సరే! ఇప్పుడు నేను ఈ దిక్కుమాలిన కూరల్తో ముద్ద కలిపి మింగుతానా?లేదా? పందెమెంత?"
ఆ మాటకి భద్రాచలం కళ్లు తిరిగేయి. పద్దులు పుస్తకమ్మీద తలవల్చేడు!
10
శ్రీవేణుగోపాలస్వామి వారి ఆలయం!
గర్భగుడిలో రామానుజాచార్యులు ఎంతో ఉత్సాహంగా మంత్రాలు చదువుతూ స్వామి వారిని అలంకరిస్తున్నాడు. మధ్య మధ్య పద్యాలనీ ఎంతో భావయుక్తంగా, రాగయుక్తంగా విసురుతున్నాడు.
"భక్తులు బారులు తీర్చి నిలబడ్డారు.
రామానుజాచార్యులు తాలూకు ఉత్సాహ తరంగాలకు అసలైన కారణం ఏమై వుంటుంది?
ఏమై వుంటుందో ఒక్కో భక్తుడు ఒక్కోరకంగా ఊహిస్తున్నాడు-
"ఆచార్లుకి స్వామి వారు కనిపించి వుంటారు."
"ఇలలో కాకపోతే కనీసం కలలోనైనా కనిపించి వుంటారు."
"కనిపించిన స్వామి వారితో ఆచార్లు ఆదుకుని వుంటారు."
"గోలీ లాటలో ఆచార్లు స్వామి వారిని చిత్తుచేసి వుంటారు. ఇవేమీ కాకపోతే ఆచార్లు స్వామి వారికి వెన్న ముద్దలు పెట్టి వుంటారు!"
భక్తుల ఆలోచనలు పరిపరి విధాలుగా సాగి పోతుండగా ఆచార్లు స్వామి వారికి హారతి ఇస్తూ గంట వాయించారు భక్తులు హారతి కళ్ల కద్దుకుంటున్నారు. భక్తుల్లో ఒకరు ఆచారి గారిని అడిగేడు.
"ఆచారి గారు ఇవాళ ఉత్సాహంగా ఉన్నారు! కారణ మేమిటో?"
"అమ్మాయికి పెళ్లి చూపులు బాబూ! పెళ్లి వారు ఇహనో ఇప్పుడో రావచ్చు!"
"శుభం! మంచి వార్త చెప్పారు!"
"అంతా వేణుగోపాల స్వామి వారి దయ! చాలా మంచి సంబంధం. పిల్ల నచ్చితే కట్నం కూడా వద్దన్నారు!"
"మీ పిల్లకేం తక్కువ? బంగారు బొమ్మ కదా!"
"ఆ మాట కొస్తే అబ్బాయి కూడా అందంగానే వుంటాడు. ఫోటో చూశాను!"
"రైల్లో వస్తున్నారా?"
"అవును బాబు! స్టేషన్ కి మనిషిని పంపుతానని జాబు రాస్తే ఆ కష్టం మీ కెందుకని జవాబు రాశారు. చాలామంచి మనుషులు బాబు! సుతిమెత్తని మనుషులు ఈ పాటికి రైలు దిగే వుంటారు.
* * *
నిజంగానే ఆ వేళకి పెళ్లి రైలు దిగేరు!
పెళ్లి కొడుకు అందంగా వున్నాడు. చాలా ఠీవిగా వున్నాడు. ఎంతో దర్జాగా వున్నాడు. గొప్ప స్టయిల్ గా నడుస్తున్నాడు. అతని వెనకఅతని తల్లిదండ్రులు నడుస్తున్నారు.
ముగ్గురూ స్టేషన్ బయటకు వచ్చారు. సేష్టన్ ముందు ఆటోవాళ్లు మామూలుగానే 'బాబూ ఆటో' అంటున్నారు. ఎక్కడికి వెళ్లాలని అడుగుతున్నారు.
పెళ్లి కొడుకు తండ్రి-
"నందివాడ వారి వీథీ" అన్నాడు.
ఆ వీథి పేరు వినగానే ఆటోవాళ్లు పారిపోయి మాయమైపోయేరు!
ఆ వింత సంఘటనకి పెళ్లి కొడుకు తండ్రి ఆశ్చర్యపోతూ వుంటే పెళ్లి కొడుకు -
"వాటీజ్ దిస్ వండ్రపుల్ ఫిట్?" అని ఇంగ్లీషులో గొణుక్కున్నాడు. సరిగ్గా అప్పుడే ఒక వ్యక్తి వాళ్ల ముందు ప్రత్యక్ష మయ్యాడు.
"ఆ ఫీటు గురించి చెప్పాలంటే తమరు నా చేతిలో ఒక పైవ్ కొట్టాలండి!" అన్నాడు ఆ వ్యక్తి.
"హూ ఆర్ యూ! నువ్వెవరివి?" అడిగేడు పెళ్లికొడుకు.
"బెగ్గర్ని ముష్టి వాడ్ని పేరు పైడితల్లి!"
"బెగ్గర్ లాగా కనిపించడం లేదే?" ఆశ్చర్యపోతూ అన్నాడు పెళ్లి కొడుకు.
"ముష్టి సంఘానికి ప్రెసిడెంటుని కదా! అదన్నమాట" అన్నాడు పైడితల్లి.
"పైడితల్లి ముష్టి సంఘానికి ప్రెసిడెంటు అని తెలీగానే - పెళ్లి కొడుకు తండ్రి ఎంతో మర్యాదగా పలకరించేడు.
"చూడండి మాస్టారూ! నందివాడ వారి వీథి అనగానే -"
"ఆటోలు గానీ, రిక్షాలు గానీ రావు అంతేగా?" అడిగేడు పైడితల్లి.
