Previous Page Next Page 
శుక్ల యజుర్వేద సంహిత పేజి 7


    4 యుగాల మొత్తం కాలం 43,20,000 సంవత్సరాలు.

    సృష్టికాలం 1000 x 4  యుగాలు = 4  కోట్ల 32 లక్షల సంవత్సరాలు. 4000 యుగాలు తరువాత ప్రళయం.  4000 యుగాల కాలం సృష్టి ఉండదు. తరువాత మళ్లీ సృష్టి మొదలు.

    సృష్టి ఆది నుండి ప్రమాది సంవత్సరం - 1999 -2000  వరకు 195,58,85,100 సంవత్సరాలు.

    కలియుగంలో గడచిన సంవత్సరాలు 5,100

    పాశ్చాత్యుల కాలం సాంతం ఇప్పటికి 2000 సంవత్సరాలే!
   
    వారు వ్రాసిన చరిత్ర 5000 సంవత్సరాలు దాటదు. వారికి కలియుగం మాత్రమే తెలుసు!
   
    యూరపు చరిత్ర సాంతం వందల వేల సంవత్సరాలదే! అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల చరిత్ర వందల యేళ్ళదే! పాశ్చాత్యుల కొలతలతో వేదకాలాన్ని కొలవడం గజంబద్దతో ఆకాశాన్నీ, బకెటుతో సముద్రాన్ని కొలవడం లాంటిది.

    మనం ఇంకా సంస్కృతిక బానిసలం. అందువలనే వారి కొలతలను నమ్ముతున్నాం. మన కొలతలను నమ్మలేకపోతున్నాం. ఆత్మ విశ్వాసం లేని జాతికి అభ్యుదయం అంత సులభం కాదు. మనం రాజకీయ బానిసత్వం వదిలించుకున్నాం, కాని స్వతంత్రులం కాలేకున్నాం!

    వేదం ఒక సారి పుట్టి ఒకనాటికి ముగిసిన కావ్యం లాంటిది కాదు. అదొక నది - ఒక స్రవంతి - ఒక ప్రవాహం. ఋషులు దర్శించిందాన్నల్లా అక్షరబద్ధం చేస్తూ పోయారు. అందుకే వేదం అనంతం 'అనంతావై వేదాః' ఈ అనంత స్రవంతులను వేద వ్యాసుడు సంహితలు చేశాడు. అప్పుడది సకల నదులు కలసిన సముద్రం అయింది. వేదం సముద్రమై సమస్త ప్రాణులకూ సాయపడుతున్నది.

    పాశ్చాత్య విద్వాంసుడు 'కీత్' ప్రకారం వేదం క్రీ.పూ. 1200 నాటిది. అంటే 1200 + 2000 = 3200 సంవత్సరాలనాటిది. వారు అంతకు పూర్వాన్ని ఆలోచించలేరు. ఇంకా క్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలే!

    వారికి సంవత్సరాలూ, శతాబ్దులు, సహస్రాబ్దులే తెలుసు. మనకు యుగాలు తెలుసు. మనది యుగాల లెక్క.

    కీత్ చెప్పింది వేద సంహితలను గురించి - వేదాన్ని గురించి కాదని గమనించాలి.

    కలియుగం ప్రారంభం అయి ఇప్పటికి 5,100 సంవత్సరాలు. భారతం ద్వాపరాంతం. కలియుగారంభంలో రచించాబడింది. ఆ తరువాత వ్యాసరచన భాగవతం, భాగవతంలో వేద సంహితల గురించి చెప్పబడింది. వేదం సంహితలుగా ఏర్పడి 5000 సంవత్సరాలైంది. వేదం ఎప్పుడు ప్రారంభం అయిందీ చెప్పడం దుస్తరం.

    ఇంతకాలంగా ఒక నాగరికత, ఒక సభ్యత, ఒక సంస్కృతీ నిలిచి ఉండటం, ప్రపంచంలో కనీవినీ ఎరుగని వింత!!

    'జీన్ లోమీ' ఇలా వ్యక్తపరిచారు.

    "Precious or durable materials -gold, silver, bronze, marble, onyx or granite - have been used by most ancient peoples in an attempt to immortaize their achievements. Not so, however, with the ancient Aryas. They turned to what may seem the most volatile insubstatial material of all - the spoken word - and out of this bubble of air fashioned a monument which more than thirty, perhaps forty, centuries later stands untouched by time or the elements. for the pyramids have been eroded by the desert wind, the marble broken by earth quakes, and the gold stolen by robbers, while the Veda remains recited daily by an unbroken chain of generations, travelling like a great wave through the living substance of mind."

