Previous Page Next Page 
సూపర్ స్టార్ పేజి 6


    పిల్లలు తిరిగి పొద చాటుకెళ్ళిపోయారు. ప్లాట్ ఫామ్ తిరిగి చివరకు వచ్చి ఆగింది.

    సరిగ్గా ఓ నిమిషానికి ఆమె స్టడీ అయి భవాని వేపు చూసింది.

    అతను చప్పున రెండడుగులు ముందుకేసి ఆగాడు.

    "హై స్పీడ్ కెమేరా..... స్లో మోషన్  షాట్  ఇది. పొదచాటున స్మోక్ ఎఫెక్టు ఇస్తే బావుంటుందేమో?" అందామె.

    "ఓ.కే మేడమ్ " అంటూ భవానీ పాదచాటుకి వెళ్ళి స్మోక్ గన్  వెలిగించాడు. క్రమంగా అందులోంచి దట్టంగా తెల్లటి పొగలు రాసాగాయి.

    "రడీ.....టేక్" అరచిందామె పెద్దగా.

    పిల్లలు బయలుదేరారు.

    కెమేరా ఉన్న  ప్లాట్ ఫామ్ కదిలింది నెమ్మదిగా.

    పొగమంచు కొండల్లా పైపైకి రాసాగింది. క్రమంగా కెమేరా ఆన్  అయి నిశ్శబ్దంగా అద్భుతమైనా దృశ్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకుపోసాగింది. అంతటా నిశ్శబ్దం.

    జలపాతంలా ముందుకు దుముకుతూ వస్తూన్న పిల్లలకి ప్రక్కగా, ఎదురుగా కెమేరా వెళ్ళసాగింది. కొద్ది క్షణాలకి పిల్లలు కెమేరాను దాటిపోయారు.

    వాళ్ళు అలా దాటిపోగానే ట్రాలీమేన్ ఫ్లాట్ ఫామ్ ని మెల్లగా ఆపాడు. కెమేరా నెమ్మదిగా టర్న్ అయి దూరానికి సాగిపోతున్న పిల్లల వెనుక భాగాన్ని ఫీల్డ్ లోకి తీసుకుంది.

    ముఫ్ఫై క్షణాలకి షాట్ అయిపోయింది.

    పిల్లలందరూ షాట్ అయిపోయింది.

    పిల్లలందరూ షాట్ అయిపోయిందని తెలీగానే వెనక్కు పరిగెత్తుకు వచ్చి హంపీని చుట్టుముట్టారు.

    ఆమె ప్రేమగా వారిని దగ్గరకు తీసుకొని, అప్పటికే తెప్పించుకొని తన దగ్గర పెట్టుకున్న చాక్లెట్ల టిన్ ఓపెన్ చేసి వారి ముందుకు చాపింది.

    సరిగ్గా అదే సమయానికి ప్రభు హంపి కాటేజ్ ని పట్టుకోగలిగాడు.

    ఆమె ప్రస్తుతం షూటింగ్ ఎన్ని గంటలకు అయిపోతుందనే వివరాలేం అతనికి అందలేదు.

    ఇప్పుడే లోకేషన్ కి వెళ్ళి ఆమెను కలిస్తే బావుంటుందా లేక రాత్రికి కాటేజ్ కి వెళ్ళటం బెటరా!"

    కొద్ది క్షణాలపాటు ఏదీ నిర్ణయించుకోలేకపోయాడు.


                       *    *    *

    సరిగ్గా ఆరున్నరకు షూటింగ్ పార్టీ పూర్తయిపోయింది.

    యూనిట్ కి పేకప్ చెప్పి హంపి కాటేజ్  కేసి బయలుదేరింది.

    మరుసటిరోజు ఉదయమే ఆమె డైరెక్టు చేస్తున్న ఒక టీ.వీ. సీరియల్  షూటింగ్ షెడ్యూల్ ఉంది.

    ఆమె కాటేజ్  రావటం చూసిన దాదాగంజ్ అక్కడి నుండి కదిలాడు.

    హంపీ కాటేజ్ కి చేరుకుందనే ఇన్ ఫర్మేషన్ అందిన ప్రభు కాటేజీ కేసి  బయలుదేరాడు.

    ఆమె కాటేజ్ లోకి ఎంటర్ అవుతూనే బాత్ రూమ్ లోకి వెళ్ళి గీజర్ ఆన్ చేసి వచ్చి బెడ్ రూమ్ లో  కూర్చుని అద్దాల్లోంచి సముద్రం వేపుకు చూస్తూ ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది.

