే విని వుంటావ్. బైటికి వెడితే పట్టుబడతానని అనుమానం. ఇంక నువ్వెళ్ళవు. నేనింక భరించలేను. కాబట్టి తాడో పేడో తేల్చుకోదలిచాను వేళతావా? వెళ్ళవా!"
"వెళ్ళనుగాక వెళ్ళను."
"అయితే ఇక నా చేతిలో ఏం లేదు."
"రివాల్వర్ తప్పు." ఎగతాళిగా నవ్వాడు మురారిదేముడు.
మండిపోయింది శృతికి. ఇంక ఆలస్యం చేయదల్చుకో లేదు. "ఒకటి....." అంది.
మురారిదేముడి పిడికిళ్ళు బలంగా బిగుసుకున్నాయి.
"రెండు...."
"మూ....."డు పూర్తి చేయలేదు శృతి. రెండు అన్నప్పుడే మురారిదేముడు గాలిలో లేచి రెండు పిల్లి మొగ్గలేసి శృతి మీదకి దూకటం శృతి మీదకి దూకటం శృతి వెనక్కి పడబోవటం, శృతి కింద పడకుండా మురారిదేముడు శృతి నడుం పట్టుకోటం రివాల్వర్ ఖంగున శబ్దం చేస్తూ కిందపడటం కన్నుమూసి తెరిచేలోపల జరిగిపోయింది.
ఏ పెద్దవుల్లో అమాంతం మీదికి దూకినట్లయింది శృతికి. కాళ్ళల్లోంచి వణుకు బైలుదేరింది.
"శృతీ! నా మాట విని నన్ను కాపాడవని ఎంతో అనుకున్నాను. నేనేం అపకారం చేయకపోయినా నా ప్రాణం తీయటానికి తలపడ్డావ్! నా మంచితనాన్నే చూశావ్. ఓ సారి చెడ్డతనాన్ని కూడా చూడు మళ్ళీ ఇలాంటి పనులు చెయ్యవు." అంటూ ఎడంచేతిలో శృతిని తన హృదయానికి గట్టిగా హత్తుకుని ముఖమంతా ముద్దులతో నింపేశాడు.
శృతి పెనుగులాడి విడిపించుకోటానికి ప్రయత్నం చేసి వ్యర్థ ప్రయత్నం కాగా పెద్దగా అరవబోయింది.
మురారిదేముడి పెదవులు శృతి పెదవుల్ని మూసేశాయి.
శృతి శరీరంమీంచి వెలువడే లక్స్ సుప్రీమ్ సుగంధ పరిమళం ఆస్వాదించే స్థితిలో లేడు మురారిదేముడు. పులితొలిసారిగా మనిషి నెత్తురు రుచి మరిగినట్లు శృతి పెదవుల రుచి చూస్తూ కొద్ది క్షణాలుండిపోయాడు.