Previous Page Next Page 
వ్యూహం పేజి 6


    "నువ్వు జపాన్ లో పుట్టాల్సిన వాడివిరా.... ఇండియాలో పుట్టావు. ఇండియాలో అందునా, ఆంధ్రలో, ఈ వెనుకబడిన వూళ్ళో పుట్టావు. నువ్వే ఒక నిరుద్యోగివి. ఇప్పటికీ ఒక ఉద్యోగం చూసుకోలేకపోతున్నావే... పరిశ్రమలు... జపాన్.... అవగాహన...." రమణ్రావ్ వ్యంగ్యంగా అన్నాడు.

 

    "జపాన్ ని ఆదర్శంగా తీసుకోమంటున్నాను. హిరోషిమా, నాగసాకీల విధ్వంసం నుంచి తేరుకుని ఎంత గొప్ప బలమైన పారిశ్రామిక దేశంగా రూపొందించో చూసావా... అది ఆదర్శం కావాలి...." జగపతి చేతిలోని సిగరెట్ తీసుకుని కాలుస్తూ అన్నాడు శక్తి.

 

    "నీ పేరు శక్తి అని పెట్టి మీ బాబు తప్పు చేసాడ్రా. చై ఎన్ లై అని పెట్టాల్సింది..." సుబ్రహ్మణ్యం జోక్కి అంతా నవ్వారు.

 

    "బోరు కొట్టేస్తుందిరా... సినిమాకు వెళితే ఎలా వుంటుందంటారు..." జగపతి ప్రపోజ్ చేసాడు.

 

    "బాగానే వుంటుంది..." అంటూ గోడ దిగాడు శక్తి.

 

                               *    *    *    *

 

    సరిగ్గా ఆరున్నరయ్యింది.

 

    సినిమా థియేటర్ దగ్గర, మూడు థియేటర్లకు పట్టే జనం వున్నారు.

 

    శక్తి మేనేజర్ దగ్గరకు వెళ్ళాడు.

 

    అరడజను టికెట్లు వచ్చేసాయి.

 

    అందరూ సీట్లలో సెటిల్ అయ్యాక జగపతి అన్నాడు.

 

    "హీరో రావటం చూడలేద్రా... చిరంజీవి ఎంట్రన్స్ ని రాఘవేంద్రరావు వండర్ ఫుల్ గా చిత్రీకరించారంటరా"

 

    "ఈ సిన్మాలో చిరంజీవి పెద్ద బిజినెస్ మాగ్నెట్ అట... ఓపెనింగ్ సీన్ కోసం రెండు వందల మారుతీకార్లు ఉపయోగించారంట" సుబ్రహ్మణ్యం అన్నాడు.

 

    "ఏంటెహె గోల... సినిమా చూడండ్రా... విసుక్కున్నాడు శక్తి.

 

    "ఫస్ట్ నుంచీ, హీరో ఎంట్రన్స్ నుంచీ సిన్మా చూడాలిరా..." రమణరావు గట్టిగా అన్నాడు.

 

    "మళ్ళీ సెకండ్ షోకి వద్దాంలే..." శక్తి అన్నాడు.

 

    "సెకండ్ షోకా... ఛీ... ఇట్సే మాటర్ ఆఫ్ ప్రెస్టేజ్. నువ్వు ఊ అను... కేబిన్ రూమ్ లోకెళ్ళి చెప్పొస్తాను" రమణరావు అన్నాడు పొగరుగా.

 

    "ఆపరేటర్ వేస్తాడంటావా..." అనుమానంగా అన్నాడు శక్తి.

 

    "వెయ్యక ఛస్తాడా... బాక్సులు బద్దలయిపోవూ... నే వెళతా నుండు" రమణారావు లేచాడు. వెనుక జగపతి కూడా నడిచాడు.

 

    పదినిమిషాల తర్వాత జగపతి పరుగు-పరుగున వచ్చి-

 

    "ఒరేయ్ శక్తీ... ఆ ఆపరేటర్ గాడు మన రమణగాడిని చితగొట్టాడ్రా..." వగర్చుకుంటూ వచ్చి అన్నాడు.

 

    ఆ మాట వినగానే శక్తి ఆవేశంగా లేచాడు. అతని వెనుకే మిగతా మిత్ర బృందం కూడా లేచింది.

 

    నేరుగా క్యాబిన్ రూమ్ వైపు నడిచాడు శక్తి.

 

    అప్పటికే అక్కడ గొడవ గొడవగా వుంది.

 

    ఆపరేటర్ మిగతా థియేటర్ సిబ్బంది రమణరావుతో కలబడుతున్నారు.