    "ఆడ పిల్లకు ఈ కెమేరా ఏంటమ్మా? హాయిగా ఏ బ్యాంకులోనో క్లర్క్ ఉద్యోగం సంపాదిస్తే కడుపులో చల్ల కదలకుండా కూర్చోవచ్చు. పైగా డైరెక్షన్ అంటున్నావ్...... అవన్నీ ఆడ పిల్లలు నెట్టుకు రాదగ్గ పనులేనా? రేపు నీకు పెళ్ళి చేయాలన్నా ఏ బ్యాంకులోనో పనయితే పెళ్ళి కూతురే ఒక బ్యాంకని సంబంధం వెంటనే ఖాయమైపోతోంది. అదే కెమేరా  వుమెన్- టీ.వీ. డెరెక్టర్  అంటే ఎవరయినా  ముందుకొస్తారా? పైగా నువ్వు నలుపు. అయినా నాకూతురు తెల్లగా, ఎర్రగా, బుర్రగా ఉండలాని కోరుకుంటారు. అమ్మాయి ఆకర్షణీయంగా, కనుముక్కు తీరు చక్కగా ఉండాని అడగరు. తెల్లగా ఉందా? ఛామనఛాయ......లేక నలుపా? అంటారు. నువ్వసలే నలుపు. నీడ  పట్టునుండే ఉద్యోగం చూసుకుంటే ఆ నలుపు కొద్దిగానన్నా విరిగిపోతుంది. ఈ కొత్తకొత్త పనులేంటి? ప్రొద్దుగూకులు చెట్లంటా, పుట్లెంటా తిరిగితే కాకిలా అయిపోవూ!" అంటూ తల్లి ప్రేమగా మందలిస్తూ జుత్తును దువ్వుతూ ఉంటే, తను చిన్నపిల్లలా తల్లి వడిలోకి వెళ్ళి ముడుచుకుని కూర్చుంటుంది.

    సాధారణంగా పుట్టి, సాధారణంగా జీవితాన్ని గడిపేయటం తన కిష్టంలేదని తనెన్నిసార్లు చెప్పినా- అన్నిసార్లు తల్లి అలాగే అంటూ వుంటుంది.

    ఏ ఆడపిల్లా కనీసం కన్నెత్తి చూడని వృత్తిలోకి తను దిగింది.

    తను కాలేజీలో ఉండగా ఓ సారి టీ.వీ సీరియల్  ప్రొడక్షన్ యూనిట్  రావటం  జరిగింది. వాళ్ళు వారం రోజులుండి రెండు భాగాలు ఆ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ చేసుకువెళ్ళారు.

    అప్పుడే తన దృష్టి కెమెరామెన్ సునిల్ విన్నెంట్ మీద పడింది. యాభై ఏళ్ళవయస్సులో కూడా ఎంతో శ్రమకోర్చి అద్భుతమైన షాట్స్ తీసేవాడు. వాటిని వెంటనే రివైండ్ చేసి మానిటర్ లో చూపించేవాడు.

    ఒకటి రెండుసార్లు తను ఊరుబయట సపోటా తోటలో, చెరువు గట్టుమీద  తిరుగుతుండగా చూసాడాయన.

    ఏమ్మా..... ప్రకృతి అంటే నీకంత ఇష్టమా? అని ఆయన అడిగితే తను  తన్మయంగా వీలైతే ఈ ప్రకృతిలోని ప్రతి అందాన్ని నా కళ్ళెదుట బంధించుకొని జీవితాంతం వాటిని చూస్తూ గడిపేయాలని తను చెప్పటం విని ఆయన ఆశ్చర్యపోవటం తనకిప్పటికీ గుర్తు.

    ప్రకృతిని అంతగా ఆరాధించే వారు కెమేరా వృత్తిలోకి దిగితే అద్భుతాల్ని సృష్టించవచ్చు. నువ్వు కెమేరా వుమెన్ గా మారకూడదూ అని అన్నారు సరదాగా.

    అంతే.... ఇకాక్షణం నుంచి ఆయన వెళ్ళేవరకు తను వదిలిపెట్టలేదు.

