Previous Page Next Page 
అనుభవాల అలలలో పేజి 6

    ఆమె చేతిలో పిల్ల ఎంతసేపు ఏడ్చిందో! యింక ఏడ్వలేక సొమ్మసిల్లి ఆమె మీదనే పడివుంది.
   
    అందరూ ఆమెని చూస్తున్నారు.
   
    "ఎవతో ముష్టిది" వకడన్నాడు.
   
    "ఇక్కడ పాయింటు ముష్టిదా కుష్టిదా అనికాదు. అది చచ్చింది. దాని పిల్ల బతికే వుంది. దానినెవరు తగలేస్తారు! ఆ పిల్ల నెవరు చేరదీస్తారు? అదీ కావల్సింది. మనిషికి మనిషే బరువు...ఆ పిల్ల దాని సంగతి."
   
    "దిక్కులేని వారికి దేముడే దిక్కు."
   
    "ముష్టి వాళ్ళకి కూడా బంధుమిత్రులుంటారే!"
   
    జరుగుబాటున్న వాళ్ళు నాలుగు వేళ్ళూ ప్రతిరోజూ నోట్లోకి పోతున్న వాళ్ళూ ఆమెను చూసి మాట్లాడుకుంటున్న మాటలు అవి.
   
    అక్కడే కొందరు ముష్టివాళ్ళు చేరారు.
   
    "ప్రతిబండీ మనం ఎక్కుతుంటాం...ఈ ఆడది మన కెప్పుడూ తగలలేదురా కుంటోడా!" బిచ్చాలగాడు తల బరుక్కుంటూ అన్నాడు.
   
    "అది ముష్టిది కాదు. మన జాతి పక్షయితే ఏదో ఒక స్టేషనుకాడ ఏదో ఒక రైలు పెట్టెలో మనకి కానవచ్చేదే! ఎవరో బాగా బతికిన మనిషే అయి వుంటుందిరా. ఆ పసిపిల్ల చూడు చక్కగా గుమ్మటంలా వుంది" జోలె సవరించుకుంటూ కుంటూ అన్నాడు.
   
    "పరీచ్చగా చూస్తే ఈ ఆడకూతురు పెద్దింటి పిల్లలానే అవపడుతున్నదిరా."
   
    "అవునురోయ్, మా బాగా కనిపెట్టావ్?"
   
    ఆడ దంటే విలాస వస్తువనుకునే ఇద్దరు కుర్రాళ్ళు వీళ్ళ మధ్య ఆమెను చూస్తూ వున్నారు.
   
    "చచ్చింది జొన్నపీచులా వుంది కాని పిల్ల, ఆ పిల్ల జాంపండులా వుందిరా...అవునా?"
   
    "ఏ జాంపండుగాడి వల్ల కన్నదో." వెకిలి నవ్వు జోడించి అన్నాడు.
   
    "రోగాలు తగిలి అలా అయివుంటుందిరా. గతంలో ఆ పిట్ట పిటపిటలాడుతూ వుండేదేమో!" రెండోవాడి అనుమానం.
   
    "ప్రస్తుతం పనికిరాదు పైగా చచ్చింది."
   
    "పదహారేళ్ళు ఆగితే ఆ పిల్ల అంది వచ్చేది తొందర పడి వెళ్ళిపోయింది యిది."
   
    అంతకు మించిన పెద్ద జోకు లేనట్లు ఇద్దరూ నవ్వుకున్నారు.
   
    అలా తలో విధంగా మాట్లాడుకుంటున్నారు.
   
    పుట్టినచోటేక్కడో తెలుస్తుందిగాని చచ్చేచోటెక్కడో ముందే ఎవరికీ తెలియదంటారు. ఆమె ఎక్కడ పుట్టిందో ఎలా జీవించిందో అక్కడున్న ఎవరికీ తెలియదు. కాని ఆమె ఈ స్టేషనులో ప్లాట్ ఫామ్ మీదవున్న బెంచీపై చెట్టుకింద మరణించిందని చూసే వాళ్ళకి తెలుస్తున్నది. ఆమె బ్రతికున్న రోజుల్లో ఏనాడూ వూహించి వుండదు...రామాపురం స్టేషను ప్లాట్ ఫామ్ మీద దిక్కులేని చావుకి బలవుతాననీను, తన అంతిమ క్షణాలు...తన దీర్ఘనిద్ర...ఇక్కడే_ఇక్కడే....అన్నీను...
   
    ఇదిలా వుండగా ఇదే సమయంలో స్టేషన్ బయట టమేటో రంగుతో మెరిసి పోతున్న టయోటా కారు ఆగింది.
   
    కారులోంచి అందమయిన ఓ సుందరి ఆజానుబాహుడైన వకతను దిగారు.
   
    అతను కారు డోరు లాక్ చేసి కీస్ జేబులో వేసుకునే లోపల ఆమె పరుగులాంటి నడకతో ముందుకు నడిచింది.
   
    అతను నాలుగంగల్లో ఆమెను చేరాడు.
   
    ఇరువురూ కలసి స్టేషనులోకి వచ్చి చుట్టూ కలయ చూశారు.

 Previous Page Next Page