"కుదర్దు అన్నానుగా" అంది కాసింత చికాగ్గా.
"అదే ఎందుకని అడుగుతున్నా... నేనేమైనా నాతోపాటు హొటల్ కు రమ్మన్నానా? టాంక్ బండ్ కే కదా...పోనీ ఓటెన్ ఫీట్ మెయింటెన్ చేయానా?"
అంత చికాకులో నవ్వొచ్చింది అవనికి. అనిరుద్రలో ఆమెకు నచ్చే గుణం అదే తన చికాకును కూడా జోవియల్ గా ఎదుటివారికి చెప్పగలడు.
"డుంబు నాతో పాటు వున్నాడు. స్కూల్ కు వెళ్ళలేదు. ఆఫీసుకు వచ్చాడు."
అదేం?"
"అన్నింటికీ ఆశ్చర్యాలేనా? రేపు చేబుతాన్లే."
"అలాగే...బై..అన్నట్టు ఒక్క చిన్న రిక్వెస్ట్. పెళ్లయ్యాక కూడా ఇలా డుంబును ఆఫీసుకు తీసుకువెళ్ళకు. ఒకవేళ నాకు మూడొచ్చి... ఏమోయ్...థియేటర్ కు వచ్చేయ్ అని ఫోన్ చేస్తే, సారీ కుదర్దు...డుంబు వున్నాడంటే వూర్కునేదిలేదు."
ఫక్కున నవ్వింది అవని.
వసుధ చిత్రంగా చూసింది అవని వై పు.
"అలాగే..ఫోన్ పెట్టేస్తున్నా" అంది అవని. అంతేకాదు వెంటనే రిసీవర్ పెట్టేసింది. లేకపోతే ఇంకేం జోక్ వేస్తాడో. తను నవ్వలేక ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనన్న భయంతో.
"అనిరుద్ర ఫోన్ చేశాడా?" ఆఫీసు వదిలాక ఇంతికేళ్లేముందు అడిగాడు డుంబు.
"పెద్దవాళ్ళను పేరుపెట్టి పిలవద్దని చెప్పానా?" అంది అవన "పోనీ అనిరుద్ర అన్నయ్య అని పిలవనా?" అక్క మొహంలోకి పరిశీలనగా చూస్తూ అడిగాడు డుంబు.
"ఛ...ఛ...అన్నయ్యేంటి అసహ్యంగా" అంది మొహమంతా అదోలా పెట్టి అవని.
"పోనీ...అంకుల్ అని..."
"వద్దు...అది కూడా బాగాలేదు."
"మరి బావ"
"బాగుంది... అనేసి నాలుక్కర్చుకుంది" అవని.
` వెంటనే డుంబు మొహంలోకి చూసింది.
ముసి ముసిగా నవ్వుతున్నాడు.
'డుంబూ..నువ్వు బాగా ఎదిగావురా, మనసులో అనుకుంది అవని.
"ఏంటక్కా.. చెప్పు..ఏమని పిలవాలి?"
"నీకు పైవ్ స్టార్ చాక్లెట్ కావాలా" అడిగింది మాట మారుస్తూ అవని.
డుంబు నవ్వి అన్నాడు. "ఏమొద్దులేగాని ...నువ్వూర్కే అస్తమానం అలా సిగ్గుపడిపోకు...నేను ప్రసూనను చూసి సిగ్గుపడుతున్నానా" అన్నాడు గంభీరంగా డుంబు.
"ప్రసూన ఎవర్రా?"
"నా గాళ్ ఫ్రెండ్ లే...సిక్త్స్ స్టాండర్డ్...భలే వుంటుంది పిలక జడయినా."
"నువ్వు బాగా అడ్వాన్సయ్యావ్రా" అనుకుంది.
ఇద్దరూ ఇంటికి బయల్దేరారు.
దారిలో హిమబిందు బేకరీ దగ్గర ఆగి, ఓ చికెన్ పిజ్జా తిని, కోక్ తాగారు.
