Previous Page Next Page 
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 71


        అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ |
        యుయో ధ్యస్మజ్జుహు రాణమేనో భూయిష్ఠాతే నమ ఉక్తిం విధేమ ||

                                   ఆరవ ప్రపాఠకము

                                          మొదటి అనువాకము

    1. యజమాని 'సమిత్' యాగమును చేయవలెను. అందువలన అతనికి వసంతర్తువు అనుకూలము అగును.

    'తనూనపాత్' యాగము చేయవలెను. అందువలన అతనికి గ్రీష్మము అనుకూలము అగును.

    'ఇట్' యాగము చేయవలెను. అందువలన అతనికి వర్షరుతువు అనుకూలము అగును.

    'బర్హి' యాగము చేయవలెను. అందువలన అతనికి శరత్తు అనుకూలము అగును.

    'స్వాహాకార' యాగము చేయవలెను. అందువలన అతనికి హేమంతము అనుకూలము అగును. హేమంతము పశుపక్ష్యాదులను బాధించునది కదా!

    2. 'సమిత్' యాగము చేయవలెను. ఉషోదేవి అనుగ్రహము పొందును.

    తనూనపాత యాగము చేయవలెను. యజ్ఞపు అనుగ్రహము కలుగును.

    'ఇట్' యాగము చేయవలెను. పశువులు కలుగును.

    'బర్హి' యాగము చేయవలెను. సంతానము కలుగును.

    3. ఉపభృత్తునుండి జుహువులోనికి సగము ఆజ్యము తీసికొనవలెను. 'బర్హి' యాగము ప్రజారూపము. ఆజ్యము తేజోరూపము. అందువలన యజమాని ప్రజలకు తేజస్సు కలిగించినవాడు అగును.

    4. యజమాని 'స్వాహాకార' యాగము చేయవలెను. అతనికి 'వాక్కు' లభించును.

    5. ఒకటవ మంత్రమున చెప్పిన అయిదు + రెండవ మంత్రమున చెప్పిన అయిదు = పది అగును. విరాట్ ఛందస్సు పది అక్షరములు కలది. అన్నము 'విరాట్' స్వరూపము అందువలన యజమానికి మృష్టాన్నము కలుగును.

    6. సమిధో యజత్యస్మిన్నేవలోకే ప్రతి తిష్ఠతి - సమిత్ యాగము చేసిన వాడు ఈలోకమున ప్రతిష్ఠ కలవాడు అగును.

    తనూన పాతం యజతి యజ్ఞఏవాన్తరిక్షే ప్రతితిష్ఠతి.
    ఈడోయజతి పశుష్యేవ ప్రతితిష్ఠతి.
    బర్హి ర్యజతి యఏవ దేవయానాః పన్థానస్తేష్వేవ ప్రతి తిష్ఠతి.
    స్వాహా కారం యజతి సువర్గ ఏవలోకే ప్రతి తిష్ఠతి.
    ఇవియే దేవలోకములు. పూర్వము చెప్పినట్లు ఆ లోకములందు ప్రతిష్ఠావంతుడగును.

    7. దేవతలు, అసురులు ఈ లోకముల కొరకు జగడము లాడినారు. దేవతలు - పైన చెప్పిన ప్రయాజయాగములు చేసినారు. ఈ లోకముల నుండి అసురలను పారద్రోలినారు. అందువలన 'ప్రయాజ' లకు పారద్రోలుట అను సార్థకనామము కలిగినది.

    సమిధాది పంచప్రయాజలు అనుష్ఠించిన వాడు శత్రువులను పారద్రోలును.

    (ఋతవో హి ప్రయాజాః - ప్రాణావై ప్రయాజాః పశవోవై ప్రయాజాః అని బ్రాహ్మణములు.)

    8. ఉత్తరోత్తరాభివృద్దికి అభిక్రమణ పూర్వకముగ ప్రయాజ హోమములు చేయవలెను.

    (అగ్నికి అభిముఖముగా ఉండి హోమము చేసి తదుపరి పాదము ముందుకు జరిపి హోమము చేయుట అభిక్రమణ అగును.)

    9. జంటల వంటి ప్రయాజలను తెలిసి కొన్నవాడు ప్రజయా పశుభిః ప్రజాయతే - పుట్టుకతోనే ప్రజలు, పశువులు కలవాడు అగును.

    'సమిత్' యాగమును అనేక స్త్రీలను వలె యజించవలెను. 'తనూనపాత్' యాగమును ఒకే పురుషుని వలె యజించవలెను. అవి మిథునము అగును.

    'ఇట్' యాగమును అనేక స్త్రీలను వలె యజించవలెను. 'బర్హి' యాగమును ఒకే పురుషుని వలె యజించవలెను. అవి మిథునము అగును.

