Previous Page Next Page 
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 73


    10. పురోడాశము ఉంచిన పాత్రలలో ఒకటి నశించినచో యజమానికి సంవత్సరమునకు ఒక మాసము చొప్పున ఆయుష్యము క్షీణించును. అతడు మరణించును. పురోడాశము ఉంచిన పాత్రలలో రెండు నశించినచో యజమానికి సంవత్సరమునకు రెండునెలల చొప్పున ఆయుష్యము క్షీణించును. అతడు మరణించును. కావున - యజమాని రక్షణకు గాను - కపాలములను చక్కగా లెక్కించి ఉద్వాసన చేయవలెను.

    11. ప్రమాద వశమున ఉద్వాసన కాలమున కపాలములు నశించిన ప్రాయశ్చిత్తముగ అశ్వినీ దేవతాకమగు ద్వికపాల పురోడాశమును నిర్వాపము చేయవలెను. ద్యావా పృథ్వీదేవతాకమగు ఒక కపాల పురోడాశమును నిర్వాపము చేయవలెను.

    అశ్వినులు దేవతలకు వైద్యులు కదా! వారే యజమానికి చికిత్స చేయుదురు.

    ద్యావాపృథ్వి సంబంధమగు కపాలము నశించినచో నిర్వాపము చేసిన ఏకకపాల పురోడాశము వలన యజమానికి ప్రతిష్ఠ కలుగును.

                                      నాలుగవ అనువాకము

    1. ఇది అనుమతి కోరినది. 'దేవస్యత్వాసవితుః ప్రసవే' అనుచు 'స్ఫ్య' అను పని ముట్టును చేబట్టవలెను.

    'ఆశ్వినోర్బాహుభ్యామ్' అశ్వినుల బాహువులతో అని చెప్పబడినది. ఏలననగా అశ్వినులు దేవతలకు అధ్వర్యులు కదా!

    'పూష్ణోహస్తా భ్యామ్' పూషచేతులతో అనిచెప్పబడినది.

    (ఇది తొలి కాండలోనే చెప్పినాము. త్రవ్వుగోల మున్నగు వానిని తీసికొనినప్పుడు అది అందుకున్న వానిని దేవతలు ఆవేశించినారని చెప్పుట.)

    2. 'స్ఫ్యమా! నీవు వందల పగవారలను వధించు దానవు. చెట్టునుంచి పుట్టిన దానవు. వైరి వధకు కారణమవు' అని చెప్పబడినది.

    శత్రువును సంహరించ గోరుచు స్ఫ్యను వజ్రముగా భావించి వాడియగునట్లు పదువు పెట్టవలెను.

    3. అధ్వర్యుడు పొరక వంటి దర్భల కట్టను దుమ్ము సహితముగా పారవేయవలెను.

    వేది ఎంతపరిమాణము గలదియో, నేల అంత మాత్రమే ఉపయోగించవలెను. దర్భల కట్టను పారవేయుట చేత వేది ఉన్నంత చోటునుండి శత్రువును తొలగించి నట్లగును. అందువలన భాగము కోరు శత్రువు తొలగిపోవును. 

    4. దర్భల కట్టను మూడుసారులు తీసివేయవలెను. ఏలననగా లోకములు మూడు కదా! అందువలన ముల్లోకముల నుండి శత్రువులను తొలగించినట్లు అగును.

    5. అధ్వర్యుడు దర్భల కట్టను నాలుగవసారి కూడ తీసివేయవలెను. అందువలన ముల్లోకములకు ఆవలి ప్రదేశము నుండియే శత్రువులను తొలగించి నట్లగును.

    6. అధ్వర్యుడు వేది కొరకు మట్టిని త్రవ్వును. ఆ మట్టిని తొలగించవలెను.

    7. అధ్వర్యుడు నేలను త్రవ్వి మట్టి తీయును. అందువలన అచట మొలచిన గడ్డిగాదము తొలగిపోవును.

    8. అధ్వర్యుడు త్రవ్వి మట్టి తీసిన చోట ఉన్న వ్రేళ్లను పెకిలించివేయవలెను. అందువలన శత్రువును పెకిలించినట్లగును.

