అలాగే స్వరబద్ధం అయిన వేదనాదం మనసును కదిలిస్తుంది, కరిగిస్తుంది, మంచి కలిగిస్తుంది. శాంతి ప్రసాదిస్తుంది.
'యో అర్థజ్ఞ ఇత్ సకలం భద్రమశ్నుతే | నాకమేతి జ్ఞానవిధూతపాప్మా"
యాస్కుడు
వేదం అర్థసహితంగా తెలిసికొన్న వానికి సకల శుభాలు కలుగుతాయి. జ్ఞానం అతని పాపాలను కడిగేస్తుంది. అతడు స్వర్గానికి చేరుకుంటాడు.
సామాన్యునికి వేదం అర్థం కావాలనే ఆశయంతో నేను వేదాలను తెనిగించాను. ఇంతవరకు ఎవరూ తలపెట్టని రీతిగా 'వేదం - జీవననాదం' వ్రాస్తున్నాను. కాని మంత్రానికి ఉన్న ప్రభావం అనువాదానికి లేదు. అనువాదం అర్థం చేసుకోవడానికి మాత్రమే! స్వరంతో వినిపించిన, విన్న మంత్రానికి మహాత్మ్యం ఉంది.
అనువాదం అర్థానికి మాత్రమే!
మంత్రం ఆనందించడానికీ, ఆస్వాదించడానికీ!!
వేదం శృతి.
వేదం వినిపించడంలో ఆనందముంది. వేదం వినడంలో అమృతం అందుతుంది!!
ఋషి
ఋషి సూక్తానికి కర్త మాత్రం కాదు వేదం అపౌరుషేయం. ఋషి ఆ సూక్తానికి ద్రష్ట. స్మర్త మాత్రమే. అతడు ఆ సూక్తాన్ని అతీంద్రియంగా దర్శించాడు. దర్శించిందాన్ని గుర్తు పెట్టుకున్నాడు.
వాస్తవానికి ఎవడూ, దేనికీ కర్తకాదు, అన్నింటి కర్త పరాత్పరుడే, అతడు చేయిస్తున్నాడు. మనం చేస్తున్నాం. పరమపిత పరమేశ్వరుడు ఈ జగన్నాటకకర్త - దర్శకుడు, మనమంతా అతడు ఆడించినట్లు ఆడేవాళ్ళమే! మనం కర్తలమే అనుకుంటే మనం అనుకున్నవి అన్నీ కావాలి కదా! అలా కావడం లేదు! ఇది సర్వే సర్వత్ర అనుభవమే!! కాని కొందరు చెప్పనొల్లరు!! వాళ్ళు సత్యానికి తొడుగువేస్తున్నారు.
నావరకు నాకు వేదాన్ని నాదంచేసే శక్తి గాని, వేదాన్ని గురించి ఇంత సులభంగా చెప్పే శక్తిగాని లేదు. భగవానుడు కర్తగా నాతో వ్రాయిస్తున్నాడు. ఇది నగ్నసత్యం, దీనికి నేను వ్రాయాసగాణ్ణి మాత్రమే! అట్లని నేను మనస్పూర్తిగా విశ్వసిస్తున్నాను.
నారచనలకు నేను ఋషిని! ఋషులు సహితం అలాగే భావించారు. వారు ద్రష్టలు - స్మర్తలు.
ఋషి అనగానే తెల్లని పొడవైన గడ్డం, నడినెత్తిన జడలముడి, చేత కమండలం గల నాటక లేక సినిమా ఋషి ప్రత్యక్షం అవుతాడు. కాని ఋషికి వేషం, వయస్సు ప్రధానములు కావు. అతని జ్ఞానమే ప్రధానం.
న తెవృద్దోభవతి యేనాన్యపలితం శరః
యో వా యువాన్యధీయానంస్తం దేవాః స్థవిరం విదుః
మనుస్మృతి
తలనెరిసినంత మాత్రాన పెద్దకాడు. యువకుడైనా జ్ఞాని అయినవాణ్ణి దేవతలు పెద్దగా భావిస్తున్నారు.
వేదంలో ఒక్కొక్క చోట ఇంద్రుని గడ్డాలూ. మీసాలు ఉన్నట్లు చెప్పబడింది. అది నాటి ఫేషను కావచ్చు. అలాగే ఋషులకు గడ్డం ఉంటే ఉండవచ్చు. కాని గడ్డం మాత్రం చేత ఋషి కాబోడు.
"యోవైజ్ఞాతో అనూచానః సఋషీ రార్షేయః" శాఠ్యం
అనాది జ్ఞానంగలవాడు ఆర్దేయ ఋషి
"ప్రాణావా ఋషయః" యజుర్వేదం
ప్రాణములే ఋషులగుచున్నారు.
