2. పరిధులకు ఆవలి భాగము అగ్ని అన్నలకు చెందినది అగును. కావున రాక్షస నాశనమునకు పరిధులను ఏర్పరచవలెను.
3. రాక్షసుల సంచారమును నిరోధించుటకై పరిధులను ఒకదానికి మరొకటి తాకునట్లు పరచవలెను.
4. తూర్పున పరిధులను పరచరాదు. సూర్యుడు తూర్పున ఉదయించి రాక్షసులను సంహరించును.
5. దక్షిణ, ఉత్తర భాగ పరిధులపైన రెండు సమిధలను ఉంచవలెను. అందువలన ఊర్ధ్వదిశన సహితము రాక్షసులను తొలగించినట్లగును.
6. ఉంచిన రెండు సమిధలందు ఒక దానిని సమంత్రకముగను, మరొక దానిని అమంత్రకముగను ఏర్పరచవలెను. అందువలన అవి స్త్రీ, పురుష సంకేతములై మిథునములు అగును.
7. యజమాని రెండు కాళ్లవాడు. కావున అతని ప్రతిష్ఠకు గాను రెండు సమిధలను వేయవలెను.
8. యజ్ఞకర్త హోమము చేయుచుండును. అప్పుడు హవిస్సు జారును. అగ్నికి ఇవతల పడును. అందువలన యజ్ఞమునకు విఘాతము ఏర్పడినట్లగును. అట్లగుట వలన యజమాని వినాశము వైపునకు సాగును. యజమాని ఆ విఘాతము నుండి ఎట్లు తప్పు కొనును? అతడు ధనవంతులందు ఎట్లు శ్రేష్ఠుడు అగును? అని కొందరు వేదవిదులు అడిగినారు. దానికి ఒక విద్వాంసుడు సమాధానము చెప్పినాడు: -
యజమాని 'భూపతయే స్వాహా" "భువనపతయే స్వాహా" 'భూతానాం పతయే స్వాహా' అను మూడు మంత్రములచే జారిపడిన హవిస్సును అభిమంత్రించవలెను. అందువలన యజ్ఞపు విఘాతము దూరమగును. యజమాని గొప్ప దేవతలను తృప్తి చెందించిన వాడు అగును.
9. అనుక్రమాగతములగు అగ్ని, అగ్నిసోమీయ పురోడాశములు కలవు. వాని వలన యజ్ఞమునకు ఆలస్యము జరుగుచున్నది. ఆలస్యనివారణార్థము - మిథునత్వ సాధనకును ఆగ్నేయ, అగ్నీషోమీయ పురోడాశములకు మధ్య ఉపాంశుయాగము చేయవలెను.
10. ఒకప్పుడు అగ్ని స్వర్గమునందు ఉండెను. యముడు భూమిపై ఉండెను. అందువలన భూలోకపు నరులకు వంటలు జరుగకుండెను. పితృదేవతలకు రాజు లేకుండ అయినాడు.
అప్పుడు దేవతలు అగ్ని యములకు స్థానవిపరివర్తన చేయ సంకల్పించినాడు. అన్నాద్యము నిత్తుమని వారు అగ్నిని భూమికి పిలిచినారు. పితృరాజ్యము ఇత్తుమని యముని స్వర్గమునకు పిలిచినారు. ఆ విధముగా ఉభయులకు స్థాన విపరివర్తనము జరిగినది.
యజమానులు స్విష్టకృదగ్ని కొరకు హవిర్భాగమును అవదానము చేయుదురు. దేవతలు ఆ హవిర్భాగమును అగ్నికి ఇచ్చినారు. స్విష్టకృదగ్ని కొరకు అవదానము చేసిన యజమాని రుద్రుడైన అగ్నిని సమృద్దుని చేయును.
