Previous Page Next Page 
ఆనందం పరమానందం పేజి 7

"ఇంకా మీరెందుకండీ యిక్కడ? ఇయ్యాల మీపని కాదంతె! మూటలోస్తున్నాయండీ మూటలు! ఆటిలో చెక్కులుంటాయండీ! ఈ  రోజంతా ఆటి పనితోనే సరిపోద్డండి! ఎల్లిపోండి బాబో ఎల్లిపోండి!"
ఆ వేళకి సింహాచలం భద్రాచలం మూటల్తో బేంకులోకి అడుగుపెట్టేసేరు. బేంకు సిబ్బంది పారి పోవటానికి వీల్లేదు గనక - కూచున్న చోటే గిలగిలా తున్నుకుంటున్నారు.
ఈ వింత వాతావణం చూచి, మీసాల భద్రయ్య హెచ్చరికల్తో మిగిలిన కొద్దిమంది కస్టమర్లు కూడా బేంకు నుంచి జారుకున్నారు.
అప్పుడు బుర్ర మీసాల భద్రయ్య "నేడు సెలవు" అనే బోర్డు తీసుకుని  బయటకు వెళ్లేడు.
సింహాచలం భద్రాచలంలు మూటల్ని దించి మాపని చూడండి అనే  హెచ్చరికను కళ్ల ద్వారా వదిలేరు.
ఒక్కోమూట దగ్గిర ముగ్గురేసి సిబ్బంది చొప్పున నిలబడి మూటలు విప్పుతున్నారు.
"మేనేజరుగారు లేరా?" అడిగేడు సింహాచలం.
"ఉన్నాను బాబు! ఇంకా బతికే వున్నా!" అనే మాటలు వినిపించాము.
"ఎక్కడున్నారు?" నాలుగు దిక్కులూ చూస్తూ కుతూహలంగా అడిగేడు భద్రాచలం.
"దాక్కున్నాను బాబూ! మూటలు వస్తున్నాయని తెలిసింది గదా! దాక్కున్నా!" బల్లకింద నుండి వస్తూ అన్నాడు మేనేజరు.
మేనేజర్ని చూచి నిట్టూర్చేరు సింహాచలం భద్రాచలం.
"ఏం బాబు? పందేలు బాగా సాగినట్టున్నాయి!" అన్నాడు మేనేజరు.
"ఎట్లా కనిపెట్టేరు?" అడిగేడు సింహాచలం.
"మూటలసైజు చూస్తే తెలీదా?" అన్నాడు మేనేజరు.
"తప్పకుండా తెలుస్తుంది?" అన్నాడు భద్రాచలం.
"ఈ మూటల్తో మా ప్రాణాలు పోతున్నాయి. వారి ఎక్కవుంటులో వీరి చెక్కు, వీరి అక్కౌంటులో వారి చెక్కు. ఒకటీ రేండైతే ఫర్లేదు. వేలు - వేల సంఖ్యలో వుంటాయి. చెక్కులు! ఎక్కవుంట్లు మాత్రం రెండంటే రెండు. ఒక్కో అక్కౌంటుకి ఒక్కో లెడ్జరు బవుండు. ఇక చెక్కు పుస్తకాలంటారా? బేంకుకి  సరఫరా చేసే చెక్కు బుక్కులో మూడు వంతుల పుస్తకాలు ఆ పుణ్యమూర్తులిద్దరికే సరిపోతాయి. అవి రెండంటే రెండే రోజుల్లో ఖర్చవుతాయి. మూడో రోజునుంచి - చెక్కు పుస్తకాలు అర్జంటుగా పంపమని ఫోన్లు మీద ప్జోన్లు. ఇండెంట్ల మీద ఇండెంట్లు!" ఇంకా చాలా చాలా విషయాలు మాటాడేవాడే గాని అలిసిపోవడం వల్ల ఆగిపోయేడు మేనేజరు.
"పని చూడండి!" అన్నాడు సింహాచలం.
"చూస్తాం! చూడక ఛస్తామా?" అన్నాడు మేనేజరు.