    "అత్యంత పురాతననరుల్లో" అనేకులు తమ విజయాలను శాశ్వత పరచడానికి విలువైన మన్నిక గల బంగారం, వెండి, కంచు, పాలరాయి, నల్లరాతిని వాడారు. సనాతన ఆర్యులు మాత్రం భిన్నంగా వ్యవహరించారు. వారు త్వరగా చెరిగే, అస్థిరరూపంగల అక్షరాన్ని, శబ్దాన్ని ఎన్నుకున్నారు. ఆర్యులు ఈ గాలి బుడగతో తీర్చిదిద్దిన నిర్మాణం ముప్పది, నలుబది శతాబ్దాల తరువాత కూడా, కాల, ప్రాకృతిక ప్రభావాలకు అతీతంగా చెక్కుచెదరక నిలిచి ఉంది. పిరమిడ్లు ఎడారి గాలులకు తరిగిపోయాయి. పాలరాతి కట్టడాలు భూకంపాలకు కూలిపోయాయి. బంగారం దొంగల పాలైంది. వేదగానం మాత్రం నిత్యం, నిరంతంరం తరతరాలుగా వినిపిస్తున్నది. ఆ వేద  స్వరం, మేంధస్సు యొక్క సజీవ పదార్ధంగా, అలలుగా, తరంగాలుగా పయనిస్తూమే ఉంది"

    వేదం - లిపి

    పాశ్చాత్యులు - స్వ ప్రయోజనం కోసం - మనసు వారి దోవ పట్టించడంలో నూటికి వేయిపాళ్లు విజయవంతులైనారు. నేను సామాన్యుల మాట చెప్పడం లేదు. అసాధారణులు , అసామాన్యులు, అఖండులు, ఉద్దండులు, విద్వాంసులు, పండితులు సహితం దారి తప్పారు. పాలకుల దారి పట్టారు. 'స్వధర్మే నిధనం శ్రేయః' మరచారు. రాజ్యం ఆంగ్లేయులది. వాటి పాలకులు వారు, 'రాజానుమతో ధర్మం'

    ఈ విధంగా భరతజాతి సాంతం నేటికీ అభారతీయం, అప్రాచ్యాన్నే విశ్వసిస్తున్నది. మనకు స్వాతంత్ర్యం అనేది వచ్చిం తరువాత మనం స్వచ్ఛందంగా పాశ్చాత్యుల సాంస్కృతిక దాస్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఒక జాతికి సంస్కృతి ప్రాణం. సంస్కృతిని మరచిన  జాతికి భవిష్యత్తు అంధకారం! వెలుగు లేదు. కనిపించదు. ఆ జాతి చీకటినే కాంతి అని భ్రమిస్తుంది.

    భాషముందు ప్రభావిస్తుంది. లిపి తరువాత అవతరించుతుంది. వ్యాకరణం తదనంతరం ఆవిర్భవిస్తుంది. లెక్కలేనన్ని భాషలకు నేటికీ లిపి లేదు. విచిత్రం ఏమంటే ప్రపంచ నాగరికతలను శాసిస్తున్నామని భావించే ఇంగ్లీషుకు, ఇతర యూరోపియన్ భాషలకు లిపి లేదు. అవి పరాయి లిపినే వాడుతున్నాయి. అంతెందుకు హిందీకి, మరాఠీకి లిపి లేదు. అవి దేవనాగరిని లిపిగా వాడుతున్నాయి.

    లిపి గల తెలుగు ఎంత సంపన్నమో అర్థం చేసుకోండి.

    వేదం సంస్కృత భాషలో ఉంది. సంస్కృతానికి సంబంధించినంత వరకు తొలుత వ్యాకరణం ఆవిర్భవించింది. వ్యాకరణాన్ని అనుసరించి భాష ఏర్పడింది. అందుకే అది సంస్కృతం అయింది.

    సంస్కృతానికే స్వంత లిపి లేదు. అందుకోసం దేవనాగరి లిపిని ఆవిష్కరించారు మహర్షులు. లిపిని వేరుగా ఆవిష్కరించడానికి కారణం అది అన్ని భాషలకు ఉపయోగపడాలని.