11. రుద్రుడు ఒక్కడే కదా! అందువలన అన్ని హవిస్సుల నుండి కొంచెము, కొంచెము అవదానము చేయవలెను. రుద్రునిది ఉత్తరదిశ. కావున హవియొక్క ఉత్తర భాగము నుండి అవదానము చేయవలెను. అందువలన యజమాని రుద్రుని అతని దిశయందే సంతోషపెట్టిన వాడగును.
12. చతురవత్త ప్రాప్తికి హవిస్సునందు రెండు సారులు అభిఘారము చేయవలెను.
13. పూర్వాహుతులు పశురూపలు. అగ్ని క్రూరస్వభావుడు. పూర్వాహుతులతో కలసినట్లు హోమము చేసిన పశువులను - వినాశమునకు - రుద్రునకు అర్పించినట్లగును. అప్పుడు యజమాని పశు శూన్యుడు అగును.
కావున్ పూర్వాహుతులను విడిచి కొంచెము దూరముగ యజ్ఞము చేయవలెను. అది పశురక్షణ కొరకు అగును.
ఏడవ అనువాకము
1. మనువు భూమి మీద యజ్ఞద్రవ్యముల కొరకు అన్వేషించినాడు. అతనికి గోవు అడుగు పెట్టిన చోట ఆజ్యము కనిపించినది. ఈ ఘృతమును యజ్ఞమునందు కూడ వినియోగించుటకు ఎవడు అర్హుడు? అని మనువు అడిగినాడు.
గోవునకే యజ్ఞాంగత్వము కలిగించుటకు మేము సమర్థులము అని మిత్రావరుణులు అన్నారు. అట్లని వారు గోవును భూలోకమునకు తెచ్చినారు. ఆ గోవు అడుగుపెట్టిన చోటనల్ల ఘృతము వెడలినది. అందువలన గోవునకు 'ఘృతపది' అను పేరు కలిగినది.
ఇది ఇడారూపగోవు జన్మవృత్తాంతము.
2. పృథివితో సహా రథంతర సామము ఆహ్వానించబడినదని చెప్పబడినది. ఈభూమియే రథంతర సామము అయినది. ఈ భూమిని అన్నాద్యయుక్తముగా ఆహ్వానించుచున్నారు.
3. అంతరిక్షముతో సహ వామదేవ సామము ఆహ్వానించబడినదని చెప్పబడినది. పశువులే వామదేవ సామములు. అంతరిక్షముతో కూడ పశువులను ఆహ్వానించుచున్నారు.
4. ద్యులోకముతో కూడ 'బృహత్' సామము ఆహ్వానించబడినదని చెప్పబడినది. 'బృహత్' సామము వృష్టి సంబంధము. ద్యులోకముతో సహ వృష్టిని ఆహ్వానించుచున్నారు.
5. సప్తహోతలు ఆహ్వానించబడినారు అని చెప్పబడినది. అట్లగుటచే హోతలనే ఆహ్వానించుచున్నారు.
10. ఇడను ఆహ్వానించుచున్నారు అన్నారు. ఇడ పశువులే అగును. కావున పశువులనే ఆహ్వానించినట్లయినది. పశువులు చతుష్పాత్తులు. కావున ఇడను నాలుగు సార్లు ఆహ్వానించవలెను.
11. తొలుత గోరూప ధారిణియైన ఇడను మనువు చూచినాడు. అందువలన అది 'మానవి' అయినది.
గోవు పాదము పెట్టిన చోట ఘృతము వెడలినది. అందువలన అది ఘృతపది' అయినది.
12. దేవతలు బ్రహ్మ ఉపాహ్వానము చేసినారని చెప్పబడినది. అందువలన బ్రహ్మ ఉపాహ్వానము చేయుచున్నారు.
13. దేవాసంబంధ అధ్వర్యులు - మానవసంబంధ అధ్వర్యులు ఆహ్వానించబడినారు అని చెప్పబడినది. అందువలన దేవ, మానవ అధ్వర్యులను ఆహ్వానించుచున్నారు.
