Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 6


    ఇంతలోనొక సేవకుఁడరుదెంచి "మహారాజా! పాటలీపుత్రపౌరులు కొందఱు తమ కష్టములు దేవర వారితో మనవి చేసికొనుటకై వచ్చియున్నా"రని పలికెను. నందరాజు కోపముతో "ఓరీ! ఇట్టి సంతోష సమయమున నట్టి సంతాప విషయములు వినము, పోపొ"మ్మని గద్దించెను.
    మఱియొక రాజభటుఁడరుందెంచెను. మహారా"జేల వచ్చితి"వని ప్రశ్నింపగా వాఁడు "ప్రభూ! మహామంత్రి రాక్షసులవారు మిమ్మొకమాటు దర్శింపఁగోరుచున్నా"రని మనవిచేసెను. "ఇది సమయము కాదు. మఱియొక మాటు కలిసికొమ్మని చెప్పు"మని రా జాజ్ఞాపించెను.
    అంతలో కారాగారాధికారి వచ్చి "మహారాజా! చంద్రగుప్తుడు కారాగృహము నుండి తప్పించుకొని పారిపోయినాఁ"డని వచించెను. మహారాజు మైకములో "చంద్రగుప్తుఁడు పోయినాఁడా! పోనిమ్ము. మనకేమి నష్టము? మంచిపని చేసినాఁడు" అనెను.
    అట్టి సమయమున నొక బ్రాహ్మణుఁడచ్చటికి వచ్చేసెను. వాని దేహము శుష్కించియుండెను. విశాలమైన ఫాలభాగమున బ్రహ్మతేజ ముట్టిపడుచుండెను. కన్నులు కాంతిమంతములై ప్రజ్ఞావైభవమును బ్రకటించుచుండెను. అతఁడు ద్వారరక్షకులను ద్రోసిపుచ్చి లోనికిఁ జనుదెంచి నందునిముందు నిర్భయముగ నిలుచుండెను.
    అట్లు నిర్లక్ష్యముగ నిలబడియున్న బ్రాహ్మణుని జూచి నందుఁడాగ్రహావేశముతో "ఎవరు నీవు? ఇక్కడి కేల వచ్చితివి?" అని ప్రశ్నించెను.
    "నేను బ్రాహ్మణుఁడను. నా పేరు చాణక్యుడు."
    "నీ కిక్కడేమి పని?"
    "న్యాయమునకై వచ్చితిని. నేను మగధ దేశ పౌరుఁడను. పాటలీపుత్రము నా నివాసస్థానము. పండ్రెండు సంవత్సరములకు పూర్వము విద్యాభ్యాసమునకై 'తక్షశిల విద్యాలయము'న కేగితిని. అచ్చటి విశ్వవిద్యాలయములో సమస్త శాస్త్రములు చదివి సంపూర్ణ విద్యావంతుఁడనైతిని. అనంతరము పాటలీపుత్రమునకుఁ దిరిగివచ్చి చూతును గదా నా యాస్తి యపహరింపఁబడినది. క్షేత్రము లన్యాక్రాంతములైనవి. గృహము పరాధీనమైనది. నా ముసలితండ్రి బలవంతముగఁ జంపఁబడినాఁడు. ఇదంతయు నేమని యడుగ నందమహారాజుల పరిపాలనా ప్రభావమని యచ్చటివారు వచించిరి."
    "ఏమీ? నా పరిపాలనమునే నిందించుచుంటివా?"
    "నే నొక్కఁడను నిందించుట యేమి? జను లాబాల గోపాలము వేనోళ్ళఁ దిట్టుచున్నారు. నందరాజ్య మెప్పుడు నాశన మగునా యని వేయిదేవతలకు మ్రొక్కుచున్నారు."
    "ఓయీ! ఒడలు దెలిసి మాటాడుము."
    "నేను దేహము తెలిసియే యుంటిని. మద్యపానముచే మత్తెక్కి మాటాడుటలేదు."
    "అనవసరముగ మా యానందమున కంతరాయము కలిగించిన నీ యపరాధము నిఁక క్షమింపము. నీవింత యుద్ధతుఁడవు గనుకనే నీకట్టి ప్రాయశ్చిత్తమైనది. ఇఁకపో! నెత్తిన గుడ్డ వేసికొనిపో!"
    "నీబోటి నీచులు, స్వార్థపరులు రాజులై రాజ్యము వెలిగించుచున్నప్పుడు మా బోటి ప్రజల కట్టిగతి పట్టుటతో నాశ్చర్య మేమున్నది? ఇదేనా రాజధర్మము? ఇంతేనా నీ న్యాయపరిపాలన? దొంగతనము, దోపిడి, దురాక్రమణ, విలాసవిహారములు, మద్యపానములు, మైకపుమాటలు - ఇవేనా నేఁటి మగధదేశమహారాజుల మర్యాదలు!!"
    చాణక్యుని మాటలు విని నందున కాగ్రహముచే నాపాదమస్తకము కంపించెను. అతఁడు పటపట పండ్లు గొఱకుచు "ఓరీ! సేవకులారా! చూతు రేమి! ఈ బడుగు బాపని బయటకు గెంటివేయుఁ"డని పలికెను. వెంటనే రాజభటులా విప్రుని చుట్టుముట్టి జుట్టుపట్టుకొని లాగిరి. చాణక్యుఁడు ప్రళయ కాలరుద్రుఁడయ్యెను. అతనినయనములనుండియగ్ని కణములు జలజలరాలెను. అతని హృదయమునుండి యగ్ని పర్వతము బ్రద్దలయ్యెను. "ఓరీ! నందాధమా! ఎంత ఘోరకృత్యమునకుఁ బాల్పడితివి? ప్రజాద్రోహీ! దుర్మదాంధా! ఇదిగో నా ప్రతిజ్ఞ వినుము! నిన్ను, నీ సింహాసనమును, నీ ప్రభుత్వమును, నీ వంశమును, నీ సర్వస్వమును నాశనము చేసి తీరెదను. అంతవరకు వీడిన యీశిఖను బంధింపను" అని వాక్రుచ్చి యచ్చోటు విడిచి చాణక్యుఁడు చకచక వెడలిపోయెను. పరాభవానల దందహ్యమానమానసుఁడగు బ్రాహ్మణుని నోటినుండి వెలువడిన కఠోరశాపము కుఠారాఘాతమువలె నందుని గుండెలకుఁదగిలెను. మద్యపాన మహాపిశాచి నిండు కౌఁగిలిలో జరిగిన సంఘటన మంతయు నాతనికి స్వప్నమువలె గోచరించెను.