    దేవనాగరి లిపి పరిపూర్ణమూ, నిర్దిష్టమూ దీని అక్షరమాలనే - లిపులు వేరైనా భారతీయ భాషలన్నీ అనుసరిస్తున్నాయి. అక్షరమాలలన్నీ 'అ' తోనే మొదలౌతాయి. జీవితం, భాష 'అమ్మతో మొదలవుతుంది. దేవనాగరి లిపితో ఏ ఉచ్చారణనైనా వ్రాయవచ్చు. అంతటి సుసంపన్నం అయిన లిపిని మన మహర్షులు మనకు అందించారు. వేల సంవత్సరాలుగా ఆ లిపి నిరంతరాయంగా మానవజాతికి అక్షరామృతం ప్రసాదిస్తున్నది!

    ఆంగ్లభాషకు అరువు తెచ్చుకున్న లిపి అపర్యాప్తం అని జార్జి బెర్నార్డ్ షా విలపించాడు.

    లిపి లేని భాష వారు సంస్కృతాన్ని మృతభాష Dead Language అంటున్నారు. "మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె" అనేది తెలుగు  సామెత.

    సంస్కృత వర్గానికి చెందినవని ఆంగ్లేయులు నిర్ణయించిన 1. ఇరానిక్ 2. హెల్లెనిక్ 3. ఇటాలిక్ 4. సెల్లెటక్ 5. ట్యుటనిక్ 6. లెట్టొస్లోవిక్ భాషలు జాడలేనివి అయినాయి. అయినా  ఇన్ని వేల సంవత్సరాలుగా సంస్కృతం హిమవదున్నతమై, నిశ్చలంగా సూర్యకాంతి వలె సజీవంగా  నిలిచిఉంది. ఇందుకు సాక్ష్యం అనంతమూ, అమరమూ అయిన సంస్కృత సాహిత్యం! వేదం, ఉపనిషత్తు, రామాయణ, భరత, భాగవతాలు కాలపు జరా జీర్నాలను ఎదిరించి నిత్యనూతనంగా విరాజిల్లుతున్నాయి.

    ఇంత సంపద ఏ భాషకు ఉంది? ఏ జాతికి ఉంది? మనం ఇంతటి మహొన్నత సంస్కృతికి, సంప్రదాయానికీ వారసులం! అందుకు మనం గర్వించాలి. గంతులు వేయాలి. దీన్ని సంరక్షించుకునే బాధ్యత స్వీకరించాలి.

    వేదం తొలినుంచే అక్షర బద్ధం అయింది. దీనికి భాష ఉంది. లిపి ఉంది. ప్రాణం ఉంది. వేదం భూమి, ఆకాశం, వాయువు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల వంటిది. ఇది శాశ్వతం. ఏ ఒక్క సమాజపు సొత్తు కాదు. ఇది సమస్త మానవాళికి చెందింది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సమస్త ప్రాణి జాలానికి వెలుగు ప్రసాదిస్తాడు. వేదంసూర్యుని లాంటిది. తూర్పున ఆవిర్భవించింది. సకల ప్రాణి జాలానికి కాంతి ప్రసాదిస్తున్నది.

    నమో వేదమాతా
    స్తుతామయా వేదమాతా ప్రచోదయన్తాం ద్విజానామ్
    ఆయుః ప్రాణం ప్రజా పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసమ్   
    మహ్యం దత్వా  ప్రజత బ్రహ్మలోకం
                                                                                అధర్వ వేదం.

   
    వేదం - స్వరం

    వేదాన్ని అర్థం చేసికోవడానికి 'స్వర' జ్ఞానం అవసరం. మన మహర్షులు వేదాన్ని భద్రపరచడానికి మహాయజ్ఞం సాగించారు. వారు వేదపు అక్షరాలకు 'స్వరం' కూర్చారు. స్వరానికి నిర్దిష్టత, శ్రావ్యత, మహిమ కలిగించారు.

    వేదానికి నాలుగు స్వరాలున్నాయి. 1. ఉదాత్త 2. అనుదాత్త 3. స్వరిత 4. ఏకశ్రుతి.

    అర్థాన్ని పరిరక్షించడానికి స్వరం ప్రకారం 'నల్లగొంగడి వాణ్ణి పిలువు' - కాగా రెండవ స్వరంలో 'నల్లగొంగడి తెమ్ము' అవుతుంది.

    వేదం శృతి. విన్నది, వినసొంపైంది. స్వరయుక్తంగా చదివిన వేదం శ్రావ్యం. మహిమాన్వితం.

    అక్షరాన్నీ , స్వరాన్నీ ఇంత కాలంగా భద్రపరచిన ఉదాహరణ సృష్టిలో మరొకటి లేదు.

