Previous Page Next Page 
ఋగ్వేద సంహిత - 2 పేజి 6


                                          ముప్పది ఎనిమిదవ సూక్తము

                    ఋషి - అత్రి, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - అనుష్టుప్.

    1. ఇంద్రా ! నీవు సర్వదర్శివి. శోభన ధనవంతుడవు. నీవు మహా కార్యములు చేసినావు. నీవు విశేష ధనమును మహాదానము చేతువు. నీవు మాకు మహాధనమును ప్రసాదించుము.

    2. ఇంద్రా ! నీవు మహాబలశాలివి. హిరణ్య వర్ణుడవు. నీవు సుప్రసిద్ధము. ప్రచురమగు అన్నమునకు అధిపతివి. అయినను ఆ విషయము అత్యంత దుర్లభరూపమున సర్వత్ర కీర్తితము అగును.

    3. వజ్రధర ఇంద్రా ! పూజనీయులు, విఖ్యాత కర్మవంతులగు మరుత్తులు నీకు బలస్వరూపులు. మీరిద్దరు ఇంద్ర మరుత్తులు భూమిమీద స్వేచ్చా విహారులగుచు శాసించెదరు.

    4. వృత్రహంత ఇంద్రా ! మేము నిన్ను ఉపాసింతుము. నీవు మమ్ము ధనాఢ్యులను చేయ కోరినవాడవు. మాకు ఎవరేని క్షమతాశీలుని ధనము తెచ్చి ఇమ్ము.

    5. శతక్రతువగు ఇంద్రా ! నీ రాకతో మేము త్వరగా సమృద్దులము కావలెను. నీ సుఖమున మమ్ము భాగస్వాములను చేయుము. నీ వలన మేము సురక్షితులము కావలెను.

                                        ముప్పది తొమ్మిదవ సూక్తము        

    ఋషి - అత్రి, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - అనుష్టుప్, చివరిది పంక్తి

    1. ఇంద్రా ! నీవు వజ్రధరుడవు. ధనవంతుడవు. నీ రూపము అత్యంత విచిత్రము. ఇచ్చుటకు నీవద్ద ఉన్న బహుమూల్య ధనమును మాకు రెండు చేతులతో ప్రసాదించుము.

    2. ఇంద్రా ! నీవు అతి శ్రేష్ఠము అనుకున్న ధనమును మాకు ప్రదానము చేయుము. మేము ఆ ధనమునకు దానపాత్రులము కావలెను.

    3. ఇంద్రా ! నీ మనసు దానము చేయుటకు ఆతురత గలది గొప్పది. నీవు మాకు సాదరముగా సారవంత అన్నము ప్రదానము చేయదలతువు.

    4. ఇంద్రుడు హవిర్లక్షణ ధనయుక్తుడు. అతడు మాకు అత్యంత పూజనీయుడు. అతడు మానసాదిపతి. స్తోతలు ప్రాచీన స్తోత్రములతో ఇంద్రుని స్తుతించి సేవింతురు.

    5. ఇంద్రుని కొఱకు మాత్రమే ఈ కావ్యము, వాక్యము, ఉక్థము ఉచ్చరితములయినవి. ఇంద్రుడు స్తోత్రవాహకుడు. అత్రిపుత్రుడు ఇంద్రునిముందే స్తోత్రములను ఉచ్చైస్వరమున ఉచ్చరించును. ఉద్దీప్తము చేయును.     

                                           నలుబదవ సూక్తము

    ఋషి - ఆత్రేయుడు, దేవత - ఇంద్రుడు ఛందస్సు 1-3 ఉష్ణిక్, 5,9 అనుష్టుప్ మిగిలినవి త్రిష్టుప్.

    1. ఇంద్రా ! నీవు ఫలప్రదాతవు. శత్రుహంతవు. నీవు మా యజ్ఞమునకు విచ్చేయుము. వచ్చి సోమస్వామివగు నీవు శిలాభిషుత సోమమును పానము చేయుము. ఫలవర్షులగు మరుత్తుల సహితముగా సోమపానము చేయుము.

    2. అభిషవ సాధన పాషాణము వర్షణకారి అగును. సోమపానజనిత హర్షము వర్షణకారి అగును. అభిషుత సోమము వర్షణకారి అగును. ఫలవర్షక, శత్రుహంత ఇంద్రా ! నీవు ఫలవర్షకులగు మరుత్తులతో సోమపానము చేయుము.

