Previous Page Next Page 
మోడల్ పేజి 6


    మంగళ తలెత్తలేదు.

    తనొచ్చినట్టుగా తెలియజేయటానికి గొంతు సవరించుకున్నాడు.

    తలెత్తలేదు.....

    బెంచిమీద కూర్చున్నాడు.

    భయం భయంగా పిలిచాడు "మంగళా......"

    తలెత్తింది మంగళ.......మనోహర్ వైపు చూసింది. మనోహర్ మంగళవైపు చూశాడు. రాత్రంతా నిద్ర లేనందువల్ల మంగళ మోము వాడిపోయి విశాలమైన ఆమె కళ్ళు ఎర్రబడుతున్నాయి. కొద్దిగా నీరసంగా కనిపిస్తోంది.

    మనోహర్ గురించి ఆలోచిస్తూ ఒక రాత్రంతా నిద్ర పాడుచేసుకున్నట్లుగా లేదు ఆమె మోము.

    అలసటగా, నీరసంగా  చెదిరిన ముంగురులతో, నుదురుమీద అలుముకుపోయిన కుంకుమతో, చెక్కిళ్ళపైకి ప్రాకిన కాటుకతో అద్భుతంగా కనిపిస్తోంది మంగళ మనోహర్ కళ్ళకి.

    ఆమె చూపు కోపంగా వుండడం గమనించి ఠక్కున తలదించుకొని___

    "సారీ మంగళా....." అన్నాడు తప్పుచేసినవాడిలా.

    "సీ మై ఫేస్ మనోహర్" అంది మంగళ కాస్త కఠినంగా.

    మనోహర్ భయపడిపోయాడు. మంగళకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు మాత్రమె తనని మనోహర్ అని పిలుస్తుంది.

    తలెత్తి మంగళవైపు చూశాడు. బేలగావున్న అతని ముఖంచూసి వదిలేద్దామనుకొంది. కానీ.....మనోహర్ కోసం ఆశగా ఎదురుచూస్తూ, ఏం తినకుండా, కనీసం మొహంకూడా కడుక్కోకుండా వుండడంతో ఆకలి, చికాకు, ప్రయాణబడలిక కలిపి రెట్టింపుకోపం తెప్పించాయి మంగళకు.

    "ఇప్పుడు టైం ఎంతయింది?"

    ప్రశ్నించింది సీరియస్ గా. వాచ్ చూసుకొని "మూడుంబావు" అన్నాడు.

    "గోదావరి ఎన్నింటికి వస్తుంది?"

    "6.......40.......కి."

    "అనూ ఫోన్ చేసిందా నేనొస్తున్నట్లు?"
   
    "చేసింది."

    "ఫోన్ చేసినా___నేనెదురు చూస్తుంటానని తెల్సినా........ఇప్పుడా వచ్చేది?"

    ".... .... ....!"

    "మమ్మల్ని నమ్మి పెళ్ళిచేసుకుంటే......రేపైనా నా పరిస్థితి అంతే గదూ.....!"

    "సారీ____సారీ."

    "నేను ఎప్పుడు హైద్రాబాద్ వచ్చినా నువ్వు స్టేషన్ కి వచ్చి రిసీవ్ చేసుకునేవరకూ ఎదురుచూస్తుంటానని తెల్సా?"

    ".... .... ....!"

    "చెప్పు......మాట్లాడవే.....?" గద్దించి అడిగింది.

    "తెల్సు....."

    "ప్రొద్దున్నే ఎక్కడికి వెళ్ళావ్?"

    "డబ్బింగ్ ధియేటరుకి."

    "ఇప్పుడెక్కడినుండి వస్తున్నావ్?"

    "హొటల్ నుంచి."

    "తెలుస్తూనే వుంది చూస్తుంటే......" అంటూ అతని మూతివైపు కుడిచేతివైపు చూసింది.

    "నేనింతవరకు మొహం కడుక్కోలేదు____కాఫీ కూడా త్రాగలేదు.6-40 నుంచి 3-16 వరకు ఇలా  బెంచ్ మీద వుండిపోయాను.....తెల్సా?"

    "అరెరె......కాఫీకూడా త్రాగలేదా? ఎందుకని? నాకు ఫోన్ అయినా చేయవచ్చుగా......ఎందుకు చేయలేదు?"

