'సంహితమ్' కూడు కొనునది అని సంస్కృతాంధ్ర నిఘంటువు.
ఒకదాన్ని ఏర్పరచడానికి, స్థాపించడానికి చేసే కూర్పు సంహిత అవుతుంది. దీన్ని మనం ఇప్పుడు సంకలనము అంటున్నాం.
వేదం రామాయణ, భారత, భాగవతాదుల వంటిది కాదు. అది ఒకే కవిచే రచింపబడినది కాదు. కావ్య, ఇతిహాస, పురాణాల వలె నిరంతరం కథాగమనం ఉండదు.
వేదం సంహిత మంత్రాల, సూక్తాల కూర్పు మాత్రమే. వేదం అపౌరుషేయం. అంటే నరుడు చెప్పింది కాదు. ఋషులు మంత్రాలను సూక్తాలను దర్శించారు. వారు కర్తలు కారు. ద్రష్టలు స్మర్తలు మాత్రమే - కనుగొని గుర్తుంచుకున్నవారు.
ఋషులు వేదాలను ఎన్ని యుగాలుగా దర్శిస్తున్నారో? ఎందరు దర్శిస్తున్నారో? ఇవి చెప్పడం అసాధ్యం. ఎందుచేతనంటే భారతీయులకు కాలం అనంతం. కాలం బ్రహ్మ. కాలం పరమేశ్వరుడు. ఇవి మానవ కొలతలకు అందవు.
ప్రాశ్చాత్యులది కాలం కాదు. చరిత్ర. వారి చరిత్ర. మూణ్ణాళ్ళది. కాబట్టి వారి చరిత్రను సంవత్సరాల్లో చెప్పుకోవచ్చు. మనకు యుగాలు ఉన్నాయి. వారికి శతాబ్ధాలే! ఇంకా క్రీస్తు తరువాత 2000 సంవత్సరాలే! వారి కొంచెపు కొలతతో మన అనంత కాలాన్ని కొలవ పూనుకోవడం వెర్రి మాత్రమే!.
అలా యుగాలుగా ఋషులు దర్శించిన వానిని వ్యాసుడు నాలుగుగా కూర్చాడు. వ్యాసుడు కూర్చిన తరువాత మంత్రద్రష్టలు లేరు. వ్యాసభగవానుడు వేదానికి ఒక పాదం ఏర్పరచాడు. ఇది మాత్రమే వేదం. ఇందులో చేరనిది వేదం కాదు.
వ్యాసభగవానుడు వేదసంహితలు చేశాడు. వాటిని నాలుగుగా విభజించాడు. మనకు 'వేదం' అని తెలిసింది వేద సంహిత. వీటి కూర్పరి వేదవ్యాసమహర్షి.
నాలుగు విధాలుగా వేదాన్ని విభజించడం వేదచతుష్టయి, వేదచతుష్టయి వేదాల విషయ నిర్ణయం చేస్తుంది.
1. ఋగ్వేదసంహిత దేవతల గుణగణాలను స్తుతిస్తుంది.
2. యజుర్వేదసంహిత వివిధ యజ్ఞాలను నిర్దేశిస్తుంది.
3. సామవేదసంహిత దేవతలను ప్రసన్నులను చేయుగానవిధిని నిర్ణయిస్తుంది.
5.అథర్వవేదసంహిత బ్రహ్మ జ్ఞానం సహితంగా అనేకానేక లౌకిక విషయాలను వివరిస్తుంది.
'వేదత్రయి' అని మరొక విభజన ఉంది. ఇది 1. పద్య, 2. గద్య 3. గేయవిభజన. వేదాలు పద్యంలో దర్శించినవీ, 2. గద్యంలో దర్శించినవీ 3. గేయంలో దర్శించినవీ ఉన్నాయి. ఇది ఛందో విభజన.
ఈ వేదత్రయికి పాశ్చాతులు కువ్యాఖ్యానం చేశారు. వేదాలు మూడే నన్నారు. అథర్వం వేదం కాదన్నారు. తరువాత వచ్చి చేరిందన్నారు.
వేదాన్ని దర్శించడానికి వేద దృష్టి కావాలి. హ్రస్వదృష్టి - అన్య దృష్టి చాలవు. పరిమితదృష్టితో అపరిమిత వేదాన్ని దర్శించడం కువ్యాఖ్యానం అవుతుంది. భారత వేదాన్ని భారత కొలమానంతో కొలవాలి. పాశ్చాత్య కొలమానాలు అందుకు పర్యప్తములు కావు.