సాయణాచార్యుడు ఋషిని అతీంద్రియ దర్శనుడు అన్నాడు. సాధారణ అవయవములకు అందని దానిని దర్శించువాడు అని అర్థం.
కవులు - రచయితలు అతీంద్రియ దర్శనులు కావాలి. అంటే వారు వ్రాసినవన్నీ వారు చూచినవి గాని, అనుభవించినవి గాని కావు. వారు అతీంద్రియదృష్టితో చూసింది వాస్తవం అవుతుంది. వ్యాసుడు, వాల్మీకి వంటి వారిది అతీంద్రియ దృష్టి! బ్రహ్మ వాల్మీకికి 'నతేవాగన్పతా భవిష్యతి' నీ మాట అసత్యం కాదు అని వరం ఇచ్చాడు.
అందువల్లనే 'నా నృషిః కురుతే కావ్యం' అన్న ఆర్యోక్తి. ఋషి కాని వాడు రచన చేయజాలడు. కాబట్టి నిజమైన కవి, రచయిత ఋషి కావాలి. సాంతం కాకున్న అంశామాత్రమైనా ఋషి కావాలి. రచయిత లోని ఋషి బట్టి అతని రచనాపటిమ, అతని రచన శక్తి ఆధారపడిఉంటుంది.
వేద ఋషు అందరూ అపౌరుశేయానికి ద్రష్టలు, స్మర్తలుకారు. ఒక్కొక్కచోట దేవతల, మానవుల కోరికను అనుసరించి సూక్తాలు రచించిన నిదర్శనాలు అరుదుగా కనిపిస్తాయి.
మొదటి మండలపు 64వ సూక్తంలో 'నోధః' అను ఋషిని మరుద్గణములను గూర్చి సుందర సూక్తం రచించమనడం కనిపిస్తుంది.
"వృష్ణే శర్ధాయ సుమభాయ వేధిసే నోధః సువృక్తిం ప్రభరామరుద్భ్యః"
"నోధా! మరుద్గణములు వర్షము కలిగించువారు యజ్ఞములనుండి శోభ కలిగించువారు. పుష్పఫల కర్తలు. వారిని గురించి సుందర స్తుతి రచించు".
10వ మండలం 107వ సూక్తపు 11వ మంత్రంలో భూతాంశుడనను నేను ఈ స్తోత్రము రచించి అశ్వినుల మనోరథం తీర్చానని చెప్పుకున్నాడు.
"యశోనపక్వం మధురోస్తరా భూతాంశో అశ్వినోః కామమప్రాః"
మరికొన్నిచోట్ల ఋషుల తామే సూక్తాలు రచించినట్లు చెప్పుకున్నారు. కొన్ని చోట్ల సంపన్నులు స్తుతించి ధనం పొందినట్లుగా ఉంది.
ఇవి ఎక్కడో ఒక చోట కనిపించేవి. అధిక భాగం ఋషులు దర్శించినవే!
అందుకే వేదం మానవ ప్రోక్తంకాదు. వేదం అపౌరుషేయం.
వేద ద్రష్టలైన ఋషులు పురాణ ఋషులూ సామ్య మాత్రాన ఒకటి కాదు. వేదాలకూ పురాణాలకూ మధ్య అనంత కాల వ్యత్యాసం ఉంది. వేద విశ్వామిత్రునికీ, రామాయణ విశ్వామిత్రునికి, మహాభారత విశ్వామిత్రునికీ పేరులో తప్ప సామ్యం లేదు.
వేదంలో ఋషులకు కోప, తాప, శాపాలు కనిపించవు. వారు ద్రష్టలు, జ్ఞానులు. పురాణ ఋషులకుకోప, తాప, శాపాలు మెండు. కోపమే ప్రధానంగా గల పురాణ ఋషులున్నారు!
దేవత
1.దివావైభూదితి తద్ దేవానాం దేవత్వం 2. యథావై మనుష్యాః ఏదం దేవా అగ్ర ఆసన్ 3. ప్రాచీన ప్రజననా వై దేవాః 4. ప్రాణాదేవాః 5. చక్షుదేవాః 6. మనోదేవాః 7. వాగేశదేవాః 8.పరోక్షం వై దేవాః 9. జాగ్రతి దేవాః 10. నవై దేవాః స్వపన్తి 11. సత్య సంహితావైదేవాః 12. సత్యమేవ దేవాః 13. ద్యోవై సర్వేషాం దేవానామాయతనం 14. పృథ్వివై సర్వేషాందేవానా మాయతనం 15. దేవాగృహావైవై నక్షత్రాః 16. సద్యావై దేవానాం గృహః
దేవతలను అనేక విధాలుగా చెప్పడం జరిగింది.