మేనేజర్తో సహా సిబ్బంది మొత్తం మూటల ముందు కూచున్నారు. చెక్కుల్ని ఛేక్ చేస్తున్నారు ఒకరు. లెడ్జర్లు ముందరేసుక్కూచున్నారు మరొకరు. చెక్కుల మీద ముద్రలు గుద్దుతున్నారు ఇంకొకరు. మేనేజరు మధ్య మధ్య ఒకటీ అరా  చెక్కులు తీసి చదువుతున్నాడు సేంపిల్ గా -  ఆనందం చెక్కు - ఆర్రూపాయిల ముప్పై పైసలు. భేష్, పరమానందం చెక్కు -  ఏడు రూపాయిల ఇరవై పైసలు. ఆహా సంతోషం.
ఆ విధంగా అతను చదువుకుంటో ముచ్చట పడుతున్నాడు. మిగతా బృందం తమ తమ పనుల్లో కష్టపడుతున్నారు. సింహాచలం భద్రాచలంలు మగత నిద్రలో సుఖపడ్తున్నారు.
మధ్యాహ్నం మూడింటికి ఆనందం, పరమానందంల చెక్కుల పని పూర్తయింది. అప్పటికి సిబ్బంది మొత్తం బాగా అలిసి పోయేరు అప్పటికి సింహాచలం భద్రాచలం మగత నిద్ర నుండి మేలుకున్నారు. మేనేజరు వాళ్లతో అంటున్నాడు.
"చూడండి బాబూ! మీరు మూటల్లో తెచ్చిన చెక్కులు జమా ఖర్చులు తీయగా నికరంగా తేలింది చెప్పమంటారా?"
"చెప్పండి!" అన్నాడు సింహాచలం.
"చెప్పడానికి సిగ్గుగావుంది!" అన్నాడు మేనేజరు.
"మాకు లేని సిగ్గు - మీకెందుకు?" చెప్పండి అన్నాడు భద్రాచలం.
"ఆనందం గారికి పరమానందంగారు కేవలం డెబ్బై రెండు రూపాయలు ఇవ్వవలసి వుంటుంది!"
"అంతా కరెక్టుగా చేసేరా? ఇంకో సారి చూస్తారా?" అని సింహాచలం అడిగేడు.
మేనేజరు దాదాపు గద్గద స్వరంతో బదులిచ్చేడు-
"ఇంకోసారా? వద్దుబాబూ! అంత కంటే కత్తి తీసుకుని నా మెడనరకండి! ఆనందిస్తాను. గన్ను పెట్టి నన్ను కాల్చండి! సంతోషిస్తాను. తలుపులు మూసి నన్ను మర్డర్ చేయండి!పరవశిస్తాను. అంతే గాని - ఇంకోసారి మరో సారి అంటూ దిక్కు మాలిన చెక్కుల్ని చెక్ చేయమని అడక్కండి! పిల్లలు గల వాళ్లం. ఉద్యోగాలే ఆధారం. ఇంకోసారి అనే మాట వాడకుండా - ఈ సారికి వెళ్లిపోండి బాబూ! కరుణించి వెళ్లిపోండి?" అని ఏడ్చేస్తున్నాడు మేనేజరు.
"ఏమన్నామని ఏడుస్తున్నారు?" అడిగేడు భద్రాచలం.
"మీరు ఏమీ అనలేదు బాబూ! నన్ను నేను అనుకుని - నాకు నేనే చెప్పుకుంటున్నా! మీరు తెచ్చే మూటలకి భయపడి విలువైన కస్టమర్లు ఎంతోమంది పారిపోతున్నారు. తమ అక్కౌంట్లు ఈ బేంకు నుంచి మార్పించుకుంటున్నారు. ఇంకా మిగిలింది కొద్దిమంది కస్టమర్లే బాబూ! బహుకొద్దిమంది! మీ యజమానుల దిక్కుమాలిన పదేంలా తాలూకు చెక్కులు మూటల్లో తీసుకురావడం ఆపకపోతే - ఆ కొద్ది మంది కూడా ఇక్కడ్నించి లేచి వెళ్లి పోతారు ఆఁ! అదే జరుగుతుంది. నాకు తెలుసు అదే జరుగుతుంది." అన్నాడు మేనేజరు ముక్కు చీదుకుంటూ!
"విచారించకండి! మంచి రోజులోస్తాయి. పాస్ బుక్కులిస్తే వెళ్లొస్తాం!" అన్నాడు సింహాచలం.
 
                             *        *        *
బేంకు తాలూకు హెడ్ ఆఫీసు ముందు ఆటో ఆగింది!