    9. వేదికి అవసరమగు స్థలమును మించి త్రవ్వరాదు. అట్లు త్రవ్విన అది పితృదేవతాకమగును.

    యజ్ఞమునకు సరిపోవునంత మాత్రము త్రవ్విన ఆది ప్రజాపతి స్వరూపమగును.

    (అవసరమును మించి భూమిని కష్టపెట్టరాదని, నష్టపెట్టరాదని చెప్పుచున్నాడు.)

    10. గట్టి నేలవరకు త్రవ్వవలెను. అందువలన యజమానికి ప్రతిష్ఠ కలుగును.

    (గట్టినేల అంటకున్న కూలుటకు అవకాశమున్నది.)

    11. భూమిని త్రవ్వునపుడు దక్షిణదిశ ఎత్తుగను, మిగిలినది పల్లముగను ఉండునట్లు త్రవ్వవలెను. అందు వలన అది దేవయజన రూపమగును.

    12. వేద - యజ్ఞ - భూమిని మెత్తగా ఉండునట్లు చేయవలెను. అందువలన యజమాని సంతానవంతుడు, పశువంతుడు అగును.

    13. ఉత్తర పరిగ్రాహము చేయునపుడు వేది ఎంత పరిమాణముది అగునో నేల అంత పరిమాణముదే అగును. అందువలన ఆ ప్రదేశము నుండి శత్రువు తొలగిపోవును. అప్పుడు ఉత్తర పరిగ్రాహము చేయవలెను.

    (వేదికి హద్దులను ఏర్పరచుట ఉత్తర పరిగ్రాహము అగును.)

    14. రాక్షసులు దూరమగుటకు గాను ప్రోక్షించు ఉదకములను స్ఫ్య యొక్క పై భాగమున ఉంచవలెను. ఆపః రక్షోఘ్నీఃవై - నీరు రాక్షస సంహారకము కదా! యజ్ఞము నిర్విఘ్నముగా జరుగుటకు స్ఫ్య రేఖమీద నీరు చల్లవలెను.

    15. నీరు చల్లునపుడు తాను ద్వేషించు పాపమును తలచుకొనవలెను. అందువలన యజమాని శుచివంతుడు అగును.

                                    అయిదవ అనువాకము

    1. 'హవిస్సును జలముచేత ప్రోక్షించితివి కదా! ఎట్లు ప్రోక్షించితివి?' అని వేదవిదులు అడిగినారు.

    'మంత్రముచేత' అని అధ్వర్యుడు చెప్పినాడు.

    కావున జలముచేతనే హవిస్సును ప్రోక్షించవలెను. మంత్రముతోనే హవిస్సును ప్రోక్షించవలెను.

    2. ఇధ్మా బర్హిస్సును ప్రోక్షించవలెను. అందువలన అవి రెండు పరిశుద్ధములు అగును.

    3. వేది కఠినమైనది. లోమారహితము. అపరిశుద్ధము. అందువలన వేదిని నీటితో ప్రోక్షించవలెను. అప్పుడు అది పరిశుద్ధము అగును.

    4. అధ్వర్యుడు వేది మీద బర్హిస్సు, దర్భలను పరచవలెను.

    'దివేత్వా' అని దర్భల అగ్రభాగములను ప్రోక్షించవలెను.

    'అంతరిక్షాయత్వా' అని మధ్యభాగమును ప్రోక్షించవలెను.

    'పృథివ్యైత్వా' చివరలను ప్రోక్షించవలెను.

    అందువలన ఈ బర్హిస్సును ముల్లోకములందు ప్రోక్షించి నట్లగును.

    5. అధ్వర్యుడు భూమిని త్రవ్వుచున్నాడు. అందువలన అది క్రూరము ఎత్తుపల్లములు కలది అగుచున్నది. అందు వలన దానిని శాంతింప చేయుటకు నీరు పోయవలెను - చల్లుటకాదు.

    6. బ్రహ్మ కాని యజమాని కాని వేదికి పూర్వభాగమున ప్రస్తరమును పెట్టవలెను. అది యజమానిని ముఖ్యమైన వానినిగా చేయును.

