5. అగ్ని సోములు దేవతలందు రాజులు. అగ్ని సోమదేవతల ఆజ్యభాగ హోమస్థానముల మధ్య ప్రధాన దేవతలకు హోమము చేయవలెను. రాజులచే కదా ప్రజలు పోషించబడుట!
6. యజమానికి దిగువ దంతములున్న గోవులు మున్నగునవి కలిగించు యజ్ఞాంగము ఏది? పైన, క్రింద దంతములున్న అశ్వాది పశువులను కలిగించు యజ్ఞభాగము ఏది? ఈ విషయము వేదవిదులు వివరించినారు: -
ఆజ్యభాగ హోమమున ఋక్కును చదివి జుషాణ ఇత్యాది యజుస్సుల చేత యాగము చేయవలెను. అందువలన క్రింది దంతములు కల జంతువులు కలుగును.
ప్రధాన హవిస్సు యొక్క ఋక్కును చదివి యాజ్యారూప ఋక్కుచేత యజించవలెను. అందువలన క్రిందను, మీదను దంతములుండు అశ్వాదులు కలుగును.
7. 'అగ్నిర్మూర్ధా దివః కకుత్' ఇత్యాది ఋక్కు 'మూర్ధన్' అను శబ్దము కలిగి ఉన్నది. ఇది పురోనువాక్య. అధ్వర్యుడు ఈ ఋక్కు చదివి హోమము చేయవలెను. అందువలన యజమాని సాటివారిలో శీర్షము వంటివాడు అగును.
"భువో యజ్ఞస్య రజస్య నేతా యత్రా నియుద్భిః సచసే శివాభిః" ఇత్యాది ఋక్కు 'నియుత్' అను శబ్దము కలిగి ఉన్నది. ఆ ఋక్కుచే హోమము చేసినచో శత్రువును పశువుల నుండి దూరము చేసినవాడు అగును.
8. సత్య కామ పుత్రుడు కేశి. అతడు దర్భపుత్రుడగు కేశితో అన్నాడు: -
దర్భకుమారా! రేపు నీవు యజ్ఞము చేయనున్నావు. అందు నీవు సప్తపద శక్వరీ ఛందస్సును ఉపయోగింతువు. శక్వరి వలన యజమాని పుట్టిఉన్న తన శత్రువును తిరస్కరించును. అది పుట్టనున్న శత్రువును కూడ నిరోధించును.
శక్వరి శక్తి వలన యజమాని ఉభయలోకము లందు జ్యోతిని పొందును.
శక్వరి శక్తి వలన ఎద్దుయొక్క ముందు భాగమును - బరువులు మోయుట, నాగలిలాగుటలు - కలుగును. అట్లే ఆవు యొక్క అధోభాగము - పాలు మున్నగునవి - కలుగును. ఇది తెలిసిన వానికి రెండును కలుగును.
9. మొదట దేవత పేరున్నది పురోను వాక్య. 'అగ్నిర్మూర్దా దివః కకుత్'. ఇందు అగ్ని దేవత మొదట చెప్పబడినాడు. అందువలన అది పురోను వాక్య. ఈ ఋక్కు అప్పటికి పుట్టియున్న శత్రువును దూరము చేయును.
ఉత్తరార్ధమున దేవత పేరుగలది యాజ్య. 'జిహ్వామగ్నే చకృషే హవ్య వాహమ్' ఇందు 'హవ్యవాహమ్' అనునది చివరన ఉన్నది. కావున ఇది యాజ్య. ఇది పుట్టబోవు శత్రువును నిరోధించును.
10. పురోనువాక్య యందు దేవతపేరు ప్రథమార్ధమున వచ్చినది. భూలోకము స్వర్గమున కన్న ముందుది కదా! ఆ సాదృశ్యమున యజమానికి పురోనువాక్య వలన భూలోకమున ప్రతిష్ఠ కలుగును.
యాజ్య యందు దేవతపేరు ఉత్తరార్ధమున ఉండును. స్వర్గము పైన ఉండునది కదా! ఆ సాదృశ్యమున యజమానికి యాజ్య వలన స్వర్గలోకము నందు ప్రతిష్ఠ కలుగును.
