Previous Page Next Page 
అందాల జాబిలి పేజి 6


    రవి కళ్ళు చక చకా అక్షరాల వెంట పరిగెత్తాయి! అది ఫామిలీ ప్లానింగ్ కి సంబంధించిన కవిత.
    "ఈ సబ్జక్టయితే సెలక్టవుతుందని---"
    నవ్వుకున్నాడు రవి. భావాలు ఫరవాలేదు పేపర్లలో, రేడియోలో, గోడలమీదా రాసే స్లోగన్స్ కి కవితా రూపం వచ్చిన చిక్కల్లా భాషలోనే! కొంత వ్యావహారికం --- కొంత శిష్ట వ్యావహారికం --- కొంత ప్రబంధ పదబంధ ధోరణి!
    "దిద్ది పెట్టండి!"
    జేబులోంచి బాల్ పెన్ తీసి గబగబా ఒక్కో పాదాన్ని మళ్ళీ చదువుతూ కొట్టివేస్తూ మారుస్తూ వెళ్ళుతున్నాడు. అనుభవం వున్నమనిషి పార్కులో పెరిగే మొక్కల్ని చక చకా కత్తికతో కత్తిరించినట్టుగా  వాక్యాల్ని నరుకుతూ, పదాల్ని దిద్దుతున్నాడు.
    ఆశ్చర్యంగా చూస్తోంది రాజ్యలక్ష్మి.
    ఆ పావు గంట ఆమెకి అదోలా వుండింది. మెల్లగా లేచి మధ్యహాలు దాటి, మధ్య గదులు దాటి, వంటిల్లు చూసి, పెరట్లోకి వెళ్ళింది. ఇల్లంతా అసహ్యంగానే వుంది. ఎలా వుంటున్నారీ పాత మట్టి కొంపలో అనుకుంది కానీ పెరడు సంద్య ద్యానంలాగా వుంది. ఎక్కడా ఒక్క పిచ్చి మొక్కలేదు. అన్నీ కాయకూరల చెట్లే! ఏప్రిల్ నెలలో కూడా బాగా కాసి, పూసి ఉన్నాయి.
    "తోట చూస్తున్నావా?" నవ్వుతూ పలకరించింది సుబ్బమ్మగారు మట్టి కాంపౌండ్ గోడకి పిడకలు ఊడుస్తోంది ఆమె.
    తలూపింది రాజ్యం.
    "ఇదంతా వాడి నేర్పే!"
    మాటల్లో మళ్ళీ తిరిగి వచ్చింది హాల్లోకి. ఆసరికి రవి తన బాధ్యతని పూర్తిచేశాడు.
    చకచకా పరిగెత్తాయి ఆమె కళ్ళు!
    ఆశ్చర్యం! ఎంత బావుంది కవిత!
    అవే పదాలు! అవే భావాలు! అదే వాక్యవిన్యాసం! కానీ అతని సవరణలతో ఎంత సొంపు, యింపు వచ్చేసింది!
    "యూ ఆర్ గ్రేట్!" అంది గొప్పగా.
    "థాంక్యూ!" ప్రిన్స్ ఆఫ్ వేక్స్ లాగా కృతజ్ఞతలు చెప్పాడు.
    మెల్లగా బయటికి దారి తీసింది. ఆమెకి ఆ పరిసరాలు బొత్తిగా నచ్చలేదు.
    "మీరు శ్రమ అనుకోనంటే నా గేయాలన్ని దిద్దిపెట్టండి!"
    "విత్ ప్లెజర్!" పొగడ్తలో ఉప్పొంగి పోయిన మనస్సు మాటమీరేడు.
    "మరి వస్తాను! మళ్ళా---"
    "మీ యిష్టం ఎప్పుడైనా రండి. ఉంటే యింట్లో లేదా అదిగ ఆ చెట్టు-గుబురుగా కనిపిస్తోందే ఆ చెట్టు-అదీ నా సామ్రాజ్యం" నవ్వేడు రవి.
    కార్లో కూచుని టాటా చెప్పింది.
    పిల్లలంతా జయప్రదనో, జయసుధనో, శ్రీదేవినో చూసినట్టుగా చూస్తున్నారు.
    కారు కదిలింది. కనుమరుగైంది.
    రవి మనస్సు శూన్యం అయిపోయింది.
  