    3. ఇంద్రా ! నీవు వజ్రధరుడవు. ఫలవర్షివి. శత్రుహంతవు. సోమరస సేవన కర్తవు. అభీష్ట వరదుడవు. మమ్ము రక్షించుమని నిన్ను ఆహ్వానించుచున్నాము. ఫలవర్షులగు మరుత్తులతో కలిసి సోమపానము చేయుము.

    4. ఇంద్రా ! నీవు ఋజీషివి. వజ్రధరుడవు. అభీష్టవర్షివి. శత్రు సంహారకర్తవు. బలవంతుడవు. సర్వులకు ఈశ్వరుడవు. వృత్రహంతవు. సోమపాయివి. అట్టి ఇంద్రుడు గుఱ్ఱములను రథమున పూన్చి మా వద్దకు రావలెను. మధ్యందిన సవనమున సోమము సేవించవలెను. హృష్టుడవు కావలెను.

    (రెండు సవనములందు అభిషుతమయి తృతీయ సవనమున మరల అభిషవించబడిన సోమము ఋజీషము)

    5. సూర్యుడా ! స్వర్భాను నామక అసురుడు నిన్ను అంధకారమున ఆచ్చాదించినపుడు అక్కడి జనులు తమను మరచిన మూఢులవలె సకల భువనములు కళ్లప్పచెప్పిచూచినవి.

    6. ఇంద్రా ! సూర్యుని అధోదేశమున నిలిచిన స్వర్భానుని ద్యుతిమంతమగు మాయను దూరము నుండియే కొట్టివేసినావు. అప్పుడు వ్రతవిధాత, అంధకార సమాచ్చన్న సూర్యుని అత్రి నాలుగు ఋక్కులతో మంత్రములతో మరల ప్రకాశితుని చేసినాడు.

    7. సూర్యుడు అనుచున్నాడు.

    అత్రీ ! నేను ఈ దశలో ఉన్నాను. నేను నీవాడను. అన్నమునకుగాను ద్రోహము చేయు అసురుడు భయంకరమగు అంధకారమున నన్ను మ్రింగునేమో ! అందువలన నీవు వరుణుడు మమ్ము రక్షించవలెను. నీవు నాకు మిత్రుడవు. సత్యపాలకుడవు.

    8. అప్పుడు ఋత్విక్ అత్రి సూర్యునకు ఉపదేశము ప్రసాదించినాడు. ప్రస్తరఖండ ఘర్షణమున ఇంద్రుని కొఱకు సోమాభిషవము చేసినాడు. స్తోత్రములతో దేవిని పూజించినాడు. మంత్ర ప్రభావమున అంతరిక్షమున సూర్యచక్షువును స్థాపించినాడు. అప్పుడు అత్రి స్వర్భానుని సమస్త మాయలను దూరము నుండియే నిష్ఫలము చేసినాడు.

    9. అసుర స్వర్భానుడు అంధకారమున సూర్యుని ఆవరించినాడు. అత్రి పుత్రుడు అట్టి సూర్యుని విముక్తుని చేసినాడు. అది చేయు సమర్థుడు మరొకడు లేడు.

                                        నలుబది ఒకటవ సూక్తము

    ఋషి - భౌమ అత్రి, దేవత - విశ్వేదేవతలు ఛందస్సు - 7,16 జగతి, 20 విరాట్ మిగిలినవి త్రిష్టుప్.

    1. మిత్రావరుణులారా ! మీ ఉభయుల యజ్ఞము చేయుటకు ఏ యజమాని సమర్ధుడగును? మీరు పృథివి, అంతరిక్షపు ఏ స్థానమున నిలిచి మమ్ము రక్షింతురు? హవ్యదాత యజమానికి పశువులు, ధనము ఎట్లు ప్రసాదింతురు?

    2. మిత్రా ! వరుణా ! ఆర్యమా ! ఆయూ ! ఇంద్రా ! ఋభుక్షా ! మరుద్గణములారా ! మీరందరు మాయొక్క శుభంకరము, పాపవర్జితమగు స్తోత్రమును ఆలకింపుడు. మీరందరు రుద్రసహితముగా ప్రీతులగుడు. మా పూజలను స్వీకరించుడు.