ఆరోజు ఎందుకో రిలీఫ్ గా అనిపించింది.
* * *
రాత్రి అందరు టి.వి. ముందు కూర్చున్నారు. సూర్యనారాయణ స్యూస్ చూసాడు. మహాలక్ష్మి వెంటనే డెయిలీ సీరియల్ చూస్తానంది. డుంబు స్టార్ మూవీస్ లో హారర్ షో చూస్తానన్నాడు.
తల్లీకొడుకులు వాదులాడుకున్నారు.
సూర్యనారాయణ ఒళ్ళుమండి టి.వి. కట్టేశాడు.
"వెళ్ళి పడుకోండి. ఈ టి.వి. వచ్చినప్పట్నుంచి నాకు సుఖం లేకుండా పోయింది. అంతకుముందుయితే బుద్ధిగా వుండేవాళ్ళు. ఇప్పుడు స్వపక్ష, విపక్షాలయ్యారు" కోపంగా అన్నాడు.
డుంబు వెంటనే తన గదిలోకి వెళ్ళాడు తల్లి వంక చురచుర చూస్తూ.
మహాలక్ష్మి గొణుక్కుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అవని అప్పటికే మంచం ఎక్కేసింది.
అందరూ వెళ్ళిపోయారని కన్ ఫర్మ్ చేసుకున్నాక సూర్యనారాయణ టి.వి. ఆం చేసి 'వి' ఛానెల్ పెట్టుకున్నాడు.
* * *
రాత్రి పదకొండున్నర.
అందరూ నిద్రలోకి జారుకున్నారు.
ఫోన్ రింగయింది.
ఉలిక్కిపడి లేచింది అవని. ఆ నిశ్శబ్దంలో ఫోన్ శబ్దం భయంకరంగా వినిపిస్తోంది.
తండ్రి అప్పటిదాకా టి.వి. చూసి పడుకున్నాడు. అతని గురక పెద్ద శబ్దం తో వినిపిస్తోంది.
భయం వేసింది అవనికి. మళ్ళీ ఆ అగంతకుడే కాదు కదా!
ఇంత రాత్రివేళ.
మెల్లగా లేచి, స్లిప్పర్స్ వేసుకొని, హాలులోకి నడిచింది. ఫోన్ రింగవుతూనే వుంది.
వణుకుతున్న చేతులతో రిసీవర్ ఎత్తింది. ఒక్కక్షణం అటువైపు నిశ్శబ్దం.
"హలో"
మళ్ళీ నిశ్శబ్దం.
"హలో...ఎవరు" ఈసారి గొంతు పెంచి అడిగింది అవని. "ప్చ్...తమ్ముడికి తృటి లో ప్రమాదం తప్పింది కదూ..."
అవని గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి.
"ఒక్కక్షణం... ఆలోచించు... నరాల తెగిపోయే టెన్షన్ లో వున్నావా?" అటువై పు నుంచి అదే బొంగురు గొంతు.
ఉదయం తమ్ముడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి
"ఇదిగో మీరెవరో తెలియదు... ఇలా ఎందుకు బెదిరిస్తున్నారు. నేను డిటెక్టివ్ జేమ్స్ బాండ్ కు చెబుతాను...నాసంగతి మీకు తెలియదు" బింకంగా అంది అవని.
ఒక్కక్షణం అటువై పు నిశ్శబ్దం.
అవనికి వేయి ఏనుగుల బలమొచ్చింది. తన బెదిరింపు బాగానే పనిచేసిందన్నమాట.
"హలో" అంది.
అటువైపు నిశ్శబ్దం.
అంటే అతడు భయపడిపోయాడన్నమాట. అవనికి సంతోషం రెట్టింపయింది.
ఆమె సంతోషాన్ని పటాపంచలు చేస్తూ తెరలు తెరలుగా నవ్వు.