 

    గొడవ తారాస్థాయిలోకి వెళ్ళింది.

 

    శక్తి గ్రూపు అక్కడకు వెళ్ళటంతో థియేటర్ సిబ్బంది రమణరావుని వదిలేసారు ఒకింత భయంగా.

 

    "స్టూడెంట్స్ రిక్వెస్ట్ మీద ఫస్ట్ రీల్ వేయమని మర్యాదగా రిక్వెస్ట్ చేసాన్రా... తిక్క- తిక్కగా మాట్లాడుతున్నాడురా ఆపరేటర్... మనం స్టూడెంట్స్ కాదంట... ఆవారాగాళ్ళమట... ఆవారాగాళ్ళ కోసం మళ్ళీ సినిమా వెయ్యాలా- అన్నాడ్రా. మనల్ని ఆవారాగాళ్ళ కోసం మళ్ళీ సినిమా వెయ్యాలా- అన్నాడ్రా. మనల్ని ఆవారాగాళ్ళంటాడంట్రా... తన్నేస్తాను. నువ్వలా నిలబడు...." అంతెత్తున లేచాడు రమణరావు తిరిగి... శక్తి తనకు తోడున్నాడన్న ధైర్యంతో.

 

    ఆ ఆపరేటర్ వైపు చూసాడు శక్తి.

 

    "ఆవారాగాళ్ళన్నావా?"   

 

    "లేదండి... సినిమా ఫస్టు నుంచీ వేయటం కుదరదు. రూల్సు ఒప్పుకోవు అన్నానండీ"

 

    "ఆహా... మరి మాకు తెలీదులే మీ రూల్స్... ఎయిర్ కూల్డ్ థియేటర్ అని డబ్బు లెక్కువ తీసుకుంటున్నావ్... మరి రూల్ ప్రకారం ఎయిర్ కూల్డ్ మెషిన్ ఆన్ చేస్తున్నారా? సీట్లు పరమ దరిద్రంగా ఉన్నాయి. సీట్లకున్న మేకులు పట్టి ప్యాంట్స్ చిరిగిపోతున్నాయి. సీట్లు బాగు చేయిస్తున్నారా? ఎమ్.ఆర్.ఓ.కో కలెక్టర్ కో కంప్లెయింట్ చేస్తే- అప్పుడు రూల్స్ ఒప్పుకుంటాయను కుంటాను?.." అన్నాడు శక్తి కోపంగా.

 

    షాక్ తిన్నాడు ఆపరేటర్ శక్తి లాజిక్ విని.

 

    "అడ్డంగా కోసేస్తున్నాడ్రా..." తిరగబడ్డాడు రమణరావు.

 

    "టైటిల్స్ దగ్గర్నుంచి సినిమా వెయ్యి..." కరుకు గొంతుతో ఆజ్ఞాపించాడు శక్తిధర్.

 

    అదే సమయంలో పరుగు పరుగున వచ్చాడు థియేటర్ మేనేజర్.

 

    "ఏమిటి... ఏంటట... అసలేంటి గోల!" మేనేజర్ కోపంగా అడుగుతూ అందరివైపూ చూసాడు. అప్పటికే శక్తి అన్న మాటలు వినిపించాయి మేనేజర్ కి.

 

    "ఫస్టురీల్ నుంచి సిన్మా వెయ్యాలి... లేకపోతే బాక్సులు బ్రద్దలైపోతాయి" పొగరుగా అన్నాడు రమణరావు తిరిగి.

 

    అప్పటికే నడుస్తున్న సినిమా ఆగిపోవటంతో థియేటర్ అంతా విజిల్స్ తోనూ, చప్పట్లతోనూ గొడవగా ఉంది.

 

    "ఈ థియేటర్ ఎమ్మెల్యే ఈశ్వరచంద్ర గారిది.... పెద్దవాళ్ళు దిగారంటే మంచిది కాదు. పెద్దవాడిని చెబుతున్నాను వెళ్ళిపొండి. ఫస్టు నుంచి సిన్మా వేయిస్తాను... వెళ్ళండి"

 

    గొడవ ముదిరితే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఆవేశానికి పోకుండా అన్నాడు మేనేజర్.

 

    "మరి ఎయిర్ కూల్?" జగపతి అడిగాడు.

 

    "అదీ వేస్తాం..." అన్నాడు మేనేజర్ తప్పు చేసినవాడిలా తల తిప్పుకుంటూ.

 

    అప్పటికే థియేటర్ లోంచి బల్లలు విరగ గొడుతున్న చప్పుడు, తలుపుల్ని బాదుతున్న చప్పుడు విన్పించింది.

 Previous Page Next Page