    3. అశ్వినులారా ! మీరిద్దరు దమనకారులు. మీ రథమును వాయువేగవంతము చేయుటకు మేము మిమ్ము ఆహ్వానించుచున్నాము.

    ఋత్విక్కులారా ! ద్యుతిమంతుడు, ప్రాణాపహారకుడగు రుద్రుని స్తోత్రములు, హవ్యములు స్వీకరించుడు.

    4. మేధావులు ఆహ్వానించువారు; యజ్ఞములను సేవించువారు, శత్రువినాశకులు, స్వర్గీయులగు వాయువు, అగ్ని, పూషలు క్షితిజాది మూడు స్థానముల నిలిచి సూర్యునివెంట సమానరూపులయి ప్రియము కలిగింతురు. ఈ సకల విశ్వరక్షక దేవతలు యజ్ఞస్థలమునకు వేగవంతమగు అశ్వము యుద్ధమునకు పరుగులిడినట్లు త్వరగా విచ్చేయవలెను.

    5. మరుత్తులారా ! మీరు అశ్వసాహిత్ ధనమును సముపార్జించుడు. స్తోతలు గోవులు, అశ్వములు మున్నగు ధనలాభమునకును, ఉన్న ధనమును రక్షించుటకును మిమ్ము స్తుతింతురు. ఉశిజ పుత్రుడు కక్షీవంతుని హోత అత్రి గమనముగల అశ్వములతో సుఖించవలెను. వేగవంతములగు ఆ అశ్వములు మీవే అగును.

    6. మా ఋత్విక్కులారా ! ద్యుతిమంతుడు, కోరికలు తీర్చువాడు, విప్రునివలె పూజ్యుడు, స్తుతియోగ్యుడగు వాయువును యజ్ఞమునకు చేరుటకుగాను స్తుతులద్వారా రథారూఢుని చేయండి. గమనవతులు, యజ్ఞగ్రహణ కారిణులు, రూపవతులు, ప్రశంసనీయులగు దేవపత్నులు మా యజ్ఞమునకు విచ్చేయవలెను.  

    7. అహోరాత్రి దేవతలారా ! మీరు మహామహులు. వందనీయులగు స్వర్గస్థ దేవతల వెంట మేము నీకు సుఖప్రదములగు జ్ఞాపక మంత్రములతో హవ్యములు సమర్పింతుము.

    దేవతలారా ! మీరు సకల కర్మజాతములను ఎరుగుదు. యజమాని యజ్ఞమునకు అభిముఖముగా విచ్చేయుడు.

    8. మీరందరు అనేకుల పోషకులు. యజ్ఞమునకు నేతలు. స్తోత్రాదులద్వారాను, హవి సమర్పించియు మా ధనలాభము కొఱకు మిమ్ము నుతింతుము. వాస్తుపతి త్వష్టను మేము స్తుతింతుము. ధనములు ప్రసాదించునది, అన్యదేవతల వెంట సాగునది అనిందితవాణిని మేము స్తుతింతుము. వనస్పతులను ఓషధులను స్తుతింతుము.

    9. వీరులవలె లోకములను స్థాపించిన మేఘము విస్తృత దాన విషయమున మాకు అనుకూలుడు కావలెను. మేఘుడు స్తుతియోగ్యుడు. ఆప్తుడు. యజనీయుడు. మానవ హితకారి. అతడు మా స్తుతులకు ప్రసన్నుడు కావలెను. మమ్ము సమృద్దులను చేయవలెను.

    10. మేఘము వర్షకారి. అంతరిక్ష స్థితుడు. అతని గర్భస్థ జలమును రక్షింపుమని వైద్యుతాగ్నిని పాపవర్జిత శోభన స్తోత్రములతో స్తుతింతుము. అగ్ని మూడు స్థానములందుండి త్రివిధుడయి ఉన్నాడు. నేను ప్రయాణించునపుడు సుఖకర కిరణములు కలవాడగును. కోపింపడు. కాని ప్రదీప్త జ్వాలలు ధరించిన అగ్ని అడవులను ధ్వంసము చేయును.

    11. మేము అత్రిగోత్రజులము. మహారుద్రపుత్రులు మరుత్తులను ఎట్లు స్తుతించవలెను? సర్వవిదుడగు భగుని ధనలాభమునకుగాను ఎట్లు స్తుతించవలెను? జలదేవత, ఓషధులు, ద్యుదేవత, వనములు, వృక్షములు కేశములుగాగల పర్వతము మమ్ము రక్షించవలెను.