    ఓ రోజు షూటింగ్ జరుగుతుండగా ఆయన విచారంగా కనిపించారు. ఎందుకలా ఉన్నారని అడుగగా నేను ఉత్తర భారతదేశస్థుడ్ని. నాకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తామని పిలిపించారు. ఇస్తున్నారుకూడా అని అన్నాడు. మరెందుకు విచారంగా ఉన్నారని అడగ్గా- ఈ కథ చూసావమ్మా..... ఇది  హైద్రాబాద్ దూరదర్శన్ వాళ్ళు అప్రూవ్ చేసారట. ఎంత దారుణం ఒకబ్బాయి రోజుకో అమ్మాయిని ప్రేమిస్తుంటాడట. అలా ఓ ఇరవై మంది అమ్మాయిల్ని ప్రేమించి చివరకు  అన్నిట్లోనూ ఫెయిలయి చుట్టాలమ్మాయిని చేసుకుంటాడట. అదమ్మా కథ. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దూరదర్శన్ ఎన్నుకోదగ్గ కథేనా ఇది? చిన్న పిల్లలపై, యౌవనంలో అడుగుపెడుతున్న వారిపై ఇదెంతటి విష ప్రభావాన్ని చూపుతుందో తెలుసా? అలాంటి కథని తెలీక కెమేరా మెన్ గా వర్క్ చేయటానికి అంగీకరించటం నాకు బాధగా ఉండమ్మా. అప్పుడిక చెత్త సినిమాల్ని తీసే సినీ నిర్మాతకీ- ప్రజా సంక్షేమాన్ని చూడవాల్సిన ప్రభుత్వ దూరదర్శన్ కీ తేడా ఏముందమ్మా...... అన్నాడాయన బాధగా.

    ఆయన సెన్సిటివ్ నెస్ కి నేను విస్మయపడ్డాను.

    నిజమే.... అలాంటి దారుణమైన కథను దూరదర్శన్ ఎలా అంగీకరించింది..... దానికి అప్పట్లో సమాధానం దొరక్కపోయినా నా లక్ష్యం నిర్ధిష్టమైన రూపం సంతరించుకుంది.

    అప్పటికప్పుడే ఆయన దగ్గర తనను అసిస్టెంట్ గా చేర్చుకొమ్మని అభ్యర్థించాను. అందుకాయన ముందాశ్చర్యపోయారు.

    నేటి స్త్రీ ఐ.పి.ఎస్, ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ కాగలుగుతున్నప్పుడు, పైలట్, జడ్డీ, డాక్టర్, ఇంజనీర్, మినిష్టర్, గవర్నర్ కాగలుగుతున్నపుడు కెమేరామెన్ మాత్రం ఎందుకు కాకూడదని తను మొండిగా వాదించింది. అందుకాయన ముందు బిత్తరపోయినా, ఆ తరువాత ప్రశంసగా తనవేపు చూసి మీ పేరెంట్స్ అంగీకారం తీసుకొని రామ్మా అన్నారు.

    ఆ రోజు అమ్మచేసిన హంగామా అంతా ఇంతా కాదు. న్యాయం కోసం, నీతికోసం, జీవితాంతం పోరాడి అలిసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న నాన్న మాత్రం  తననే  సపోర్ట్ చేసారు. మొత్తానికి నాలుగు రోజులకి అమ్మ అయిష్టంగానే ఒప్పుకోవటం జరిగింది. ఆరోజు తను పొందిన ఆనందం...... ఓహొ...... ఎప్పటికీ మర్చిపోలేనేమో.....

    సునీల్ విన్నెంట్ ఓ జీనియస్....... కెమేరాతోనే సహజీవనం చేసేవాడు..... కెమేరా గురించే కలవరించేవాడు. కెమేరానే స్మరిస్తుండేవాడు. ప్రతిక్షణం ఆయనతోనే ఉండి సెల్యులాయిడ్ మిరకిల్స్, వీడియో థ్రిల్స్ గురించి తను తెలుసుకుంటుండేది. తనను సొంత బిడ్డలా చూసుకొనేవాడు. ఆయన్నెవరయినా ఎంత సంపాదించారని అడిగితే మరలా జన్మలో అలా అడిగిన వ్యక్తి మొఖం చూసేవాడు కాదు. ఎన్ని కళాఖండాలు సృష్టించారని అడిగితే ఆ రోజు ఆయనకు పండుగ.

    మనిషి రెండు కళ్ళతో చూడలేని ప్రకృతి అందాల్ని, మనిషి తమ మేథస్సుతో పరిష్కరించలేని మానవ  సమస్యల్ని తను ఒకే ఒక కెమేరా కన్నుతో సృజించేవారు.