    ఈ విధమగు ప్రయాజ మిథునములను తెలిసి కొనినవాడు ప్రజయా, పశుభిః ప్రజాయతే.

    10. దేవతలు, ఆజ్యభాగ దేవతలు విముఖులు అయినారు. అప్పుడు అసురులు దేవతల యజ్ఞములను ధ్వంసము చేయ తలపెట్టినారు.

    దేవతలు ఆ విషయమును గ్రహించినారు. గాయత్రీ మంత్రమును వ్యూహముగా తీర్చినారు. గాయత్రి యందలి అయిదు అక్షరములను ఒక వ్యూహముగను, తరువాతి మూడు అక్షరములను ఒక వ్యూహముగను ఏర్పరచినారు. అది యజ్ఞమునకు కవచము వంటిది అయినది. రాక్షసులు దహనము చేయలేకపోయినారు.

    యజమాని ప్రయాజ అనుయాజలను అనుష్ఠించును. అప్పుడు ఆ ప్రయాజ అనుయాజలకు గాయత్రి కవచముగా ఏర్పడును. అందువలన సైన్యము ముందు భాగమున పెద్దదిగా ఉండి చివర చిన్నదిగా ఉన్నట్లు అగును.

    (గాయత్రి యందలి అక్షరములందలి వ్యూహములందు ఒకటి పెద్దది, ఒకటి చిన్నదిగా అయిన సాదృశ్యము.)

    11. రాక్షసులు రాకముందు దేవతలు స్వాహా కారమను పంచమ ప్రయాజతో యజ్ఞము సమాప్తము చేయదలచినారు. అనుకున్నట్లే స్వాహాకార పంచమ ప్రయాజతో యజ్ఞమును పూర్తిచేసినారు.

    స్వాహాకారమున ప్రయాజయజ్ఞము సమాప్తము చేసినందున యజ్ఞమునకు విచ్చిత్తి కలిగించిన వారు అగుచున్నారు. ప్రయాజలను అనుష్ఠించి యజ్ఞము నిరంతరము సాగుటకు హవిస్సులను అభిఘరించవలెను. అందువలన పురోడాశాది హవిస్సును చెసినట్లగును. మరియు యజ్ఞమునకు విఘ్నములు కలుగవు.

    12. ప్రయాజ, అనుయాజలందు ప్రయాజలు ముందు అనుష్ఠించ తగినవి. కావున అవి తండ్రి వంటివి. అనుయాజలు తరువాత చేయదగినవి. కావున పుత్రుని వంటివి.

    ప్రయాజల పిదప హవిస్సును అభిఘరించుట వలన తండ్రి పుత్రుని చేరినట్లగును.

    13. ఒకడు - ముందుచెప్పిన ప్రయాజ వృత్తాంతమును తెలిసికున్నాడు. ఒకడు తెలిసికొనలేదు. అటువంటి ఉభయరీతుల వారు ఉన్న సభ జరిగినది. అచట ఆ తెలియని వారు తండ్రి వృత్తాంతము సాధారణము - పుత్రుని వృత్తాంతము సాధారణమే కదా! అన్నారు.

    తెలిసిన వారు ఆ వృత్తాంతపు ప్రాశస్త్యమును వివరించినారు.

    14. ప్రయాజ యాగములు జరుగుచుండగా జారిక్రింద పడిన ఆజ్యము అస్కన్నమేవ - జారినష్టపడినది కాకుండును.

    15. గాయత్రి తదభిఘారమున గర్భము దాల్చినట్లు అగును. ఆమె యజమాని కొరకు ప్రజలను, పశువులను పుట్టించును.

                                      రెండవ అనువాకము

    1. ఆజ్యభాగ హోమములు యజ్ఞమునకు నేత్రముల వంటివి. ఆ హోమములు చేసినవాడు యజ్ఞమునకు నేత్రములు కూర్చినవాడు అగును.

    2. ఆహవనీయాగ్నికి పూర్వార్థమున ఆజ్యభాగ హోమములు చేయవలెను. నేత్రములు తలకు ముందు భాగమున ఉండును కదా!

    3. ఆజ్య భాగహోమములు తిన్నగా - వంకర లేనట్లు - చేయవలెను.

    4. యజ్ఞకర్త అగ్ని ద్వారా దేవలోకములను, సోమదేవత ద్వారా పితృలోకమును చూచును. కావున ఉత్తరార్ధము నందు అగ్నిని, దక్షిణార్ధము నందు అగ్నిని, దక్షిణార్ధమున సోమదేవతకు హోమము చేయవలెను. దేవా, పితృలోకములు ఆ దిశలందే ఉన్నవి కదా! అందువలన యజమానికి ఆ ఉభయలోకముల అభిజ్ఞానము కలుగుచున్నది.

 Previous Page Next Page