    "కాఫీ కూడా త్రాగంది......నీకు చెప్పినా అర్ధంకాదు.....హు.......నీతోనే త్రాగాలనే నా స్వీట్ ఇడియాటిక్ లవ్ సెంటిమెంట్......ఫోన్ చేయండి.....చూద్దాం......యెప్పటికి గుర్తుకొస్తావో అని.....అవును.....ఇపుడు మాత్రం ఎలా గుర్తుకొచ్చాను?......" అడిగింది. కనీసం ఎనిమిది గంటల తర్వాతయినా తను మనోహర్ కి గుర్తుకొచ్చినందుకు కొద్దిగా సంతోషపడుతూ___

    "ఇప్పుడు......ఇప్పుడు......"

    "ఊ......చెప్పు....."

    "విశాఖనుంచి అనూ ఫోన్ చేసింది."

    విపరీతంగా కోపం వచ్చింది మంగళకు.

    "అంతే.....అలా ఎవరో చెబితే గుర్తురావలసిందే కానీ నీకు  మాత్రం గుర్తుండదు నా విషయం."

    "ఎక్స్ ట్రీమ్ లీ  సారీ మంగళా......" అన్నాడు దీనంగా మంగళకేసి చూస్తూ రెండు చేతులూ జేబుల్లో పెట్టుకొని.

    జాలేసింది మంగళకు. తలదించుకొని వున్న మనోహర్ ని చూస్తుంటే జాలి, దాచుకున్న ప్రేమ పెల్లుబికాయి మంగళలో.

    "మనూ......" అంది హృదయంలో మనోహర్ పై ఉప్పొంగిన ప్రేమతో.

    ఆనందంగా తలెత్తాడు మనోహర్. మంగళలో కోపంలేకుంటేనే ప్రేమగా, అప్యాయంగా తనను 'మానూ' అని పిలుస్తుంది. అంటే.....ఆనందంగా మంగళవైపు చూస్తూ గుండెలనిండా ఊపిరి పీల్చుకున్నాడు. పెదవుల మాటున చిరునవ్వును దాచుకుంటూ "ఇలా రా.....!" అంటూ  చేయి  పట్టుకొని ప్రక్కనే వున్న వాష్ బేసిన్ దగ్గరకు తీసుకెళ్ళింది.

    "ఎందుకు?" అడిగాడు అర్ధంకాక.

    "ఇందుకు....." అంటూ మనోహర్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని తనే వాష్ బేసిన్ లో కడిగింది.

    అప్పుడు స్ఫురించింది మనోహర్ కి......తను భోంచేస్తూ మధ్యలో చేయి కడుక్కోకుండానే వచ్చినట్లుగా.

    మనోహర్ చేయి కడిగి అలాగే తడిగా వున్న తన  కుడిచేత్తో మనోహర్ నోరు తుడిచింది.

    "నువ్వు గుర్తుకొచ్చిన తొందర....."

    "నేను గుర్తుకొస్తే ఉరుకులు......పరుగులు పెడతావ్.......అదే నాకానందం. కాని గుర్తుకురావడమే ఎలా?......అది రానందుకే కోపం......." అంది తన ఖర్చీఫ్ తో మనోహర్ చేయి తుడుస్తూ నవ్వులోనే చిరుకోపం మిళితం  చేసి.

    దూరంగా వున్న ముసలి దంపతులు మనోహర్ కి మంగళ చేస్తున్న సపర్యలు చూసి ముసిముసిగా నవ్వుకున్నారు.

    మంగళ బ్యాగ్, సూట్ కేస్ చేతుల్లోకి తీసుకొన్నాడు మనోహర్.

    "మనూ" పిలిచింది "ఏం?" అన్నట్లు చూశాడు.

    "నేనిప్పుడు రక్షించండి......రక్షించండి' అని అరుస్తాను" అంది చిలిపిగా పెదాలమాటు చిరునవ్వును దాచుకొంటూ.

    అర్థంకాలేదు మనోహర్ కి "ఏం పాపం?"

    "ఎందుకంటే నేను హైదరాబాద్ లో వుండే పదిరోజులు నువ్వు నన్నొదిలిపెట్టి వుండకూడదు. అలా అని మాటివ్వాలి ఇప్పుడే......లేదంటే అరుస్తాను. అప్పుడు నలుగురూ వచ్చి నాలుగంటిస్తారు నీకు."

