అతని పెదవులు నెమ్మదిగా విచ్చుకున్నాయి.
"యదావి నియతం చిత్తమాత్మ న్యే వావతిష్టతే
నిస్పృహ సర్వకామే భ్యో యుక్త ఇత్యుచ్యతే తదా....
చిత్తమును వశపరుచుకొని, లగ్నమైన మనస్సును పరబ్రహ్మమును ధ్యానించుటకు వినియోగము చేయుచు, బాహ్యమైన చింతలను విడిచి ఆత్మ స్వరూపము వైపునకు దృష్టి మరల్చి, సమస్తములగు కోరికల నుండి మనస్సును మళ్ళించడమే నిష్ట అని, ధ్యానమని, అటుల చేయువాడే యోగి అని భగవద్గీతలో చెప్పలేదా మహాశయా...? యోగసిద్ధికి పగలు, రాత్రి భేదమున్నదా?" ప్రశ్నించాడాయన.
అంత చలిలోనూ శివస్వామి ఒంటికి చిరుచెమటలు పట్టేశాయి. తనని పరీక్షించటానికి వైదీశ్వరుడే వైకుంఠం నుంచి దిగిరాలేదు కదా- అని తనను తాను ప్రశ్నించుకున్నాడు శివస్వామి.
"ఇంతకీ... మీరెవరు?" సంభ్రమాశ్చర్యాలతో తలమునకలోతూ అడిగాడు శివస్వామి.
"సంశయాత్మకుడను... పృక్చకుడ్ని... నా సంశయాలకు నాడీశాస్త్రములో సమాధానాల కోసం వెతికే అన్వేషిని. భౌతికంగా మీలాంటి మనిషిని..." గోడగడియారం వైపు చూస్తూ అన్నాడాయన.
గోడగడియారం రెండు గంటలు చూపిస్తోంది.
"మీరు అరగంటసేపు కూర్చుంటే స్నానంచేసి వస్తాను" తొట్రుపాటుతో అన్నాడు శివస్వామి.
తలపంకించాడు ఆ వ్యక్తి.
శివస్వామి ఏదో గొణుక్కుంటూ వేగంగా లోపలికెళ్ళిపోయాడు.
* * * *
విశాలమైన అయిదెకరాల స్థలంలో నిర్మితమైన వైదీశ్వరుని కోవెల తూర్పు ద్వారం తెరుచుకుంది.
అలా ఆ నిశిరాత్రివేళ ఆ గుడి తలుపులు తెరుచుకోవటం ఎన్నడూ జరగలేదు- జరగదు కూడా.
కానెందుకో.... ఆ కోవెల ప్రధాన పూజారి సయితం ఆ వ్యక్తి ముఖంలో వెల్లివిరిసే తేజస్సునీ, శివస్వామి అభ్యర్థనని కాదనలేకపోయాడు.
ఎక్కడో మారుమూల కుహారాల్లోని పావురాలు కువకువలాడుతున్నాయి. నాపరాయి తాపడమయిన ఆ గుడి విశాలమయిన ప్రాంగణం చల్లగా వుంది. అటూ ఇటూ ధృడమైన రాతి స్తంభాలు, ఆరొందల అడుగుల దూరంలో గర్భగుడి...
గర్భగుడికి వెళ్ళేదారికి అటూ ఇటూ ఇద్దరు ఆజానుబాహువుల కైవారానికి కూడా అందనంత వెడల్పాటి రాతిస్తంభాలు, పటిష్టమైన శిల్పాన్ని ఆలయ గుడి కప్పుని మోస్తూ కనిపించాయి.
గుడిలో కుడివైపు నున్న మొదటి రాతి స్తంభానికి గోలుసులేసి కట్టివున్న ఏనుగు, ఆ గుడి గోడల మధ్య పేరుకున్న నిశినిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ వస్తున్న శివస్వామి, ఆ వ్యక్తికేసి ఆశ్చర్యంగా చూసింది.
శివస్వామి చిరపరిచితుడు కావడంతో ఘీంకరించబోయిన ఆ ఏనుగు తన ప్రయత్నాన్ని కేవలం తన వెనక కాలికి కట్టివున్న ఇనుప సంకెళ్ళని కదిలించటంతోటే సరిపెట్టుకుంది- మీరీ సమయంలో రావటాన్ని నేను గమనించానన్నట్లు.
గర్భగుడి ముందున్న మట్టి ప్రమిదలలోని దీపాలు మిణుకు మిణుకుమని వెలుగుతూ కనిపించాయి.
ఆ గుడి ప్రధాన పూజారి శివస్వామికి కనుసైగ చేసి, గర్భగుడికేసి సాగిపోయాడు.
నాలుగు ఏనుగులు అవలీలగా వెళ్లగలిగేంత విశాలంగా వున్న ఆ గుడి తూర్పు గవాక్షాన్ని, ప్రధాన పూజారి సంజ్ఞ మేరకు, ఏనుగుకి దగ్గరలో చాపమీద పడుకొని వున్న మావటి వెంటనే మూసి వేశాడు.
