పచ్చరంగు చిన్న కారు చాలా స్పీడ్ గా ముందుకు దూసుకు వెళుతున్నది.
డ్రైవర్ తలతిప్పి వెనక్కు చూడటంగాని వందనాదేవిని పలకరించటంగాని చేయలేదు. ఏకాగ్రతతో డైవ్ చేస్తున్నాడు.
ఇలా యింట్లోంచి రావటం. రాజ్ చేసిన ఈ ఏర్పాటు రవంత భీతి బోలెడు థ్రిల్లింగ్ గాను వుంది వందనాదేవికి. పెదనాన్నగారింట్లో యిప్పుడు ఏం జరుగుతుంటుందో ఏముంది. నానా గోల అవుతుంది. తనని వెతకటానికి నలుమూలలకీ మనుషులని పరుగెత్తిస్తారు. ఫోన్ కాల్స్ చాలా చోట్లకి వెళ్ళిపోతాయి. ఇంటిలోంచి వెళ్లిపోతానని లేక చస్తానని, అంతేగాని యీ పెళ్ళిమాత్రం చేసుకోనని తను బెదిరించింది.
"ఈ గోపాలరావ్ సంగతి నీకు తెలియదు. నీ పని నీవు చెయ్యి. నా పని నేను చేస్తాను. మృత్యువు వడిలోంచి లాక్కురాగలను. పారిపోతే అరగంటలో మూలమూలలా గాలించి ముహూర్తం సమయానికి నిన్ను పెళ్ళి పీటమీదకి చేర్చగలను"
ఆలోచనలో వున్న వందనాదేవి సీటుమీంచి కొంచెం ముందుకు జరిగి "పెదనాన్నగారు ఈ సరికి నా కోసం నలుమూలలకీ మనుషులని పంపించే వుంటారు. ఫరవాలేదు కదూ!" ఆదుర్దాగా అడిగింది.
అతను తల వెనక్కు తిప్పకుండానే అన్నాడు.
"ఆపరేషన్ సక్ సెస్"
అతనేమన్నాడో అర్ధం కాలేదు. "అంటే" అంది వందనాదేవి.
"స్టేషన్ వచ్చేస్తున్నది. ఫోన్ చేసి తెలుసుకున్నాము. ట్రైన్ కరెక్టు టైముకే వస్తోంది. రాజ్ ముస్లింభాయ్ వేషంలో టిక్కెట్ తో సహా రెడీగా వుంటాడు. మారువేషం కాబట్టి మీరు అతనిని గుర్తు పట్టలేకపోవచ్చు. గడ్డం కుచ్చుటోపీ ముఖం సగం కప్పేస్తూ బ్లాక్ గాగుల్స్, మంచి గుర్తు ఏమిటంటే రాజ్ మాటిమాటికి ఎర్రని రుమాలుతో ముక్కు తుడుచుకుంటాడు" అతను చెపుతూనే వున్నాడు స్టేషను వచ్చింది.
స్టేషను బైటే వున్న రాజ్ పరుగున కారు దగ్గరకు వచ్చాడు.
"ట్రైను బి ఫోర్ టైముకి వస్తున్నది. సిగ్నల్ ఇచ్చేశాడు.క్విక్" అంటూ ప్లాట్ ఫాం వైపుకి నడిచాడు.
"అతి తక్కువ మాట్లాడండి అనుమానం ఏ మాత్రం మీ ప్రవర్తనలో కానరాకూడదు. భగవంతుడు సదా మిమ్మల్ని కాపాడాలని కోరుతున్నాను. వెళ్ళండి" కారు దగ్గరే నిలిచి డ్రైవర్ అన్నాడు.
పెద్ద పెద్ద అంగలేస్తూ నడుస్తున్న రాజుని పరుగులాంటి నడకతో అనుసరించింది వందనాదేవి.
దడదడ శబ్దం చేస్తూ ట్రైన్ వచ్చేసింది.
రెండు పెట్టెలు ఒక బాస్ కెట్ లో పోర్టర్ వాళ్ళని అనుసరించాడు.
బురఖా తీసేస్తే ప్రమాదం కాబట్టి-అది ఏమాత్రం తొలగకుండా జాగ్రతపడుతూ వదిగి కూర్చుంది. తన సీటు మీద. రాజు కూడా తనపక్కన కూర్చుంటే "ఈ ప్రయాణం ఎక్కడిదాకా! ముందేం చేయాలి?" అంటూ ఎన్నో మాట్లాడాలనుకుంది. కాని ఇద్దరాడవాళ్ళు వచ్చి వందనాదేవిక చెరోపక్కా కూర్చున్నారు. దానికితోడు సీతుకింద కాళ్ళ చుట్టూతా వాళ్ళ సామాను బోలెడు వుంది.
ఇదే ఆలోచనలో వున్న రాజు నిరాశగా ఎదుటి సీట్లో కూలబడ్డాడు. ట్రైను బయలుదేరుతుండగా డ్రెస్ లో వున్న పోలీసు ఇన్ స్పెక్టర్ వచ్చి రాజు పక్కనే కూర్చున్నాడు.
ట్రైన్ ఓ గావుకేక పెట్టి బయలుదేరింది.
బాత్ రూంకు వెళ్ళి వచ్చే నెపం మీద ఓ సారి లేచి ఇన్ స్పెక్టర్ కి దూరంగా కూర్చున్నాడు రాజు.