ఇవన్నీ తెలియకో- తెలిసి మనను కొంచెపు వారిని చేయటానికో 'వేదత్రయి' అంటే వేదాలు మూడేనని మనను నమ్మించారు పాశ్చాత్యులు.
నమ్మించేట్లు చేసేవాడు వంచకుడు
వంచకుడు చెప్పింది నమ్మేవాడు బానిస.
భాగవతంలో 'వేదమేకంచతుర్విధం' అని చెప్పబడింది.
'చత్వారోహి ఇమే వేదా ఋగ్వేద యజుర్వేదః
సామవేదో బ్రహ్మవేద ఇతి" అని గోపథ పూర్వం. బ్రహ్మవేదమే అథర్వవేదం.
కావున మన ప్రమాణాలే ఆధారం. వేద సంహితలు నాలుగు 1. ఋగ్వేదసంహిత 2. యజుర్వేదసంహిత 3. సామవేదసంహిత 4. అథర్వవేదసంహిత.
యజుర్వేద సంహిత రెండు భాగాలు 1. శుక్ల యజుర్వేదసంహిత. 2. కృష్ణ యజుర్వేద సంహిత.
వేదం మూడింటిమిని ప్రతిపాదిస్తుంది. అందుకు కూడ అది 'వేదత్రయి' అయింది.
"వేదా బ్రహ్మాత్మ విషయాస్త్రి కాండ విషయా ఇమే
పరోక్షవాదా ఋషయః పరోక్షం మమచ ప్రియం" అన్నాడు కృష్ణపరమాత్మ.
వేదం మూడు విషయాలను ప్రతిపాదిస్తుంది. అవి. 1. బ్రహ్మ, 2.ఆత్మ, 3. బ్రహ్మ ఆత్మల ఏకత్వం.
ఋషులు పరోక్షవాదులు. పరోక్షవాదం నాకు సహితం ప్రియం అని అర్థం.
'పరోక్షం' అంటే ఏమి?
కంటికి కనిపిస్తున్నది ప్రత్యక్షం. కంటికి మాత్రమేకాక ఆలోచనకు దర్శనం ఇచ్చేది పరోక్షం.
మనముందే మనిషి ఉంటాడు. అతడు ప్రత్యక్షంగా కనిపిస్తుంటాడు. అంతే. అతడు మనకు అర్థంకాడు. అతని జ్ఞానం, సంస్కారం, మనసు అర్థం చేసికోవడానికి పరోక్షంగా పరిశీలించాలి. ఇంత చేసినా ఒక మనిషి వేరొకనికి ఇంతవరకు పరిపూర్ణంగా అర్థం కాలేదు. కాడు, అది ప్రకృతి రహస్యం. అది ఎన్నటికి బయటపడదు.
వేరొక వ్యక్తి కాదు. తనకు తాను ఎంతవరకు అర్థం అయినాడు?
నాకు ఇప్పుడు 71 సంవత్సరాలు. కాస్తో, కూస్తో జ్ఞానమూ, సంస్కారం ఉన్నాయి. నేను ఇంతవరకు నన్ను పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాననుకోవడం లేదు.
'లోకములన్నియున్ గడియలోన జయించిన వాడ వింద్రియానీకముజిత్తము గెలువనేరవు' అంటాడు ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశినితో.
వేదమూ అలాంటిదే. కంటికి కనిపించే అక్షరం మాత్రం వేదం కాదు.
వేదాన్ని అర్థం చేసుకోవడానికి మహర్షులు ఒక నిర్దిష్ట పద్ధతి ఏర్పరిచారు. అవి ఆరు వేదాంగాలు, నాలుగు ఉపవేదాలు.
వేదాంగాలు
1. శిక్ష, 2. వ్యాకరణం, 3. నిఘంటు, 4. ఛందస్సు 5. జ్యోతిషం, 6. శిల్పం.
ఉపవేదాలు
1. గాధంర్వవేదం, 2. ఆయుర్వేదం, 3. ధనుర్వేదం. 4. అర్థవేదం.
వేదార్థాన్ని గ్రహించడానికి 1. ఉపనిషత్తులు, 2. కణాదుని వైశేషికం 3. గౌతముని న్యాయం, 4. కపిలుని సాంఖ్యం. 5. పతంజలి యోగం, 6. జైమిని పూర్వమీమాంస, బాదరాయణుని ఉత్తర మీమాంస ఉపకరిస్తాయి.
పరోక్షంగా పరిశీలించినా వేదాత్మ సంపూర్ణంగా దర్శనం ఇవ్వడం దుర్లభం.
మనిషి అర్థం కావడం లేదు. అయినా అతనితో వ్యవహరిస్తున్నాం. వేదం విషయమూ అంతే! ప్రత్యక్షదర్శనమే ధన్యత కలిగిస్తుంది.