అక్కడిప్పుడు అనూహ్యమైన ఒక యజ్ఞమే జరగబోతోందో, అనువంశీక సాంప్రదాయానికతీతంగా ఒక యాగమే జరగబోతోందన్నట్లు, ఆ కోవెల నాలుగు గవాక్షాల కావల, లోపలా పేరుకున్న భయంకరమైన నిశ్శబ్ద నిశీధి సయితం భయానికి లోనయినట్లుగా వుంది అక్కడి వాతావరణం.
ఇప్పుడక్కడ- మూసివేసిన కోవెల లోపల ప్రాంగణంలో ఒక విచిత్రానికి తొలిప్రేరణ జరగబోతోందని- అమాయకంగా నిద్రపోతున్న ఆ ఊరికిగానీ, ఊరి జనానికిగానీ తెలీదు. అలా తెలీకూడదనే ఆ ఆజానుబాహుడు ఆ సమయాన్ని ఎన్నుకున్నాడా? అన్న అనుమానం శివస్వామికే కాదు- గుడి పూజారికి, మావటిక్కూడా వచ్చింది.
మావటి కళ్ళ ముందు జరుగుతున్న ఆ అరుదైన సంఘటనని చూస్తూ అయోమయానికి, ఒకింత భయోద్వేగానికి లోనయిపోయాడు. ఆపై అతనికి తిరిగి నిద్రపోవాలనే ధ్యాసే లేకుండా పోయింది.
శివస్వామి, ఆ వ్యక్తి గుడిలోపల కుడివైపు నున్న విశాలమైన దారి వెంబడి కోనేటికేసి సాగిపోతున్నారు- ఎవరో అదృశ్య శక్తి నియంత్రించినట్లుగా, మానవాతీత శక్తి శాసిస్తున్నట్లుగా.
"ఈ కోవెలకు నాలుగు వాకిళ్ళు ప్రత్యేకత. చోళరాజులు అప్పటి వర్ణవ్యవస్థకు అనుసంధానంగా ఈ దేవాలయాన్ని నిర్మించారని చెప్పారు. క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్రులు. ఒక్కొక్కరు ఒక్కొక్క వాకిలిగుండా ప్రవేశం చేసేవారట. అలాగే నివాసస్థలాలు ఆయా ముఖద్వారాలకు ఎదురుగా వుండేవి. ఇప్పుడు కూడా అదే సంప్రదాయం వుంది.
బ్రాహ్మణ స్త్రీలు ఆలయం కోనేట్లో స్నానాలు చేస్తే, మిగతా జాతుల వారు బయట కోనేట్లో స్నానాలు చేస్తారు..." చెపుతూ నడుస్తున్నాడు శివస్వామి.
నలువైపులా చూస్తూ నడుస్తున్నాడా వ్యక్తి.
కొంతదూరం నడిచాక, చిన్నమండపం వచ్చింది. అక్కడనుంచి ఎడంవైపు కెళితే, గర్భగుడికి కేవలం వందడుగుల దూరం చేరువకి చేరుకోవచ్చు.
ఆ దారిలోనే వైదీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మిరియాలు, ఉప్పు ప్రసాదంగా సమర్పించుకొనే పెద్ద పెద్ద రాతి తొట్టెలుంటాయి. భక్తులు మిరియాలు, ఉప్పు అక్కడ సమర్పించుకునే మూలవిరాట్టు దర్శనానికి అనుమతిస్తారు.
కుడివైపుకి వెళితే కేవలం ఇరవై అడుగుల దూరంలో పెద్ద పెద్ద నల్లమద్ది చెక్క ద్వారాలుంటాయి.
శివస్వామి ఆ ద్వారాల దగ్గరికెళ్ళి వాటిని బలమంతా ఉపయోగించి తెరిచాడు.
కిర్రుమని శబ్దం చేస్తూ తెరుచుకుంటుండగానే, చల్లటిగాలి వారిద్దరికీ సోకింది. ఆ గాలిలో అదో రకమైన వాసన వున్నట్లు ఆ ఆజానుబాహుడు గ్రహించాడు.
అక్కడి నుంచి కిందికి దిగడానికి మెట్లున్నాయి. ఆ మెట్లు పూర్తవుతూనే విశాలమైన కొనేరు, సుమారు రెండెకరాల విస్తీర్ణంలో విస్తరించుకొని వున్న లోతైన కోనేరు.
దానిచుట్టూ రాతిస్తంభాలు- రాతికప్పుతో నిర్మించిన విశాలమైన వరండాలున్నాయి. కొనేరు చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసేందుకు.
కోనేటి నీటి మధ్యలో నిర్మించిన మండపంలో వినాయకుడి విగ్రహం కొలువుతీరి వుంటుంది.
చిన్న పడవ మీద అక్కడికెళ్ళి అర్చకులు పూజాది కార్యక్రమాలు నిర్వహించుకొని వస్తారు.
ఆ పరిసరాల్నే చూస్తూ చోళరాజుల భక్తిభావానికి, కళాభిరుచికి లోలోనే నివాళులర్పించాడా వ్యక్తి.