    అలా ఆయన దగ్గర  రెండేండ్లు నిరంతరం పరిశ్రమించాక ఇక నువ్వు స్వతంత్రంగా వర్క్ చేయవచ్చమ్మా- చెట్టు క్రింద మొక్కలా. నా దగ్గరే ఉంటేఎదగలేవమ్మా..... అని ఆశీర్వదించి పంపిస్తున్నప్పుడు చిన్న పిల్ల కంటే ఘోరం తను విలపించింది.

    గురుదక్షిణ అని తను అడగగా ఆయన నవ్వి తరాలు గుర్తుండే  ఒకే  ఒక్క  అద్భుతమైన టెలీఫిల్మ్ సృష్టించి అది నాకు అంకితమివ్వమ్మా- అది  ప్రభుత్వ అవార్డుల కన్నా  ప్రజల ప్రశంసలే ఎక్కువ పొందాలి. క్షీణదశకు  చేరుకుంటున్న మానవ విలువల్ని౦న్ నశించి పోతున్న నీతి నిజాయితీలను టీవీ తెరపైకి ఎక్కించి అప్పుడు కనిపించమ్మా అని అంటున్నప్పుడు ఆయన కళ్ళలోతుల్లో ఎక్కడో గూడుకట్టుకున్న నిరాశా నిస్పృహల తాలూకు అసహాయత తన దృష్టిని దాటిపోలేదు.

    రేపటి ఈ దేశాన్ని, ఈ దేశ యువతను, ఈ దేశ అభివృద్ధిని, అవసరాల్ని, మానవవిలువల్ని తీవ్రంగా ప్రభావితం చేయగలిగేది చిన్న టీవీ తెరేనమ్మా...... అందుకే అంతటి శక్తివంతమయిన వీడియో ద్వారా  నా దగ్గర నేర్చుకున్న విద్యకు విలువ కట్టు...... సబ్ జెక్టుతోగానీ, షాట్ తో గాని దేనితోనైనా  ఎవరితోనైనా రాజీపడవద్దు. నీలో నేను ఒక అపర్ణా సేన్ ని చూడాలి. సృష్టికి ప్రతిసృష్టిచేసిన విశ్వామిత్రను చూడాలి.......తప్పదమ్మ......ఆ సందర్భంలో నీకు  ఎదురు దెబ్బలు తగలక తప్పదు. అయినా  వెరవకు- వెనుకంజ వేయకు.

    నీ వృత్తిలో నీకు శత్రువులు ఎక్కువయ్యారంటే నీ ప్రతిభకు వాళ్ళు నీరాజనాలు పలుకుతున్నట్లే, నీ గురించి స్కాండల్స్ ప్రచారం చేసారంటే నీ  అభివృద్ధి వాళ్ళకు మ్రింగుడు పడకే. నీ గురించి చెడుగానైనా ప్రచారం చేస్తున్నారంటే నువ్వు  ఎదిగిపోతున్నట్లు లెక్క. వార్ని చూసి జాలి పడు- నీ  అభివృద్ధికై శ్రమించు. పాతిక వేలిస్తే పరమ నీచమైన స్ర్కిప్ట్ నిఅప్రూవ్ చేసే  దూరదర్శన్ అధికారులు కోకొల్లలు. టీవి విజన్ లో పనిచేస్తూ  ప్రయివేట్ ప్రోగ్రామ్స్ షూట్ చేసే నీతిమాలిన కెమేరామెన్ కోకొల్లలు-బంధుప్రీతి, ఆశ్రిత  పక్షపాతం, లంచగొండితనం, వ్యసనాలు, నిర్లక్ష్యం, అలక్ష్యం అన్నీ  నేటి దూరదర్శన్ కేంద్రాల్లో తిష్టవేసుకున్నాయి.

    ఫైలట్ బాగా లేకపోయినా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూతుళ్ళకు,  అల్లుళ్ళకు ఊటీకి ప్లైట్ టిక్కెట్స్ బుక్ చేస్తే ఎన్ని ఎపిసోడ్స్ అయినా టెలీకాస్ట్ అవుతాయి. ఎక్స్ టెన్షన్ కూడా లభిస్తుంది.

    దూరదర్శన్ గేట్ దగ్గర పనిచేసే. బంట్రోత్ లు కూడా కథలురాసి అప్రూవ్ చేయించుకొని కమీషన్ బెస్ మీద అమ్ముకుంటుంటారు.

 Previous Page Next Page