                                 3


    సాయంకాలము కావచ్చుచుండెను. పాటలీపుత్ర పట్టణప్రాంతమందలి యొకయరణ్యములో చాణక్యుఁడు నడచిపోవుచుండెను. ఆలోచనామగ్నుఁడై యట్లరుగుచున్న యాయనపాదమున నొక దర్భమ్రోడు గ్రుచ్చుకొనెను. వెంటనే చాణక్యుఁడు "ఏమీ! కుశమూలములకు సైతమింతగర్వమా!"యని యామ్రోడు మొదలంటఁ బెకలించి ముక్కలు ముక్కలుగాఁ జేసి పొడిపొడిగా నలిపి గాలిలో నెగురవేసెను.    
    అది యంతయు దూరమునుండి యవలోకించుచున్న యొక యువకుఁడు చరచర నరుదెంచి చాణక్యుని చరణయుగమునకు సాష్టాంగ నమస్కారమాచరించెను. చాణక్యుఁడు నివ్వెరపడి "వత్సా! నీవెవ్వర"వని యువకుని బ్రశ్నించెను. యువకుఁడు "స్వామీ! నేను చంద్రగుప్తుఁ డనువాఁడను. మగధరాజ కుటుంబములోని వాఁడను. మీ విచిత్ర ప్రవృత్తి విస్మయము గొల్పినది. ఆ కుశమూలము నట్లు తూర్పారఁ బట్టితి రేమి?" అని సవినయముగఁ బల్కెను.
    "వత్సా! చంద్రగుప్తా! ఈ కుశము నా కాలిలో గ్రుచ్చుకొనినది. శత్రుశేష ముండరాదని భావించి దీనిని సమూలముగాఁబెకలించివైచితిని. ఇది నందవంశ నాశానమను నాటకమునకు నాందీసూచన. తెలిసినదా?"
    "ఆచార్యా! నేటినుండి మీరే నా గురుదేవులు. ఈ చంద్రగుప్తుఁడు మీ శిష్యుఁడు."
    "ఏమీ? నీవును దుర్మార్గుఁడగు నందుని దుండగములకు లోనైతివా?"
    "గురుదేవా! మహాపద్మనందుని యనంతరము పెద్ద వాఁడగు మా తండ్రి మగధదేశమునకు మహారాజు కావలసియుండగా రెండవభార్య బిడ్డలగు నందులు కుట్రఁజేసి మా తండ్రిని, నా సోదరులను కారాగారములో బంధించిరి. నావారందఱు తిండి నీళ్లులేక చీఁకటి కొట్టులో కృశించి కృశించి నశించిపోయిరి. పసిబిడ్డ ననిజాలిదలఁచి నన్నుమాత్రము మా తల్లితో వదలిపెట్టిరి. అనంతర మొకనాఁడు రాజసభలోని కరిగితిని. అట నా బుద్ధి చాకచక్యమున కసూయపడి నన్ను సైతము కారాగృహబద్ధుని గావించిరి. పది సంవత్సరములా పాతాళగృహరక్షకుల కన్నుగప్పి తప్పించుకొని బయటఁబడి దిక్కుచెడి దేశభ్రష్టుఁడనై యిట్లు తిరుగుచుంటిని."

 Previous Page Next Page