ఊపిరి బిగాపట్టింది. ఎందుకలా నవ్వుతున్నాడు?
"డిటెక్టివ్ జేమ్స్ బాండ్ కు చెబుతావా? అంత ధైర్యమా? నీకా సలహా ఎవరిచ్చారు?" అటువై పు నుంచి గొంతులో కరుకుదనం వినిపించింది.
"మా తమ్ముడు" అంది వెంటనే అనాలోచితంగా.
అలా అన్న తర్వాతగానీ తనెంత తప్పు చేసిందో అర్ధం కాలేదు.
మళ్ళీ నవ్వు.
"మీ తమ్ముడా...గుడ్...వెరీగుడ్" అని ఫోన్ పెట్టేసాడు.
ఒక్కక్షణం గుండె వేగంగా కొట్టుకుంది.
ఏం చేస్తాడు? కొంపదీసి తమ్ముడ్ని ఏమీ చేయదు కదా! ఛ...తను అనవసరంగా నోరు జారి తమ్ముడి పేరు చెప్పింది.
ఉదయం నుంచీ వున్న ఉత్సాహం ఒక్కసారిగా నీరుగారిపోయింది. తమ్ముడి గదిలోకి వెళ్ళింది. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు.
దేవుడా...దేవుడా...మా తమ్ముడికి ఏమీ కాకుండా చూడు స్వామీ అని గోడకున్న వేంకటేశ్వరస్వామి పటానికేసి చేతులు జోడించి మొక్కుకుంది.
ఏదో శబ్దమైంది.
ఉలిక్కిపడింది. అడుగుల శబ్దం. మరింత భయమేసింది. మెల్లిగా కర్టెన్ తొలగించింది.
పిల్లి...తేలిగ్గా నిట్టూర్చింది. తమ ఇంటి పిల్లి...డుంబుకు ఇష్టమైన పిల్లి...రోజూ దానికి పాలు పడతాడు.
ఆపిల్లి బుద్ధిగా వచ్చి డుంబు మంచమ్మీద సెటిలైంది.
ఏమనలేదు అవని.
పిల్లి తన గదిలో వుండడం తనకు ధైర్యంగానే అనిపించింది. ఇంట్లో ఎలుకల బాధ లేకపోవడానికి ఆ పిల్లి కూడా ఒక కారణమే.
ఆ పిల్లికి, డుంబుకు ఎటాచ్ మెంట్. ఒక్కోసారి తన పాలు కూడా ఆ పిల్లికే పోస్తాడు.
తనకు మాత్రం పిల్లిని చూస్తే ఎలర్జీగా అనిపించేది. ఇప్పుడెందుకో తన ఆత్మీయురాలిగా అనిపిస్తుంది.
తమ్ముడి మంచం దగ్గరికి వెళ్ళి పిల్లిని తన ఒళ్ళోకి తీసుకుంది. బుద్ధిగా అవని ఒళ్ళో కూచుంది పిల్లి.
ఆ మాత్రానికే చాలా ధైర్యం వచ్చినట్టు అనిపించింది. వెళ్ళి తన మంచమ్మీద పడుకుంది.
* * *
పెద్ద కేక వినిపించి ఉలిక్కిపడి లేచింది అవని. ఆ కేక డుంబుది. భయపడిపోయింది అవని.
ఏమైంది? రాత్రి తనకు ఫోన్ లో బెదిరింపు, మంచమ్మీద తమ్ముడు లేడు. భయంగా లేచి హాల్లోకి వెళ్ళింది. వెళ్ళేముందు దేవుడ్ని ప్రార్ధించింది.
"నా తమ్ముడికేం కాకుండా చూడు స్వామీ"అని.
హాలులో డుంబు ఏడుస్తున్నాడు. అంతలా ఏడ్వడం ఎప్పడూ చూడలేదు అవని.