    (ప్రస్తరము - దర్భలకట్ట.)

    7. యజమాని ప్రజాపతి స్వరూపుడు అయినాడు. అధ్వర్యుడు యజమాని ముఖపు పరిమాణము గల ప్రస్తరమును వేది యొక్క పూర్వభాగమున పెట్టవలెను.

    8. అధ్వర్యుడు వేది మీద దర్భలను పరచవలెను. పృథివి వేది. ప్రజలు దర్భలు. కావున భూమి మీద ప్రజలను ఏర్పరచినట్లగును.

    9. అధ్వర్యుడు వేదిమీద బర్హిస్సును దట్టముగా పరచవలెను. అందువలన యజమానిని అత్యంత ప్రజావంతుని, పశువంతుని చేసిన వాడగును.

    10. అధ్వర్యుడు వేదిమీద పరచిన బర్హిస్సు అగ్రభాగమున ప్రస్తరము ఉంచవలెను. ప్రజలు బర్హిస్సు, యజమాని ప్రస్తరము అగుచున్నాడు. అట్లు చేయుట వలన యజమానిని యజ్ఞము చేయని వానికన్న శ్రేష్ఠుని చేయుచున్నాడు.

    అప్పుడు యజమాని అయజమానిని మించినవాడు అగును.

    11. బర్హి, ప్రస్తరముల మధ్య రెండు దర్భలను - వ్యవధానము కొరకు - అడ్డముగా వేయవలెను.

    12. అధ్వర్యుడు ప్రస్తరమును నేతిలో తడుపవలెను. అందువలన అది హవిస్సు అగును. అది స్వర్గమునకు చేరును.

    13. అధ్వర్యుడు ప్రస్తరమును మూడు మారులు నేతిలో ముంచవలెను. ఈ లోకములు మూడు కదా! అందువలన మూడు లోకములను ఘృతమున ముంచినట్లగును.

    14. ఆహవనీయ అగ్ని యందు నిప్పు కణికలు ఉన్నప్పుడు ప్రస్తరమును నిప్పుకణికలందు కొట్టరాదు. అందువలన అది యజమానికి స్వర్గసాధకము కాకుండును. స్వర్గము పైన ఉన్నది కదా! అధ్వర్యుడు ప్రస్తరమును తనచేతి పైకి ఎత్తి అగ్ని పై భాగమును తాకించవలెను.

    15. తాకించిన తరువాత అధ్వర్యుడు తనచేతిని కిందకు వంచవలెను. అందువలన యజమాని కొరకు అధోముఖ వర్షము కలిగించినవాడు అగును.

    16. అధ్వర్యుడు ప్రస్తరాగ్రమును ఆహవనీయాగ్నిని అతిక్రమించునట్లు కొట్టరాదు. ప్రస్తరాగ్రమును ఆహవనీయాగ్నికి ఉత్తరమున ఉంచవలెను. అత్యగ్రప్రహరణము వలన అతివృష్టి కలిగి అధ్వర్యునకు వినాశకము అగును.

    17. అధ్వర్యుడు ప్రస్తరమూలమును తూర్పుదిక్కున ఉంచి అగ్నిని కొట్టరాదు. అందువలన యజమానిని స్వర్గము నుంచి పడద్రోసినవాడగును.

    18. అధ్వర్యుడు ప్రస్తరమును ప్రాచీనాగ్రముగ ఉంచి అగ్నిని తాకించవలెను. అందువలన యజమానికి స్వర్గము కలిగించినవాడు అగును.

    19. అధ్వర్యుడు ప్రస్తరాగ్రములను చిందరవందరగా చేసి అగ్ని ప్రహారము చేయరాదు. అందువలన అధ్వర్యునకు స్త్రీ సంతానము (మాత్రమే) కలుగును.

    20. అగ్నీధ్రుడు ప్రస్తరమును దండాకారముగ ఉండునట్లు మెలిపెట్టవలెను. పురుషవ్యంజనము ఊర్ధ్వాకారము. అందువలన అతనికి పురుష సంతానము కలుగును.

    21. యజ్ఞాంగములందు ఏది యాజమాన స్థానీయము? ఏది స్వర్గ ప్రాప్తి సాధకము? అని బ్రహ్మవాదులు అడిగినారు.