వేదవాక్కును అర్థం చేసుకోవడానికి 5. దిశలున్నాయి. 1. అన్నమయం ఇది భౌతికం, 2. ప్రాణమయం ఇది దృష్టి గోచరం 3. మనోమయం ఇది మనసును గ్రహించడం 4. జ్ఞానమయం, ఇది బుద్ధిని గ్రహించడం 5.ఆనందమయం ఇది వేదంలో లీనం కావడం.
జీవిత పరమావధి ఆనందమే. ఆనందోబ్రహ్మ.
వేదం- శ్రుతి
వేదానికి 'శ్రుతి' అని కూడా పేరుంది. 'శ్రుతి' అంటే చెవిన పడింది - విన్నది.
పాశ్చాత్యులు మన సాహిత్య, సంప్రదాయ, సంస్కృతులను కించపరచడానికి కొంచె పరచడానికి. హేళన చేయడానికి వారి స్వామిత్వాన్ని, మన బానిసత్వాన్ని బాగా వాడుకున్నారు. మనవారితోనే వాటిని వప్పించాలి. మనవాతిని నమ్మకుండా చేశారు.
శ్రుతి అంటే విన్నది కాబట్టి వేదకాలం నాటికి అక్షరం లేదని వ్యాఖ్యానించారు. తొలుత వేదం వల్లించబడింది. వ్రాయబడలేదు అన్నారు. అదే నిజం అని మనం నమ్ముతున్నాం.
వేదం అపౌరుషేయం; అలా అంటే అది మానవుడు చెప్పింది కాదు. అంతేకాని భగవంతుడు చెప్పాడని వాచ్యంగా చెప్పబడలేదు. వేదం మానవుని కన్న అతీతం అయింది. వాస్తవంగా వేదం మానవ శక్తిని మించింది. అందుకోసం 'అపౌరుషేయం' అనే వాస్తవసత్యాన్ని వచించారు మహర్షులు.
'అపౌరుషేయం' అనే స్ఫూర్తితోనే అన్య మతాల వారు తమ గ్రంథాలను భగవంతుడే వచించాడు అని చెప్పారు. భగవంతుడు పరాత్పరుడు. జగత్పిత. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ప్రవక్త కావచ్చు. కాని వేరు వేరు మతాలకు వేరు వేరు భగవంతులు లేరు. ఉండరు - ఉండకూడదు.
మానవాళిది ఒకే అదితి భూమి. ఒకే ఆకాశం. ఒకే భగవంతుడు. పరాత్పురుడు. ఈశ్వరుడు. మానవ జాతి సహితంగా సమస్త ప్రాణిజాలానికి అతడే సృష్టికర్త. తల్లి తండ్రీ అన్నీ.
అట్టి పరాత్పరుడు ఒక మతాన్ని నమ్మిన వారి పాపాలు మాత్రమే దూరం చేయడు. వారికి మాత్రమే మోక్షం ప్రసాదిస్తానని అనడు. అది సత్యానికి దూరం.
అసత్యం అవుతుంది.
భగవంతుడు సత్యస్వరూపుడు. పరాత్పరునికి అసత్యం అనంత దూరపుది. అంటే ప్రవక్తలు చెప్పి భగవంతుడు చెప్పాడు అన్నారు!!
వేదం చెప్పిన అపౌరుషేయం మాత్రమే సత్యం భగవంతుడు ఒక విశ్వాసపు వారిని మాత్రమే ఉద్ధరిస్తాడనడం బూటకం.
'అపౌరుషేయం' సహేతుకం, మిగతావి నిర్హేతుకములు!
వేదంలో ప్రతిసూక్తి ద్రష్ట పేరు ఋషిగా చెప్పబడింది. అతడు వేదసూక్తపు కర్త కాదు. ద్రష్ట స్మర్త మాత్రమే! అతడు ఆ సూక్తాన్ని విన్నాడు. విన్నది కాబట్టి 'శ్రుతి' విని దాన్ని అక్షరబద్ధం చేశాడు.
వేదం పుట్టిన్నాడే అక్షరం ఉంది. అంతేకాదు శాస్త్రీయమూ పరిపుష్టమూ అయిన సంస్కృత బాష ఉంది. ఛందస్సు ఉంది.
ఎంతటి నాగరిక జాతి అవుతే సంస్కృతం వంటి భాష ఆవిర్భవించాలి? ఎంతటి సంస్కారం గల జాతి అవుతే 'సర్వేపిసుఖినస్సంతు' సకల ప్రాణులూ సుఖించాలని నినదించాలి?
