Previous Page Next Page 
సూపర్ స్టార్ పేజి 7


    ఒక్క మాటలో చెప్పాలంటే నేటి దూరదర్శన్ కేంద్రాలు చెత్తకుప్పలు. మరలాంటి దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పుడే నీ నుంచి ఒక రామాయణ్, ఒక బూనియాద్, ఒక నుక్కడ్ పుట్టకొస్తాయి.

    అప్పుడు.... అప్పుడు కనిపించమ్మా అదే నువ్వు నాకివ్వగలిగిన గురుదక్షిణ.

    సృష్టించు ఒక బోస్ లాంటి పాత్రను, ఒక గాంధీలాంటి పాత్రను. ఆ పాత్రలో దుర్గంధభూయిష్టమైన నేటి వ్యవస్థకు బుద్ది చెప్పు..... చాలు..... ఒక్కటి అలాంటిది నువ్వు గాల్లోకి వదలగలిగిన లక్షలాది,  కోట్లాది అభిరుచి ఉన్న ప్రేక్షకులు ఆనందిస్తారు. అభినందిస్తారు. అదే మార్పుకు నాందిగా భావిస్తారు. గుడ్ బై మై లిటిల్ చైల్డ్..... గుడ్ బై. ఆయన కళ్ళ వెంట నీళ్ళు..... తనను వదులుకోలేక ఆయనలా బాధపడుతున్నారని తెలిసి తను వెక్కి వెక్కి ఏడ్చింది.

    కాలింగ్ బెల్ మ్రోగడంతో ఉలిక్కిపడి తేరుకుంది గత జ్ఞాపకాలనుంచి.

    అప్పుడామె కళ్ళు తడిదేరి ఉన్నాయి. చీర చెంగుతో వాటిని అద్దుకొని వెళ్ళి తలుపు తీసింది.

    ప్రభు ఎదురుగా నించుని ఉన్నాడు. "గుడ్ ఈవెనింగ్ మిస్...... ఐయామ్ ఫ్రమ్ సి.బి.సి.ఐ.డి.... మైనేమ్ ఈజ్ ప్రభు" అన్నాడు మర్యాదగా ప్రభు ఆమెవేపు చూస్తూ.

    అప్పుడే ఆ ప్రాంతానికి వచ్చిన దాదా ప్రభును గుర్తుపట్టి ఉలిక్కిపడ్డాడు.

    ప్రభు..... డి.ఎస్ పి.సి బి సి.ఐ.డి ఫ్రమ్ హైదరాబాద్..... ఇక్కడ, ఇలా హఠాత్తుగా ప్రత్యక్షం....స్వగతంలో అనుకుంటూ వెనక్కి వెనక్కి వెళ్ళిపోయాడు కంగారుగా.

    "దెన్ వాట్....? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ?" అంది హంపి చిరాకు పడుతూ.

    ఆమె అందమైన ఆలోచనల్ని, ఆ ఆలోచనల మాధుర్యాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే అడ్డుపడ్డాడన్న చిరాకు ఆమె మోములో సృష్టంగా కనిపించింది.

    "సారీ ఫర్ డి డిస్ట్రబన్స్" నొచ్చుకొంటున్నట్లుగా అన్నాడు.

    ఫర్వాలేదు చెప్పండి అందామె ముందు హల్లోకి అతన్ని ఇన్వైట్ చేస్తూ.

    చిన్న ఇన్ ఫర్మేషన్ కావాలి..... మీరు ఇండియన్ ఎయిర్ పోర్ట్సు అనే టాపిక్ మీద టీవీ ఫిల్మ్ తీసారు గదా?

    "ఎస్.....దెన్ వాట్?"

    "ఢిల్లీ పాలం విమానాశ్రయంలో ఏ రోజు షూట్ చేసారో గుర్తుందా?

    "గుర్తులేదు....."

    "పోనీ..... కనీసం నెలా .....వారం?"

    అతను ఆతృతగా ఆమె చెప్పే వివరాల కోసం చూస్తున్నాడు.