    ప్రస్తరమను యజ్ఞాంగము యజమాని స్థానీయము. ఆహవనీయము స్వర్గము అని చెప్పబడినది.

    కావున ప్రస్తరమును ఆహ్వానీయమున కొట్టవలెను. అది యజమానికి నిశ్చయముగ స్వర్గమును కలిగించును.

    23. ఆహవనీయాగ్ని యందు ప్రస్తరముచే కొట్టునపుడు ప్రస్తరమూలము పైభాగమునకు ఎత్తబడును. దానివలన యజమాని అల్పుడగును. లేదా వ్యాధులచే కృశించును. కావున నేతితో తడిసిన ప్రస్తరము నుండి ఒక దర్భను తీయవలెను. శాంతి కొరకని దానితో ఆహవనీయాగ్ని యందు అనుప్రహరణము చేయవలెను.

    24. యజమాని ప్రస్తరరూపుడు. ప్రస్తరప్రహరణ జరిగినది. అందువలన అతడు స్వర్గమునకు చేరినాడు. అప్పుడు అధ్వర్యుడు ఏకాకి అయినాడు. అతడు భయమున వడకినాడు.

    కావున అధ్వర్యుడు ద్రువాసి' అను మంత్రము చదివి భూమిని తాకవలెను. భూమి స్థిరమైనది కదా! అందువలన అధ్వర్యుడు భూమి మీద స్థిరపడును. భయము లేనివాడు అగును.

    25. అగ్నీ ధ్రుడా! అగాన్? యజమాని స్వర్గమునకు చేరినాడా? అనునది ప్రశ్న.

    "అగన్నగ్నిః" అగ్నిస్వర్గమునకు చేరినాడు, అను సమాధానమైనచో స్వర్గరూపమగు అగ్నియందు అగ్నిని చేర్చినట్లు అగును. అప్పుడు యజమాని స్వర్గము నుండి తొలగించబడిన వాడు అగును.

    కావున 'అగన్' వెళ్లెను అనియే సమాధానము చెప్పవలెను. అప్పుడు యజమానికి స్వర్గలోకము కలిగించినట్లగును.

                                     ఆరవ అనువాకము

    1. అగ్నికి ముగ్గురు అన్నలు ఉండిరి. వారు దేవతల కొరకు హవిస్సు వహించుచు మరణించినారు. దేవతలకు హవిస్సు వహించువాడు మరణించును అనుకున్నాడు అగ్ని. దేవతలకు కనిపించవలదు అనుకున్నాడు. వారికి కనిపించకుండ నీటిలో దాగినాడు.

    దేవతలకు అగ్ని కనిపించలేదు. వారు ఎంతో వెదికినారు. నీటిలోని చేప దేవతలకు అగ్ని ఉనికిని గురించి చెప్పినది.

    చేప చెప్పిన విషయము అగ్ని తెలిసికొన్నాడు. 'చేపా! నా ఉనికి తెలియపరచినావు. నిన్ను జాలరులు పట్టి చంపుదురు గాక' అని శపించినాడు. అందువలన జాలరులు తమ ఇచ్చవచ్చినపుడెల్ల చేపలను పట్టుచున్నారు. చంపుచున్నారు.

    అంతట దేవతలు అగ్నిని తమకొరకు హవిస్సులు వహించవలసినదని కోరినారు. అప్పుడు అగ్ని 'స్రుక్కులోనికి తీసికొనబడి' హుతము కాని హవిస్సు పరిధి బయట పడినప్పుడు అది మరణించిన తన అన్నల భాగము కావలెనని దేవతలను కోరినాడు. దేవతలు అగ్నికి ఆ వరమును ప్రసాదించినారు. అప్పటినుంచి హవిస్సు స్రుక్కులోనికి గ్రహించబడి హుతము కాక పరిధి బయటపడినది అగ్ని యొక్క అన్నల భాగము అయినది.

    ఆ హవిర్భాగమున యజమాని అగ్ని భ్రాతలను సంతోషపెట్టినవాడు అగుచున్నాడు.

 Previous Page Next Page