"హమ్మయ్య...తమ్ముడికేం కాలేదు" అనుకుంది. తండ్రి, తల్లీ తమ్ముడ్ని ఓదారుస్తున్నారు.
'ఏమైందమ్మా" అవని అడిగింది తమ్ముడ్ని ఓదారుస్తున్న తల్లిని.
ఏం మాట్లాడలేదు తల్లి.
"ఏమైంది నాన్నా..." ఈసారి తండ్రిని అడిగింది.
సూర్యనారాయణ మౌనంగా తన చేతిని హాలు గుమ్మం వైపు తిప్పి చూపించాడు. అక్కడ దృశ్యం చూసిన అవని ఒళ్ళు జలదరించింది ఒక్క క్షణం.
పిల్లి చచ్చిపడి వుంది. రాత్రి తనింట్లో తిరిగిన పిల్లి.
తన ఒళ్ళో బుద్ధిగా కూచున్న పిల్లి...
తమ్ముడికి ఇష్టమైన పిల్లి.
ఇదెలా సాధ్యం?
సరిగ్గా అప్పడే ఫోన్ మ్రోగింది. ట్రాన్స్ లో వున్నట్టు నడిచి వెళ్ళి రిసీవర్ ఎత్తింది.
"పి..ల్లి.. చ..చ్చిం..దా...?" అటువై పు నుంచి గొంతు... అదే బొంగురు గొంతు.
"చెప్పానుగా...నేను చాలా చెడ్డవాణ్ణి.. పిచ్చి పిచ్చి పనులు చేస్తే..ఈసారి పిల్లి కాదు.. ఆ స్దానంలో మీ తమ్ముడు వుంటాడు."
న్నో.. అని గట్టిగా అరవాలనుకుంది. గొంతు చివర ఆ కేకను నొక్కి పెట్టింది.
వెంటనే రిసీవర్ పెట్టేసింది.
డుంబు ఇంకా ఏడుస్తూనే వున్నాడు.
* * *
తలంతా దిమ్ముగా వుంది. ఏ పనీ చేయాలనిపించడం లేదు.
బాస్ ఢిల్లీ నుంచి ఈరోజే వస్తాడని ఆఫీసుకు వచ్చింది అవని.
ఉదయం జరిగిన సంఘటన ఆమె కళ్ళ ముందు కదలాడింది.
పిల్లి చనిపోవడం యాక్సిడెంటల్ గా జరిగింది కాదు...ఫోన్ లో ఆ విషయాన్ని కన్ ఫర్మ్ చేసుకుంది.
ఆమెకు అర్ధం కాని విషయమొక్కటే...ఆ ఆగంతకుడు తననెందుకిలా బెదిరిస్తున్నాడు?
"ఏంటి అవనిగారూ.. దీర్ఘంగా ఆలోచిస్తున్నారు" శేషశాయి అవని సీటు దగ్గరికి వచ్చి పలకరించాడు.
అతని చూపులే ఇబ్బందిగా వుంటాయి అవనికి. గొంగళిపురుగు శరీరమ్మీద పాకుతున్న సెన్సేషన్.
"ఏం లేదు" అంది ముక్తసరిగా.
"అదేమిటండీ...ఈమధ్య మీరు అదోమాదిరిగా వుంటున్నారు. ప్రాబ్లం ఏంటో చెబితే నేను సాయం చేయానా? మనం మనమా ఒకటి" 'మనం మనము' అనే అధాలు ఒత్తి పలుకుతూ అన్నాడు శేషశాయి.
"నాకే ప్రాబ్లమూ లేదు. దయచేసి నన్ను వదిలేయండి" అంది అవని అసహనంగా.
"మీరు మరీ...నేనేమైన పట్టుకున్నానా ఏంటి?" వంకరగా నవ్వుతూ అన్నాడు శేషశాయి.
కోపంగా చూసింది అవని.
శేషశాయి మాత్రం నవ్వుతూనే వున్నాడు.