    "మనోహర్ కూడా చిలిపిగా నవ్వి "ఓ.కే. మేడమ్.....అలాగే.......పరువున్న ఫోటోగ్రాఫర్ ని.......అల్లరి పెట్టావంటే......అది నలుగురికి తెలిసిందంటే నేను అల్లరిచిల్లరివాడినని ఏ మోడలూ నా దగ్గరకు రాదు___" అన్నాడు వినయం ఒలకపోస్తూ.

    "అదీ అసలు సంగతి......నా కోసం  వస్తానని మాటిస్తావనుకున్నాను. అంటే నీ  పరువుపోతుందని, నీ వృత్తికి చెడ్డపేరొస్తుందని మాటిస్తున్నా వన్నమాట" అంది నిష్టూరంగా.

    "ముందు కాఫీ త్రాగుదువుగాని పద" అంటూ లగేజ్ తో కదిలాడు, కేంటిన్ వేపు వెనుక బయలుదేరింది మనోహర్ ని తృప్తిగా, నిండుగా చూసుకుంటూ మంగళ.

    మనోహర్ ఇచ్చిన ప్రకటన హఠాత్ గా గుర్తుకొచ్చి దాన్ని గురించిన వివరాలు అతన్ని అడుగుదామన్న విషయం తలపుకొచ్చింది. సరే......తీరిగ్గా అడగొచ్చులే అనుకొని ఆ విషయం వాయిదా వేసుకుంది మంగళ మనసులోనే. మనోహర్ కాంటిన్ లోకి అడుగుపెడుతుండగానే ఒక్కసారి వొళ్ళు జలదరించింది, ఎందుకో హఠాత్తుగా ప్రదీప్ సక్సేనా గుర్తుకొచ్చి. తనపై బాగా నిఘావేసి వుంచుతున్నాడు సక్సేనా ఈమధ్య. అతని దుర్మార్గమైన కళ్ళలో తన మంగళ పడితే......మరలా అంతలోనే సర్దుకున్నాడు. తనో కుర్చీలో కూర్చుంటూ......మంగళకి ప్రక్క సీటు చూపిస్తూ నలుప్రక్కలకి చూశాడు యధాలాపంగా.

    అదే కేంటిన్ లో ఓ మూలగా పేపరు చదువుతూ ప్రదీప్ సక్సేనా!!!

   
                                   *    *    *

    ప్రపంచం పారిశ్రామికంగా శరవేగంగా ముందుకుపోతోంది. ఉత్సత్తయిన వస్తువులకు మార్కెట్ లో తీవ్రమైన పోటీ ఎదురౌతుంది. అయినా డానికి సిద్దపడుతూనే మరెన్నో కంపెనీలు ఉత్పత్తిరంగంలోకి దిగుతుంటాయి. ఏ పారిశ్రామిక వేత్తయినా ఒక వస్తువును ఉత్పత్తిచేయాలని తలపెట్టేముందు వాటి తయారీలోని కష్టనష్టాలకంటే కూడా దాన్ని ఎలా తెలివిగా మార్కెట్ చేసుకోవాలా అని ఆలోచిస్తాడు.

    ముందు మార్కెట్ సర్వే చేయిస్తాడు. తను చేయబోయే వస్తువు లాంటివి అప్పటికే ఏ ఏ కంపెనీలు చేస్తున్నాయి. అవి ఎలా అమ్ముడవుతున్నాయి? ఏ ప్రాంతాలలో ఎక్కువ అమ్ముడుతోంది? అందుకు కారణాలేమిటి? ఆ ప్రోడక్టు ఖరీదెంత? అప్పటికి ఆ కంపెనీల మధ్య వున్న  పోటీ ఎలా వుండి? వాళ్ళకు వచ్చే లాభాల శాతమెంత?.....అనేవి బాగా స్టడీ  చేస్తాడు.

    అలాంటి పరిస్థితిలో తన ప్రోడక్టుని మార్కెట్ కి ఎలా ఎక్కించాలి? క్వాలిటి పెంచా? రేటు తగ్గించా? పబ్లిసిటీ బాగా చేసా? ఇలాంటిది తీవ్రంగా ఆలోచిస్తాడు. మూడో ప్రశ్నకు సమాధానమే పబ్లిసిటీ.....

