"ఇదే!"
"నిన్ను చూడబోతున్నానన్న ఆనందం ఎన్నో ఏళ్ళ తర్వాత మనం కల్సుకుంటున్నాం అన్న సంతోషం నాకు వళ్ళూ పై తెలియలేదు. లెటర్ రాయకుండా వచ్చి నిన్ను ఆనందాశ్చర్యాలలో ముంచెత్తుదామనుకున్నాను. పైగా యిది అటూ ఇటూగాని పల్లెటూరు. జనాభా కూడా అంతగా వుండరు. నాలుగు వీధులూ తిరిగితే నీ ముఖం కనపడకుండా పోతుందా అనుకున్నాను."
"ఆ....ఈ ఒక్కటీ నిజమైంది. సుబ్బరామయ్యగారి ఇంటినుంచి వస్తూ నీకు కనపడ్డా కాబట్టి నీ పంట పండింది. ఇది యిదివరకటి పల్లెటూరు కాదురాబాబూ! ఊరు పెరిగిపోయింది. ఊళ్ళో జనాభా పెరిగిపోయింది" అన్నాడు సూర్యారావు.
"ఇంకా ఏమిటి కబుర్లు?"
"ముందు నీ కబుర్లు చెప్పు."
"రిటైర్ అయ్యాకదా, హాయిగా ఇంటి పట్టున వున్నాను. ఉన్న రెండెకరాల పొలంకి మనిషిని పెట్టి పైపై అజమాయిషీ చేస్తున్నాను. కాలక్షేపానికి చిన్న చిన్న పనులు చేస్తున్నాను. మా పెద్దాడు హరి పక్కఊళ్ళోనే పోస్టుమాస్టరు. లూనా కొన్నాడు. వెళ్ళి వస్తుంటాడు. కోడలు ప్రమీల. పురిటికి పుట్టింటికి వెళ్ళింది. రెండోవాడు రవి. బియస్సీతో కుస్తీ పడుతున్నాడు. వాడికి చాలా రకాల ఆటలువచ్చు. ఆటలపోటీల్లో అంగుళం నుంచి అడుగుపొడుగువరకూ రకరకాల కప్పులు సంపాదించాడు.
హరి, రవి తరువాత విమల. బి.కామ్ ఫస్టియర్ చదువుతున్నది. ఉత్త అల్లరిపిల్ల. పుస్తకాల పురుగు. పుస్తకాలంటే క్లాసు పుస్తకాలు అనుకునేవురా కైలాసం. అవి కావు. నవలలు, వార మాసపత్రికలు లాంటివన్నమాట.
కడుపులో చల్లకదలకుండా హాయిగా ఇంటిపట్టున వున్నాను. తిరిగేకాలు తిట్టేనోరు వూరుకోదన్న సత్యం తెలిసిన మీ చెల్లెమ్మ నా నోరు మూయటానికి ఇదిగో ఇలా అరిసలు గట్రా చేసి తినిపిస్తుంటుంది. క్లుప్తంగా యిదీ నాకధ. ఇంక నీకధ కానియ్యి" అన్నాడు సూర్యారావు.
"నీకు తెలిసిందేకదా!" భారంగా నిట్టూర్పు విడుస్తూ అన్నాడు కైలాసగణపతి.
"ఆ కధకాదు ఆ తరువాత ఇన్నేళ్ళబట్టీ నీ చరిత్ర."
కైలసగణపతి ఆలోచనలో పడ్డాడు ఓ నిమిషం.
సూర్యారావు మౌనంగా వుండిపోయాడు ఆ కొద్ది సమయం.
కైలాసగణపతి సూర్యారావు కలసి చదువుకున్నారు. సూర్యారావు చాలా విషయాలలో బుద్ధిమంతుడిలా వుంటే కైలాస గణపతి వేపకాయంత వెర్రి పనులు చేస్తుండేవాడు. "కనపడ్డ ప్రతిదాంట్లో వేలు పెడతావు ఎందుకు?" సూర్యారావు అంటే "నా వేలేకదా పెడుతున్నాను. కాలితే నా వేలు కాలేను. బంగారం అంటుకుంటే నా వేలికే అంటుకుంటుంది. నీకేమి బాధరా అబ్బీ" అనేవాడు కైలాస గణపతి చాలా తేలికగా నవ్వేస్తూ.