నందివాడ వారి వీథి బ్రాంచి మేనేజరు ఆటో దిగేడు! ఆటోకి డబ్బులిచ్చి పంపించేడు. ఆనక కళ్లు తుడుచున్నాడు. ఆ తర్వాత పెద్ద పెద్ద అంగలు వేసుకుంటో రీజినల్ మేనేజరు గది వేపు కోస్తున్నాడు.
రీజనల్ మేనేజరు ప్జోన్లో మాటాడుతున్నాడు. అతను మాతాడుతుండగా నందివాడ వారి వీథి బ్రాంచి మేనేజరు వచ్చేడు. వచ్చి నమస్కరించి కళ్లొత్తుకుంటున్నాడు!
రీజినల్ మేనేజరు ఫోన్లో ఇంకా మాటాడుతూనే వున్నాడు.
మాటాదుతూనే నందివాడ వారి వీథి బ్రాంచి మేనేజర్ని గమనిస్తున్నాడు. బ్రాంచి మేనేజరు కళ్లల్లో నీళ్లు చూచి కలవరపడి - ఫోన్లో ఏదో చెప్పబోయి ఎందుకేడుస్తున్నారని అడిగేడు.
ఆ తర్వాత రీజనల్ మేనేజరు  ఫోన్లో 'సారి....క్షమించాలి.....సారి.....క్షమించాలి'. అనే మాటల్ని రిపీట్ చేస్తున్నాడు. ఆ వరస చూస్తుంటేఫోన్లో అవతల పెద్ద మనిషి రీజనల్ మేనేజర్ని చివాట్లు పెడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది!
రీజినల్ మేనేజరు నీరసంగా ఫోన్ పెట్టేసేడు. బ్రాంచి మేనేజర్తో అంటున్నాడు-
"ఎందుకేడుస్తున్నారని నేను మిమ్మల్ని అడిగేను అంతేకదా?"
"అవును సార్! నన్నే అడిగేరు!"
"ఆమాట తనని అడిగినట్లు భావించి - పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు డైరెక్టరు! విన్నారా?"
"మవుత్ పీస్ మూసి - ఎందుకేడుస్తున్నారని అడిగి వుంటే బావుండేది సార్!"
"తోచలేదు. మీ దీన వదనం చూడగానే అయిడియా లెట్లా వస్తాయి? రావు! ఇప్పుడైనా చెప్పండి! ఎందుకేడుస్తున్నారు?"
"నేను పని చేసే బ్రాంచి పరిస్థితి రోజు రోజుకీ క్షీణ దశకు చేరుకుంటోంది. ఆ వీథిలోనే ఆనందం పరమానందమని-"
"విన్నాను ఈ విషయమే డైరెక్టర్తో మాటాడుతుంటే మీరు నా గదిలోకి వచ్చేరు. నన్ను ఏడిపించేరు."
"క్షమించాలి నా బ్రాంచిలో సిబ్బంది మొత్తం ఏడుస్తూనే డ్యూటీ చేస్తున్నారు."
"ఒ.కే! అక్కడ్నించి మీ బ్రాంచిని మరోచోటుకి మార్చాలి! అంతే గదా?"
"ఎక్కడికి మార్చినా -ఆనందం పరమానందలకు అందుబాటులో లేకుండా చూడండి! ఇది పెర్సనల్ రిక్వెస్టు!"
"అండమాన్లో పెట్టమంటారా?" అన్నాడు కించిత్తు కోపంగా.
"ఆనందంగా వెళ్లి పోతాం సార్!" అన్నాడు ఎంతో ఆనందంగా.
విషయం అంత తీవ్రంగా వున్నందున రీజినల్ మేనేజరు కూడా నొచ్చుకున్నాడు. ఆ తర్వాత క్షణం ఆలోచించి అన్నాడు.
"కుప్పిలి వారి వీథి ఆ ఇద్దరికీ చాలా దూరంగా వుంటుంది. అక్కడికి మీ బ్రాంచిని మారుస్తున్నాను. ఒ.కే?" అన్నాడు రీజినల్ మేనేజరు.
"సంతోషం సార్! చాలా సంతోషం!" అన్నాడు బ్రాంచి మేనేజరు.
"ఇక ముందు మీరు ఏడ్చి నన్ను ఏడ్పించకుండా జాగ్రత్త పడండి! ఇంక మీరు వెళ్లచ్చు" అన్నాడు రీజినల్ మేనేజరు.

 Previous Page Next Page