ఈ విషయములు గ్రహించిన వానికి ఉభయ లోకములు జ్యోతిష్మంతములు అగును.
13. 'అగ్నిర్మూర్ధా' గాయత్రి ఛందస్సు. ఇది పురోనువాక్య. 'భువోయజ్ఞస్య' త్రిష్టుప్ ఛందము. ఇది యాజ్య.
గాయత్రి బ్రాహ్మణునితో పుట్టినది. త్రిష్టుప్ క్షత్రియునితో పుట్టినది. కావున బ్రాహ్మణుని తరువాతనే క్షత్రియుడు అగుచున్నాడు. "తస్మాద్ర్భాహ్మణో ముఖ్యో" అందువలన బ్రాహ్మణుడు ముఖ్యుడు - మొదటివాడు - అగుచున్నాడు.
14. ఈ విషయములను గ్రహించిన వాడు ముఖ్యుడు - శ్రేష్ఠుడు - అగును.
15. పురోను వాక్య పఠించిన వాడు యజమానిని గురించి దేవతలకు వివరించి చెప్పినవాడు అగును.
యాజ్య పఠించిన వాడు యజమానికి దేవతల వద్దకు చేరు సరియైన మార్గము చూపిన వాడు అగును.
'వషట్' పఠించిన వాడు యజమానిని దేవతల వద్దకు చేర్చిన వాడగును.
16. పురోనువాక్య, యాజ్య, వషట్కారములు చదివిన అధ్వర్యుడు యజమానిని చేయిపట్టుకొని దేవతలకు అప్పగించి, అతనిని అక్కడ స్థిరపరచినవాడు అగును.
17. పురోనువాక్య మూడు పాదములు కలది. ఈలోకములు మూడు. దానిని అనుష్ఠించిన వాడు ముల్లోకములందు ప్రతిష్ఠ కలవాడు అగును.
యాజ్య నాలుగు పాదములది. దానిని అనుష్ఠించిన వానికి నాలుగు పాదముల జంతువులు కలుగును.
'వౌషట్' రెండు అక్షరములు కలది. యజమాని రెండు కాళ్లు కలవాడు. అతనికి పశువులు కలిగిన తరువాతనే ప్రతిష్ఠావంతుడు అగును.
18. పురోను వాక్య గాయత్రి ఛందస్సుది. యాజ్య త్రిష్టుప్ ఛందస్సుది. ఈ రెండు కలిసి సప్తపదాత్మక శక్వరి ఛందస్సు అగుచున్నది. దేవతలు ఈ శక్వరీ ఛందోయుక్త ఋక్కు వలననే సాధించదలచిన కార్యమును సాధించినారు.
ఈ విషయమును గ్రహించిన వాడు సాధించదలచిన కార్యమును సాధించగలడు.
మూడవ అనువాకము
1. ప్రజాపతి దేవతలకు యజ్ఞద్రవ్యములను పంచి ఇచ్చినాడు. ఆజ్యమును తన వద్ద ఉంచుకున్నాడు. అప్పుడు దేవతలు ప్రజాపతితో అన్నారు: -
"ఆజ్యమే యజ్ఞము అగుచున్నది. మాకు కూడ ఆజ్య యజ్ఞ భాగమును ఏర్పరచుము"
అప్పుడు ప్రజాపతి ఇట్లు అన్నాడు: -
"దేవతలారా! మిమ్ములను ఉద్దేశించి యజ్ఞము చేయువారు ఆజ్యభాగహోమములు చేయుదురు గాక. ప్రధాన హవిస్సు క్రింద ఉపస్తరణ చేసి పైన అభిఘారము చేయుదురు గాత."
2. 'హవిస్సులందు ఆజ్యము కాక ఇతరములు సారహీనములు అగుటకు కారణమేమి? ఆజ్యము సారవంతమగుటకు గల కారణమేమి?' అని వేదవిదులు చర్చించినారు. వారిలో ఒకడు ఆజ్యము ప్రజాపతి దేవతాకమనియు, ప్రజాపతి సారము క్షీణించని వాడనియు చెప్పినాడు.