ఇరువురికీ చదువు పూర్తి అయింది. వేరు వేరు చోట్ల ఉద్యోగాలు వచ్చాయి. చేసే వుద్యోగం నచ్చక రెండు మూడు ఉద్యోగాలు మారాడు కైలాసగణపతి. కొన్నాళ్ళకి యిరువురికి పెళ్ళిళ్ళు అయ్యాయి. మధ్య మధ్య కల్సుకునే వారు. ఏడాదికో ఉత్తరం రాసుకునేవారు.
గ్యాస్ స్టవ్ అది పంపుకొట్టే రకం. ఓ రోజు అది పేలి కైలాసగణపతి భార్య మంటల్లో చిక్కుకొని మరణించింది. అప్పుడు సూర్యారావు డబల్ టైఫాయిడ్ లో మంచంమీద ఉన్నాడు. ఆ తర్వాత ఎప్పుడో వెళ్ళి కైలాస గణపతిని కల్సుకున్నాడు. కొన్నాళ్ళు తన ఇంట్లో వుండమని ఆహ్వానించాడు. బలవంతం చేశాడు. మనశ్శాంతికి కొన్నాళ్ళు పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తానన్నాడు.
ఆ తర్వాత కైలాసగణపతి సూర్యారావు ఎప్పుడో ఒకటి రెండుసార్లు కల్సుకోటం తప్పించి ఇంటికి వచ్చిందంటూ లేదు. నూటికో కోటికో ఉత్తరం అంతే. సూర్యారావు ఈ ఊళ్ళో వున్నట్లు కైలాసగణపతికి తెలుసు. "ఎప్పుడో ఒకప్పుడు మీ ఊరు వస్తాను. నీ నెత్తిన కూర్చుంటాను. నీవు మెడబట్టి గెంటేదాకా మీ ఇంట్లోంచి కదలను సరేనా" అని మాట కూడా ఇచ్చాడు గణపతి.
ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఇలా కల్సుకున్నారు. ఈ సమయంలో పాతజ్ఞాపకాలు ఇరువురికీ ఒకేసారి వచ్చాయి.
"పిల్లలు ఇప్పుడప్పుడే రారా ఇంటికి?" ఆలోచన చాలించి అడిగాడు కైలాసగణపతి.
"వచ్చేవేళయింది. ఒక్కోసారి లేటుగా వస్తారు. మనంతటివాళ్ళయ్యారు. వాళ్ళిష్టం." నవ్వుతూ చెప్పాడు సూర్యారావు.
"కూర్చుని ఎంతసేపు కబుర్లు చెప్పుకుంటాం. పిల్లలు వచ్చేసరికి అలా తిరిగివద్దాం చల్లగాలి దానితోపాటు కబుర్లు మేస్తూ."
"సరే" నన్నాడు సూర్యారావు. పెళ్ళాంతో చెప్పాడు అలా బయటికి వెళ్లొస్తామని.
ఆ తర్వాత....
ఇరువురూ ఇంట్లోంచి బైటికి అడుగుపెట్టారు చేయి చేయి కలుపుకుని.
5
"ఇంక నాకు ఓపికపోయిందిరా కైలాసం!"
"అదేమి! చూడటానికి పిడిరాయిలా బాగానే వున్నావ్?" నవ్వుతూ అడిగాడు కైలాసగణపతి.
"మనం ఇంట్లోంచి బయటపడి నాలుగు వీధులు తిరిగామా లేదా?" సూర్యారావు అడిగాడు.
"తిరిగాము అందులో రవంత అనుమానం కూడా లేదు."
"మరి....."
"ఏమిటి మరి?"
"ఎంతసేపు నా ఇంటి విషయాలు అడగటం. నా గురించి అడగటం తప్పించి నీ గురించి ఒక్క ముక్కకూడా చెప్పవేమిటి? నీ కంటికి నేనో చవట వెధవలాగా కనపడుతున్నానా!"
"నా కధ ఏమన్నా రామాయణమా? భారతమా? ఓ దేశదిమ్మరిని. కొద్దికాలం నుంచీ కాస్త నిలకడగా వున్నాను. అందుకనే నీ దగ్గరకు వచ్చాను" అన్నాడు కైలాసగణపతి.
"నా దగ్గరకు రావటం కాదు. నా దగ్గర వుండాలి." సూర్యారావు ఆప్యాయంగా చెప్పాడు.
"నీకు అభ్యంతరం లేకపోతే కొన్నాళ్ళు మీ ఇంట్లో....."
"ముందు నోరు ముయ్యి. నీ నాలుక తెగకొస్తాను."