    మా తండ్రిగారు విద్వాన్ వేంకటాచార్యుల వారు 'తిరువాయ్ మొళి' కి ఆంధ్రానువాదం చేశాడు. మరికొన్ని గ్రంథాలు రచించి, ప్రచురించారు. వారు 1979తో పరమపదించారు. వారి గ్రంథం ఒక్కటీ మాకు లభించలేదు.

    మా అన్నయ్య 'దాశరథి కృష్ణమాచార్య' అనేక కవితా సంపుటాలు ప్రచురించారు. వారు 1987లో పరమపదించారు. వారి సమగ్ర రచనలు లభించడం లేదు.

    తమ జీవితంలోనే తమ గ్రంథాలు లభించకపోవడం నేటి రచయితలకు సర్వ సాధారణ అనుభవం.

    ఇది అచ్చు యంత్రాలు, ప్రచురణ సంస్థలు, గ్రంథాలయాలు, కంప్యూటర్స్ వచ్చిన నాటి కథ.

    తాళపత్ర, భూర్జర పత్రాల మీద వ్రాసుకుని , వాటిని వల్లించి ఇన్ని వేల సంవత్సరాలు  భద్ర పరచడం ప్రపంచ వింతల్లో సర్వ ప్రథమం కావాలి.

    పిరమిడ్లు, చైనా మహాకుడ్యం, ఎల్లోరా అజంతా శిల్పాలు, తాజ్ మహల్ వంటివి కాలదోషం పట్టి విరిగి పోవడమో, అరిగిపోవడమో జరిగింది. జరుగుతున్నది. అక్షరం, నాదయుక్తమైన వేదం జరాజీర్ణాలకు అతీతంగా నిత్య యవ్వనిలా నిలిచి ఉండడం వింత మాత్రం కాదు మహత్తు.

    అయితే మనం సాంస్కృతిక బానిసలం, చెప్పుకోం. చెప్పనొల్లం. పాలకులు పరాయి విధానాలకు దాసానుదాసులు. భృత్యులు. వారి ఏలికలను నొప్పించనొల్లరు.

    వేదంశృతి. వినడం ఏమిటి చదువు కొనరాదా? అని అడగవచ్చు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ!

    ఇవ్వాళ సాంకేతిక, సాంకేతికేతర గ్రంథాలు, దృశ్య, శ్రవణ యంత్రాలు, Webs, Internets ఇన్ని ఉన్నా ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. దీని తాత్విక సూత్రం ఏమంటే విన్నదే మనసుకెక్కుతుంది. వంటపడుతుంది.

    అర్ధశతాబ్దం క్రితం కూడా ఈ దేశంలో జనం, పురాణాలు, హరికథలు, బుర్రకథలు, జముకుల కథలు మున్నగు జానపద రూపాల ద్వారానే విద్యావంతులు, నీతిమంతులు అయినారు.

    పుస్తకాల వ్యాపారం మొదలైన తరువాత అక్షరంనుండి విద్య, విద్యనుండి నీతి అదృశ్యం అయినాయి!

    శబ్దానికి నాదం ఉంది, అర్థం ఉంది, ఆ రెండూ మనసుకుపడ్తాయి. ఆనందాన్నిస్తాయి. వెంటాడ్తాయి. వదలవు.

    అర్థంకాని నాదం ఏమి? అని అడగవచ్చు. అడగడం తేలిక, ఆలోచన అక్కరలేదు!

    త్యాగరాయి కృతులు తెలుగులో ఉన్నాయి. ఆ కృతులను తమిళులే ఎక్కువ ఆరాధిస్తున్నారు. వారికి తెలుగు అర్థంకాదు. తెలుగు వ్రాసుకోవడానికి పర్యాప్తమైన లిపి సహితం తమిళులకు లేదు. వారు అర్థాన్ని మించిన నాదాన్ని ఆస్వాదిస్తున్నారు! ఉపాసిస్తున్నారు. నాదం మనసును  కదలిస్తుంది, కరిగిస్తుంది! నాదం పశువుకూ తెలుసు, శిశువుకూ తెలుసు, "శిశుర్వేత్తి పశుర్వేత్తి" శ్రీకృష్ణుని వేణుగానానికి గోపికలే కాదు గోవులూ పులకించేవి!

    ఈ కాలంలో అన్యభాషల సినిమాలు చూచే వారికీ పాటలు వినేవారికి భాష తెలియదు. అయినా చూస్తున్నారు. వింటున్నారు. అందులో అర్థాన్ని మించిన ఆనందం ఏదో ఉంది!

 Previous Page Next Page