14. దేవాధ్వరులు. మానవాధ్వరులు ఈ యజ్ఞమును రక్షింతురు గాక. యజ్ఞకర్తకు అభ్యుదయము ప్రసాదింతురు గాక అని చెప్పబడినది. అది యజ్ఞమునకును, యజమానికిని ఆశీర్వాదము అగుచున్నది.
15. ద్యావాపృథ్వులు తొలుత పుట్టినవి అని చెప్పబడినది. అట్లనుట వలన ద్వారా పృథ్వులనే ఆహ్వానించుచున్నారు.
16. ద్యావాపృథ్వులు తొలుత పుట్టినవి అని చెప్పబడినది. అట్లనుట వలన ద్యావా పృథ్వులు ప్రాణిజాలము కన్న పూర్వము పుట్టినవి అగుచున్నవి.
ద్యావా పృథ్వులు దేవతా స్వరూపులనియు, దేవతలు పుత్రులుగా కలవనియు చెప్పబడినది. అట్లనుట వలన అవి దేవతాస్వరూపములు అయినవి. దేవతలు వాటికి పుత్రులు అయినారు.
17. 'ఉపహూతోయం యజమానః' అనుట వలన యజమానినే ఆహ్వానించుచున్నారు.
18. ఉత్తర దేవయాగమునకు - అధిక హవిష్కరణమునకు - దేవతాస్థానములకు ఆహ్వానించబడినారని చెప్పబడినది. ఉత్తర దేవయాగము ప్రజ యగును. హవిష్కరణము పశువులు అగును. దేవతాస్థానము స్వర్గమగును.
19. ఈ కర్మను చేయ సంకల్పించినావు. సోమయాగ రూప కర్మను చేయ నిచ్చగించినావు అనుటవలన యజమాని యజ్ఞపు ప్రియధామమును ఆహ్వానించినట్లయినది.
20. ఈ యజమానికి ఇష్టమైన వారందరు ఆహ్వానించబడినారు అని చెప్పబడినది. కావున వైయర్థము లేని విధముగ యజమాని ఆహ్వానించబడినవాడు అగుచున్నాడు.
ఎనిమిదవ అనువాకము
1. పశువులు ఇడా స్వరూపలు. ఋత్విజులందు హోత మాత్రమే పశువులు కోరువాని కోరిక తీర్చగలడు. ఇతరులకు అది సాధ్యపడదు.
2. పురోడాశమా! నీవు వాచస్పతికై హుతమైనావు. నిన్ను నేను భక్షించుచున్నాను. అట్లనుట వలన వాచస్పతికి పురోడాశ భాగము ఇచ్చినట్లగును - సంతోషపెట్టినట్లగును.
సదస్పతికి హుతమైన నిన్ను స్వీకరించుచున్నాను. అట్లనుటవలన తన కొరకే స్వీకరించినట్లగుచున్నది.
3. హోత చేతియందు చతురవత్తము అగును. పశువు నాలుగు పాదములది. కావున హవిస్సును నాలుగు పర్యాయములు అవదానము చేయవలెను.
4. హోత దేవతారూపమగు ఇడను భక్షించరాదు. అందువలన అతడు మరణించును. అట్లుకాక ఇడా భాగమును అగ్నియందు హోమము చేయరాదు. అందువలన పశువులను రుద్రరూప అగ్నికి అందించినట్లగును. కావున పశు రహితుడు అగును.
ఆ దోష పరిహారమునకు "వాచస్పతయేత్వాహుతమ్" అని ముందు చెప్పవలెను. తరువాత భక్షించవలెను. అట్లనుట వలన ఇడ అగ్నియందు హుతమగుట లేదు. రుద్రునకు పశుసమర్పణ చేసినట్లు కాదు. యజమాని ఇతరులకై హుతమైన దానిని సేవించును. అందువలన అతనికి మరణ దోషము కలుగదు. ఈ భక్షించినది తన కొరకు అగుటకు "సదస్పతయే త్వాహుతం ప్రాశ్నామి" అనవలెను.