    "ఓ వారం అయుంటుంది. పాలం విమానాశ్రమం నా  ఆఖరి షూటింగ్ స్పాట్. అయినా నా వృత్తికి మీ వృత్తికి సంబంధమే లేదు. ఎందుకడుగుతున్నారివన్నీ?"

    "ఓ వైట్ కాలర్డ్ నోటోరియస్ క్రిమినల్ అదే రోజు పాలం ఎయిర్  సర్వీస్ లో ఢిల్లీ దిగినట్టు  మాకు ఇన్ ఫర్మేషన్ వచ్చింది. మీరు ఆ  ఫ్లయిట్  లాండ్ అవటాన్ని మీ క్యాసెట్ లో చూపించారు....."

    "అయితే?" ఆమెలోని చిరాకు క్షణక్షణానికి పెరిగిపోతోంది.

    "ఆ రోజేమన్నా మీకు విశేషమనిపించే వ్యక్తి కనిపించడంగాని, సంఘటనగాని జరిగిందా?"

    "లేదు. నా పని వ్యక్తులకు సంబంధించిన విశేషాల్ని షూట్  చేయటం  కాదు. ఎయిర్ పోర్ట్ కి సంబంధించిన వివరాల్ని వివరంగా విజ్ఞానాత్మకంగా  టీవీ ప్రేక్షకులకు అందించటమే. సారీ మిస్టర్ పోలీసాఫీసర్. మీ కింకేమన్నా వివరాలు కావాలంటే మా అసోసియేట్ ని అడగండి. కాటేజ్  నెంబర్  పదిహేను....బై...." అంది లేస్తూ.

    ఆమె చెప్పే మూడ్ లో లేదని గ్రహించిన ప్రభు లేచి వెళ్తూ..... "మీ  క్రియేటివ్ పీపుల్ అంతా ఇంతే. టూ మూడీ" అనుకుంటూ వెళ్ళి  పోయాడు.

    అది ఆమెకు వినిపించి చిన్నగా నవ్వుకుంది.

    తిరిగి గ్లాసెస్ ముందుకొచ్చి నిల్చుంది.

    నిర్నిద్రమైన నీలాకాశం తనపైన మేఘాల మేలి ముసుగును పూర్తిగా కప్పుకుంది.

    సముద్రంపై దూరంగా లంగరేసి ఉన్న ఓడలోని లైట్స్ వెలిగాయి.

    అప్పుడప్పుడు ఆమె కోరుకున్న లక్షణాలతో ఓ హీ మాన్  ఆమె  మనోనేత్రం ముందు నిర్దుష్టమైన రూపం సంతరించుకునేందుకు ఆమె ఆలోచనలు, ఊహలు కలహించుకుంటాయి.

    నిజంగా అలాంటి మగవాడుంటాడా?

    ఎందుకుండడు...... ఉంటాడు..... కాని తనకు తారసపడతాడా? ఏమో.....?

    మునిమాపులో తలవంచిన పల్చని క్రోటన్ మొక్కకేసి చూస్తూ నిమిషాల్ని క్షణాల్లో గడిపేసింది.

    అంతలో ఫోన్ మ్రోగడంతో తన కలల ప్రపంచానికి తెర దింపేసింది.

    "మేడమ్..... రడీ అయ్యారా? ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే టైమైంది....." ఆ వేపు నుంచి విల్సన్ అడగడంతో ఆమె వెంటనే ఫోన్ పెట్టేసి ప్రయాణానికి సిద్ధంకాసాగింది.


                                            *    *    *

    "సారీ....." దాదా భయంగా జయధీర్ కేసే చూస్తూ అన్నాడు.

    "ఏమయింది......?" జయధీర్ స్కాచ్ గ్లాస్ లోకి వంపుకుంటూ తాపీగా అడిగాడు.

    "నేను సరీగ్గా ఆ కాటేజీ దగ్గరకు వెళ్ళేసరికి ప్రభు అనే హైద్రాబాద్ సి.బి.సి.ఐ.డి., డి.ఎస్.పి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దాంతో వెనకనుంచి వెనక్కు వచ్చేశాను."