    12. జలములకు - అన్నములకు అధిపతి. ఆకాశ సంచారి వాయువు మా స్తుతులు ఆలకించవలెను. నగరమువలె ఉజ్వలము, పర్వతపు నలుదిశలపడు జలధార మా వాణిని వినవలెను.

    13. మహామరుత్తులారా ! మీరు వెంటనే స్తుతులను తెలియండి. మేము మిమ్ము స్తుతించువారము. హవ్యములు పట్టుకొని నిన్ను స్తుతింతుము.

    మరుద్గణములు అనుకూల భావమున విచ్చేయవలెను. క్షోభకలిగించు మానవవైరులను అస్త్రములు ప్రయోగించి పరిమార్చి మావద్దకు విచ్చేయవలెను.

    14. దేవసంబంధి, భూసంబంధి జనులకు జల లాభమునకుగాను సుందర యజ్ఞవంతులగు మరుత్తులను స్తుతింతుము. మా స్తుతులు వర్థిల్లవలెను. ప్రీతిదాయకము స్వర్గము సమృద్ధి సంపన్నము కావలెను. మరుత్తుల ద్వారా పరిపుష్టములగు నదులు జలపూరములు కావలెను.

    15. మేము సదా స్తుతింతుము. ఉపద్రవములు నివారించి మమ్ము రక్షించుటకు సమర్థురాలు, సర్వ నిర్మాత్రి, పూజ్యురాల్గు భూమి మా స్తుతులను స్వీకరించవలెను. ప్రశస్త వచనులగు మేధావులగు స్తోతల విషయము భూమి ప్రసన్నురాలు కావలెను. అనుకూల హస్త అయి మాకు శుభములు కలిగించవలెను.

    16. దానశీల మరుత్తులను మేము ఏరీతి సముచితముగా స్తుతింతుము? వర్థమాన స్తుతుల ద్వారా ఎట్లు మరుత్తులను ఉపాసింతుము? వర్తమాన స్తుతుల ద్వారా మరుత్తులను ప్రశంసించుట ఎట్లు సాధ్యము?

    అహిబుధ్న్య దేవుడు మాకు అనిష్టుడు కారాదు. శత్రువులను నష్టపరచవలెను.

    17. దేవతలారా ! మానవ యజమానులు సంతానము కొఱకుగాను, పశువుల కొఱకును శీఘ్రముగా మిమ్ము ఉపాసింతురు. ఈ యజ్ఞమందు నిఋృతి దేవత కళ్యాణకర అన్నమున మా శరీరములను పోషించవలెను. వార్ధక్యమును దూరము చేయవలెను.

    18. వసువులారా ! మీ సుమతి ధేనువు యొక్క బలకరము, హృదయ పోషకమగు అన్నము మాకు లభించవలెను. ఆదానశీల, సుఖదాయిని దేవి మాకు సుఖములు ప్రసాదించుటకు త్వరత్వరగా విచ్చేయవలెను.

    19. గోసంఘ నిర్మాతలు ఇడ - ఊర్వశీ నదుల సహితముగా మా విషయమున అనుకూలవతులు కావలెను. నిరతిశయ దీప్తిశాలిని ఊర్వశి మా యజ్ఞాది కార్యములను ప్రశంసించవలెను. యజమానులను ప్రకాశవంతము చేయుటకు విచ్చేయవలెను.

    20. అర్జువ్యరాజు యొక్క దేవసంఘము మమ్ము అనుగ్రహించవలెను.

                                        నలుబది రెండవ సూక్తము

        ఋషి-భౌమ ఆత్రేయుడు, దేవత-విశ్వేదేవతలు, ఛందస్సు-త్రిష్టుప్.

    1. హవ్య సహితులమయిన మేము నిరతిశయ, సుఖదాయక స్తుతులతో వరుణ, మిత్ర, భగ ఆదిత్యుల వద్దకు చేరుదుము.

    వాయువు పంచప్రాణ సాధకుడు అంతరిక్షమున సంచరించువాడు. అప్రతిహతగమనుడు. ప్రాణదాత. సుఖ సముపార్జకుడు. అట్టి వాయువు మా స్తుతులను వినవలెను.

 Previous Page Next Page