    రేడియోలో స్పాట్స్, దిన వార మాసపత్రికల్లో డిజైన్స్, టెలివిజన్ లో స్పాన్సర్డ్ ప్రోగ్రామ్సు, రోడ్డుప్రక్క బిజీ సెంటర్సులలో హొర్డింగ్స్, వాల్ పోస్టర్సు, వ్యాపార సినిమాలద్వారా....యిలా అనేక  విధాలుగా పబ్లిసిటీ చేస్తుంటాయి కంపెనీలు.

    అన్నింటిలోకి ఖరీదయినది, అతి విలువైనది ఎక్కువ అమ్మకాలు తెచ్చిపెట్టేది యాడ్ పిల్మ్ పబ్లిసిటీ.

    దీనికి వస్తూత్పత్తి చేసే  కంపెనీ ముందుగా ఓ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని కాంటాక్టు చేస్తుంది మేము ఫలానా వస్తువు ఉత్పత్తి చేస్తున్నాం, డానికి మంచి యాడ్ ఫిల్మ్ తీసి పెట్టాలని అడుగుతుంది.

    ఏం ప్రోడక్టు ఉత్పత్తి చేస్తున్నారు?

    ఎంత పెట్టుబడితో చేస్తున్నారు?

    ఏఏ ప్రాంతాలలో అమ్మాలనుకుంటున్నారు?

    ఒక యాడ్ ఫిల్ముకి ఎంతవరకు ఖర్చుపెట్టగలరు? అని అడుగుతారు సాధారణంగా. మరికొంతమంది యింకా 'లోతుగా' కూడా అడగవచ్చు. వారిచ్చిన సమాధానాలను దృష్టిలో పెట్టుకొని యాడ్ఫిల్మ్ కి బడ్జెట్ వేస్తారు. అందులో ఏజన్సీ కమీషన్ వుంటుంది. ఆ వస్తువుకున్న సుగుణాలని, అది  వినియోగదారులకు చేసే మంచిని దృష్టిలో పెట్టుకొని కాపీరైటరుతో స్క్రిప్టు వ్రాయిస్తారు. ఆ స్క్రిప్టులో పాత్రలు.....అవి మాట్లాడాల్సిన మాటలు.....బ్యాక్ గ్రౌండ్ లోకేషన్, చూపించవలసిన వస్తువును గురించి ఎంతో క్షుణ్నంగా రాసుంటుంది.

    స్క్రిప్టు పూర్తయ్యాక ఆర్టిస్టును పిలిపిస్తారు. అతను ఆ స్క్రిప్ట్ ను ఎలా విజువలైజ్ చేయాలనే విషయాన్ని బొమ్మల రూపంలో ఒక ఆల్భమ్ తయారుచేస్తాడు. ఇవన్నీ పూర్తయ్యాక స్క్రిప్టు, విజువలైజ్ డ్ స్క్రిప్టు తీసుకొని అడ్వర్టయిజింగ్ ఏజన్సీకి చెందిన మీడియా ఎగ్జిక్యూటివ్, ఆ వస్తూత్పత్తి చేసే కంపెనీకి వెళ్ళి వాటిని చూపిస్తారు. వారికి నచ్చితే అడ్వాన్స్ యిచ్చి షూట్ చేయమంటారు. ఫలానా వస్తువును ఫలానా యాడ్  ఫోటోగ్రాఫర్ అయితేనే బాగా తీయగలడని ఏజన్సీ భావిస్తే వారిని పిలిపించి స్క్రిప్టు అందించి అడ్వాన్స్ యిస్తూ గడుపు పెడతారు__రెండు నెలల్లోనో, నెలలోనే పూర్తిచేయాలని.

    అదే సందర్భంలో యాడ్ ఫోటోగ్రాఫరుకి సూచనలు కూడా ఇస్తారు. ఈ ఫిల్మ్స్ లో నటించే మాడల్స్ చాలా అందంగా వుండాలని వినియోగదారుల్ని సమ్మోహితుల్ని చేయగలిగేలా వుండాలని.....వీలయితే అందుకు కొద్దిగా సెక్స్ జొప్పించమని కూడా చెబుతారు.

 Previous Page Next Page