Previous Page Next Page 
ఆనందం పరమానందం పేజి 8

గాల్లో తెలిపోతూ ఎంతో ఆనందంగా ఆ గదిలోంచి బయటి పడ్డాడు బ్రాంచి మేనేజరు.

                                           9
ఊరికి దూరంగా వున్న ప్రాంతం.
అక్కడ చెట్లు, పుట్టలు చాలా ఎక్కువగా వున్నాయి. ఆ చెట్ల కింద ఆవులూ, మేకలూ తిరుగుతున్నాయి. ఒక చెట్టు మీద సింహాచలం పాకుతున్నాడు. బాగా దూరం నుంచి చూస్తే - అతను పాకుతున్న పద్ధతి - కొమ్మల మీద ఒక కోతి గెంతుతున్నట్లు కనిపిస్తోంది.
సింహాచలం చెట్టెక్కి కొమ్మల్ని నరికి కింద పారేస్తున్నాడు. కింద ఆనందం వున్నాడు. సింహాచలం నరికి పారేస్తున్న కొమ్మల్ని ఆనందం ఎంతో జాగ్రత్తగా సేకరించి - వాటిని ఒక గుట్టగా పేరుస్తున్నాడు.
చెట్టు మీద సింహాచలం అలిసి పోయాడు - కొమ్మ మీద  చేర గిలబడి రెస్టు తీసుకుంటున్నాడు. ఆ దృశ్యం చూచి ఆనందంమండిపడ్డాడు-
"ఏమిటా ఫోజు?"
"చిత్తం! నడుం నొప్పిగా ఉంటేనూ - రెస్టు తీసుకుంటున్నానండి!
"రెస్టు తీసుకోవడానికి నువ్వేం రారాజుని కాదు. ఆఫ్ట్రాల్ నా దగ్గిర గుమాస్తావి!" అన్నాడు.
ఆనందం ప్రయోగించిన డైలాగులో దోషమేదో దొర్లినట్లు పసి గట్టిన సింహాచలం మౌనంగా వుండలేక అడిగేడు-
"అయ్యా, ఆఫ్టరాల్ మీ దగ్గిర - నేను గుమస్తానా? లేక ఆప్టరాల్ గుమాస్తానా?"
"చంపుతా! కోపంలో తాళం తప్పవచ్చు. వ్యాకరణం దెబ్బ తినవచ్చు. అంత మాత్రాన - నీకై నువ్వే ఏదేదో ఊహించేసుకుని మురిసిపోవద్దు పని చూడు ముందు!"
"చిత్తం! నాదో చిన్న మనవి!"
"బీడి తాగుతావా?"
 "నా బతుక్కి బీడీలు కూడానా?"
"మరేమిటి?"
"తమరు పందేలు కాసుకోండి! తప్పులేదు. కానీ ఎవరి మీద కాస్తున్నారో కాస్త ముందూ వెనక ఆలోచించి కాయండి. అందరం క్షేమంగా ఉంటాం!"
"నస వద్దు. పాయింటు చెప్పు!"
"చిత్తం! పాలవాడు, గేసువాడు, బియ్యం పప్పు, ఉప్పులవాడు - వీళ్లంతా మనం పీల్చే ప్రాణవాయువుతో సమానం. వాళ్ల మీద పందేలు కాస్తే - వాళ్లకి కోపాలు రావచ్చు. ఆ దరిమిలా వంట చెరకు నిమిత్తం నేను ఈ విధంగా చెట్లెక్కి కొమ్మలు నరకడం, తమరు చెట్టు కింద ఆపసోపాలు పడి పోవడం తప్పదు. అందుచేత దయచేసి ప్రాణ వాయువుల మీద పందాలు కట్టకండి!" అన్నాడు సింహాచలం.
సింహాచలం చెప్పిన సలహా కొంచెం న్యాయసమ్మతంగా కనిపించింది కాబోలు - ఆనందం క్షణం ఆలోచన చేసి అన్నాడు.
"చూద్దాం!"
"చూద్దామని కొట్టి పారేయకండి! చూస్తున్నారు గదా! తమరు గేసు  వాడ్ని జయించి పంపించడం వల్ల గేసు సరఫరా నిలిచిపోయింది.
చెట్టుకొమ్మలు నరుక్కుంటున్నాం. పాలవాడితో పెట్టుకుంటే పాల సరఫరా ఆగిపోతుంది. దొంగతనంగా మేక పాలు పితుక్కోవాలి. కరెంటు వాడితో పందేలు కడితే కరెంటుండదు. ఆముదపు దీపాలు వెలిగించుకోవాలి. డాక్టర్లతో పెట్టుకుంటే మందు నీళ్లు దొరకవు. రంగు నీళ్లు తాగాలి."
సింహాచలం ఈతి బాధల లిస్టు ఎంత పెద్దది చదివేవాడో గాని - ఆనందం మధ్యలో అడ్డం పడ్డాడు.
"ఆపవయ్యా! ఆపాటి బుద్దీ జ్ఞానం నాకు లేవనుకుంటున్నావా?"
"చిత్తం!"
"కాకపోతే పందేలు కాయడం హాబీగా ప్రారంభమై బలహీనంగా మారిపోయింది. దానికి నేనేం చేసేది?"
"చిత్తం! తమరు చిత్తగిస్తానంటే చిన్న చిట్కా చెప్తానండయ!"
"చెప్పు! నువ్వేం పరాయివాడివా? చెప్పు!"
"ఇక ముందు తమరు పందెం కాస్తే - పేడ తిన్నంత ఒట్టు అని గట్టిగా ఒక మాటనుకోండి! ఇహ అంతే! పందెం మాట మనసులో తట్టగానే పేడ గుర్తుకొచ్చి మనసు విరిగి పోతుంది!"
"నీ ఆలోచన బాగానే వుంది!"
"చిత్తం!"
"కానీ - ఆప్టరాల్ పేడ భయంతో మారిపోతానా?"
సింహాచలం రెచ్చిపోయి అన్నాడు-
"మారతారు. తప్పకుండా మారిపోతారు. మీ మనసు గొప్పది! మీ సంస్కారం గొప్పది! మీకు పెడంటే పరమ రోత. అంచేత....."
"సరే! ఒక పని చేద్దాం!"
"తప్పకుండా చేద్దాం చెప్పండి?"
"పేడ భయంతో మారిపోతానని నువ్వు గట్టిగా అంటున్నావు."
"చిత్తం!"
"వారం రోజులు గడువు పెట్టుకుందాం."
"అబ్బో! అన్ని రోజులెందుకండీ?"
"ఎన్ని రోజులు పెట్టుకుందామో నువ్వే చెప్పు!"
"మూడంటే మూడు రోజులు చాలు! తమ బుద్ది తప్పకుండా మారిపోతుంది!"
"మారదు పందెమెత?"
ఇంత చెప్పినా - యజమాని పందెం కట్టేందుకు సిద్దపడటం వల్ల  సింహాచలానికి కళ్లు తిరిగాయి. అంచేత అతను గొడ్డలితో పాటు కొమ్మమీంచి కింద పడ్డాడు.