                                            5
    ఓ రోజు సాయంకాలం నాలుగు గంటల సమయం! ఏమీ తోచక చదివేదీ, రాసేదీ తగినంత తృప్తి యివ్వక టౌన్ లోకి బయలుదేరాడు రవి! దారివెంట మనుషుల్నీ, రిక్షాబళ్ళనీ, జట్కాబళ్ళనీ గమనిస్తూ వెతుకుతున్నాడు. ఏనాడైనా తను రాయగలిగితే యీ మనుషులు, పరిసరాలూ తనకి ఉపకరణాలు అవుతాయి అనుకున్నాడు. లోక పరిశీలనా, గ్రంధ పరిశీలనా లేని రచన ఏం బావుంటుంది?
    "ఒరే రవీ!"
    పరధ్యానంగా ఆలోచనల్లో మునిగిపోయి నడుస్తోన్న రవి, కేకలాటి ఆ పిలుపువిని అటుచూశాడు.
    ధియేటర్ గేటుకి అటుప్రక్కగా వున్న బడ్డీ కొట్టులోంచి కేక వేస్తున్నాడు సమద్. రవికి హైస్కూల్ మేట్.
    "ఏమిటలా ఆలోచనల్లో మునిగి నడుస్తున్నావు? మనవూరి రిక్షావాళ్ళ విషయం తెలియదా? బెజవాడ సిటీ బస్సులూ మనవూరి రిక్షాలూ యమధర్మరాజుకి డైరెక్టు ఏజెంట్లు"
    నవ్వాడు రవి. "ఎలా వుంది వ్యాపారం?"
    "నాలుగేళ్ళయిందిగా! నాలుగువేళ్ళూ లోపలికి వెళుతున్నాయి బాగా" అతను ముస్లిమ్ అయినా భాష నాజూగ్గా, స్లిమ్ గా వుంటుంది.
    "వెరీ గుడ్?" చక్కబల్ల నానుకుని నుంచున్నాడా రవి.
    గెలలోంచి అరటిపండు తుంచి యిచ్చాడు సమద్.
    "నో థాంక్స్"
    "ఎందుకు భాయ్! పండిచ్చినా పాలిచ్చినా వద్దనకూడదు తెలుసా?" ఆశ్చర్యంగా అన్నాడు.
    "నా విషయం తెలుసుగా! ఉదయం భోజనం, రాత్రికి భోజనం మధ్యన ఏమీ అలవాటు లేదు."
    "చాల్లేవోయ్! ఈ పండు తింటే నీ నియమమేమీ చెడిపోదు" ఒలిచి అందించాడు కాదనలేకపోయాడు రవి.
    కేంటిన్ లోపలికి తొంగిచూసి "రమణా రెండు బెస్ట్ టీ" అన్నాడు సమద్. కంగారుపడ్డాడు రవి.
    "వద్దు, వద్దు" అన్నాడు గాబరాగా.
    "ఏం? ఇదీ నిషిద్ధమేనా? రవీ, ప్రాప్తకాలజ్ఞునిలాగా వుండాలోయ్. ఏ సమయంలో ఏది లభిస్తే అది తిన్నవాడు సన్నాసి అవుతాడట. రుచికోసం దేవుళ్ళాడితేనే బాధ... అయినా ఎప్పుడూ నువ్వు ఈ కేంటీన్ టీ తాగలేదుకదూ."
    "ఏ కేంటీన్ టీ తాగను. నాకు ఈ రంగూ, రుచీ, వాసనా అట్టే గిట్టవు"
    "మనకిది స్పెషల్ లే! అన్నట్టు విన్నావా మీ శిష్యురాలు రాజ్యలక్ష్మికి రేడియో ప్రోగ్రాం వచ్చింది గురువును మించిన శిష్యురాలు."
    ఆమాటవిని ఆశ్చర్యపోయాడు రవి. "ఒక్కమాటైనా చెప్పింది కాదే" అనుకున్నాడు. ఒక్కక్షణం మనస్సు బాధగా మూలిగింది.
    "మా చెల్లెలికి చెప్పిందటలే. ఈరోజే కాంట్రాక్టు వచ్చిందట" టీ అందిస్తూ అన్నాడు సమద్. రవి మౌనంగా అందుకున్నాడు కప్పు.
    "టీ బాగానే వుంది. రుచికి బానిసకావచ్చు."
    "ఎలా వున్నాయ్ ఉద్యోగ ప్రయత్నాలు."
    నిట్టూర్చాడు రవి.
    "ఇదిగో నా మాటవిను. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీం క్రింద ఓ బడ్డీకొట్టుపెట్టు. ఏడాది తిరక్కముందే లాభాలొచ్చేస్తాయి. నన్ను చూడు, ఈ నాలుగేళ్ళలో మా సంసారాన్నంతా యీది నాలుగువేలు కూడేశాను. నీకయితే యింకా లాభమే. పైగా బ్యాంక్ వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు."

 Previous Page Next Page