"ప్రాచీన ప్రజననావై దేవాః ప్రాచీన ప్రజననా మనుష్యాః" సత్యమేవ దేవాః అనృతం మనుష్యాః" "పృథివై సర్వేషాం దేవానామాయతనం"
"ప్రాచీనులుగా పుట్టినవారు దేవతలు. ప్రాచీనంగా పుట్టిన వారు మనుష్యులు. సత్యమే దేవతలు. అసత్యం మనుష్యులు. దేవతలందరి స్థానం పృథ్వియే అగుచున్నది.
అట్లని వేదం దేవతలను మనుష్యులను సమానంగా భావిస్తున్నది. ఋభువులు మున్నగు నరులు స్వయం కృషితో దేవతలైనారు. వాస్తవంగా వేదం మానవుని కృషిని, మానవుల విశ్వాసాన్ని మానవుని మహత్తునూ ఎక్కువగా విశ్వస్తున్నాది.
ఓం. ఇషేత్వోర్జే త్వా వాయవస్థ దేవో వః
సవితా ప్రార్పయంతు శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయధ్వమఘ్న్యా ఇంద్రాయ భాగం ప్రజాపతీ రనమీనా అయక్ష్మా మవస్తేన ఈశత మాఘశంసోధ్రువా అస్మిన్ గోపతౌ స్యాత్ బహ్వీర్యజమానాయ పశూన్పాహి
- శుక్ల యజుర్వేద తొలిమంత్రం
నరుడా! సూర్యుడు నిన్ను అన్నము, శక్తి, కొరకు ప్రేరణ కలిగించును గాత. నీవు ఆత్మవు, సూర్యుడు నీతో సత్కార్యాలు చేయించును గాత. వర్ధిల్లుము. అవధ్యుడవగుము. ఇంద్రునకు భాగములు సమర్పించుము. సంతానవంతుడవగుము. ఆరోగ్యవంతుడవగుము.
మావస్తేన ఈశత, చోరులు నీకు శాసకులు కాకుందురు గాక అంటున్నది. శాసకులు. నిష్పత్తి భేదంతో - చోరులే అవుతున్నారు. ప్రస్తుత భారతశాసకులకు - పాలకులకు ఎంతవరకు వర్తిస్తుందో గ్రహించండి - ఊహించడం కాదు. కాకూడదు అన్నది మానవ సంకల్పం - ప్రార్థనకాదు.
దైవసహాయం, ఈశ్వరసంకల్పం అవసరం. ఈ అనంత విశ్వసత్యాన్ని వేదం ఆవిష్కరించింది. హేతువాదుల అనిపించుకునే కొందురు స్వశక్తిమీద విజయాలు సాధించలేకున్నారు! సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని బ్రిటిషు ప్రభుత్వం జయించింది. దక్కించుకోలేకపోయింది. ఇది ప్రయత్నలోపమా? బొత్తిగా కాదు. సామ్రాజ్యాన్ని స్వచ్చందంగా వదులుకున్నవారు అరుదు.
రాముడు స్వచ్చందంగా రాజ్యాన్ని వదులుకున్నాడు. అన్న రాముని కోసం లక్ష్ముణుడు రాజ్యాన్ని త్యజించాడు. ధర్మంకోసం ధర్మరాజు రాజ్యాన్ని వదిలాడు. కేవలం సత్యవాక్కు కోసం హరిశ్చంద్రుడు రాజ్యాన్ని వదులుకున్నాడు. ఇవన్నీ భారతీయ నిదర్శనాలు.
భారత ప్రజ, రాజ్యాధికారాన్ని కాదు, త్యాగాన్ని ఆరాధించింది. ఈ ధరిత్రిమీద రాజకీయం కన్నా జ్ఞానం, ధర్మం విశ్వాసం రాజ్యం చేశాయి.
బ్రిటిషువారు వేషధారణ తప్ప ధర్మానికి ఇంకా స్పెల్లింగు నేర్వనివారు. వారి రక్తంలో త్యాగంలేదు. అమెరికా స్వాతంత్ర్య సంగ్రామం నుంచి, దక్షిణాఫ్రికా స్వాతంత్ర్య సమర విజయం వరకు ప్రజలు బ్రిటిషు వారిని తరిమి కొట్టారు. బ్రిటిషువారి కుట్రలు, విభజించి పాలించుటలు. అణగద్రొక్కడాలు, దోపిళ్లు ఏమైనాయి? వాటికి కాలం చెల్లింది. కాలం భగవత్ స్వరూపం. 'కాలోయం బ్రహ్మ' బ్రిటిషు వారి ఓటమి హేతువాద పరాజయంగా భావించడం తప్పగునా?