                                           *        *        *
పరమానందం ఎంచక్కా పట్టు వస్త్రం కట్టుకుని భోజనానికి కూర్చున్నాడు.
భద్రాచలం కొంచెం దూరంగా కూచుని పద్దులు చూస్తున్నాడు.
పరమానందం భద్రాచలాన్ని అడిగేడు.
"ఏవయ్యా! నీ  భోజనం మాటేమిటి?"
"చిత్తం! కడుపులో కాస్త మందంగా వుందండి. అంచేత పద్దులు రాసుకోడంలో పడ్డాను!"
పరమానందం అతని మాటని పట్టించుకోలేదు. " జానకీ వడ్డించు!" అని భార్యకి ఆర్డరు వేసేడు.
జానకి వచ్చింది. వడ్డించవలసిన పదార్ధాలన్నీ  వడ్డించి అక్కడ్నించి తలుపు చాటుకీ వెళ్లిపోయింది.
పరమానందం ఒక వంటకాన్ని రుచి చూసేడు. మొహం అష్టవంకరలు తిరిగింది.
"అబ్బ! ఇంత  చేదుగా తగలడిందే? ఏం  పప్పు?"  అడిగేడు పరమానందం.
"పప్పులో వేపాకు వేశానని చెప్పవయ్యా!"
"చిత్తం! అయ్యా - వేపాకు పప్పటండి. వెర్రికి శ్రేష్ఠమైన వంటకం!" అన్నాడు భద్రాచలం.
"అలాగా! మరి - ఈ కూర - ఏం కూర?" అడిగేడు పరమానందం.
"గన్నేరు కాయ వేపుడని చెప్పవయ్యా?" అన్నది జానకి.
"విన్నారుగా! అదీ విషయం! గన్నేరు గట్టెక్కిస్తుందని శాస్త్రం! లాగించండి" అన్నాడు భద్రాచలం.
పరమానందం మొహం చిట్లించాడు. కడుపులో దేవుతన్నట్టనిపించింది. ఎందుకైనా మంచిదని రుచి చూడకుండానే అడిగేడు.
"ఈ పచ్చడి ఏమిటో కూడా అడుగు!"
జానకి తలుపు చాటు నుంచే సమాధానం చెప్పింది.
"పచ్చగడ్డి పచ్చడి!"
పరమానందం వర్రీ అవుతూ అడిగేడు.
"పచ్చగడ్డితో పచ్చళ్లు కూడా చేస్తారా?"
"ఎందుకు చేయరు? కూరలు దొరక్కపోతే - గడ్డే గతి!"
"కూరలెందుకు దొరకవు?"
"ఎందుకు దొరుకుతాయి? కూరలు వాళ్లతో అడ్డమైన పందేలు  కాసిపంపిస్తుంటే మన గుమ్మం ఎందుకు తొక్కుతారు? బాబూ ... అయ్యా ... అని ప్రాధేయపడినా మన మొహం చూడరు. ఇంక మన బతుకులింతే! రెండు పూటలా చేతికందింది చితగ్గోటి పప్పులో పడేస్తా!" అని   జానకి  అక్కడ్నించి వెళ్లిపోయింది.
భద్రాచలం పద్దుల రాయడం మాని యజమానితో అంటున్నాడు-
"అయ్యా! అదీ విషయం! పాపం - అమ్మగారు మాత్రమేం చేస్తుంది? వస్తువు దొరికితేనే గదా వంట! తమరేమో కూరల వాళ్లతో పందేలు కాసి వాళ్లని కుదేలు చేస్తుంటే - మనకి దొరికేవి ఇవే! వేపాకు, గన్నేరు కాయ, పచ్చగడ్డి!"
"ఇప్పుడేమంటావ్"
"వడ్డించినవి కళ్లు మూసుకు భోం చేయండి!"
"అంతేనంటావా?"
"వేరే మార్గం లేదు మరి!"   

 Previous Page Next Page