    "డి.ఎస్.పి. ఇన్ గోవా:" చిన్నగా నవ్వాడు జయధీర్.

    "మీరు ఖచ్చితంగా ఆ క్యాసెట్ లోకి ఎక్స్ పోజు అయివుంటారని నా నమ్మకం సార్..... మీరెవరో ప్రపంచానికి తెలియనప్పుడు ఒక రకంగా మనం భయపడనక్కర్లేదు. కాదంటే దాన్నెలాగయినా వశం చేసుకుంటాను... చెప్పండి..... ఏం చేయమంటారు?"

    "నా ఫోటో ఓ చోట ఫైలయి ఉంది......బహుశా పెట్టీ కేసని ఈ పాటికి ఆ ఫైల్ క్లోజ్ చేసుండొచ్చు. అయినా చిన్న విషయం గదా అని నిర్లక్ష్యం చేయటం నేరవృత్తిలో ఉన్న వాళ్ళు చేయతగ్గది కాదు..... నేను ఉన్నంతవరకు మర్యాదగా ఎడిట్ చేసి ఇచ్చేయమను. అనవసరంగా అనుమానం వచ్చేలా ప్రవర్తించకు....." అన్నాడు డి.ఎస్.పి. ప్రభు గురించే ఆలోచిస్తూ.


                                             *    *    *

    దివ్యతేజ బిల్డింగ్ రెండో ఫ్లోర్ లో ఉంది హంపీ ఆఫీస్. మూడో ఫ్లోర్ లో హంపి తన తల్లిదండ్రులతో ఉంటోంది.

    మెట్లెక్కుతూనే ఆఫీస్ ఫ్లోర్ వరండాలో ముందుగా కనిపించేది ఓ లైఫ్ సైజ్ ఫోటో. ఆ ఫోటోలో ఓ అమ్మాయి ఓ వేపు వోరగా వంగుని ఉంటుంది. అందులో ఆమె ముఖమే ఫోకస్ చేయటం జరిగింది. ఆమె మోములోని సగభాగాన్ని ఆమె నల్లటి కురులు కప్పేయగా మిగతా సగభాగం సజీవమై కళ్ళెదుట నిలిచినట్లనిపిస్తుంది.

    నిశ్శబ్దమైన చీకట్లో నా వెంట వచ్చేదెవరు? నా ఊహలకు ఆకృతి ఇచ్చే ఊహాసుందరుడు ఎవరు? ఎన్నాళ్ళు నాకీ నిరీక్షణ? ఎప్పటికైనా ఫలిస్తుందా నా ఈ నిరీక్షణ? నాకెన్నాళ్ళు ఈ అభిసారిక జీవితం....? చెప్పు నేస్తమా? న కళ్ళు నీకు సందేశాన్నందించటం లేదా? అని ప్రశ్నిస్తుంటే ఆ సజీవ ఛాయా చిత్రాన్ని చూసిన ఎవరయినా కొద్ది క్షణాలు అక్కడ ఆగి అప్పుడు ముందుకు వెళ్ళవలసిందే..... ఆ ఛాయా చిత్రంలో ఉన్న కలల సుందరి హంపి.....హంపి.... తన గురువుగారైన సునిల్ విన్సెంట్ దగ్గర  పనిచేసే రోజుల్లో విహరిస్తుండగా ఆమె  ప్రొఫైల్ అద్భుతంగా కనిపించింది ఆయనకు. వెంటనే ఓ స్నాప్ తీయటం జరిగింది. అదే..... ఆ అద్భుతమైన ఫోటోనే లైఫ్  సైజులోకి ప్రింట్ వేయించి సరిగ్గా హంపి ఆఫీసు ఓపెనింగ్ రోజుకి అందేలా పంపించారు సునిల్ విన్సెంట్. ఆ ఫోటో అంటే ఆమెకు ఎంతో ఇష్టం.

    సరీగ్గా 9-30కి ఇంట్లోంచి ఆఫీస్ లోకి వచ్చింది హంపి.

    "మేడమ్.....షూటింగ్ స్పాట్ కి అందరూ వెళ్ళిపోయారు.. అన్నాడు  భవాని వినయంగా.