హేతువాదం పాశ్చాత్యులు కన్న బిడ్డకాదు. దాన్ని వారు భారత దేశం నుంచే అపహరించారు. జాబాలి, చార్వాకుడు హేతువాదానికీ, భౌతికవాదానికీ ఆద్యులు. వారిని భారత రాజకీయంగాని, ధర్మ గాని శిక్షించలేదు. భారత భూమిలో ఆధ్యాత్మికం, హేతువాదం సహజీవనం చేశాయి. పాశ్చాత్య రాక్షస రాజకీయం అనేకమంది హేతువాదులను, శిక్షించింది, ఉరితీసింది!
మానవ జీవితానికి కేవల అధ్యాత్మికంగాని, కేవల హేతువాదం కాని సరిపడవు. మానవ జీవితం ఏకాకి కాదు. అది అనేకపు సమాహారం. వేదం ఈ పరమ సత్యాన్ని గుర్తించింది. దీన్ని కాదనడం కేవలం వాదం మాత్రమే!
ఇది బ్రిటిషు సామ్రాజ్యానికి సంబంధించిన విషయం. కారల్ మార్క్స్ మహర్షి సామాన్య మానవుని కోసం, శ్రామికుని కోసం ఒక మహా సిద్ధాంతాన్ని ఆవిష్కరించారు. మార్క్స్ అనుకున్నరీతిలో కాకున్నా అతని సిద్ధాంతాన్ని అనుసరించి లెనిన్ మహాశయుడు రష్యాలో శ్రామిక విజయానికి కారకుడైనాడు. సోషలిస్టు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇరవయ్యవ శతాబ్దపు ముప్పావు భాగం సోషలిస్టు ప్రభావంగలదే! సోవియట్ రష్యాలో ప్రజలకు ఉండినన్ని సౌకర్యాలు ఏ ప్రజాస్వామ్య దేశంలో లేకుండినవి. ఆ రోజుల్లో మేము ప్రపంచమంతటా ఎర్రజండా ఎగురుతుందని ఆశించాం. రష్యాలో పండంటి సోషలిజం పతనానికీ, రష్యావిచ్చిత్తికీ కారణాలు ప్రస్తుతం కేవలం తార్కికాలు! మరి హేతువాదపు జాడ ఏది? 'కాలోయం దురతిక్రమః' అన్న వాల్మీకి వాదం నిత్య సత్యం.
ప్రస్తుతం లోకాధిపత్యం వహిస్తున్నానన్న అమెరికా సామ్రాజ్యవాదం కడు చిన్న వియత్నాం చేత చావు దెబ్బ తిన్నది. రష్యాపతనంతో తానే మొనగాణ్ణని విర్రవీగి లోకాన్ని పాదాక్రాంతం చేయించడానికి డాలర్ ను నమ్ముకున్న ఆమెరికా సామ్రాజ్య వాదానికి ఆయువు అంతగా లేదు. నేను చూడకపోవచ్చు. అమెరికా సామ్రాజ్యవాద పతనం తథ్యం. దీనిని ఏ హేతువాదము, డాలరిజమూ రక్షించజాలవు. ఇది సత్యం. ఇది తథ్యం. సత్యం ఏది?
"కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే!
వారేరీ సిరి మూట గట్టుకొని పోవం జాలిరే భూమిపై
బేరైనం గలదే శిబిప్రముఖులు బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా!
ఇది పోతనామాత్యుని శ్రీమహాభాగవతపు 8వ స్కంధంలోని 589వ పద్యం. విచిత్రం ఏమంటే ఈ మాటలన్నది రాక్షసరాజు బలిచక్రవర్తి! ఇది నిత్య సత్యం! సత్యానికి ఆద్యంతములు లేవు.
సత్యం ఎవరినోట వెలువడినా శిరోధార్యమే!
"కమలనాభు నెరిగి కాలంబు దేశంబు
నెరిగి శుక్రుమాటలెరిగి నాశ
మెరిగి పాత్రమనుచు నిచ్చెదానము బలి
మహి వదాన్యుడొకడు మరియుగలడె?
అని బలిచక్రవర్తిని వ్యాసమహర్షి కీర్తించాడు. బలిరాక్షసుడగును గాక! సత్కార్యం, మహాకార్యం చేశాడు! ఇది భారతీయత! భారతధర్మం! భారత సంస్కృతి! భారత నాగరకత!
భారతం ఒక నేలకాదు. ఒక దేశం కాదు. భారతం ఒక సంస్కృతి. ఒక విశ్వాసం. ఒక ధర్మం, ఒక న్యాయం, ఒక సత్యం. దానికి రాజకీయ హద్దులు లేవు. అదొక జీవన విధానం. అది శాసనానికి లొంగదు. అది ఆకాశమంతటిది! భూగోళమంతటిది! సముద్రమంతటిది!