"ఇంతకీ ఆ వీథిలో ఎవరికింటికి వెళ్లాలి?"
రామానుజా చార్యులని-"
"గుళ్లో పూజారి!"
"అవును. వీడు మా అబ్బాయి!"
"అందంగా వున్నాడు."
"వీడికి రామానుజాచార్యులి కూతుర్ని-"
"ఇంక చెప్పద్దు. పాయింటు అర్థమై పోయింది. ఇక మిమ్మల్ని ఆ దేవుడే రక్షించాలి" అన్నాడు పైడితల్లి.
"అంటే? పిల్లగుణం-"
"బహు దొడ్డ గుణమండి! గుణ వంతురాలు బంగారమనుకోండి?"
"ఆచారి గుణమే మంచిది కాదేమో?"
"అమ్మో! అంత మాటెందుకంటానండి! అమ్మాయి మేలిమిబంగారమైతే - ఆ తల్లి దండ్రులు రత్నాలు. అసలు ఆ కుటుంబ మంతా మణి మాణిక్యాలు!" అన్నాడు పైడితల్లి.
పెళ్లి కొడుకు తల్లి విసుక్కుంటూ అడిగింది.
"అందరు మంచి వాళ్లు అయినప్పుడు ఆ కూత ఎందుకుకూశావ్?"
"ఏం కూసేనమ్మా?"
"ఆ పిల్లను చేసుకుంటే - మిమ్మల్ని దేవుడే రక్షించాలని కూయలేదా?"
"ఇప్పుడు కూడా అదే కూత కూస్తానమ్మ!"
"వాట్ నాన్ సెన్స్ యూ ఆర్ స్పీకింగ్?" అడిగేడు పెళ్లికొడుకు.
"మరేంలేదు బాబూ! పూజారి గారుంటున్న ఆ నందివాడవారి వీథిలో ఆనందం పరమానందమని ఇద్దరు పెద్దమనుషులున్నారు." ముష్టి ప్రెసిడెంటు పాత్రల పరిచయం ప్రారంభించాడు.
* * *
వేణుగోపాల స్వామి ఆలయంలో రామానుజాచారి గొప్ప బిజీగా వున్నాడు. పూజాదికాలు ముగించి భక్తులందర్నీ కూచోబెట్టి - తనక్కాబోయే అల్లుడి యొక్క గుణ గణాలు వివరిస్తున్నాడు.
భక్తులంతా వేణుగోపాలుడ్ని గాలి కొదిలేసి - ఆచారి క్కాబోయే అల్లుడి వివరాలు శ్రద్దగా వింటున్నారు.
"అయితే అన్నయ్యగారూ - పెళ్లికొడుకు పేరు ఏమిటి?"
"చిరంజీవి!" అన్నాడు పూజారి.
"సినిమా పేరు."
"పేరు సినిమా పేరైనా - బుద్దిమంతుడు!" అన్నాడు పూజారి.
"ఇది కూడా సినిమా పేరే!"
"మరేం చేస్తాం? వాడకంలో వున్న మంచి పేర్లన్నీ సినీమాలకు పెట్టేస్తున్నాప్పుడు- ఏ పేరు చెప్పినా - సినీమాగానే వుంటుంది. ఏవైనా- పేరు గురించి పట్టించుకోకుండా - అబ్బాయిని చూడటానికి మీరంతా దయచేయాలి. ఇది నా కోరిక!" అన్నాడు పూజారి.
"తప్పకుండా వస్తాం" అంటున్నారు భక్తులు.
* * *
రైల్వేస్టేషను బయట-
నందివాడ వారి వీథిలో వున్న ఆనందం పరమానందాల గురించి పైడితల్లి ఇంకా చెబుతూనే వున్నాడు.
"ఆ వీథికి వున్న అమ్మాయితో మీ అబ్బాయికి పెళ్లయితే - ఆనందం పరమానందంల చూపు మీ అబ్బాయి మీద తప్పకుండా పడుతుంది. పందెం కట్టేందుకు అబ్బాయిగార్ని రెచ్చగోదాతారు. వినకపోతే పౌరుషం తెప్పించి ముగ్గులోకి దించుతారు. అబ్బాయిగారిని హెచ్చరించేందుకు మీరు వస్తారు. మిమ్మల్ని కూడా ముగ్గులోకి దించి ముచ్చట పడతారు. ఆ తర్వాత మీ బతుకులు తిరగబడతాయి. అబ్బాయిగారు గోచీ కట్టుకుని గేదెల్ని కడుగుతారు. మీరు పేడ తీస్తారు. గడ్డి వేస్తారు. మీ ఆవిడగారు- మా తల్లి -చుట్టనోట్లో పెట్టుకుని పిడకలు కొడుతుంది" అంటూ ఏదో చెప్పబోతుండగా పెళ్లికొడుకు తండ్రి గావుకేక పెట్టేడు-
"అఖ్ఖర్లేదు. మాకు ఈ సంబంధం ససేమిరా వద్దు. తిరుగు రైల్లో మా ఊరు వెళ్లిపోతున్నాం. ఇంకా చూస్తూ నిలబడ్డారే! కదలండి!" అని పెళ్లి కొడుకు తండ్రి అరుస్తున్నాడు.
* * *
రామానుజాచార్యులింటో పేరంటాళ్లు చేరి పోయేరు.
పెళ్లికూతుర్ని పెళ్లి చూపులకు చేస్తున్నారు. రామానుజాచారికాలు కాలిన పిల్లిలాగా ఇంటో తిరుగుతున్నాడు. ఉండీ ఉడిగి వీథిలోకి వెళ్లి పెళ్లి వారి కోసం ఎదురు తెన్నులు చూస్తున్నాడు.