3. గాయత్రి మున్నగు ఛందస్సులు 'మేము భాగరహితులమై మీకు హవిస్సులు పలుకము' అని దేవతల నుండి తొలగి పోయినవి. అప్పుడు హవిర్దానులగు దేవతలు ఛందసుల కొరకు 'చతురవత్తము'ను ఏర్పరచినారు.
పురోనువాక్య, యాజ్య, వషట్కార దేవతలకు చతుర వత్తమును హోమము చేయవలెను. అందువలన ఛందోదేవతలను సంతోషపెట్టిన వాడు అగును. సంతోషించిన ఛందస్సులు యజమాని హవిస్సులను దేవతలకు చేర్చును.
4. అంగిరోనామక ఋషులు స్వర్గమునకు వెళ్లుచుండిరి. వారు యజ్ఞమునకు అభిముఖముగ వచ్చినారు. అక్కడ వారికి పురోడాశము కూర్మరూపము దాల్చి పాకుచుండుట కనిపించినది. అప్పుడు వారు "కూర్మరూపము దాల్చిన పురోడాశమా! నిన్ను ఇంద్రాది దేవతలలో ఒకరికి ఇత్తుము. నిలువుము" అన్నారు. కూర్మము వారి మాటలు విన్నది. కాని నిలువలేదు.
"కూర్మమా! నిన్ను అగ్ని దేవతకు ఇత్తుము. నిలువుము" అన్నారు ఋషులు. కూర్మము వారి మాటలు విన్నది. నిలిచినది. కావున అగ్ని దేవతాకమగు అష్టాకపాల పురోడాశమును అమావాస్య, పూర్ణిమలందు అచ్యుతముగా చేయవలెను. ఆ పురోడాశము స్వర్గలోక ప్రాప్తి కలిగించును.
5. "పురోడాశమా! నీవు యజ్ఞభూమిని విడిచి ఏల పోవుచుంటివి?" అని ఋషులు పురోడాశమును అడిగినారు.
"ఋషులారా! నన్ను కాటుకచే అలంకరించలేదు. కందెనలేని బండివలె కాటుక లేని నేను నశించుచున్నాను" అని సమాధానము చెప్పినది.
కావున అగ్ని దేవతాకమగు పురోడాశమును హోమము చేయుటకు ముందు దాని పైనను, క్రిందను ఆజ్యముచే అలంకరించవలెను.
6. అన్ని కపాలములందలి పురోడాశమును యజమాని - తన చేయిచాచి - తాకవలెను. ఆ విధముగా చేసిన యజమానికి స్వర్గమునందు అన్ని పురోడాశములు లభించును.
7. పురోడాశము ఎక్కువ ఉడికిన రాక్షసులకు ప్రియమగును. ఉడకకున్న రుద్రునకు ప్రియమగును. చక్కగా ఉడికినది దేవతలకు ప్రియము అగును. కావున పురోడాశమును ఎక్కువ ఉడికించక ఉడుకకుండ ఉంచక చక్కగా ఉడికించవలెను. అది దేవతలకు ప్రియమగును.
8. నిప్పుల మీద కాల్చిన పురోడాశము గట్టిగా ఉండును. నిప్పులపై కాల్చి బూడిద కప్పిన పురోడాశము మాంసముగల ఎముకవలె ఉండును.
తదనంతరము దానిని దర్భలచే కప్పివేయవలెను. అప్పుడది కేశములతో కూడిన తలవలె ఉండును.
9. పురోడాశ హవిస్సు మంత్ర పూర్వకముగ పక్వమైనపుడు అది ఈ లోకమునకు చెందినది కాకుండును. పక్వమైన పురోడాశము మీద నేయి రాయకున్న దానికి స్వర్గప్రాప్తి కలుగదు. కావున ఉద్వాసన కాలమునందు సహితము పురోడాశమును ఆజ్యముచే అభిఘరించవలెను. అందువలన అది దేవతలకు చేరును.