"యూనాన్ - బ - మిశ్ర్ రోమా సబ్ మిట్ గయె జహఁసె
అబ్ తక్ మగర్ హై బాఖీ నామొనిశాఁహమారా" అంటాడు ఇక్చాల్
గ్రీకు, రోం, ఈజిప్టులు మట్టిలో కలిసిపోయాయి.
నేటికీ మా ఊరూ, పేరూ నిలిచి ఉన్నాయి.
అన్ని పురాతన నాగరికతలూ మాసిపోయాయి. కాని భారత నాగరికత, సంస్కృతి, సంప్రదాయం ఇంకా నిత్య నూతనంగా వెలుగొందుతూంది. అదీ 1200 సంవత్సరాల పరాయి పాలన తరువాత!
ఎంత మహత్తమ మండీ మన దేశం - మన జాతి - మన సభ్యత - మన సంస్కారం - మన సాహిత్యం - మన సంగీతం - మన కళలు!
ఒక్కసారి జయకొట్టండి భారత భూమికి!
వేదం - కాలం
భారత శాస్త్రం ప్రకారం కాలం అనంతం. కాలం ఎప్పుడు ప్రారంభం అయింది? కాలం ఎపుడు అంతం అవుతుంది? ఇది తెలిసిన వాడు లేడు. ప్రభువులు, ప్రభుత్వాలు. ఋషులు, ప్రవక్తలూ అందరినీ కాలం మింగేస్తుంది. యుగాలు అంతం అవుతాయి. ప్రళయం వస్తుంది. మళ్లీ సృష్టి ప్రారంభం అవుతుంది. కాలం నిరంతరం సాగుతూనే ఉంటుంది. కాలమే సృష్టిస్తుంది. కాలమే రక్షిస్తుంది. కాలమే కష్టాలు కలిగిస్తుంది. కాలమే సర్వాన్నీ అంతం చేస్తుంది.
కాలం మాత్రం సాగుతూనే ఉంటుంది.
కాలానికి నిలకడ లేదు.
కాలానికి కళ్లూ నోరూ ఉంటే ఎన్ని వాస్తవాలు వెల్లడించగలదో?
కాలాన్ని జయించినవాడు లేడు. కాలం అజేయం.
అందుకే 'కాలోయం బ్రహ్మ' అన్నారు.
ఈ కాలానికి నరుడు కొన్ని కొలతలు ఏర్పరచుకున్నాడు. అందుకు భూమి సూర్యుని చుట్టు తిరిగి వచ్చిన కాలాన్ని సంవత్సరం అన్నాం. అది అంత నిర్దిష్టం కాదు. సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి 365 రోజుల 6 గంటలు పడుతుంది. ఆ ఆరుగంటలను సరిచేయడానికే నెల రోజుల వ్యత్యాసం - అధికమాసాలు - Leap year మొదలైనవి. అవి ఎప్పుడో కలుపుతాయి. ప్రతి ఏడాదీ జరగదు! మరి దీని నిర్దిష్టత ఏమి?
నరుని కొలమానం కాలానికి సరిపోవడం లేదు!
భారతీయులు పరమాణువు నుంచి ప్రళయం దాకా కాలానికి లెక్కలు కట్టారు. పరికించండి.
సూర్యుడు పరమాణువును ఆక్రమించిన కాలం పరమాణువు. సృష్టిలో అతి సూక్ష్మ పదార్ధం పరమాణువు. 2. పరమాణువులు 1 అణువు- 3 అణువులు ఒక త్రసరేణువు 3 త్రాసరేణువులు ఒక తృటి-100 తృటులు 1 వేధ - 3వేధలు ఒక లవం - 3 లవములు ఒక నిమేషం- ఇది మనం వాడుతున్న మినిట్ నిమిషం కాదు. ఇది సెకనులో 16175వ భాగం 3 నిమేషములు ఒక క్షణం- 5 క్షణాలు 1కాష్ట- 10 కాష్టలు ఒక లఘువు- 15 లఘువులు ఒక గడియ - 71\2 గడియలు - 1 జాము - 8 జాములు ఒకరోజు- 15 రోజులు ఒక పక్షం, -2 పక్షాలు ఒక నెల - 2 నెలలు ఒక ఋతువు -3 ఋతువులు ఒక అయనం- 2 ఉత్తర, దక్షిణాయనములు ఒక మానవ సంవత్సరము - 17, 28, 000 సంవత్సరాలు కృతయుగం. 12,96,000 సంవత్సరాలు. త్రేతాయుగం - 8, 64,000 సంవత్సరాలు ద్వాపరం, 4, 32,000 సంవత్సరాలు కలియుగం.