"సరేలే" అంది అరుంధతి. సరేలే నీవెందుకు వచ్చావ్ తొందరగా కక్కు అన్న ఫోజులో.
"మిమ్మల్ని పిలవమని చెపుతున్నాను. మీరు వచ్చారు. మీకు వెయ్యేళ్ళు ఆయుష్షు."
"ఎందుకు! ఇంకా పదికాలాల పాటు బాధపడి చావటానికా! సంపాదన చేతగాని మొగుడు..." నోరు జారినట్లు తెలుసుకుని అక్కడితో ఆగింది అరుంధతి.
"మిమ్మల్ని చూస్తుంటే మా అక్కని చూసినట్లు వుంది. ఎర్రని, సన్నని పెదవులు, వంపు తీరిన చక్కని ముక్కు, ఎత్తైన నుదురు, ఇంత అందమైన నుదురు మీకుంది. మా అక్కకి వుంది. రేఖ సినిమా తార ఆమెకి వుంది..." దీక్ష మాట్లాడుతూ అరుంధతిని నిశితంగా పరీక్షించింది. అరుంధతి ముఖం ప్రసన్నంగా మారటం గమనించింది.
"నన్ను చూసిన అందరూ అలాగే అంటుంటారు" మురిసిపోతూ చెప్పింది అరుంధతి.
"చూసే వాళ్ళకి మనసు, కళ్ళు వుంటే చాలండీ! మసి బొగ్గుని మసి బొగ్గనే చెపుతారు. మాణిక్యాన్ని మాణిక్యం అనే చెపుతారు." అంది దీక్ష.
"నిజం చెప్పావు" మెచ్చుకుంది అరుంధతి.
దీక్ష భుజాన తగిలించుకున్న గుడ్డ సంచిలో చేయిపెట్టి పాంప్లెట్ తీసింది. దానిని అరుంధతి చేతిలో పెడుతూ "మంచి మనసు మంచి మాట మంచి హృదయం కూడా వుండాలి. ఈ రెండూ మీకున్నాయి." అంది. వెంటనే మరోసారి కలుస్తానని చెప్పి ఆ యింటి మెట్లు దిగింది.
"మంచిదమ్మా!" అని చెప్పి పాంప్లెట్ చదవబోయింది అరుంధతి. కాని... "ఆ పిల్ల వెళ్ళిపోయినట్లుందే!" అంటూ పద్మనాభం వచ్చాడు.
అరుంధతికి వళ్ళు మండింది. ఆ మంటని పైకి తెలియనివ్వకుండా కాస్త నవ్వి "ఆ వెళ్ళిపోయింది" అంది.
అరుంధతి అన్నట్లుగా లేదు. అరచినట్లు వుంది పద్మనాభం ప్రాణానికి. "అదికాదు" అంటూ గొణిగాడు.
"అదికాదు ఇదికాదు. నాకు తెలుసులెండి మీ వెధవబుద్ధి. ఆడవాళ్ళు ఇంటికి వస్తే చాలు మీ ముఖం చింకిచేటంత అవుతుంది. మాటలు వింటే చాలు వళ్ళూ పై తెలియదు."
"సరేలే, నేను అలాంటి వాడిని కాకపోయినా అస్తమానం ఆడి పోసుకోటం మానవు. ఆ పిల్లా ఏదో కాగితం యిచ్చినట్లు వుంది?" భార్య చేతిలో కాగితాన్ని ఓరకంట చూస్తూ అడిగాడు.
"ఇచ్చింది"
"ఏమిటి?"
"మగవాళ్ళ వెధవబుద్ధులు తెలుసుకోవటం ఎలా అని కాసిని నీతి వాక్యాలు రాసివున్న కాగితం యిది. చదువుతారా! ఏమీ అక్కరలేదు. యిస్తానంటే ఎంత ఆశో వెళ్ళండి." గడగడ వాగింది అరుంధతి.
పద్మనాభం గొణుక్కుంటూ అవతలికి వెళ్ళాడు.
అప్పుడు అరుంధతి పాంప్లెట్ చదవటం మొదలు పెట్టింది.
పాంప్లెట్ లో వున్నది చదువుతుంటే అరుంధతికి ముచ్చెమటలు పోశాయి. అరుంధతి పులితోలు కప్పుకున్న ఆడది. ఆమె గుర్ గుర్ లు అవతలి వాళ్ళు తలవగ్గే వరకే. ఏయ్, నా తడాఖా చూస్తావా అంటే చాలు వెనక్కి తగ్గేరకం.
పాంప్లెట్ చదవటం పూర్తి చేసి "ఏమండోయ్ ఓసారి యిటురండి" అని గావుకేక పెట్టింది అరుంధతి.
"నన్నేనా!" అంటూ పరుగున వచ్చాడు పద్మనాభం.
"మిమ్మల్ని గాక యింకెవరిని పిలుస్తాను. మీరూ నేనూగాక ఈ కొంపలో ఎవరు చచ్చారు, గనుక! కయ్యిమంది అరుంధతి.