    "ఓ.కే.....ఓ.కే కమాన్ లెటజ్ గో....." అంటూ ఆమె హడావిడిగా బయలుదేరింది.

    భవాని ఆమె కంటే ముందే క్రిందికెళ్ళిపోయాడు.

    హంపీ మెట్లకు దగ్గరవుతుండగా 'అమ్మాహంపీ' కేక  వినిపించింది.

    హంపి ఓ క్షణం ఆగి పైకి చూసింది. చేతిలో చిన్న బాక్స్ తో క్రిందకు దిగి వస్తోంది ఆమె తల్లి.

    "ఏంటమ్మా? ఎందుకు క్రిందకు వస్తావు? కేకేస్తే నేవచ్చేదాన్నికదా." అంది హంపి నొచ్చుకుంటూ." ఫర్వాలేదులేమ్మా. ఆ లోకేషన్ లో  పిచ్చి పిచ్చి తిండి తింటే ఆరోగ్యం పాడవుతుంది. ఇదుగో ఇందులో నీకిష్టమైన కూర కలిపి తెచ్చాను. ఇదే తినమ్మా. ఎండలో ఎక్కువ తిరక్కమ్మా...." అందామె కూతురివేపు చూస్తూ.

    "ఎండలో తిరిగితే మరీ నలుపవుతాను గదమ్మా.....? అప్పుడు పెళ్ళి కొడుకు దొరకడు కదా? పోనీ ఓ నల్లటి పిల్లణ్నే చేసుకుంటే పోలా?" నవ్వుతూ అంది హంపి తల్లి చేతిలోంచి లంచ్ బాక్స్ అందుకుంటూ.

    "పోవే అల్లరి పిల్లా..... నా బాధ నీకిప్పుడే అర్థంకాదులే....." అంది వెళ్తున్న కూతురివేపు ఆప్యాయంగా చూసుకుంటూ.

    క్రిందకొచ్చేసరికి క్రీమ్ కలర్  మారుతీ కారు సిద్దంగా ఉంది. భవానీని ఎక్కమని సంజ్ఞచేసి తను డైవింగ్ సీట్లో కూర్చుంది. ఆ మరుక్షణం కారు తూనీగలా బంజరాహిల్స్ లోని లోకేషన్ కేసి సాగిపోయింది.

   
                       *    *    *

    "హలో .....హలో....." అనిల్ పెరటి గోడ మీంచి చూస్తూ ఒకింత పెద్దగా అన్నాడు.

    అంట్లు తోముతున్న శిరీష తలెత్తి అనిల్ వేపు చూసి వెంటనే చేతులు కడుక్కొని ఫిల్టర్ లోని కాఫీ పొడి సుద్దను తీసుకొని పెరటి గోడ వద్దకు వచ్చింది.

    "ఓ పని చేస్తే బావుండేదేమోనండి" ఆమె అందించిన కాఫీ పొడి ముద్దను అందుకుంటూ అన్నాడు.

    "ఏంటది....."

    "స్త్రీలు ఇప్పుడు మగవాళ్ళు చేసే ప్రతి ఉద్యోగం చేస్తున్నారు. సమాన జీతం కూడా పొందుతున్నారు. అలాంటప్పుడు ఆడ పనులు, మగ పనులు అనే తేడా లేకుండా పోయింది కదా.....?"

    "పోతే.....?"

    అతనేం చెప్పాలనుకుంటున్నాడో ఆమె కర్థం కావటం లేదు.

    "పోతే గీతే అంట్లు తోమటం అనేది ఇంతవరకు ఆడవాళ్ల పని గానే చూస్తున్నారు. దాన్ని నేను బ్రేక్ చేస్తే......?"

    "అంటే......మీరు?"

    "ఎస్...... అంట్లు తోమితే తప్పేంటి......?

    ఆమె ఫకాలున నవ్వింది. ఆ నవ్వు చాలాసేపు అలాగే కొనసాగింది.

    "భలే నవ్వుతారండి మీరు"

 Previous Page Next Page