5. యాగోత్తరణ సమయమందు యజమాని సహితముగా అయిదుగురు ఋత్విజులు ఇడను భక్షించవలెను. అది ఋత్విజులకు దక్షిణ ఇచ్చుట వంటిది. యాగోత్తర సమయమునందే కదా దక్షిణ ఇచ్చునది!
6. యాగ మధ్యమందు ఇడను భుజించరాదు. అందు వలన యాగము విచ్చిన్నము అగును. ప్రస్తరమునందు నీళ్ళు చల్లి తుడువవలెను. సత్యమాపస్సర్వా దేవతా ఆపః - నీటి యందే సత్యము, నీటియందే సమస్త దేవతలున్నారు. అందువలన దేవతలే యజ్ఞమును విస్తరిల్లచేయుదురు.
7. దేవతలు యజ్ఞము చేసినారు. వారు యజ్ఞము నుండి రుద్రుని తొలగించినారు. అంతట రుద్రుడు యజ్ఞమును వికలము చేసినాడు.
అప్పుడు దేవతలు "మాయజ్ఞమును పరిపూర్ణము చేయించుము" అని రుద్రుని ప్రార్థించినారు. దేవతలలో కొందరు 'రుద్రుని ఆరాధించిన మన యజ్ఞము 'స్విష్థం భవిష్యతివై' సంపూర్ణముగ 'ఆచరించనట్లగును' అన్నారు.
అందువలననే స్విష్టకృదగ్నికి 'సుష్ఠుగ చేయించువాడు' అను సార్థక నామధేయము కలిగినది. దేవతలు రుద్ర సంబంధియగు ఉపహత పురోడాశమును యావగింజంత మాత్రము అర్పించిరి.
తస్మాద్యవ మాత్ర మవద్యేత్ - కావున యవ మాత్రమగు పురోడాశమును అవదానము చేయవలెను.
8. యవ గింజంతను మించి అవదానము చేయరాదు. అందువలన యజ్ఞమను భ్రాంతి కలిగించిన వాడగును.
9. పురోడాశ అవదానమునకు పూర్వము ఉపస్తరణ చేయరాదు. అభిఘారము చేయరాదు. అందువలన పురోడాశపు రెండు పక్కలకు సంశ్వాయి వ్యాధి కలిగించినవాడు అగును.
యజమాని రెండు కాళ్లవాడు. అట్లగుటవలన సకృదవదానము, సకృదభిఘారము ద్విః సంపద్యతే - ద్విత్వ సంపన్నము అగును.
10. అధ్వర్యుడు పురోడాశము నందలి ప్రాశిత్ర భాగమును బ్రహ్మకు అపమార్గముగా ఇవ్వరాదు. అందువలన యజ్ఞమందలి వికలము కాని భాగము సహితము వికలమగును. కావున దానిని ఎదుటనే ఇవ్వవలెను. అది సక్రమ మార్గమున ఇచ్చినట్లగును.
11. దేవతలు పూషదేవునకు ప్రాశిత్రమును ఇచ్చినారు. అతడు దానిని భక్షించినాడు. అందువలన అతని దంతములు రాలిపోయినవి. అప్పటినుండి పూషదేవతకు పిండితో చేసిన చరు భాగమైనది.
అప్పుడు దేవతలు పూష దంతరహితుడు - సమృద్ధిరహితుడు - ప్రాశిత్ర రహితుడు అనుకున్నారు. అట్లనుకొని దేవతలు ప్రాశిత్రము బృహస్పతికి అర్పించినారు. బృహస్పతి పూషవంటి పరిస్థితి తనకు కలుగునని భయపడినాడు.
(లోకః ప్రాశిత్రమ్ అని శతపథము. లోకములను తిను ప్రయత్నము ప్రమాదకరము కదా! ప్రాశిత్రమ్ అనగా తినదగినది కూడ అగును. తిను బండారము.)